వాషింగ్టన్: ఆన్‌లైన్ సెర్చ్‌లో గూగుల్ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి ఆ సంస్థ తన క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించాల్సిందేనంటూ అమెరికా న్యాయశాఖ స్పష్టం చేస్తోంది. ఈ మేరకు న్యాయశాఖ తన స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేసినట్లు అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ (ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా)లో దాఖలు చేసిన 28 పేజీల ఫైల్ స్పష్టం చేస్తోంది. గూగుల్ ‘‘గుత్తాధిపత్యం’’ చేస్తోందన్న ఇటీవలి కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, టెక్ దిగ్గజాన్ని దాని ఆధిపత్య మార్కెట్ స్థానం నుండి తొలగించే చర్యలను అమెరికా న్యాయశాఖ సూచించింది.
న్యాయశాఖ ప్రతిపాదనతో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ (ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా) న్యాయమూర్తి మెహతా అంగీకరిస్తే, క్రోమ్‌ను గూగుల్ విక్రయించాల్సి రావచ్చన్నది నిపుణుల విశ్లేషణ. గూగుల్ చట్టవిరుద్ధ గుత్తాధిపత్య ధోరణులను అరికట్టడానికి ఉన్న మార్గాల్లో క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ను విక్రయించడం ఒకటని అమెరికా న్యాయశాఖతో పాటు పలు రాష్ట్రాలూ ప్రతిపాదనలు పెట్టడం గమనార్హం. ‘‘గూగుల్ ఒక గుత్తాధిపత్య సంస్థ. దాని గుత్తాధిపత్యం కొనసాగడానికి ఈ గుత్తాధిపత్యమూ పనిచేసింది’’ అని ఈ ఏడాది ఆగస్టులో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ కొలంబియా న్యాయమూర్తి అమిత్ మెహతా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
జరిగేదేమిటి?
జడ్జి మెహతా ప్రభుత్వ సిఫార్సులను ఆమోదిస్తే, తుది తీర్పు వెలువడిన ఆరు నెలల్లోపు గూగుల్ తన 16 ఏళ్ల క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించాల్సి వస్తుందని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక పేర్కొంది. ‘‘కానీ కంపెనీ ఖచి్చతంగా అప్పీల్‌కు వెళుతుంది. ఇదే జరిగితే ఇప్పటికే నాలుగేళ్లుగా సాగిన ఈ వివాదం మరింతకాలం కొనసాగే అవకాశం ఉంది. పొడిగించే అవకాశం ఉంది. ఇది యూట్యూబ్ వంటి దాని స్వంత సేవలను విస్తృత పరచకుండా గూగుల్‌ను నిలువరిస్తుంది’’ అని కూడా ప్రెస్ నివేదిక వ్యాఖ్యానించింది.
గూగుల్ మాతృ సంస్థ ఖండన
కాగా తాజా పరిణామాలపై గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చీఫ్ లీగల్ ఆఫీసర్ కెంట్ వాకర్ ఒక బ్లాగ్‌లో వ్యాఖ్యానిస్తూ, న్యాయశాఖ ప్రతిపాదనను ఒక సంస్థను ‘‘అస్థిరపరిచేది‘గా అలాగే ‘‘అనవసర జ్యోక్యం ఎజెండా‘ను ముందుకు తెచ్చేదిగా ఉందని పేర్కొన్నారు. న్యాయశాఖ విధానం ప్రభుత్వ విపరీత జోక్యానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ధోరణి అమెరికన్ వినియోగదారులకు, డెవలపర్‌లకు, చిన్న వ్యాపారాలకు హాని కలిగిస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రపంచ ఆర్థిక, సాంకేతిక నాయకత్వాన్ని అవసరమైన సమయంలో ప్రమాదంలో పడేసే విధానంగా విశ్లేషించారు.
ఇతర టెక్ దిగ్గజాలపైనా ఇవే కేసులు
ఇటీవలి సంవత్సరాలలో అమెజాన్, మెటా, గూగుల్ వంటి అనేక పెద్ద టెక్ కంపెనీలపై అమెరికా ప్రభుత్వ సంస్థలు ‘గుత్తాధిపత్యానికి సంబంధించి’ ఇదే తరహా కేసులు నమోదు చేశాయి. ఆయా సంస్థలు గుత్తాధిపత్యాన్ని సృష్టిస్తున్నాయని, మార్కెట్‌లోని ఇతర సంస్థల పోటీని అణిచివేస్తున్నాయని ఈ కేసుల సారాంశం. ఆపిల్, శామ్‌సంగ్ వంటి సంస్థలకు వాటి స్మార్ట్‌ఫోన్లు, వెబ్ బ్రౌజర్లపై ఆటోమేటిగ్‌గా తన సెర్చ్ ఇంజన్ లింక్ వచ్చే విధంగా గూగుల్ బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు 2020లోనే అమెరికా న్యాయశాఖ, కాలిఫోర్నియా, కొలరాడో, న్యూజెర్సీ మరియు న్యూయార్క్‌సహా పలు అమెరికా రాష్ట్రాలు కేసులు దాఖలు చేశాయి. గూగుల్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోందంటూ జడ్జి మెహతా ఆగస్టులో చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై తాజా పరిణామాలకు దారితీశాయి. సంస్థ గుత్తాధిపత్యాన్ని సరిదిద్దడాదనికి పరిష్కారాలను సమర్పించమని జడ్జి మెహతా న్యాయశాఖ అలాగే రాష్ట్రాలకు సూచించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment