ఉద్యోగుల బదిలీల కోసం లక్షకుపైగా సిఫారసు లేఖలు
ఎమ్మెల్యేల లేఖలు ఉన్న వారికే బదిలీలు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు
కొన్ని జిల్లాల్లో 5 నుంచి 7 వేల వరకూ లేఖలిచ్చిన ఎమ్మెల్యేలు
ప్రతి ఎమ్మెల్యే 150 నుంచి 200కిపైగా లేఖలు!
ముడుపులు, కులమే ప్రాతిపదికన లేఖలిస్తున్న నేతలు
గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఇదే తీరు
తహసీల్దారైనా, జూనియర్ అసిస్టెంట్ అయినా ఎమ్మెల్యే చెప్పాల్సిందే
గడువు పూర్తయినా అనధికారికంగా కొనసాగుతున్న బదిలీలు
బదిలీల్లో ఈ స్థాయి రాజకీయ జోక్యం ఎప్పుడూ లేదంటున్న అధికారవర్గాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. ఎమ్మెల్యేల సిఫారసు లేకుండా ఏ ఉద్యోగి, ఏ అధికారి కూడా మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఏ నియోజకవర్గంలోని కార్యాలయంలోనైనా అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేలు చెప్పిన వారిని నియమించాలని కలెక్టర్లకు కూడా అనధికారికంగా ఆదేశాలు వెళ్లాయి. సీనియారిటీ, ప్రతిభను కూడా పక్కన పెట్టి కేవలం సిఫారసుల ఆధారంగానే బదిలీలు జరపాలని ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులకు స్పష్టంగా చెప్పారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు రెచ్చిపోయి వారే పోస్టింగులు ఇచ్చేస్తున్నారు.
నచ్చిన వారికి, ముడుపులిచ్చిన వారికి మాత్రమే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. బదిలీల ప్రక్రియ మొదలైన తర్వాత ఇలా లక్షకుపైగా సిఫారసు లేఖలు ఎమ్మెల్యేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి ఎమ్మెల్యే కనీసం 150 సిఫారసు లేఖలు ఇచ్చారని, కొందరు 250 నుంచి 300 లేఖలు కూడా ఇచ్చారని సమాచారం. జిల్లాకు సగటున 4 వేల సిఫారసు లేఖలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో 5 వేలకు పైగా సిఫారసు లేఖలు రావడంతో ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు.
బదిలీల్లో ఇంతటి రాజకీయ జోక్యం, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఎప్పుడూ చూడలేదని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీతో బదిలీల గడువు ముగిసినప్పటికీ, పెద్ద ఎత్తున వస్తున్న ఒత్తిళ్లతో ఇప్పటికీ బదిలీలు చేస్తూనే ఉన్నారు. చాలా జిల్లాల్లో పాత తేదీలు వేసి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అనధికారికంగా వచ్చే నెల 2వ తేదీ వరకు బదిలీలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు.
‘దక్షిణ’ ఇస్తే ‘దమ్మున్న’ పోస్టింగ్
నియోజకవర్గాలోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లను గుప్పిట్లో ఉంచుకునేలా ఎమ్మెల్యేలు అనువైన వారిని గుర్తించి సిఫారసు లేఖలు ఇచ్చారు. ఎక్కువ ముడుపులు ఇచ్చిన వారికి ఫోకల్ స్థానాల్లో పోస్టింగ్‌లు ఇప్పించారు. కుల ప్రాతిపదికన కూడా చాలామందికి సిఫారసు చేశారు. ఇందుకోసం అప్పటికే అక్కడ పని చేస్తున్న వారిని బలవంతంగా లూప్‌లైన్‌లోకి, అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయించారు.
కొందరు ఉద్యోగులపై రాజకీయ ముద్ర వేసి మరీ పక్కన పెడుతున్నారు. కొన్నిచోట్ల బదిలీల జాబితాలో ఉన్న పేర్ల పక్కన టీడీపీ, వైఎస్సార్‌సీపీ, తటస్థం అని రాశారు. టీడీపీకి అనుకూలమైన వారికే నియోజకవర్గాల్లో పోస్టింగ్‌కి అనుమతిస్తున్నారు. లేకపోతే లూప్‌లైన్‌లోకి పంపించేస్తున్నారు. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు కూడా తమ వారినే నియమించుకుంటున్నారు.
నిబంధనలు బేఖాతరు
బదిలీల్లో నిబంధనలను అసలే పట్టించుకోవడంలేదు. తహశీల్దార్లను సొంత నియోజకవర్గాలకు బదిలీ చేయకూడదనే నిబంధనను అన్ని చోట్లా తుంగలో తొక్కారు. కాగితాలపై ఆ నియోజకవర్గం కాదని చూపించి మరీ సొంత నియోజకవర్గాలకు బదిలీ చేయించుకుంటున్నారు. ఇదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పనిచేస్తున్న తహశీల్దార్ తన సొంత నియోజకవర్గమైన భీమవరం వేయించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
ఇందుకు ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఇచ్చినా అధికారులు కాదనలేని పరిస్థితి నెలకొంది. తాడేపల్లిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్‌పై ఏసీబీ కేసు ఉన్నా ప్రధానమైన పోస్టు కోసం అక్కడి ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఇచ్చారు. ఎమ్మెల్యేల లేఖలను తప్పనిసరిగా ఆమోదించాలన్న ఒత్తిడి తీవ్రంగా ఉన్నందున నిబంధనలకు విరుద్ధమైన వారికి కూడా పోస్టింగ్‌లు ఇవ్వక తప్పడంలేదని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment