సాక్షి, అమరావతి/చిలకలూరిపేట: బాలికల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ కింబెర్లీ– క్లార్క్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు మంగళవారం ఉచితంగా శానిటరీ నాప్‌కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వైద్య, ఆరోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు ఈ సంస్థ 2.33 లక్షల శానిటరీ నాప్‌కిన్లు, 297 కేసుల డైపర్స్‌ను తొలి విడతలో పేద విద్యార్థులు, చిన్నారులకు అందజేసేందుకు ముందుకొచ్చింది. కార్య్రకమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఏడో తరగతి నుంచి 12వ తరగతి లోపు ఆడపిల్లలకు స్వేచ్ఛ కార్యక్రమం కింద ప్రభుత్వం నెల నెలా 12 లక్షల శానిటరీ నాప్‌కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు.
హెల్త్ రికార్డులన్నీ కంప్యూటర్‌లో నిక్షిప్తం
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నామని మంత్రి రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా వైద్యం పొందుతున్న అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. 1.6 కోట్ల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు అందించగలుగుతున్నామన్నారు.
క్యాంపులకు హాజరైన వారిలో ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే అలాంటి వారిని పెద్దాస్పత్రులకు సిఫారసు చేస్తున్నామని చెప్పారు. వ్యాధి నయం అయ్యేంతవరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని, కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ప్రతి అంశంలోనూ బురదజల్లడమే పనిగా మారిందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment