సెక్యూరిటీస్ మోసం, కుట్ర అభియోగాలే...
అదానీ గ్రీన్ ఎనర్జీ వివరణ
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, కంపెనీ బోర్డు సీనియర్ డైరెక్టర్ వినీత్‌జైన్‌పై అమెరికా న్యాయ శాఖ లంచం అభియోగాలు మోపలేదని అదానీ గ్రూప్ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది.
‘‘న్యూయార్క్ కోర్టులో గత వారం అమెరికా న్యాయ శాఖ (యూఎస్ డీఓజే) దాఖలు చేసిన అభియోగ పత్రంలో, యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ (ఎఫ్‌సీపీఏ/అవినీతి నిరోధక) చట్టం నిబంధనలను ఉల్లంఘించే కుట్రకు పాల్పడినట్టు వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ లేదా వినీత్‌జైన్‌పై అభియోగాలు మోపలేదు’’అని స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) బుధవారం వివరణ ఇచ్చింది.
సెక్యూరిటీస్ చట్టం కింద మోసం, కుట్ర, ఉద్దేశపూర్వక కుట్ర ఆరోపణలే మోపినట్టు తెలిపింది. ఈ అభియోగాలకు చట్టం పరిధిలో శిక్షలు లంచం కంటే చాలా తక్కువని పేర్కొంది. మరోవైపు సెక్యూరిటీల చట్టం నిబంధనలు ఉల్లంఘించారంటూ.. చట్ట ఉల్లంఘన దిశగా అదానీ గ్రీన్ ఎనర్జీకి సాయం అందించారంటూ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ మరో సివిల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు ఏజీఈఎల్ వివరణ ఇచ్చింది.
సెక్యూరిటీస్ చట్టం 1933, సెక్యూరిటీస్ చట్టం 1934లోని పలు సెక్షన్లను వీరు ఉల్లంఘించారని.. ఏజీఈఎల్ సైతం ఇవే చట్ట ఉల్లంఘనలకు పాల్పడేందుకు సాయం లేదా ప్రోత్సాహం అందించినట్టు సివిల్ కేసులో అభియోగాలు మోపినట్టు వెల్లడించింది. ఏజీఈఎల్ సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టులను దక్కించుకునేందుకు వీలుగా భారత అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చారంటూ అదానీ తదితరులపై కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో ఆదానీ గ్రీన్ ఎనర్జీ ఇచ్చిన వివరణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని, ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ ఇప్పటికే వివరణ ఇచ్చింది.
అదరగొట్టిన అదానీ షేర్లు...
అమెరికా లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ వివరణ ఇవ్వడంతో అదానీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అదానీ టోటల్ గ్యాస్ 20%, అదానీ పవర్ 20%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 10%, అదానీ గ్రీన్ ఎనర్జీ 10% లాభపడ్డాయి. ఈ షేర్లన్నీ ఇంట్రాడేలో అప్పర్‌సర్క్యూట్ తాకాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 12%, ఎన్‌డీటీవీ 9%, అదానీ విల్మార్ 8%, అదానీ పోర్ట్స్ 6%, సంఘీ ఇండస్ట్రీస్ 5%, అంబుజా సిమెంట్స్ 4.50%, ఏసీసీ 4% పెరిగాయి. పదకొండు కంపెనీల షేర్లూ రాణించడంతో ఒక్కరోజులో అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.24 లక్షల కోట్లు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment