శానిటరీ నాప్‌కిన్ల పంపిణీలో ఏపీ అగ్రగామి | Distribution of Free Sanitary Napkins to Girls: Andhra pradesh | Sakshi
Sakshi News home page

శానిటరీ నాప్‌కిన్ల పంపిణీలో ఏపీ అగ్రగామి

Published Tue, Dec 26 2023 5:48 AM | Last Updated on Tue, Dec 26 2023 2:51 PM

Distribution of Free Sanitary Napkins to Girls: Andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి:  ఆడబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారిపట్ల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ (నెలసరి పరిశుభ్రత) కార్యక్రమం అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంటోంది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ లోక్‌సభలో వెల్లడించింది.

నెలసరి సమయంలో స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్‌కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబరు మధ్య 72.59 లక్షల నాప్‌కిన్‌లను పంపిణీ చేసి పశ్చిమ బెంగాల్‌ మొదటి స్థానంలో ఉండగా.. 59,63,209 శానిటరీ నాప్‌కిన్ల పంపిణీతో ఏపీ రెండో స్థానంలో ఉంది. అనంతరం.. 45.86 లక్షలతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచింది. ఇక కేరళలో 80,166, కర్ణాటకలో కేవలం 5,613, తెలంగాణలో 3,920 మాత్రమే పంపిణీ చేశారు.  

కేటాయించిన నిధుల ఖర్చులో నెంబర్‌ వన్‌.. 
ఇక నెలసరి పరిశుభ్రత కార్యక్రమాలు అమలుచేయడం ద్వారా భవిష్యత్తులో బాలికలు అనారోగ్య సమస్యల బారినపడకుండా నియంత్రించేందుకు కేటా­యించిన నిధులను ఖర్చుచేయడంలో ఏపీ దేశం­లోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల మేర నిధులు కేటాయించడమే కాకుండా దేశంలోనే అత్యధికంగా వంద శాతం నిధులను ఖర్చుచేసింది. పశ్చిమ బెంగాల్‌లో రూ.389 కోట్లు కేటాయించగా కేవలం రూ.9.32 కోట్లు, తెలంగాణాలో రూ.303 కోట్లు కేటాయించినప్పటికీ రూ.4 లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.   

ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు.. 
నెలసరి ఇబ్బందులతో బాలికలు విద్యకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్‌ ప్రభుత్వం గుర్తించింది. దేశంలో దాదాపు 23 శాతం బాలికల చదువులు ఆగిపోవడానికి ప్రధాన కారణం నెలసరి సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులేనని యునైటెడ్‌ నేషన్స్‌ వాటర్‌ సఫ్లై అండ్‌ శానిటేషన్‌ కొలాబరేటివ్‌ కౌన్సిల్‌ నివేదికల్లో వెల్లడించారు.

ఈ తరహా డ్రాపౌట్స్‌ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మిడియట్‌ చదువుతున్న 10 లక్షల మంది బాలికలకు ప్రతినెలా ఒకొక్కరికి  10 చొప్పున నాణ్యమైన, బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది.  

ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార దశ క్లినిక్‌లు.. 
ఇక కౌమార దశలో బాలబాలికలకు ఎదురయ్యే ఆ­రో­గ్య సమస్యల నివృత్తికి, వారికి వైద్యసేవలు అం­దించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. క్లినిక్‌లలో సేవలు అందించే వైద్యు­లు.. కౌమార దశ పిల్లలపట్ల ఏ విధంగా వ్యవ­హరించాలి.. తదితర అంశాలపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చారు.

అంతేకాక.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో గ్రామా­లకు వెళ్లిన డాక్టర్లు మధ్యాహ్నం నుంచి పాఠశాలలు సందర్శించి అక్కడి బాలికల ఆరోగ్యంపై వాక­బు చేస్తున్నారు. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యా­పకులు, గ్రామ సచివాలయాల్లోని ఏఎన్‌ఎంలు ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలు.. 
ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల్లో చాలావరకు  మధ్యతరగతి, పేద కుటుంబాల వారుంటారు. వీరికి శానిటరీ నాప్‌కిన్లు కొనే 
ఆర్థిక స్థోమత ఉండదు. దీంతో.. 
► నెలసరి సమయంలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో రీప్రొడక్టివ్‌ ట్రాక్ట్‌ ఇన్ఫెక్ఫన్లు (జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు–ఆర్టీఐ) వస్తాయి.  

► అలాగే.. సాధారణంగా జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్ది మోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్రమైన పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడిన తర్వాత కాలంలో సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులొస్తాయి.  

► అంతేకాదు.. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ వస్తుంది. భవిష్యత్‌లో సంతానలేమి సమస్యలూ తలెత్తుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement