డయేరియా బాధితుల్లో కలరా లక్షణాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ
పూర్తి స్థాయి నిర్ధారణ కోసం కోల్‌కతాకు నమూనాలు
విషయం బయటకు పొక్కకుండా చూస్తున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా గుర్లలో 14 మంది మరణించడంతో పాటు, వందల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులపాలవ్వడానికి కారణం కలరా అని తెలుస్తోంది. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా కలరా ఆనవాళ్లను గుర్తించినట్టు సమాచారం. వైద్య శాఖ నియమించిన ర్యాపిడ్ రియాక్షన్ టీమ్ సైతం ఈ అంశాన్ని ధ్రువీకరిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది.
గుర్లలో చోటు చేసుకున్న మరణాలను దాచినట్లుగానే, సమస్యకు కారణాలను సైతం బయటకు పొక్కకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆస్పత్రిలో చేరిన కొందరు బాధితుల నుంచి నమూనాలు సేకరించి.. విజయనగరం వైద్యకళాశాల ల్యాబ్‌లో పరీక్షించారు. కల్చర్ టెస్ట్‌లో విబ్రియో కలరా ఆనవాళ్లను గుర్తించినట్టు తెలిసింది.
పూర్తి స్థాయిలో నిర్ధారణ కోసం కోల్‌కతాలోని ల్యాబ్‌కు పంపినట్టు సమాచారం. కలరా సోకిన వారిలో తీవ్ర స్థాయిలో విరోచనాలు అవుతాయి. దీంతో తొందరగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి బాగా నీరసించిపోతారు. ఆపై కిడ్నీల పనితీరుపై ప్రభావం పడి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో మరణాలు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment