bribery charges
-
అదానీపై లంచం ఆరోపణల్లేవు!
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, కంపెనీ బోర్డు సీనియర్ డైరెక్టర్ వినీత్జైన్పై అమెరికా న్యాయ శాఖ లంచం అభియోగాలు మోపలేదని అదానీ గ్రూప్ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది. ‘‘న్యూయార్క్ కోర్టులో గత వారం అమెరికా న్యాయ శాఖ (యూఎస్ డీఓజే) దాఖలు చేసిన అభియోగ పత్రంలో, యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ (ఎఫ్‌సీపీఏ/అవినీతి నిరోధక) చట్టం నిబంధనలను ఉల్లంఘించే కుట్రకు పాల్పడినట్టు వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ లేదా వినీత్జైన్పై అభియోగాలు మోపలేదు’’అని స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) బుధవారం వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం కింద మోసం, కుట్ర, ఉద్దేశపూర్వక కుట్ర ఆరోపణలే మోపినట్టు తెలిపింది. ఈ అభియోగాలకు చట్టం పరిధిలో శిక్షలు లంచం కంటే చాలా తక్కువని పేర్కొంది. మరోవైపు సెక్యూరిటీల చట్టం నిబంధనలు ఉల్లంఘించారంటూ.. చట్ట ఉల్లంఘన దిశగా అదానీ గ్రీన్ ఎనర్జీకి సాయం అందించారంటూ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ మరో సివిల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు ఏజీఈఎల్ వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం 1933, సెక్యూరిటీస్ చట్టం 1934లోని పలు సెక్షన్లను వీరు ఉల్లంఘించారని.. ఏజీఈఎల్ సైతం ఇవే చట్ట ఉల్లంఘనలకు పాల్పడేందుకు సాయం లేదా ప్రోత్సాహం అందించినట్టు సివిల్ కేసులో అభియోగాలు మోపినట్టు వెల్లడించింది. ఏజీఈఎల్ సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టులను దక్కించుకునేందుకు వీలుగా భారత అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చారంటూ అదానీ తదితరులపై కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో ఆదానీ గ్రీన్ ఎనర్జీ ఇచ్చిన వివరణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని, ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ ఇప్పటికే వివరణ ఇచ్చింది.అదరగొట్టిన అదానీ షేర్లు...అమెరికా లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ వివరణ ఇవ్వడంతో అదానీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అదానీ టోటల్ గ్యాస్ 20%, అదానీ పవర్ 20%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 10%, అదానీ గ్రీన్ ఎనర్జీ 10% లాభపడ్డాయి. ఈ షేర్లన్నీ ఇంట్రాడేలో అప్పర్‌సర్క్యూట్ తాకాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 12%, ఎన్డీటీవీ 9%, అదానీ విల్మార్ 8%, అదానీ పోర్ట్స్ 6%, సంఘీ ఇండస్ట్రీస్ 5%, అంబుజా సిమెంట్స్ 4.50%, ఏసీసీ 4% పెరిగాయి. పదకొండు కంపెనీల షేర్లూ రాణించడంతో ఒక్కరోజులో అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.24 లక్షల కోట్లు పెరిగింది. -
ఆ ఆరోపణలు కేసు పెట్టదగినవే
న్యూఢిల్లీ: అవినీతి కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దుచేయాలన్న ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. ఈ వ్యవహారంలో అస్థానాతో పాటు ఇతర అధికారులపై వచ్చిన ఆరోపణలు కేసు పెట్టదగినవేనని ఢిల్లీ కోర్టుకు తెలిపింది. అస్థానా పిటిషన్‌పై అభిప్రాయం తెలపాలని కోర్టు ఆదేశించగా సీబీఐ గురువారం ఈ మేరకు బదులిచ్చింది. ఇంకా చార్జిషీట్ దాఖలుచేయలేదని, విచారణ పూర్తయ్యే సరికి చాలా విషయాలు బయటికి వస్తాయని తెలిపింది. అస్థానా, సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌ల పిటిషన్లను జస్టిస్ నజ్మీ వాజిరి బెంచ్ విచారణకు చేపట్టింది. ఈ దశలో అనవసర సందేహాలొద్దు.. ‘అవినీతి సంబంధ కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్ను రిట్ పిటిషన్ ద్వారా సవాలుచేసినప్పుడు, ఆ ఎఫ్ఐఆర్లోని ఆరోపణల్లో కేసు పెట్టదగినవి ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని పరిశీలించాలి. ఈ దశలో కేసుతో సంబంధంలేని విషయాలు, సందేహాల్ని లేవనెత్తకూడదు. ఇక ప్రస్తుత కేసులో వచ్చిన ఆరోపణలు కేసుపెట్టదగినవే అని తేలడంతోనే ఎఫ్ఐఆర్ నమోదుచేసి విచారణ ప్రారంభించాం. కొత్త బృందం దర్యాప్తును ప్రారంభించి, కీలక పత్రాలను పరిశీలిస్తోంది. తదుపరి దశలో సవివర అఫిడవిట్ దాఖలుచేస్తాం’ అని సీబీఐ పేర్కొంది. కాగా, అస్థానాపై విచారణ చేపట్టకుండా యథాతథ స్థితిని కోర్టు నవంబర్ 14 వరకు పొడిగించింది. -
తప్పు చేసి.. మళ్లీ నాపై నిందలా!
♦ లంచం ఆరోపణలపై మంత్రి సరోజ ..రాజామీనాక్షిపై ఆగ్రహం సాక్షి, చెన్నై : తప్పు చేసింది కాకుండా, తప్పించుకునేందుకు నిందల్ని తన మీద మోపుతున్నారని లంచం వ్యవహారంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సరోజ ఆవేదన వ్యక్తం చేశారు. రాజామీనాక్షి ఆరోపణలపై మంగళవారం ఆమె వివరణ ఇచ్చారు. ధర్మపురి జిల్లా శిశుసంక్షేమ శాఖ అధికారిణి రాజామీనాక్షి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సరోజపై గత వారం ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాను శిశుసంక్షేమ శాఖాధికారిణిగా కొనసాగాలంటే రూ.30 లక్షలు లంచం ఇవ్వాలని మంత్రి ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపించి రాజకీయంగా చర్చకు తెరలేపారు. లంచం కోసం తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు రాజా మీనాక్షి ఫిర్యాదు కూడా చేశారు. ఈ వ్యవహారంతో విమర్శల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి మంత్రితో పాటు సీఎం పళని ప్రభుత్వానికి తప్పలేదు. రెండు మూడు రోజులుగా ఈ వ్యవహారంపై మంత్రి సరోజ కూడా నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం రా జామీనాక్షి ఆరోపణల్ని తిప్పి కొడుతూ సరోజ ఓ ప్రకటన విడుదల చేశారు. తప్ప చేసి నిందలా: చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు రాజామీనాక్షి నిందల్ని తన మీద వేస్తున్నారని మంత్రి సరోజ ఆవేదన వ్యక్తం చేశారు. శిశుసంక్షేమ శాఖలో రాజామీనాక్షి తాత్కాలిక ఉద్యోగిగా పేర్కొన్నారు. పనిచేస్తున్న చోట చేతి వాటం ప్రదర్శించి విచారణను ఎదుర్కొంటున్న రాజాలక్ష్మి తన మీద నిందలు వేసి రాజకీయ జీవితానికి, తన వైద్య వృత్తికి కలంకం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా, శిశు వైద్యురాలిగా తాను చేస్తున్న సేవలకు, రాజకీయ పయనంలో తన ఉత్సాహానికి మెచ్చి అమ్మ జయలలిత మంచి గుర్తింపు, పదవిని ఇచ్చారని గుర్తు చేశారు. సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న తన మీద రాజామీనాక్షి ఆరోపణలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజామీనాక్షి విచారణను ఎదుర్కొంటున్నారని, గత నెల విచారణకు రావాల్సి ఉన్నా, అనారోగ్య కారణాలతో తప్పించుకున్నట్టు వివరించారు. ఆమె చేతివాటం ప్రదర్శించారన్నది ధ్రువీకరించబడి ఉందని, ఇక ఆమెపై చర్యలు తప్పదన్న నిర్ణయానికి సంబంధిత జిల్లా అధికారులు వచ్చి ఉన్నారని తెలిపారు. గత వారం తన వద్దకు వచ్చిన రాజామీనాక్షి పర్మినెంట్ చేయాలని, విచారణ నుంచి బయటపడే మార్గం చూపించాలని, చెన్నైకు బదిలీ చేయాలని కోరడం జరిగిందన్నారు. ఇందుకు తాను అంగీకరించకుండా బయటకు పంపించానని, దీంతో ఆమె చేసిన తప్పును కప్పిపుచ్చుకునే యత్నంలో తన మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడాల్సినంత అవసరం తనకు లేదు అని, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు. -
శాంసంగ్‌కు మరిన్ని కష్టాలు
సియోల్: దక్షిణ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ మరిన్ని కష్టాల్లో ఇరుక్కోనుంది. సౌత్ కొరియాలో సంచలనం రేపిన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంసంగ్ గ్రూప్ డి ఫ్యాక్టో హెడ్ జె వై లీ (48) పై అవినీతి సహా బహుళ ఆరోపణలపై ప్రత్యేక ప్రాసిక్యూటర్లు కేసును దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈయనతోపాటు మరో నలుగురు ఎగ్జిక్యూటివ్‌లపై ఆరోపణలను నమోదు చేయనుంది. అరెస్టు వారెంట్‌నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిన శాంసంగ్ వారసుడు చివరికి అరెస్టుకాక తప్పలేదు. తాజాగా కేసుల నమోదు ఖరారు కావడంతో శాంసంగ్ కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు లీకు వ్యతిరేకంగా నిధుల దుర్వినియోగం, లంచం, అప్రకటిత విదేశీ ఆస్తులు తదితర ఆరోపణలను నమోదు చేయనున్నట్టు దక్షిణ కొరియన్ ప్రత్యేక ప్రాసిక్యూటర్ ప్రతినిధి లీ క్యు-చుల్ మంగళవారం విలేకరులకు చెప్పారు. ఈ విలక్షణ విచారణ , తీర్పు కు 18 నెలల వరకు పడుతుందనీ, అయినప్పటికీ, ప్రత్యేక-ప్రాసిక్యూటర్ చట్టం చాలా త్వరగా కేసు పరిష్కరించేందుకు సిఫార్సు చేసినట్టు చెప్పారు. మరోవైపు ఈ నేరారోపణలపై లీ బెయిల్ కోరే అవకాశం ఉంది. అలాగే మూడు నెలలోపు కోర్టు కోర్టు తన మొదటి తీర్పును జారీ చేయాల్సి ఉంది. కాగా తాము ఎలాంటి తప్పులు చేయలేదని, లంచాలు ఇవ్వలేదని శాంసంగ్ సంస్థతో పాటు జే లీ కూడా వాదిస్తున్నారు. కోర్టు విచారణలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని , తాము ఎలాంటి తప్పు చేయలేదంటూఈ ఆరోపణలను లీ తిరస్కరించారు. -
శాంసంగ్ గ్రూప్‌నకు భారీ ఎదురుదెబ్బ
-
శాంసంగ్ గ్రూప్‌నకు భారీ ఎదురుదెబ్బ
ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రూప్ చీఫ్ జే లీని పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గ్యూన్-హైని అభిశంసన చేయడానికి కారణమైన అవినీతి కుంభకోణంలో పాత్ర ఉందన్న ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. సియోల్‌లోని డిటెన్షన్ సెంటర్లో ఆయనను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కోర్టులో రోజంతా సుదీర్ఘ విచారణ జరిగింది. అయితే ఆ విచారణ మొత్తం రహస్యంగానే సాగింది. కంపెనీలో రెండు ప్రధాన విభాగాలను కలిపేసి, తన తండ్రి లీ కున్ హీ నుంచి పగ్గాలు తీసుకోడానికి ప్రభుత్వ మద్దతు కూడా తీసుకున్నారన్నది జే లీపై ప్రధాన ఆరోపణ. ఇందులో భారీ మొత్తంలో చేతులు మారాయని అంటున్నారు. లీ అరెస్టుతో శాంసంగ్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. జే లీ అరెస్టుపై కోర్టులో సవాలు చేస్తారా.. బెయిల్ కోసం దరఖాస్తు చేస్తారా లేదా అనే విషయాలపై ఇంకా నిర్ణయం ఏమీ తీసుకోలేదని శాంసంగ్ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గత నెలలో ప్రాసిక్యూటర్లు ఇదే కోర్టులో జే లీ అరెస్టు కోసం దరఖాస్తు చేయగా, దాన్ని కోర్టు తిరస్కరించింది. తర్వాత జే లీతో పాటు శాంసంగ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్ పార్క్ శాంగ్-జిన్ను కూడా లంచాలు, ఇతర ఆరోపణలపై అరెస్టు చేసేందుకు మళ్లీ తాజాగా వారాంటు కోరుతూ ప్రత్యేక ప్రాసిక్యూటర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కొరియా ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ అధ్యక్షుడు కూడా అయిన పార్క్ అరెస్టుకు కోర్టు అనుమతి నిరాకరించింది. ఆయనను అరెస్టు చేయడానికి మరిన్ని సాక్ష్యాలు కావాలని కోర్టు తెలిపింది. అయితే తాము ఎలాంటి తప్పులు చేయలేదని, లంచాలు ఇవ్వలేదని శాంసంగ్ సంస్థతో పాటు జే లీ కూడా అంటున్నారు. కోర్టు విచారణలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే లీని అరెస్టు చేసినా, శాంసంగ్ గ్రూప్ కంపెనీల రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అంటున్నారు.