యాపిల్‌తో మళ్లీ ఘర్షణ దిశగా అమెరికా!
ఐఫోన్ అన్‌లాక్ విషయంలో యాపిల్ కంపెనీకి, అమెరికా ప్రభుత్వానికి ఘర్షణ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే సాన్‌బెర్నార్డినో సాయుధుడి ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేలా ఆదేశాలు ఇవ్వలేమంటూ అమెరికా కోర్టు యాపిల్‌కు ఊరట కల్పించినా.. ఆ కంపెనీకి వ్యతిరేకంగా మరో కేసును ఆ దేశ న్యాయవిభాగం కోర్టు ముందు ఉంచింది. డ్రగ్స్ నేరగాడైన ఓ నిందితుడి ఐఫోన్‌ను యాపిల్ అన్‌లాక్ చేసేవిధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టును న్యాయవిభాగం ఆశ్రయించింది.
సాన్‌బెర్నార్డినోలో కాల్పులు జరిపిన సాయుధుడి ఐఫోన్ అన్‌లాక్ చేసేందుకు 1789నాటి చట్టం ఆధారంగా ఆదేశాలు ఇవ్వలేమంటూ కాలిఫోర్నియా కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దొడ్డిదారిలో తాము ఆ సాయుధుడి ఐఫోన్‌ను హ్యాక్ చేసి.. అందులోని వివరాలు వెల్లడించలేమని, ఒకవేళ తాము అలా చేస్తే భవిష్యత్‌లో ఐఫోన్ యూజర్ల వ్యక్తిగత భద్రత ప్రమాదంలో పడే అవకాశముందన్న యాపిల్ వాదనను కోర్టు సమర్థించింది. అయినప్పటికీ తాజాగా డ్రగ్స్ నేరగాడి కేసులో ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేలా యాపిల్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ అమెరికా న్యాయవిభాగం మరో కేసును కోర్టు ముందు ఉంచింది. సాన్‌బెర్నార్డినో కేసు మాదిరిగానే ఈ కేసులోనూ 1789నాటి చట్టం ఆధారంగా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.