డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో రెచ్చిపోతున్న లంచావతారులు
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి అంటూ ఓ మెడికల్ ఆఫీసర్ ఆడియో మెసేజ్
అంబేడ్కర్ కోనసీమ డీఎంహెచ్‌వో అవినీతిపై వాట్సాప్ గ్రూప్‌లో తీవ్ర చర్చ
మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్‌వో చర్చలు!
సాక్షి, అమరావతి: ప్రసూతి సెలవుల ఆమోదం కోసం రూ.10 వేలు తీసుకున్నారని ఓ మహిళా వైద్యురాలు... రూ.4 వేలు లంచం ఇస్తే గానీ ఎస్‌ఆర్ నమోదు చేయలేదని మరొక మెడికల్ ఆఫీసర్... రూ.10 వేలు ముట్టజెప్పాకే ప్రొబేషన్ డిక్లరేషన్(రెగ్యులరైజేషన్) చేశారని ఇంకొకరు... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ డీఎంహెచ్‌వో కార్యాలయం అవినీతిపై మెడికల్ ఆఫీసర్ (ఎంవో)లు అధికారిక వాట్సాప్ గ్రూప్‌లోనే తమ ఆవేదనను వ్యక్తంచేయడం వైద్యశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తంచేస్తూ మాట్లాడిన ఆడియో మెసేజ్ శుక్రవారం వైద్యశాఖ వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేసింది. డాక్టర్, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్... ఇలా క్యాడర్, పనిని బట్టి డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో రేట్లు ఖరారు చేసి లంచాలు వసూలు చేస్తున్నారని ఆ వైద్యుడు చెప్పారు.
ఆఖరికి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కింద పని చేసే చిరుద్యోగులను సైతం లంచాల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారని ధ్వజమెత్తారు. పైగా తాము తీసుకుంటున్న ప్రతి రూపాయిలో కొంత డీహెచ్ కార్యాలయానికి ముట్టజెప్పాలని జిల్లా కార్యాలయాల్లో చెబుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్‌వో మంతనాలు!
తన కార్యాలయ అవినీతి తంతు బట్టబయలు కావడంతో ఉలిక్కిపడ్డ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ డీఎంహెచ్‌వో... కొందరు మెడికల్ ఆఫీసర్‌లను తన కార్యాలయానికి పిలిపించుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది. తనకు తెలియకుండానే కింది స్థాయి ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇకపై అలా జరగకుండా చూస్తానని డీఎంహెచ్‌వో బతిమిలాడినట్లు సమాచారం.
అదేవిధంగా వసూలు చేసిన ప్రతి రూపాయిని తిరిగి చెల్లించేలా చూస్తానని, ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని ప్రాథేయపడినట్లు తెలిసింది. మెడికల్ ఆఫీసర్లు సైతం పీహెచ్‌సీల వారీగా అవినీతి వ్యవహారంపై ఫిర్యాదులు స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
డీఎంహెచ్‌వో కార్యాలయం అవినీతిపై ఎంవోలు జిల్లా స్థాయి అధికారులు ఉండే వాట్సాప్ గ్రూప్‌లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగినా... ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు తేలికగా తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment