శాంసంగ్ గ్రూప్‌నకు భారీ ఎదురుదెబ్బ
శాంసంగ్ గ్రూప్‌నకు భారీ ఎదురుదెబ్బ
Published Fri, Feb 17 2017 8:11 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM
ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రూప్ చీఫ్ జే లీని పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గ్యూన్-హైని అభిశంసన చేయడానికి కారణమైన అవినీతి కుంభకోణంలో పాత్ర ఉందన్న ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. సియోల్‌లోని డిటెన్షన్ సెంటర్‌లో ఆయనను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కోర్టులో రోజంతా సుదీర్ఘ విచారణ జరిగింది. అయితే ఆ విచారణ మొత్తం రహస్యంగానే సాగింది. కంపెనీలో రెండు ప్రధాన విభాగాలను కలిపేసి, తన తండ్రి లీ కున్ హీ నుంచి పగ్గాలు తీసుకోడానికి ప్రభుత్వ మద్దతు కూడా తీసుకున్నారన్నది జే లీపై ప్రధాన ఆరోపణ. ఇందులో భారీ మొత్తంలో చేతులు మారాయని అంటున్నారు. లీ అరెస్టుతో శాంసంగ్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
జే లీ అరెస్టుపై కోర్టులో సవాలు చేస్తారా.. బెయిల్ కోసం దరఖాస్తు చేస్తారా లేదా అనే విషయాలపై ఇంకా నిర్ణయం ఏమీ తీసుకోలేదని శాంసంగ్ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గత నెలలో ప్రాసిక్యూటర్లు ఇదే కోర్టులో జే లీ అరెస్టు కోసం దరఖాస్తు చేయగా, దాన్ని కోర్టు తిరస్కరించింది. తర్వాత జే లీతో పాటు శాంసంగ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్ పార్క్ శాంగ్-జిన్‌ను కూడా లంచాలు, ఇతర ఆరోపణలపై అరెస్టు చేసేందుకు మళ్లీ తాజాగా వారాంటు కోరుతూ ప్రత్యేక ప్రాసిక్యూటర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కొరియా ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ అధ్యక్షుడు కూడా అయిన పార్క్ అరెస్టుకు కోర్టు అనుమతి నిరాకరించింది. ఆయనను అరెస్టు చేయడానికి మరిన్ని సాక్ష్యాలు కావాలని కోర్టు తెలిపింది.
అయితే తాము ఎలాంటి తప్పులు చేయలేదని, లంచాలు ఇవ్వలేదని శాంసంగ్ సంస్థతో పాటు జే లీ కూడా అంటున్నారు. కోర్టు విచారణలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే లీని అరెస్టు చేసినా, శాంసంగ్ గ్రూప్ కంపెనీల రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అంటున్నారు.
Advertisement
Advertisement