మరో షాక్: ఇన్ఫీపై న్యాయ విచారణ
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో షాక్ తగిలింది. నిన్ననే(శుక్రవారమే) ఆ కంపెనీ సీఈవో, ఎండీ పదవికి విశాల్ సిక్కా అనూహ్యంగా రాజీనామా చేయగా... ఒక్కరోజు వ్యవధిలోనే అమెరికా న్యాయ సంస్థలు ఆ కంపెనీపై న్యాయ విచారణకు దిగాయి. ఫెడరల్ సెక్యురిటీస్ చట్టాలను దేశీయ ఈ కంపెనీ, దాని అధికారులు, డైరెక్టర్లు ఉల్లంఘించిన ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తరుఫున నాలుగు అమెరికా న్యాయ సంస్థలు విచారణను ప్రారంభించాయి. బ్రోన్‌స్టెయిన్, జివెర్ట్జ్ అండ్ గ్రాస్మాన్, రోసెన్ న్యాయ సంస్థ, పోమెరాంట్జ్ న్యాయ సంస్థ, గోల్డ్ బర్గ్ లా పీసీలు ఈ విచారణ చేపట్టాయి. అమెరికా స్టాక్ మార్కెట్‌లో ఇన్ఫోసిస్ లిస్టు అయి ఉంది.
సంస్థపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇన్ఫోసిస్ పెట్టుబడిదారుల తరుఫున పొటెన్షియల్ సెక్యురిటీ క్లయిమ్స్‌పై విచారణ జరుపుతున్నామని రోసెన్ చెప్పింది. ప్రజలు పెట్టుబడులు పెట్టడానికి భౌతికంగా తప్పుదోవ పట్టించే వ్యాపార సమాచారాన్ని ఆ సంస్థ జారీచేసినట్టు ఆరోపణలు వస్తున్నాయన్నది. ఇన్వెస్టర్లు పోగొట్టుకున్న మొత్తాలను రికవరీ చేయడానికి కంపెనీ క్లాస్ యాక్షన్ దావాకు కూడా సిద్ధమై ఉండాలని హెచ్చరించింది. ఇన్ఫోసిస్ లేదా కొందరు ఆఫీసర్లు, డైరెక్టర్లు ఫెడరల్ సెక్యురిటీ చట్టాలకు అనుగుణంగా పనిచేశారా లేదా అన్నది విచారిస్తున్నామని బ్రోన్‌స్టెయిన్ పేర్కొంది. సెక్యురిటీస్ మోసానికి లేదా చట్టవిరుద్ధమైన వ్యాపార విధానాలకు వారు పాల్పడారా? లేదా? అన్నది తేల్చుతామని పోమెరాంట్జ్ తెలిపింది. సిక్కా రాజీనామా అనంతరం ఇన్ఫీకి మరింత షాక్‌గా ఈ విచారణలు ప్రారంభమయ్యాయి. సిక్కా రాజీనామాతోనే ఇప్పటికే ఇన్ఫీ షేరు కనీసం 9 శాతం మేర నష్టపోయింది.