
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల ఆవేదన
వలంటీర్ల పనులన్నీ సచివాలయాల సిబ్బందిపైనే
సగం మంది ఉద్యోగులు వారి విధుల్లో పూర్తిగా బీజీ
మిగతా వారిపై తీవ్ర ఒత్తిడి.. సెలవు రోజుల్లోనూ పని
టార్గెట్ పూర్తి కాలేదంటూ క్రమ శిక్షణ చర్యలు
పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఆరు నెలలుగా విఫలయత్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ తొలగింపు అనంతరం ప్రభుత్వం క్షేత్ర స్థాయి నుంచి ఏ సమాచారం సేకరించాలన్నా, సర్వేలు నిర్వహించాలన్నా ఆ పనులు పూర్తిగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకే అప్పగిస్తుండడంతో పంచాయతీ కార్యదర్శులు తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారు. గత ఐదేళ్లలో ప్రతి నెలా పింఛన్ల పంపిణీ సహా ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల సర్వేలు పూర్తిగా వలంటీర్ల ఆధ్వర్యంలో కొనసాగేవి. అప్పట్లో సచివాలయాల ఉద్యోగులు వారి విధులు నిర్వహించడంతో పాటు ఆయా సర్వే కార్యక్రమాలను పర్యవేక్షించే వారు.
అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా పింఛన్ల పంపిణీ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి వివిధ రకాల సమాచారం సేకరించే 14కు పైగా సర్వేలు, మరో ఐదారు అంశాల్లో గ్రామ స్థాయి నుంచి సమాచారం నమోదు చేసే కార్యక్రమాలు చేపట్టింది. వీటన్నింటినీ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే నిర్వహిస్తున్నారు.
గ్రామ సచివాలయాల్లో 8–9 మంది చొప్పున ఉద్యోగులు పని చేస్తుండగా, వారిలో నాలుగైదు కేటగిరీల ఉద్యోగులు ఎక్కువ చోట్ల వారి మాతృ శాఖలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నామని చెబుతూ సర్వేలకు దూరంగా ఉన్నారని ఉద్యోగ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. దీంతో ఈ భారం అంతా సచివాలయాల్లో ఉండే ఇతర ఉద్యోగులపై పడుతోందన్నారు. పై అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారని, పలుచోట్ల షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సారూ.. అపాయింట్‌మెంట్ ఇవ్వరూ..
ఓ వైపు నిర్దిష్ట గడువులు విధించి సర్వేల కోసం ఒత్తిడి.. మరో వైపు ఇంటి పన్నుల వసూళ్ల టార్గెట్.. ఇంకో వైపు పారిశుధ్య పనులపై ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా వచ్చిన ప్రజాభిప్రాయంపై పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేయడం.. తదితర వాటితో కొన్ని నెలలుగా పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ తెలిపింది. గ్రామ సభల నిర్వహణ, పంచాయతీ సమావేశాల నిర్వహణ తదితర 37 రకాల గ్రామ పంచాయతీల సాధారణ కార్యక్రమాలతో బిజీగా ఉండే కార్యదర్శులకు ప్రస్తుత పనుల వల్ల భారం తీవ్రంగా పెరిగిందని ఫెడరేషన్ ప్రతినిధులు చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక సెలవులు కూడా సరిగా ఇవ్వడం లేదని, సెలవు రోజుల్లోనూ పని చేయాల్సి వస్తోందని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీంతో పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు సంబంధిత ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీలతో పాటు జిల్లా స్థాయిలో డీపీవో, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తున్నారు.
రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు సైతం ఉద్యోగ సంఘ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆరు నెలలుగా ప్రయతి్నస్తున్నా, ఆయన అపాయింట్‌మెంట్ దొరకలేదని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వర్ల శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.