వారం పది రోజుల్లో మొత్తాన్ని పీకేయిస్తాను
టీడీపీ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య ఫోన్ సంభాషణ
సోషల్ మీడియాలో ఆడియో వైరల్
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ‘సచివాలయ బ్యాచ్ మొత్తం వైసీపీ వాళ్లే ఉన్నారు. ఏం చేస్తాం? ఒక పక్క నుంచి పీక్కుంటూ వస్తున్నాం. ఒకరా.. ఇద్దరా ఆపడానికి. వారం ఆగితే అందరినీ రిమూవ్ చేస్తాం. వారం పదిరోజుల్లో మొత్తాన్ని తీసి పారనూకుతాం. వాళ్లిష్టమొచ్చినట్లు కొట్టుకుంటూ పోయారు. మనోళ్లకు రాలేదు. వాడి మీద ఫిర్యాదు పెట్టు.. వాడి జాబ్ తీయించి పారనూకుతాను’ అంటూ సచివాలయ ఉద్యోగుల గురించి పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య ఆ పార్టీ కార్యకర్తతో చేసిన ఫోన్ సంభాషణ. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కుట్రలో భాగంగానే హల్‌చల్
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 42వ డివిజన్‌కు చెందిన టీడీపీ కార్యకర్త కిషోర్ మాజీ కార్పొరేటర్ రామయ్యకు ఫోన్ చేసి.. వరద నష్ట పరిహారం అందలేదని చెప్పాడు. ఫలానా వాళ్లకు రూ. 1.25లక్షలు పడ్డాయి. మన వాళ్లు మొత్తం కోల్పోయినా రూ. 3వేలు పరిహారం ఇచ్చారంటూ రామయ్యతో ఫోన్‌లో మాట్లాడాడు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి రూ. లక్ష, రెండు లక్షలు వేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి ఏమీ ఇవ్వలేదు. ఇదేం న్యాయమంటూ రామయ్యను అడిగాడు. దీంతో రామయ్య ఒక్కసారిగా.. సచివాలయ బ్యాచ్ మొత్తం వైసీపీ వాళ్లేనంటూ రెచ్చిపోయాడు.
ఫోన్ సంభాషణతో నియోజకవర్గంలోని సచివాలయ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ సంభాషణలో వాడిన భాష, సచివాలయ ఉద్యోగులను వాడు వీడు అంటూ మాట్లాడిన తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి ఆడియోలు రికార్డు చేసి వాటిని వైరల్ చేయడం రామయ్యకు అలవాటేనని, సచివాలయ ఉద్యోగులంతా వైఎస్సార్ సీపీ వాళ్లేనంటూ బెదిరించి వారిని తన ఆధీనంలో పెట్టుకునే కుట్రలో భాగంగానే ఆడియో వైరల్ చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో వాళ్ల పార్టీ నాయకులు ఫోన్‌లో మాట్లాడిన సంభాషణల ఆడియోలు కూడా ఇలాగే వైరల్ అయ్యాయని నాయకులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment