sanitary napkins
-
శానిటరీ నాప్కిన్ల పంపిణీలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ఆడబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారిపట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మెన్స్ట్రువల్ హైజీన్ (నెలసరి పరిశుభ్రత) కార్యక్రమం అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంటోంది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ లోక్‌సభలో వెల్లడించింది. నెలసరి సమయంలో స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య 72.59 లక్షల నాప్కిన్లను పంపిణీ చేసి పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా.. 59,63,209 శానిటరీ నాప్కిన్ల పంపిణీతో ఏపీ రెండో స్థానంలో ఉంది. అనంతరం.. 45.86 లక్షలతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచింది. ఇక కేరళలో 80,166, కర్ణాటకలో కేవలం 5,613, తెలంగాణలో 3,920 మాత్రమే పంపిణీ చేశారు. కేటాయించిన నిధుల ఖర్చులో నెంబర్ వన్.. ఇక నెలసరి పరిశుభ్రత కార్యక్రమాలు అమలుచేయడం ద్వారా భవిష్యత్తులో బాలికలు అనారోగ్య సమస్యల బారినపడకుండా నియంత్రించేందుకు కేటాయించిన నిధులను ఖర్చుచేయడంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల మేర నిధులు కేటాయించడమే కాకుండా దేశంలోనే అత్యధికంగా వంద శాతం నిధులను ఖర్చుచేసింది. పశ్చిమ బెంగాల్లో రూ.389 కోట్లు కేటాయించగా కేవలం రూ.9.32 కోట్లు, తెలంగాణాలో రూ.303 కోట్లు కేటాయించినప్పటికీ రూ.4 లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు.. నెలసరి ఇబ్బందులతో బాలికలు విద్యకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్ ప్రభుత్వం గుర్తించింది. దేశంలో దాదాపు 23 శాతం బాలికల చదువులు ఆగిపోవడానికి ప్రధాన కారణం నెలసరి సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులేనని యునైటెడ్ నేషన్స్ వాటర్ సఫ్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికల్లో వెల్లడించారు. ఈ తరహా డ్రాపౌట్స్‌ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మిడియట్ చదువుతున్న 10 లక్షల మంది బాలికలకు ప్రతినెలా ఒకొక్కరికి 10 చొప్పున నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార దశ క్లినిక్‌లు.. ఇక కౌమార దశలో బాలబాలికలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నివృత్తికి, వారికి వైద్యసేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. క్లినిక్‌లలో సేవలు అందించే వైద్యులు.. కౌమార దశ పిల్లలపట్ల ఏ విధంగా వ్యవహరించాలి.. తదితర అంశాలపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. అంతేకాక.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు మధ్యాహ్నం నుంచి పాఠశాలలు సందర్శించి అక్కడి బాలికల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు, గ్రామ సచివాలయాల్లోని ఏఎన్ఎంలు ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలు.. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల్లో చాలావరకు మధ్యతరగతి, పేద కుటుంబాల వారుంటారు. వీరికి శానిటరీ నాప్కిన్లు కొనే ఆర్థిక స్థోమత ఉండదు. దీంతో.. ► నెలసరి సమయంలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్ఫన్లు (జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు–ఆర్టీఐ) వస్తాయి. ► అలాగే.. సాధారణంగా జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్ది మోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్రమైన పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడిన తర్వాత కాలంలో సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులొస్తాయి. ► అంతేకాదు.. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. భవిష్యత్‌లో సంతానలేమి సమస్యలూ తలెత్తుతాయి. -
ఇది మూణ్ణాళ్ళ కథ కాదు!
ప్రజల ఆరోగ్యం విషయంలోనూ పాలకులకు న్యాయస్థానాలు గడువు విధించాల్సి రావడం విచిత్రమే. అయితే, ఇప్పటికే అదే పనిలో ప్రభుత్వముంటే, త్వరితగతిన పనులు జరగడానికి ఈ గడువు విధింపు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. శానిటరీ న్యాప్కిన్ల పంపిణీపై దృష్టి పెడుతూ, జాతీయ స్థాయిలో ‘వాంఛనీయ’ ఋతుస్రావ కాల ఆరోగ్య విధానాన్ని 4 వారాల్లో ఖరారు చేయాలంటూ సుప్రీమ్ కోర్ట్ గత సోమవారం అన్నమాట అలాంటిదే. ప్రభుత్వ ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సగటున ఎంతమంది ఆడపిల్లలకు ఎన్ని మరుగుదొడ్లు ఉండాలన్న దానిపైనా జాతీయ స్థాయిలో ఒక మోడల్‌ను నిర్ణయించాల్సిందిగా కోర్ట్ ఆదేశించింది.దాదాపు 37.5 కోట్ల మంది ఋతుస్రావ వయసువారున్న దేశంలో... 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులో... దేశ ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం ఇచ్చిన ఈ ఆదేశం మహిళా లోకానికి కొంత ఊరట. ఋతుస్రావ ఆరోగ్య ప్రాధాన్యాన్ని కోర్ట్ గుర్తించడం, ప్రస్తావించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఆ పని చేసింది. పట్టని ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది. ఏడు నెలల క్రితం ఏప్రిల్‌లో కూడా ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో స్పందిస్తూ, ఋతుకాలపు ఆరోగ్యంపై ఏకరూప జాతీయ విధాన రూపకల్పనకు కేంద్రాన్ని సుప్రీమ్ ఆదేశించింది. తాజాగా, కోర్ట్‌లో ప్రభుత్వ వకీలు పేర్కొన్నట్టు జాతీయ విధానం ముసాయిదాను కేంద్రం ఇటీవలే ఆన్లైన్లో పెట్టింది. సామాన్య ప్రజల మొదలు నిపుణుల దాకా అందరి అభిప్రాయాలు కోరింది. తద్వారా ఋతుస్రావం పట్ల తరతరాలుగా మన దేశంలో నెలకొన్న అనేక అపోహలనూ, సవాళ్ళనూ నిర్వీర్యం చేయాలన్నది ప్రయత్నం. అర్ధంతరంగా బడి చదువు మానేయడం సహా అనేక సమస్యలకు కారణమవుతున్న ఈ ఆరోగ్య అంశం పట్ల దృష్టి పెట్టడానికి స్వతంత్ర దేశంలో ఏడున్నర దశాబ్దాలు పట్టింది. అలాగని అసలేమీ జరగలేదనలేం. కొన్నేళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా ఋతుస్రావ కాల ఆరోగ్యం, పరిశుభ్రత (ఎంహెచ్‌హెచ్) పట్ల దృష్టి పెరుగుతోంది. భారత్‌లో సైతం ప్రజారోగ్య చర్చల్లో ఈ అంశాన్ని భాగం చేశారు. ‘జాతీయ ఆరోగ్య మిషన్ 2011’లో గ్రామీణ ప్రాంతాల్లోని కౌమార బాలికల్లో ఋతుస్రావ కాలపు ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో దీన్ని చేర్చారు. కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ సైతం 2015లోనే పాఠశాలలకు మార్గ దర్శకాలు జారీచేసింది. దాని ఫలితాలు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల్లో కొంత కనిపించాయి. పీరియడ్స్ వేళ ఆరోగ్యకర మైన పద్ధతులను పాటించడమనేది మునుపటి సర్వేతో పోలిస్తే, అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో 15 నుంచి 24 ఏళ్ళ వయసు యువతుల్లో 20 శాతం పెరిగింది. ఇది కొంత సంతోషకరం. పైగా, ఐరాస పేర్కొన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంహెచ్‌హెచ్ కూడా ఒకటనేది గమనార్హం. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో ‘స్వేచ్ఛ’, కేరళలో ‘షీ ప్యాడ్’, రాజస్థాన్‌లో ‘ఉడాన్’ ఇలా రకరకాల పేర్లతో వివిధ రాష్ట్రాలు కౌమార బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేస్తున్నాయి. దీర్ఘకాలిక వినియోగ నిమిత్తం కేరళ, కర్ణాటకలు న్యాప్కిన్లకు బదులు ఋతుస్రావ కప్స్ అందిస్తున్నాయి. అయితే, సమాజంలోని దురభిప్రాయాలను పొగొట్టడమనే సవాలు మిగిలే ఉంది. పన్నెండేళ్ళ సోదరి దుస్తుల మీద ఉన్న తొలి ఋతుస్రావ రక్తపు మరకలను చూసిన ఓ అన్నయ్య ఆమెను అనుమానించి, కొట్టి చంపిన ఘటన ఆ మధ్య మహారాష్ట్రలో జరిగింది. ఆడవారికే కాక, మగవారికి సైతం పీరియడ్స్ పట్ల అవగాహన పెంచాలంటున్నది అందుకే. ‘ఆ 3 రోజులు’ ఆడవారిని ప్రాథమిక వసతులైనా లేని గుడిసెల్లో విడిగా ఉంచే మహారాష్ట్ర తరహా అమానుష పద్ధతుల్ని మాన్పించడం లక్ష్యం కావాలి. ఋతుక్రమం అపవిత్రత కాదనీ, శారీరక జీవప్రక్రియనీ గుర్తెరిగేలా చేయాలి. తగిన ఎంహెచ్‌హెచ్ వసతులు లేకపోవడంతో ఏటా మన దేశంలో 2.3 కోట్ల మందికి పైగా బాలికలు అర్ధంతరంగా బడి చదువులు మానేస్తున్నట్టు సర్వేల మాట. సరిగ్గా చదువుకోని వారు ఋతుస్రావ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపలేకపోతున్నారన్నది దాని పర్యవసానం. అంటే, ఇది ఒక విషవలయం. దీన్ని ఛేదించాలి. బడిలో వసతులు పెంచడంతో పాటు జాతీయ విధానం ద్వారా ఆరోగ్యంలో, సామాజిక అనాచారాలను మాన్పించడంలో టీచర్లు కీలక పాత్ర పోషించేలా తగిన శిక్షణనివ్వాలి. విధానాల నిర్ణయం, కార్యక్రమాల రూపకల్పనలో తరచూ ఓ పొరపాటు చేస్తుంటారు. యువతుల మీదే దృష్టి పెట్టి, ఋతుక్రమం ఆగిపోయిన లక్షలాది మహిళల ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటారు. అది మారాలి. మెనోపాజ్ అనంతర ఆరోగ్యం, అపోహల నివృత్తిపైనా చైతన్యం తేవాలి. ఆరోగ్య కార్యకర్తలకు అందుకు తగ్గ శిక్షణనివ్వాలి. ప్యాడ్ల పంపిణీతో బాధ్యత ముగిసిందను కోకుండా సంక్లిష్ట సామాజిక అంశాలపై జనచైతన్యం ప్రధానాంశం కావాలి. ఇన్నేళ్ళకు ఒక జాతీయ విధానం తేవడం విప్లవాత్మకమే కానీ దానితో పని సగమే అయినట్టు! గ్రామప్రాంతాల్లోనూ అందరికీ అందుబాటు ధరలో న్యాప్కిన్లుండాలి. శుభ్రమైన మరుగుదొడ్లు, నీటి వసతి బడిలో భాగం కావాలి. ఆరోగ్యం, ఆచారం లాంటి అంశాల్లో తరతరాలుగా సమాజంలో నెలకొన్న అభిప్రాయాలను పోగొట్టడం సులభం కాకపోవచ్చు. కానీ, అందుకు ప్రయత్నించకపోతే నేరం, ఘోరం. ఋతుస్రావ ఆరోగ్యంపై చైతన్యం తేవడంలో భారత్ మరింత ముందడుగు వేసేందుకు సత్వర జాతీయ విధానం తోడ్పడితే మేలు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సైతం ఏళ్ళు పూళ్ళు తీసుకొని, మరో అయిదేళ్ళ తర్వాత అమలు అంటున్న పాలక వర్గాలు ఆకాశంలో సగమనే ఆడవారి తాలూకు శారీరక, మానసిక ఆరోగ్యం గురించి వెంటనే పట్టించుకుంటే అదే పదివేలు. -
బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, అమరావతి/చిలకలూరిపేట: బాలికల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ కింబెర్లీ– క్లార్క్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు మంగళవారం ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్య, ఆరోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు ఈ సంస్థ 2.33 లక్షల శానిటరీ నాప్కిన్లు, 297 కేసుల డైపర్స్‌ను తొలి విడతలో పేద విద్యార్థులు, చిన్నారులకు అందజేసేందుకు ముందుకొచ్చింది. కార్య్రకమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఏడో తరగతి నుంచి 12వ తరగతి లోపు ఆడపిల్లలకు స్వేచ్ఛ కార్యక్రమం కింద ప్రభుత్వం నెల నెలా 12 లక్షల శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. హెల్త్ రికార్డులన్నీ కంప్యూటర్లో నిక్షిప్తం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నామని మంత్రి రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా వైద్యం పొందుతున్న అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. 1.6 కోట్ల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు అందించగలుగుతున్నామన్నారు. క్యాంపులకు హాజరైన వారిలో ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే అలాంటి వారిని పెద్దాస్పత్రులకు సిఫారసు చేస్తున్నామని చెప్పారు. వ్యాధి నయం అయ్యేంతవరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని, కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ప్రతి అంశంలోనూ బురదజల్లడమే పనిగా మారిందని మండిపడ్డారు. -
10 లక్షల మంది బాలికలకు ‘స్వేచ్ఛ’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న బాలికలకు ‘స్వేచ్ఛ’ పథకం కింద శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు నెలల కాలానికి గాను మొదటి విడతగా జూన్‌లో ప్యాడ్స్ అందించగా, రెండో విడత పంపిణీని అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నారు. బాలికల స్కూల్ డ్రాప్ అవుట్‌కు కారణమవుతున్న రుతుక్రమ సమయంలో ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏడు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. కౌమారదశలో ఉన్న బాలికలు రుతుస్రావం సమయంలో పాఠశాల, కాలేజీ మానేస్తున్నారు. దీంతో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు రుతుక్రమం సమయంలో బాలికల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ ప్యాడ్స్‌ను ప్రభుత్వమే రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న 10,144 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థినులకు అందిస్తోంది. గతంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టగా, ఈ ఏడాది నుంచి పాఠశాల విద్యాశాఖలోని మధ్యాహ్న భోజన విభాగానికి అప్పగించారు. వచ్చే నెలలో 4 కోట్ల ప్యాడ్స్ పంపిణీకి ఏర్పాట్లు దేశంలో 23 శాతం మంది విద్యార్థినులు బహిష్టు సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 10,144 స్కూళ్లు, కాలేజీల్లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న 10 లక్షల మంది విద్యార్థినులకు ఒకొక్కరికి నెలకు 10 ప్యాడ్స్ చొప్పున ఏడాదికి 12 కోట్ల ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.35 కోట్ల నిధులను వెచ్చింది. ప్రతి నాలుగు నెలలకు ఒక పర్యాయం పంపిణీ కార్యక్రమం చేపడుతోంది. ఈ విద్యా సంవత్సరంలో సెపె్టంబర్ వరకు అవసరమైన ప్యాడ్స్‌ను జూన్ నెలలో అందించగా, రెండో విడత పంపిణీని అక్టోబర్‌లో ప్రారంభించనున్నారు. దీంతో రుతుక్రమంలో ఎదురయ్యే సమస్యలు, నివారణ చర్యలపై విద్యార్థినుల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి పాఠశాలలోను నెలకు ఒకసారి మహిళా ఉపాధ్యాయులు, మహిళా పోలీసుల ద్వారా సదస్సులు నిర్వహిస్తున్నారు. వినియోగించిన ప్యాడ్స్‌ను పర్యావరణ హితంగా నాశనం చేసేందుకు ప్రత్యేక డస్ట్బిన్లు, యంత్రాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. -
యూపీ స్కూల్ టీచర్
లక్నో: నిరుపేద యువతులు, మహిళల్లో రుతుస్రావంలో పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి ఉత్తరప్రదేశ్‌లో ఒక స్కూలు టీచర్ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. తన సొంత డబ్బులతో ‘‘ప్యాడ్ బ్యాంక్’’ను ఏర్పాటు చేసి గ్రామంలో అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. బరేలి జిల్లా బొరియా బ్యాంకులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న రాఖీ గంగ్వార్ తమ ఊళ్లో యుక్త వయసుకి వచి్చన అమ్మాయిలు, మహిళలు రుతుస్రావం సమయంలో ఇంకా పాతకాలం పద్ధతుల్లో బట్టలనే వాడడం పట్ల ఆవేదనతో ఉండేవారు. వారిలో శానిటరీ ప్యాడ్స్‌పై అవగాహన పెంచడానికి స్కూల్లోనే ప్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. తన సొంత డబ్బుతో ప్యాడ్స్ కొని ఆ బ్యాంకులో ఉంచుతున్నారు. అవి వాడడానికి ముందుకొచి్చన వారికి ఉచితంగా ఇస్తూ ఎలా వాడాలో నేరి్పస్తూ వారిలో అవగాహన పెంచుతున్నారు. మే 15న మదర్స్ డే సందర్భంగా ఈ బ్యాంక్ ప్రారంభించారు. మొదట్లో శానిటరీ ప్యాడ్స్ వాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆ సమయంలో పరిశుభ్రత గురించి వివరంగా చెప్పాక ఒక్కొక్కరు వచ్చి ప్యాడ్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. అలా ప్రస్తుతం ప్రతీ నెలా 150 వరకు మహిళలు ప్యాడ్ బ్యాంక్‌కి వస్తున్నారని రాఖీ గంగ్వార్ వివరించారు. -
Smriti Irani: ఆ అయిదు రోజులు... అయితే ఏంటీ!
మెనుస్ట్రుయేషన్కు సంబంధించిన విషయాలు బహిరంగంగా మాట్లాడడానికి సంకోచించే రోజుల్లో, శానిటరీ యాడ్స్‌లో నటించడానికి నటీమణులు ససేమిరా అనే రోజుల్లో కెరీర్ తొలి అడుగుల్లో శానిటరీ ప్యాడ్ యాడ్ లో నటించింది స్మృతి ఇరానీ. అది తన తొలి యాడ్. ‘అది ఫ్యాన్సీ యాడ్ కాదు. వదిలేయ్’ ‘ఈ యాడ్ చేస్తే తక్కువ చేసి చూస్తారు. నటిగా అవకాశాలు రావు’ అని అందరూ భయపెట్టారు. కానీ వాటిని పట్టించుకోకుండా ఆ యాడ్‌లో నటించింది స్మృతి. 25 సంవత్సరాల క్రితం నాటి ఆ వీడియోను స్మృతి ఇరానీ(ప్రస్తుతం కేంద్రమంత్రి) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే వైరల్ అయింది. ఆ వీడియోలో... పీరియెడ్స్, వాటిపై ఉండే అపోహలు... మొదలైన వాటి గురించి స్మృతి ఇరానీ మాట్లాడింది. ‘ఆ అయిదు రోజులు. అయితే ఏంటీ? పీరియెడ్స్ అంటే వ్యాధి కాదు. ప్రతి మహిళకు ఉండే సహజ లక్షణం. నేను, మా అమ్మ, మీరు... లక్షలాదిమంది భారతీయ మహిళల కోసం శానిటరీ ప్యాడ్లు ఉన్నాయి...’ అంటూ సాగే స్మృతి మాటలకు ఆ రోజుల్లో ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదుగానీ ఇప్పుడు మాత్రం వైరల్ అవుతోంది. ‘ఇది తప్పనిసరిగా గుర్తుచేసుకోదగిన జ్ఞాపకం’ అని తన వీడియో గురించి కాప్షన్ రాసింది స్మృతి ఇరానీ. ‘ఈరోజుల్లో శానిటరీ ప్యాడ్ యాడ్లు చేయడానికి నటీమణులు సంకోచించడం లేదు. కాని ఆరోజుల పరిస్థితి వేరు. ఆ రోజులు నాకు ఇంకా బాగా గుర్తు ఉన్నాయి. పీరియెడ్స్ గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడే రోజుల్లో ధైర్యంగా స్మృతి ఆ యాడ్ చేయడం అభినందనీయం’ అంటూ ఒక యూజర్ కామెంట్ సెక్షన్లో స్పందించారు. -
దేశంలోనే ఏపీ అగ్రగామి.. చిట్టి తల్లులకు ‘స్వేచ్ఛ’
సాక్షి, అమరావతి: రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రేపటి పౌరులైన కిశోర బాలికల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సమర్థవంతంగా మెన్స్ట్రువల్ హైజీన్ (బహిష్టు సమయంలో పరిశుభ్రత) కార్యక్రమాల అమలులో కూడా మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంటోంది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నెలసరి సమయంలో స్కూళ్లు, కళాశాలల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్కిన్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా 2021–22లో 1.48 కోట్ల శానిటరీ నాప్కిన్ల పంపిణీతో తమిళనాడు దేశంలో మొదటి స్థానంలో ఉండగా, 1.16 కోట్లతో ఏపీ రెండో స్థానంలో ఉంది. ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు.. రుతుక్రమం ఇబ్బందులతో బాలికలు స్కూలుకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్ ప్రభుత్వం గుర్తించింది. డ్రాపౌట్స్‌ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న 10,01,860 మంది బాలికలకు ప్రతినెలా 10 నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. అంతేకాక.. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా అడోలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్‌లు.. ఇక కౌమార దశలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నివృత్తికి,వైద్యసేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అడోలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలివే.. ♦ నెలసరిలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయి. ♦ జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్దిమోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్ర పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడ్డాక సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెలి్వక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులొస్తాయి. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. చాలా మార్పు కనిపిస్తోంది ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల్లో చాలామంది పేద కుటుంబాలకు చెందినవారే. వీరు నెలసరిలో పాఠశాలకు గైర్హాజరయ్యే వారు. ప్రస్తుతం ప్రభుత్వమే ఉచితంగా శానిటరీ నాప్కిన్లు ఇస్తోంది. పాఠశాలల్లో బాత్రూమ్లు, ఇతర వసతులు మెరుగుపడ్డాయి. దీంతో గతంతో పోలిస్తే గైర్హాజరు తక్కువగా ఉంటోంది. – కేవీ పద్మావతి, ఉపాధ్యాయురాలు, అడవివరం, జెడ్పీ ఉన్నత పాఠశాల, విశాఖపట్నం ప్రతి స్కూల్లో అంబాసిడర్లుగా ఇద్దరు టీచర్లు మెన్స్ట్రువల్ హైజీన్ కార్యక్రమాలను విద్యా సంస్థల్లో నిర్వహించడానికి ప్రతి విద్యాసంస్థలో ఇద్దరు టీచర్లను హెల్త్, వెల్నెస్ అంబాసిడర్లుగా గుర్తించారు. వీరితోపాటు మెడికల్ ఆఫీసర్లకు ఎయిమ్స్ వైద్యుల ద్వారా మెన్స్ట్రువల్ హైజీన్‌పై శిక్షణ ఇప్పించాం. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, అడిషనల్ డైరెక్టర్ వైద్య శాఖ -
శానిటరీ ప్యాడ్స్ ప్రశ్నవివాదం.. ఫ్రీగా ఇస్తానని ముందుకు వచ్చిన సంస్థ
పాట్నా: బిహార్‌లోని 20 ఏళ్ల విద్యార్థిని రియా కూమారి ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ భమ్రాని శానిటర్ప్యాడ్స్ గురించి ప్రశ్నించిన సంగతి తెలిసింది. ఐతే ఆమె ఇచ్చిన వివరణ వివాదాస్పదమవ్వడంతో ఆమె పలు విమర్శలను ఎదుర్కొన్నారు కూడా. ఐతే ఆ విద్యార్థిని ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఏడాది పాటు శానిటరీ ప్యాడ్లను అందించడానికి ముందుకు వచ్చింది ఢిల్లీకి చెందిన శానిటరీ తయారీ సంస్థ పాన్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ మేరకు ఆ తయారీ సంస్థ సీఈవో చిరాగ్ మాట్లాడుతూ..ఈ విషయాల గురించి మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రారు. పైగా అది మాట్లాడకూడని నిషిద్ధ అంశంగా చూస్తారు. అమ్మాయిలంతా ఆమెలా ధైర్యంగా ముందుకు వచ్చి బహిరంగా మాట్లాడాలి. నిజంగా రియా ధ్యైర్యానికి హ్యాట్సాప్. అని ఆమెని ప్రశంసించారు చిరాగ్. అంతేగాదు ఆమె గ్రాడ్యుయేషన్ చదువుకు అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని చెప్పారు. ఐతే రియా మాత్రం... తన ప్రశ్న తప్పు కాదు కానీ మేడమ్ (ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ భుమ్రా) మరోలా తీసుకున్నారని చెప్పింది. అంతేగాదు ఆమె ప్రతిదానికి ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం ఆధారితంగా ఉండాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా బహుశా ఆమె అలా అన్నారేమో కాబోలు అని చెబుతోంది. ఇదిలా ఉండగా బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ....బిహార్ ప్రభుత్వం 'కన్యా ఉత్థాన్' కార్యక్రమం కింద ప్రతి అమ్మాయికి రూ.300/లు అందజేస్తుంది. అంటే ప్రతి అమ్మాయికి ప్రభుత్వం ప్రతి నెల రూ. 25లు చెల్లిస్తున్నట్లని, కానీ ఈ అమ్మాయి మాత్రం శానిటర్ ప్యాడ్స్ కోసం డిమాండ్ చేస్తోందన్నారు. బహుశా ఈ విషయం ఆ అమ్మాయికి, ఆ ఐఏఎస్ అధికారికి తెలియకపోయి ఉండొచ్చు అన్నారు. ఆ విద్యార్థిని సాశక్త్ బేటీ.. సమృద్ధి బీహార్ పేరుతో జరిగిన వర్క్‌షాప్‌లో ఐఎఏస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రాని ఈ విషయమై ఆమె ప్రశ్నించింది. ప్రభుత్వం యూనిఫాంలు వంటివి ప్రతీది ఉచితంగా ఇస్తోంది కదా అలానే రూ. 20-30లు ఉండే ఈ శానిటరీ ప్యాడ్స్‌ని ఉచితంగా ఇవ్వలేదా? అని ప్రశ్నించింది. ఐతే కలెక్టర్ కాస్త కటువుగా ఆ విద్యార్థి ప్రశ్నకు బదులివ్వడంతో ఇంత పెద్ద చర్చకు దారితీసింది. (చదవండి: ‘కండోమ్’ వ్యాఖ్యలతో చిక్కుల్లో ఐఏఎస్.. చర్యలకు సీఎం ఆదేశం!) -
‘కండోమ్’ వ్యాఖ్యలపై సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశం!
పాట్నా: శానిటరీ పాడ్లపై ఓ విద్యార్థి ప్రశ్నకు వెటకారంగా ‘కండోమ్’లు పంచమని అడుగుతారేమో అంటూ వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రా చిక్కుల్లో పడ్డారు. పాఠశాల బాలికలతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయటంపై దూమారం చెలరేగటంతో ఇప్పటికే వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్‌పై చర్యలు తీసుకుంటామని సూత్రప్రాయంగా తెలిపారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ఆమె వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనే కారణంతో సీఎం సీరియస్‌గా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 27న జరిగిన కార్యక్రమంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రా వివరణ ఇవ్వాలని ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది. దీనిపై సీఎం నితీశ్ కుమార్‌ను విలేకరులు ప్రశ్నించగా.. ‘ఈ విషయం వార్తా పత్రికల ద్వారా తెలిసింది. ఈ వివాదంపై దర్యాప్తు చేపట్టేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర మహిళలకు అన్ని విధాల సహాయం చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఐఏఎస్ అధికారిని ప్రవర్తన ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. ఐఏఎస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రా అదనపు చీఫ్ సెక్రెటరీ ర్యాక్ ఆఫీసర్, బిహార్ మహిళా, శిశు సంక్షేమ కమిషన్ హెడ్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ‘సాశక్త్ భేటీ.. సమృద్ధ బిహార్’ పేరుతో యూనిసెఫ్ భాగస్వామ్యంతో సెప్టెంబర్ 27న పాట్నాలో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని లేచి ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లు, యూనిఫాం ఇస్తున్నప్పుడు శానిటరీ పాడ్లు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించింది. దీనికి ఐఏఎస్ అధికారిని వెటకారంగా సమాధానం ఇచ్చారు. ‘‘రేపు ప్రభుత్వం ఉచితంగా జీన్ ప్యాంట్స్ పంచాలని మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన షూస్ కావాలని అడుగుతారు. అంతెందుకు ఫ్యామిలీ ఫ్లానింగ్ పద్దతుల్లో ఒకటైన కండోమ్‌లు పంచమని కూడా అడుగుతారు’’ అంటూ ఆమె పేర్కొన్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. 🔊Girl - Can the govt give sanitary pads at ₹ 20-30? IAS Harjot Kaur Bharma - You will eventually expect the govt to give you family planning methods, condoms, too. 🔊Girl - Govt comes to us for votes. IAS Kaur - This is height of stupidity. Don't vote, then. Become Pakistan pic.twitter.com/V4NKdekLuc — Samarg (@aaummh) September 28, 2022 ఇదీ చదవండి: వీడియో: శానిటరీ పాడ్స్‌పై ప్రశ్న.. ఐఏఎస్ అధికారిణి వివరణతో షాక్ తిన్న విద్యార్థినులు -
ఇచ్చుకుంటూ పోతే.. రేపు ఫ్రీగా కండోమ్‌లు పంచాలంటారు!
వైరల్: ఆమె ఒక ఐఏఎస్ అధికారిణి. అదీ మహిళాశిశు సంక్షేమ శాఖకు సంబంధించిన విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. స్కూల్ స్టూడెంట్స్ అందునా అమ్మాయిలు చేసిన విజ్ఞప్తికి ఆమె స్పందించిన తీరుపై మండిపడుతున్నారంతా. ఊరకుంటే.. కండోమ్‌లు కూడా ఫ్రీగా పంచాలని అడుగుతారంటూ విద్యార్థులను ఉద్దేశించి వెటకారంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కంపరం పుట్టిస్తున్నాయి. బీహార్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ భామ్రా ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎన్నో ఉచితాలను అందజేస్తోంది. అలాంటిది 20-30రూ. ఉండే శానిటరీ పాడ్స్ ఉచితంగా ఇవ్వలేదా? అని ఓ అమ్మాయి ప్రశ్నించింది. దీనికి ఆ ఐఏఎస్ అధికారిని ఇచ్చిన వివరణలు, ఆ అమ్మాయితో పెట్టుకున్న వాగ్వాదం.. ఆమెను చిక్కుల్లో పడేసింది. సాశక్త్ భేటీ.. సమృద్ధి బీహార్ పేరుతో యునిసెఫ్ మరికొన్ని సంస్థల భాగస్వామ్యంతో మంగళవారం సాయంత్రం పాట్నాలో ఒక కార్యక్రమం నిర్వహించింది. దీనికి డబ్ల్యూసీడీసీ ఎండీ హర్జోత్ కౌర్ హాజరయ్యారు. అయితే.. కార్యక్రమానికి హాజరైన ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నతో మొదలైన వ్యవహారం.. వాడీవేడిగా సాగింది. ఉచిత ప్రకటనలు చేసే ప్రభుత్వం.. రూ.20-30 ఖర్చు చేసి ఉచితంగా శానిటరీ పాడ్లు అందించలేదా? అని స్టూడెంట్ ప్రశ్నించింది. దానికి హర్జోత్ బదులిస్తూ.. ‘‘రేపు ప్రభుత్వం ఉచితంగా జీన్ ప్యాంట్స్ పంచాలని మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన షూస్ కావాలని అడుగుతారు. అంతెందుకు ఫ్యామిలీ ఫ్లానింగ్ పద్దతుల్లో ఒకటైన కండోమ్‌లు పంచమని కూడా అడుగుతారు’’ అంటూ ఆమె పేర్కొన్నారు. 🔊Girl - Can the govt give sanitary pads at ₹ 20-30? IAS Harjot Kaur Bharma - You will eventually expect the govt to give you family planning methods, condoms, too. 🔊Girl - Govt comes to us for votes. IAS Kaur - This is height of stupidity. Don't vote, then. Become Pakistan pic.twitter.com/V4NKdekLuc — Samarg (@aaummh) September 28, 2022 ఆ వెంటనే.. ఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం కదా అంది ఆ విద్యార్థిని. దానికి హర్జోత్ కాస్త కటువుగానే బదులిచ్చింది. ‘‘ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. అలా అనిపిస్తే ఓటేయకు. అప్పుడు మన దేశం పాకిస్తాన్ అవుతుంది. డబ్బు, సేవల కోసమే ఓటేస్తావా? అని ఆ విద్యార్థిని నిలదీసిందామె. దీంతో ఆ విద్యార్థిని ‘నేను భారతీయురాలిని. నేనెందుకు అలా చేస్తా’ అంటూ గట్టి సమాధానం ఇచ్చింది. ఆ వెంటనే.. అసలు ప్రభుత్వం నుంచి ప్రతీది ఎందుకు ఆశిస్తారని?.. ఆ ఆలోచనే తప్పని, సొంతంగా చేసుకునేందుకు ప్రయత్నించాలంటూ ఉచిత సలహా ఇచ్చింది హర్జోత్. అయితే ఈ వాడివేడి చర్చ ఇక్కడితోనే ఆగిపోలేదు. ఇంతలో మరో విద్యార్థిని పైకి లేచి.. ఆస్పత్రిలో టాయిలెట్ బాగోలేదని, తరచూ బాలురు కూడా వస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీనికి హర్జోత్ కౌర్ భామ్రా స్పందిస్తూ.. ఇంట్లో నీకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉంటాయా?.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఇలా అడగడం ఎంత వరకు సమంజసం అంటూ ఎదురు ప్రశ్నించడంతో కంగు తినడం విద్యార్థిని వంతు అయ్యింది. ప్రస్తుతం ఆ ఐఏఎస్ అధికారిణి-విద్యార్థినులకు మధ్య జరిగిన చర్చ వైరల్ అవుతోంది. -
శానిటరీ నాప్కిన్స్.. సగం మందికే తెలుసు
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలోనూ దేశంలో చాలామంది మహిళలకు శానిటరీ నాప్కిన్స్/ప్యాడ్స్ గురించి తెలియదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. 15–24 ఏళ్ల మహిళల్లో 50 శాతం మంది ఇప్పటికీ నాప్కిన్స్ బదులు గుడ్డలు వాడుతున్నట్లు తేలింది. అవగాహన లేమి, రుతుస్రావంపై మూఢ నమ్మకాలే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. శుభ్రంగా లేని గుడ్డలు ఉపయోగిస్తుండడం వల్ల మహిళలు రకరకాల ఇన్ఫెక్షన్లకు గురవుతున్నట్లు గుర్తించారు. ఎన్ఎఫ్హెచ్ఎస్–5 సర్వే ఫలితాలను ఇటీవలే విడుదల చేశారు. 2019–21 వరకు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 707 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. 15–24 ఏళ్ల వయసున్న మహిళలను ప్రశ్నించారు. రుతుస్రావ సమయంలో మామూలు గుడ్డలే వాడుతున్నట్లు 50 శాతం మంది బదులిచ్చారు. స్థానికంగా తయారు చేసిన నాప్కిన్లు వాడుతున్నట్లు 15 శాతం మంది చెప్పారు. అపరిశుభ్ర పద్ధతులు మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని గురుగ్రామ్‌లో సీకే బిర్లా హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ ఆస్తా దయాల్ చెప్పారు. గర్భం దాల్చడంలో ఇబ్బందులు, గర్భిణుల్లోనూ అనారోగ్య సమస్యలు సృష్టించే అవకాశం ఉందన్నారు. బిహార్‌లో అత్యల్పం నగరాలు, పట్టణాల్లో 90 శాతం మంది మహిళలు శానిటరీ నాప్కిన్లు ఉపయోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 73 శాతంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యల్పంగా బిహార్‌లో 59 శాతం మంది, మధ్యప్రదేశ్‌లో 61 శాతం, మేఘాలయాలో 65 శాతం మంది నాప్కిన్లు వాడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన(పీఎంబీజేపీ)ని ప్రారంభించింది. ఈ పథకం దేశవ్యాప్తంగా మహిళలకు కేవలం ఒక్క రూపాయికే శానిటరీ ప్యాడ్ అందిస్తున్నట్లు సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్, సామాజిక ఉద్యమకారిణి రంజనా కుమారి తెలిపారు. శానిటరీ ప్యాడ్ వినియోగించే విషయంలో సిగ్గు పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదన్నారు. -
Jeevan Jyot Kaur: ప్యాడ్ ఉమన్.. వాడిన బట్టనే వాడితే అనారోగ్యం.. అందుకే
పదిమంది తప్పుడు మార్గంలో నడుస్తున్నారని, మనం కూడా వారితో కలిసి నడిస్తేనే మనుగడ ఉంటుందనుకోవడం పొరపాటు. ఎవరి మద్దతూ లభించకపోయినా చేసేది మంచి పని అయితే ఒంటరిగా తల వంచుకుని ముందుకు సాగితే ఆ పనికి ఏదో ఒక రోజు గుర్తింపు, గౌరవ మర్యాదలు తప్పకుండా దక్కుతాయని నిరూపించింది ఆమ్ఆద్మీ పార్టీ నేత జీవన్‌జ్యోత్ కౌర్. యాభై ఏళ్ల జీవన్‌జ్యోత్ కౌర్ పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో పుట్టింది. చిన్నప్పటినుంచి చాలా చురుకుగా ఉండే అమ్మాయి. అన్ని విషయాల్లో ఆల్‌రౌండర్‌గా ఉండడమేగాక, మంచి వక్తగా పేరు తెచ్చుకుంది. చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన తరువాత తల్లిదండ్రులు నడుపుతోన్న ‘శ్రీ హేమ్‌కుంత్ ఎడ్యుకేషన్ సొసైటీ(ఎస్హెచ్ఈఎస్)లో పనిచేయాలని నిర్ణయించుకుంది. విద్య, ఆరోగ్య, మహిళల సంక్షేమాభివృద్ధికి పాటుపడే ఎన్జీవో ఇది. దీనిలో అనేక పనుల్లో పాలుపంచుకుంటోంది. ఇలా ఉండగా... పంజాబ్ స్కూళ్లలోని చాలామంది అమ్మాయిలు శానిటరీ న్యాప్కిన్స్ కొనుక్కోలేని పరిస్థితి. దీంతో వాడిన బట్టనే వాడుతూ అనారోగ్యాల బారిన పడుతున్నట్లు సర్వే ద్వారా తెలుసుకుంది జీవన్. అప్పటినుంచి స్కూళ్లకు వెళ్లి ఉచితంగా బాలికలకు ప్యాడ్స్‌ను అందించేది. తరవాత జైళ్లు, ఓల్డేజ్ హోమ్‌లలో పనిచేసే వారి పంపిణీ చేసేది. ఇలా ప్యాడ్స్ పంచుతూ పంజాబీ ప్యాడ్ ఉమెన్‌గా పాపులర్ అయింది. ఇకో షీ రివల్యూషన్ పాండిచ్చేరీకి చెందిన ఇకోఫెమ్మే,, ఇంకా స్విట్జర్లాండ్ కంపెనీలతో కలసి సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన రీ యూజబుల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్యాడ్లను జీవన్ పంపిణీ చేస్తూనే, ఇకో షీ రివల్యూషన్ పేరు మీద రెండు గంటలపాటు రుతుక్రమం మీద అవగాహన కార్యక్రమాలను నిర్వహించేది. ఐదువందల స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు హర్యాణ, బిహార్లలో కూడా నిర్వహిస్తోంది.ఎస్హెచ్ఈ ఎన్జీవోకు జీవన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇకో షీ రివల్యూషన్తోపాటు, ‘ఆబాద్’ బదల్వ్, ఏక్ నయీ సోచ్, ఎస్‌హెచ్‌పీ స్కూల్ వంటి ప్రాజెక్టులను నిర్వహిస్తూ బాలికలు, మహిళల అభ్యున్నతికి కృషిచేస్తోంది. సీనియర్లను ఓడించి.. సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే జీవన్‌కు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అస్సలు లేదు. రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదనుకుంది తను. కానీ జీవన్ తల్లి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వీరాభిమాని కావడంతో ఆప్‌లో చేరమని ఒత్తిడి తెచ్చింది. దీంతో 2015లో జీవన్ ఆప్‌లో చేరింది. పార్టీలో చేరినప్పటినుంచి కష్టపడి అంకితభావంతో పనిచేసే వ్యక్తిగా గుర్తింపు పొందింది. ఆప్‌లో అధికార ప్రతినిధిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన జీవన్ తన పనితీరుతో పంజాబీ ఉమెన్ వింగ్‌కు కో–ప్రెసిడెంట్‌గానూ, తరువాత అమృత్సర్ ఆప్ ప్రెసిడెంట్‌గానూ ఎంపికైంది. 2019 నుంచి మరింత చురుకుగా పనిచేస్తూ పార్టీ ప్రచార కోఆర్డినేటర్‌గా మారింది. తరువాత ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా మారింది. అంకిత భావంతో పనిచేస్తూ ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో తొలిసారి పోటీచేసింది. ఈ ఎన్నికల్లో ఎంతో సీనియర్ నాయకులైన నవజ్యోత్ సింగ్ సిద్ధు, అకాలీ దల్ నాయకుడు విక్రమ్ సింగ్ మజితాయ్లను ఓడించి చరిత్రాత్మక విజయం సాధించింది. మనమే పూలబాటగా మార్చుకోవాలి ‘‘ఎమ్ఎల్ఏగా గెలిచినప్పటికీ మహిళా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తాను. 117 పంజాబ్ అసెంబ్లీలో స్థానాల్లో కేవలం 13 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ద్వారా మహిళలను ప్రగతి పథంలో నడిపించడమేగాక, మరింతమందిని రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే స్థాయికి తీసుకురావడానికి కృషిచేస్తాను. ఏదీ కష్టమైన పనికాదు. యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. యువత రాజకీయాల్లోకి రావాలి. మాదక ద్రవ్యాలకు బానిసలవ్వడం, నిరుద్యోగ సమస్యలు ఎప్పుడూ ఉండేవే. ఎవరికి పూలబాటలు పరిచి ఉండవు, ఒక్కో ముల్లును తీసేసి మీ బాటను మీరే పూలబాటలా మార్చుకోవాలి’’ అని యువతకు బోధిస్తున్నారు కౌర్. -
‘తమ్ముడితో కలిసి ఈ పని చేశా’.. క్షణాల్లో బూడిద చేస్తుంది సోలార్ లజ్జా!
"Solar Lajja" Machine: Learn How to Burn Sanitary Pads and PPE Kits and How to Dispose Diapers.. ‘‘శానిటరీ ప్యాడ్స్ వల్ల ఒక రకంగా మంచి జరిగితే మరోరకంగా పర్యావరణానికి తీవ్రహాని కలుగుతోంది. ఈ ముప్పును నివారించేందుకు విద్యుచ్ఛక్తితో పని చేసే మెషీన్ల ద్వారా వాటిని కాల్చివేయడం జరుగుతోంది. అయితే అలా చేయాలన్నా, ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలున్నాయి. ఒకవేళ సౌకర్యం ఉన్నా, ఎప్పుడు కరెంట్ ఉంటుందో, ఎప్పుడు వసు ్తందో తెలియని పరిస్థితి. అందుకు ప్రత్యామ్నాయంగా సోలార్‌తో పని చేసే మెషిన్‌ను తయారు చేయాలని తమ్ముడు, నేను అనుకున్నాము. అనుకున్నట్లుగానే సోలార్ లజ్జాను రూపొందించాం. ఇతర మెషిన్లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకపోగా దీని ద్వారా వెలువడే బూడిదను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు’’ అని చెబుతోంది ముంబైకి చెందిన మధురిత గుప్తా. ప్రకృతికి మంచిచేసే మెషిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మధురిత, రూపన్లకు అనేక అవార్డులు వచ్చాయి. వీటిలో టాప్‌టెన్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌లో ‘ఇన్స్పెన్య్రూరు 3.0’, యూనైటెడ్ నేషన్స్ అందించే టాప్‌టెన్ ఇన్నోవేషన్స్ ఉమెన్ అవార్డులు ఉన్నాయి. అంతేగాక మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ అందించే టాప్ టెన్ ఇన్నోవేషన్స్‌లో కూడా సోలార్ లజ్జా చోటుదక్కించుకుంది. వెటర్నరీ డాక్టర్ అయిన మధురిత గుప్తాకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకపక్క తన విధులను నిర్వహిస్తూనే ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ‘మేవాట్స్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్’లో వ్యవస్థాపక సభ్యురాలిగా పనిచేస్తున్న మధురిత గుప్తా పదేళ్లకు పైగా జూలలో పనిచేస్తూ జాతీయ పార్కుల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను సందర్శించేది. అడవులకు దగ్గర్లోని గ్రామాల్లో పర్యటించినప్పుడు నెలసరి సమయంలో గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మధురిత నిశితంగా గమనించేది. అవగాహన లేమితో కొందరు, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు గోనెపట్టాను ప్యాడ్‌గా వాడడం చూసింది. ఎంతో పరిశుభ్రంగా ఉండాల్సిన ఆ రోజుల్లో వాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు సరిగా లేవని భావించి వెంటనే ఆ మహిళలకు.. నెలసరి సమయంలో వాడుకోవడానికి శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేసింది. ప్యాడ్స్ ఇచ్చి మహిళల సమస్యకు పరిష్కారం చూపినప్పటికి, వాడేసిన ప్యాడ్స్‌ను ఆరుబయట పడేయడంతో.. రక్తం వాసనకు క్రూరమృగాలు అక్కడ చేరి, ప్యాడ్లను ఆరగించేవి. ఇది ఇటు గిరిజన మహిళలకు, అటు జంతువులకు కూడా మంచిది కాదు. ప్రాణాలకూ ముప్పే. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించాలనుకుని ‘సోలార్ లజ్జా’ను తీసుకొచ్చింది మధురిత. సోలార్ లజ్జా.. అలా కనుగొన్నాం ‘‘శానిటరీ ప్యాడ్స్ అంత త్వరగా భూమిలో కలవకపోవడం వల్ల అటు పర్యావరణానికి, ఇటు జంతువులకూ కూడా హాని జరుగుతుంది. దీనికి ఏదైనా పరిష్కారం వెదకాలి’’ అని మధురిత తన ఐఐటీ ఇంజినీర్ తమ్ముడు రూపన్తో చెప్పింది. ఇద్దరూ కలిసి దాదాపు ఏడాదిపాటు ప్రయోగాలు, పరిశోధనలు చేసి 2019లో ‘‘సోలార్ లజ్జా’’ మెషిన్‌ను అర్ణవ్ గ్రీన్ టెక్ స్టార్టప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెషిన్. సోలార్ శక్తితో నడుస్తుంది. ఒకసారి మెషిన్‌ను అమర్చితే దాని నిర్వహణకు ఎటువంటి ఖర్చు ఉండదు. మిషన్‌పై ఉన్న సోలర్ ప్యానల్స్ సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు మెషిన్‌ను రీచార్జ్ చేస్తాయి. శానిటరీ ప్యాడ్స్కే కాకుండా, పీపీఈ కిట్లు, ట్యాంపాన్స్, డయపర్లు, ఒకసారి వాడిపడేసే మాస్కులను సైతం ఈ మెషిన్ బూడిద చేస్తుంది. పర్యావరణ హితం... మహిళలకు ఉపాధి ‘‘మేము కనిపెట్టిన ఈ మెషిన్ రోజుకి రెండువందల ప్యాడ్లను బూడిద చేస్తుంది. ఈ బూడిదను పొలాల్లో ఎరువుగా వాడుకోవచ్చు. ప్రస్తుతం వీటిని ప్రైవేటు కంపెనీ, స్కూళ్లు కాలేజీల్లో అమర్చాము. ప్యాడ్స్‌ను పంపిణీ చేయడమేగాక, వాటిని మెషిన్లో ఎలా పడేయాలో కూడా నేర్పిస్తున్నాము. దీనిపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. 2019లో ప్రారంభించిన సోలార్ లజ్జా మెషిన్లను పదకొండు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో అమర్చాము. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హర్యాణ, సిక్కింలలో ఈ మెషిన్లను అమర్చాము. జర్మనీ, స్వీడన్, స్పెయిన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, ప్రైవేటు లేదా పబ్లిక్ స్థలాలకోసం ఆర్డర్లు వస్తున్నాయి. సోలార్ లజ్జా ద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కూడా కలుగుతోంది. భవిష్యత్‌లో వీటి ఉత్పత్తిని పెంచుతాము’’ అని మధురిత వివరించింది. -
చిట్టితల్లుల సాధికారతకు ‘స్వేచ్ఛ’
మహిళల నిజమైన సాధికారత గురించి ఆలోచిస్తూ, ఈ దిశగా దేశంలోనే ఏ రాష్ట్రం చేయని సాహసోపేతమైన, ఆదర్శవంతమైన నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా కిశోరబాలి కల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు ఒక్కరోజు కూడా పాఠశాలకు దూరంకారాదనే సమున్నత ఆశయంతో ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. యుక్తవయసు వచ్చిన బాలికలకు రుతుక్రమం సమయంలో కొన్ని సమస్యలు రావడం, వీటి కారణంగా వీరు పాఠశాలకు వెళ్లలేకపోవడం దశాబ్ధాలుగా జరుగుతోంది. దీని కారణంగా వీరు తరగతులకు సరిగా హాజరు కాలేకపోవడం, విద్యలో కొంత వెనకబడటం సర్వసాధారణంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో కిశోరబాలికల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని రూ. 32 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించి, అమలు చేస్తున్నారు. రుతుక్రమం ఇబ్బందులతో ఏ ఒక్కరూ పాఠశాలకు దూరం కారాదనే సదుద్దేశంతో ప్రతి నెల 10 నాణ్యమైన శానిటరీ నాప్కిన్స్ను అందించే ప్రక్రియను చేపట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగాన్ని ఖర్చుగా చూడకుండా భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తూ ప్రోత్సహిస్తున్నారు. జగనన్న విద్యా కానుకగా 9 వస్తువులు, పుస్తకాలు అందిస్తూ చిన్నారుల పాఠశాల విద్య బాధ్యతను ప్రభుత్వం తన భుజాలపై వేసుకుంది. దీనిలో భాగంగా అమలు చేసిన ‘నాడు–నేడు’లో జరిగిన అభివృద్ది ప్రశంసనీయం. దీనిలో భాగంగా ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేసిన నిరంతర నీటి సరఫరా కలిగిన టాయిలెట్లు బాలికల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో దోహదకారిగా నిలుస్తున్నాయి. నేడు ప్రారంభించిన స్వేచ్ఛ పథకం బాలికా విద్యను మరో మెట్టు ఎక్కిస్తుంది. పథకం అమలుకు ప్రత్యేక అధికారిగా అధ్యాపకురాలిని ఏర్పాటు చేయడం వలన బాలికలకు తమ భావాలను, ఇబ్బందులను చెప్పుకునే అవకాశం, వాటికి పరిష్కారాలు పొందడం సాధ్యపడుతుంది. పథకంలో భాగంగా రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా నెలకు10 చొప్పున ఏడాదికి 120 బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ను ప్రభుత్వమే అందించనుంది. వేసవి సెలవుల్లో సైతం వీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి ముందుగానే విద్యార్థినులకు వీటిని అందించాలనే నిర్ణయం వారిపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తాయి. గ్రామీణ మహిళలపై సైతం దీనిపై అవగాహన కల్పిస్తూ, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా వైఎస్సార్ చేయూత దుకాణాల ద్వారా తక్కువ ధరకే నాప్కిన్స్ అందించడం మరొక మంచి నిర్ణయం. పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం పడకుండా వారి చిన్నారులకు అవసరమైన నాప్కిన్స్ సైతం రాష్ట్ర ప్రభుత్వం అందించాలనే నిర్ణయం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలుస్తుంది. కిశోర బాలికల్లో అవగాహన కల్పించే విధంగా పాఠశాల అధ్యాపకులు, ఏఎన్ఎంలతో కార్యక్రమాలు చేపట్టడం, నాప్కిన్స్ ఉపయోగించే విధంగా ప్రోత్సహించడం, వినియోగించిన నాప్కిన్స్ సురక్షితంగా డిస్పోజ్ చేయడానికి సైతం 6417 ఇన్సినరేటర్లను ఏర్పాటు చేయడం, మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా డస్ట్ బిన్లు ఉంచడం పర్యావరణానికి మేలు చేసే ప్రయత్నాలుగా మనం భావించవచ్చును. దేశంలో 23 శాతం మంది చిన్నారులు రుతుసంబంధ సమస్యలతో పాఠశాలకు దూరం అవుతున్నారని యుఎన్ నివేదికలో పేర్కొన్న పరిస్థితులను మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వేచ్ఛ పథకం నిలుస్తుంది. రాష్ట్రంలో నూరుశాతం కిశోర బాలికలు ‘స్వేచ్ఛ’గా తమ పాఠశాల విద్యను పొందే అవకాశాన్ని ఈ పథకం అందిస్తూ వారి కలలను సంపూర్ణంగా సాకారం చేస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషి యోను పెంపుదల చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయా నికి, లక్ష్యానికి ఇటువంటి పథకాలు పునాదిరాళ్లుగా మారతాయి. - డాక్టర్ దిగుమర్తి సాయి బాల పల్లవి అసిస్టెంట్ ప్రొఫెసర్, గాయత్రీ విద్యాపరిషత్ పీజీ కళాశాల, విశాఖపట్నం -
రేవ్ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్
ముంబై: డ్రగ్స్ దందాను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, కేటుగాళ్లు సరికొత్త దారులు ఎంచుకుంటూ సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో ఓ మహిళ ఏకంగా శానిటరీ న్యాప్కిన్లో డ్రగ్స్ తీసుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలడంతో షాక్ గరయ్యారు. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం 19మందిని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా అక్టోబర్ 11న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ప్రొడ్యూసర్ ఇంతియాజ్ ఖత్రీకి ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చేందుకు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే ప్రయత్నించగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ముంబై మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆర్యన్ ఖాన్ సహా ఏడుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్యన్ ఖాన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టులో.. ఆర్యన్ ఖాన్‌ను క్రూయిజ్ పార్టీకి ఆహ్వానించారు. అయితే, అతనికి బోర్డింగ్ పాస్ కూడా లేదు. రెండవది, పోలీసులు అర్యాన్ని అదుపులోకి తీసుకుంది కూడా కేవలం అతని చాట్ ఆధారంగా మాత్రమేనని మరే ఇతర బలమైన అధారాలు లేవని తెలిపారు. చదవండి: భార్యే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..? -
అమ్మలా ఆలోచించారు
సాక్షి, అమరావతి: పిల్లల ఆరోగ్యం పట్ల ఒక తల్లి ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ముఖ్యమంత్రి జగన్ ఓ మేనమామగా అంతకుమించి ఆలోచిస్తున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని, దీనివల్ల పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇన్ఫెక్షన్ల బారినపడ్డ పిల్లలు తమ సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక ఆందోళనకు గురవడం వల్ల చదువులపై ప్రభావం పడుతుందన్నారు. మంగళవారం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంత్రి వనిత మాట్లాడారు. రెండు నెలలకు సరిపడా స్కూళ్లకు స్టాక్ ‘గతంలో స్కూళ్లలో టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు నాడు– నేడు ద్వారా రన్నింగ్ వాటర్‌తో టాయిలెట్స్ సదుపాయం కల్పించడం వల్ల పిల్లలు నిశ్చింతగా పాఠశాలలకు వస్తున్నారు. విద్య, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో నిర్వహించే స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా 10 లక్షల మంది విద్యార్ధులకు న్యాప్కిన్స్ అందచేస్తాం. ప్రతీ స్కూల్లో నోడల్ ఆఫీసర్ దీనిని పర్యవేక్షిస్తారు. దీంతోపాటు వైఎస్సార్ చేయూత స్టోర్స్ ద్వారా కూడా తక్కువ ధరకే బ్రాండెడ్ న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచుతున్నాం. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, నైన్ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలలకు సరిపడా స్టాక్ ఇప్పటికే స్కూళ్లకు పంపించాం. ముఖ్యమంత్రి జగన్ మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా ఏడాదికి రూ.1,800 కోట్లు కేటాయిస్తున్నారు. రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. దిశ యాప్ తెచ్చి మహిళలకు చక్కటి వరాన్ని ఇచ్చారు. మీరు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం వల్ల ఎంతోమంది పేద కుటుంబాల్లో వారి తల్లిదండ్రులు ఇవ్వలేనివి పిల్లలకు అందుతున్నాయి’ అని మంత్రి వనిత పేర్కొన్నారు. -
‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ( ఫోటోలు )
-
‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ కార్యకమ్ర లక్ష్యమని తెలిపారు. రుతుక్రమ సమస్యలతో చదువులు ఆగిపోతున్నాయని, 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందజేస్తామని తెలిపారు. 10లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాపికిన్లు పంపిణీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10, 388 స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్కిన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి నెల జేసీ (ఆసరా) ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరగాలని పేర్కొన్నారు. మహిళా టీచర్లు, ఏఎన్ఎంలు బాలికలకు అవగాహన కల్పించాలని, ‘స్వేచ్ఛ’ పథకం అమలుపై నోడల్ అధికారిగా మహిళా టీచర్‌ను నియమించామని తెలిపారు. దిశ యాప్, దిశ చట్టం గురించి వివరించాలని అన్నారు. మహిళా సాధికారతలో ఏపీ మొదటి స్థానంలో ఉందని సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ చేయూత స్టోర్లలో శానిటరీ న్యాప్కిన్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చరిత్రను మార్చే శక్తి మహిళలకే ఉందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం తమదని సీఎం జగన్ తెలిపారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు చదువులకు దూరం కాకుండా చూడటమే లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్కిన్స్ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు చేపట్టింది. యూనిసెఫ్, వాష్, పీ అండ్ జీ తదితర సంస్థలతో కలసి అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమంపై అపోహలు తొలగించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూళ్లు, కాలేజీలలో న్యాప్కిన్స్ పంపిణీకి చర్యలు చేపట్టింది. -
‘స్వేచ్ఛ’గా చదువుదాం
సాక్షి, అమరావతి: మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న సుమారు 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్కిన్స్ పంపిణీ చేయనున్నారు. నెలకు పది చొప్పున వీటిని అందచేస్తారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు చదువులకు దూరం కాకుండా చూడటమే లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్కిన్స్ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు చేపట్టింది. అపోహలు తొలగిస్తూ.. నాలుగో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015–16) ప్రకారం రాష్ట్రంలో శానిటరీ న్యాప్కిన్స్ వినియోగిస్తున్న 15 – 24 వయసు యువతుల శాతం 56 కాగా 2019 – 20 సర్వే నాటికి ఇది 69 శాతానికి పెరిగింది. వాటర్ సప్లయి, శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం దేశంలో 23 శాతం మంది బాలికలు చదువులు మధ్యలో నిలిపివేయటానికి ప్రధాన కారణం– శానిటరీ న్యాప్కిన్స్ అందుబాటులో లేకపోవడం, విద్యాసంస్థల్లో కనీస వసతులు కరువవడం, టాయిలెట్లలో రన్నింగ్ వాటర్ లేకపోవడమేనని వెల్లడైంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూళ్లు, కాలేజీలలో న్యాప్కిన్స్ పంపిణీకి చర్యలు చేపట్టింది. యూనిసెఫ్, వాష్, పీ అండ్ జీ తదితర సంస్థలతో కలసి అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమంపై అపోహలు తొలగించనున్నారు. చదవండి: సీఎం జగన్‌కు ప్రజలు అండగా ఉన్నారని నిరూపించాలి -
ఆ సమయంలో... భరోసా ఇస్తోంది!
తాను ఎదుర్కొన్న కష్టాన్ని మరెవరూ పడకూడదని కోరుకునే పెద్దమనసు ఇర్ఫానా జర్గర్ది. అది 2014 శ్రీనగర్‌లో ఉన్న అత్యంత రద్దీ బజారులో నడుచుకుంటూ వెళ్తోంది ఇర్ఫానా. సడెన్‌గా ఆమెకు నెలసరి (పీరియడ్స్) బ్లీడింగ్ అవ్వడం మొదౖలñ ంది. ఆ సమయంలో తన దగ్గర శానిటరీ ప్యాడ్లు లేవు. కొనుకుందామనుకున్నా డబ్బులు లేవు. దీంతో దగ్గర్లో ఉన్న పబ్లిక్ టాయిలñ ట్‌కు వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు ఏమీ దొరకలేదు. దీంతో ఇంటికి వెళ్లేంత వరకు తీవ్రంగా ఇబ్బందికి గురైంది. ఆరోజు ఇర్ఫానా పడిన ఇబ్బందిని మరే అమ్మాయి పడకూడదని శ్రీనగర్‌లోని పబ్లిక్ టాయిలెట్లలో శానిటరీ న్యాప్కిన్స్ను ఉచితంగా అందిస్తోంది ఇర్ఫానా. అమ్మాయిలు, మహిళలు నెలసరి సమయంలో శారీరకంగా, మానసికంగా ఇబ్బందికి గురవుతుంటారు. ఇక నలుగురిలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు దృష్టి అంతా వెనుకాల ఎక్కడ మరకలు అంటుకున్నాయో? అని పదేపదే చూసుకుంటుంటారు. అది ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియే అయినా ఇప్పటికీ అమ్మాయిలు దానికి గురించి మాట్లాడానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఈ ధోరణి మార్చాలన్న ఉద్దేశ్యంతోనే ‘ఇవ సేఫ్టీ డోర్’ కిట్ కార్యక్రమాన్ని ఇర్ఫానా చేపట్టింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో హెల్పింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తోన్న ఇర్ఫానా... నెల జీతంలో ఐదువేల రూపాయలను పొదుపు చేసి , వాటితో శానిటరీ ప్యాడ్స్ కొని నిరుపేదలకు ఉచితంగా అందిస్తోంది. ఇలా ఇప్పటిదాకా 20 వేలకు పైగా శానిటరీ ప్యాడ్స్ ఇచ్చింది. శానిటరీ న్యాప్కిన్స్, ప్యాంటీస్, హ్యాండ్ వాష్, బేబీ డయపర్స్తో కూడిన ‘ఇవ సేఫ్టీ డోర్’ కిట్‌ను పబ్లిక్ టాయిలెట్లలో ఉంచుతోంది. అత్యవసరంలో ప్యాడ్లు అవసరమైన మహిళలు ఎటువంటి టెన్షన్ పడకుండా వీటిని వాడుకునేలా పబ్లిక్ లేడీస్ టాయిలెట్స్‌లో అందుబాటులో ఉంచుతోంది. శ్రీనగర్‌లోని దాదాపు అన్ని పబ్లిక్ టాయిలెట్లలో ఇవ ప్యాడ్స్ కనిపిస్తాయి. వివిధ గ్రామాల నుంచి నగరానికి వచ్చే మíß ళలకు ఇవి ఉపయోగపడుతున్నాయి. సమాజానికి ఏదైనా చేయాలన్న మనస్తత్వం ఇర్ఫానాది. తనకి 21 ఏళ్లు ఉన్నప్పుడు తన తండ్రి హార్ట్ ఎటాక్‌తో మరణించారు. దీంతో తను చదువుకుంటూనే, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు... మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగంలో చేరింది. తన జీతంలో కొంత మిగుల్చుకుని ఉచితంగా ప్యాడ్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా సమయంలోనూ ఆసుపత్రులలో ప్యాడ్స్‌ను ఉచితంగా అందించింది. ఈ సమయంలో చాలామంది ఇర్ఫానాకు కాల్స్ చేసి శానిటరీ న్యాప్కిన్స్, కిట్స్ ఇవ్వమని అడిగితే వారికి పంపించేది. నిరుపేదలు, నిరక్షరాస్య మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ప్రాముఖ్యత వివరిస్తూ, మెన్స్ట్రువల్ హైజీన్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది.ఈ మొత్తానికి ఎవరి సాయం లేకుండా తన సొంత డబ్బులను వాడడం విశేషం. ఇర్ఫానా చేస్తోన్న పని గురించి తెలిసిన వారంతా అభినందిస్తున్నారు. ‘‘నేను ఈ పనిచేయడానికి ప్రేరణ మా నాన్నగారే. షాపుల నుంచి మా నాన్న గారే శానిటరీ ప్యాడ్స్ కొని తెచ్చి నాకు ఇబ్బంది లేకుండా చూసేవారు. అందుకే నాన్న మరణించాక ఆయన గర్వపడేలా ఏదైనా చేయాలనుకున్నాను. ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. కొన్నిసార్లు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంటికి దూరంగా బయట ఎక్కడో ఉన్నప్పుడు సడెన్‌గా మొదలవుతుంది. ఆ సమయంలో మన దగ్గర ప్యాడ్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో ఈ ప్యాడ్లు బాగా ఉపయోగపడుతాయి’’ అని ఇర్ఫానా చెప్పింది. -
Menstrual Hygiene Day: ప్యాడ్ ఎక్కడ మార్చుకుందాం?
స్త్రీల బహిష్టు సమస్యలను ప్రపంచం 2013 నుంచి మాట్లాడటం మొదలెడితే భారతదేశం గత నాలుగైదేళ్లుగా మాట్లాడుతోంది. విద్యార్థినులకు ప్యాడ్స్ ఇవ్వడం, పేద వర్గాల మహిళలకు ప్యాడ్స్ అవసరం చెప్పడం ఇప్పుడిప్పుడే జరుగుతోంది. కాని నిజంగా బహిష్టును దాంతో పాటు స్త్రీలను అర్థం చేసుకుని దానితో ముడిపడిన సమస్యలకు పరిష్కారాన్ని, ఆపై స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని సమాజం ఇస్తోందా? బహిష్టులో ఉన్న స్త్రీ ఇంట్లో ఉంటే సరే, బయటకు వస్తే ప్యాడ్ ఎక్కడ మార్చుకోవాలో తెలియని ఆందోళన లో నేటికీ ఉందంటే బహిష్టు ధర్మం పట్ల ఈ సమాజం ఇంకా స్నేహంగా లేనట్టే లెక్క. మే 28 ‘బహిష్టు పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా కొన్ని చర్చలో ఉన్న ఆలోచనలు.... ఒక రచయిత్రి రాసిన తెలుగు కథలో ఒక మహిళా పాత్రధారి విమాన ప్రయాణం చేస్తూ ఉంటుంది. సడన్‌గా ఆమెకు పిరియెడ్స్ మొదలైపోతాయి. దగ్గర ప్యాడ్స్ ఉండవు. చీరలో ఉంటుంది. ప్రయాణ హడావిడిలో ప్యాంటిస్ కూడా వేసుకుని ఉండదు. ఒక పెద్ద దురవస్థగా ఉంటుందామెకు. విమానంలో మహిళలకు సడన్ గా పిరియడ్స్ వస్తాయేమోనని ప్యాడ్స్ ఉంచరు. ఇప్పటికీ ఎన్ని విమానాలలో ఈ సదుపాయం ఉందో మనకు తెలియదు. కాని తోటి ప్రయాణికులు ఆమెను అభ్యంతరకరంగా చూస్తూ ఉంటే ఎయిర్ హోస్టెస్‌లు సహకరిస్తే ఆ మహిళా పాత్రధారి ఆ దురవస్థ నుంచి బయటపడుతుంది. ఆ కథలో రచయిత్రి అంటుంది– ‘ఈ పాత్రధారి దురవస్థ సరే, దేశంలో బహిష్టు వస్త్రాన్ని ఉతికి మళ్లీ వాడుకునే కోట్లాది మహిళలు ఆ వస్త్రాలను ఆరేసుకోవాలంటే కొంచెం ఎండ కూడా దొరకదు’ అని. అంటే బహిరంగంగా వాటిని ఆరబెట్టుకోవడానికి ఈ సమాజం అంగీకరించదు అని. చీకటిలో, నీడలో, ఇంట్లో దండేలకు వాటిని ఆరబెట్టి తిరిగి వాడటం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో వచ్చాయో వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. ∙∙ విమానం వంటి ఖరీదైన వ్యవస్థలో, ‘నాగరికులు’ రాకపోకలు జరిపే ప్రయాణ సాధనాలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఈ దేశంలో నేటికీ రైళ్లలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, బస్సులలో ఎంతమేరకు స్త్రీలకు ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి? వాటి అవసరాన్ని ఈ సమాజం, వ్యవస్థలు ఏ మేరకు గుర్తించాయి? ఇంకా గుర్తించాల్సి ఉంది? ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు ఉన్నట్టు ప్యాడ్ బాక్స్‌లు ఎందుకు ఉండవు అని ఇంకా అడగాల్సిన పరిస్థితే ఉంది. ∙∙ గత సంవత్సరం కేరళ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయ్యాల్లో ఫ్రీ ప్యాడ్స్‌ను ఏర్పాటు చేయడమే కాక, వాడిన ప్యాడ్స్‌ను బూడిద చేసే ‘ఇన్సినెరేటర్’లు కూడా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. పిరియెడ్స్లో ఉన్న మహిళా ఉద్యోగులకు ఆఫీసులో ప్యాడ్స్ మార్చుకునే వీలు ఏదో మేరకు ఉన్నా అంతవరకూ ఉపయోగించిన ప్యాడ్‌ను ఎక్కడ పడేయాలనే వత్తిడిలో ఉంటారు. అందువల్ల ఒకే ప్యాడ్‌ను ఎక్కువ సేపు వాడుతూ ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. వాటిని మార్చుకునే స్థలంతో పాటు వాటిని ఎవరూ చూడకుండా చేసే బూడిద యంత్రాలు అందుబాటులో ఉన్నప్పుడే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది. అయితే మహిళలు ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేస్తారా? ప్రయివేటు ఆఫీసుల్లో చేయరా? ఎన్ని ప్రయివేటు కార్యాలయాలు ఇలాంటి ఏర్పాటు చేస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. మహిళలు తమ బహిష్టు పరిశుభ్రతను పాటించాలంటే సమాజం మొత్తం అడుగడుగునా అందుకు అవసరమైన స్నేహాన్ని, సౌకర్యాన్ని కలిగించాల్సి ఉంటుంది. ∙∙ ‘బాడీ లిటరసీ’ అనే మాటను వాడుతున్నారు మహిళల కోసం పని చేసే కార్యకర్తలు, ఆలోచనాపరులు. అంటే స్త్రీ శరీర ధర్మాలను సమాజం సరిగ్గా అర్థం చేసుకుని ఆ ధర్మాలను గౌరవించే స్థాయిలో విద్యావంతం కావాలి. అప్పుడే ‘బహిష్టు’కు సంబంధించిన కట్టుబాట్లు, ఏహ్యత, వెలి దూరం అవుతాయి. స్త్రీల శరీరం గురించి స్త్రీలకు తెలుసు. స్త్రీలు తమ లోపలి దొంతరల్లో మొదట ఈ శరీర ధర్మాల పట్ల స్వీయగౌరవం పెంచుకోవడం ఎంత అవసరమో ఇంటి పురుషులతో మొదలెట్టి అధికార పదవులలో కూచుని పురుషదృష్టితో పాలసీలు చేసే పాలకుల వరకూ వీటి పట్ల గౌరవం కలిగించడం కూడా అంతే అవసరం. ఇంట్లోని తల్లి, కుమార్తె బహిష్టు గురించి నార్మల్‌గా మాట్లాడే పరిస్థితితోపాటు తండ్రి, కుమారుడు కూడా అంతే నార్మల్‌గా మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు అవసరమైన మార్పు వస్తుంది. ∙∙ బహిష్టు పట్ల ఉండే చూపును, అప్రకటిత నిబంధనలను వ్యతిరేకిస్తూ ‘హ్యాపీ టు బ్లీడ్’తో మొదలెట్టి ఇటీవలి కాలంలో ఎన్నో విజ్ఞాన నిరసనలు స్త్రీలు చేస్తున్నారు. తమ శరీర ధర్మాన్ని తాము ఓన్ చేసుకోవడం అవసరమని, గట్టిగా మాట్లాడటం కూడా అవసరమే అని వారు తెలుసుకుని మాట్లాడుతున్నారు. దాంతోపాటు ‘నల్ల కవర్‌ను పారేయడం’ గురించి కూడా మాట్లాడుతున్నారు. మెడికల్ షాప్‌కు వెళ్లి ప్యాడ్స్ అడిగితే వాటిని ఒక నల్ల కవర్లో చుట్టి ఇచ్చే ఆనవాయితీ ఉంది ఈ దేశంలో. ఎందుకు నల్లకవర్? అదేమైనా తప్పు పదార్థమా? మామూలు టానిక్‌లు ఎంత ఓపెన్ గా కొంటామో అంతే ఓపెన్‌గా వీటిని కొని, తీసుకెళ్లే పరిస్థితి ఉండాలని స్త్రీలు అంటారు. భార్యకు అవసరమైన ప్యాడ్స్ కోసం భర్త, కుమార్తెకు అవసరమైన ప్యాడ్స్ కోసం తండ్రి మెడికల్ షాపుకు వెళ్లడం ఏ మేరకు ఉంది... వాటిని తెచ్చిపెట్టడం లో ఇబ్బంది/నామోషీ ఎందుకు ఉంది అని ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన రోజు ఈ రోజు. ∙∙ సాధారణంగా స్త్రీలకు పిరియెడ్స్ 28 రోజులకు వస్తాయి. అవి ఐదు రోజులు ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఐదో నెల అయిన మేలో, 28వ తేదీని ‘మెన్స్ట్రువల్ హైజీన్ డే’గా పాటిస్తున్నారు. ఈ రోజు స్త్రీలు తమ శరీర ధర్మం పట్ల సమాజంలో రావాల్సిన మార్పు గురించి మాట్లాడతారు. గుర్తు చేస్తారు. సమాజం దీనిగురించి స్పందించాల్సి ఉంటుంది. స్త్రీల గురించి ఎన్నో చేయాలి. అనుక్షణం ఆలోచించాలి. ప్రత్యేకంగా రోజులను ఖరారు చేసి పదే పదే చెప్పేది అందుకే. స్త్రీలు కోరే ‘విద్యావంతమైన’ సమాజం త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను!
ప్రతీ బిడ్డ తల్లిదండ్రులకు సమానమే. కానీ, ఆడా-మగా తేడాతో ప్రేమను కురిపించే తల్లిదండ్రులు ఈ సమాజంలో ఇప్పటికీ ఉన్నారు. పిల్లల్ని పెంచే పద్ధతిలోనూ లింగ వివక్ష చూపించే తల్లిదండ్రులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. అలాంటి ఓ తండ్రిని జనాలు ‘ఛీ’ కొట్టిన ఘటన ఒకటి జరిగింది. ప్రముఖ వెబ్సైట్ రెడ్డిట్లోని ఒక ఫోరమ్‌లో కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తి ఇలా పోస్ట్ చేశాడు. ‘‘నా వయసు యాభై ఏళ్లు. నా భార్య పదేళ్ల క్రితం చనిపోయింది. నాకు పదిహేడేళ్ల కొడుకు, పదిహేనేళ్ల కూతురు ఉన్నారు. వాళ్లిద్దరి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత నాది. నా కొడుక్కి కావాల్సినంత డబ్బు ఇస్తాను. కానీ, నా కూతురికి మాత్రం ఇవ్వదల్చుకోలేదు. కారణం, శానిటరీ ప్యాడ్స్, పీరియడ్ ప్రొడక్టుల కోసం ఆమె విపరీతంగా ఖర్చుచేస్తోంది. అందుకే ఆ ఖర్చు కోసం ఆమెనే డబ్బు సంపాదించి నాకివ్వమని చెప్పా. అందుకోసం నాలుగు ఇళ్లలో పని చేయమని సలహా ఇచ్చాను. కానీ నా కూతురికి అది నచ్చలేదు. వెంటనే బ్యాగ్ సర్దేసుకుని నా సోదరి ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి పంపించమని నా సోదరిని అడిగితే.. ఆమె నన్ను బండబూతులు తిట్టింది. ఇందులో ఏమైనా తప్పుందా?’’ అని నెటిజన్స్‌ను అడిగాడు. అంతే.. ఆ పోస్టుకి ఇప్పుడు వేల మంది రియాక్ట్ అయ్యారు. ఆ తండ్రిని ఇష్టమొచ్చినట్లు తిట్టిపోశారు. సెక్సీయెస్ట్ ఎబ్యూజింగ్ కేస్ కింద ఆ తండ్రిని జైల్లో వేయాలని కొందరు పోలీసులను కోరారు. అలాంటి తండ్రి దగ్గర ఉండే కంటే.. దూరంగా ఎక్కడైనా ప్రశాంతంగా బతకమని ఆ కూతురికి సలహా ఇచ్చారు మరికొందరు. -
‘మాస్కు’ల నిర్వీర్యానికి ఏపీలో 8 వేల ఇన్సినెరేటర్ యంత్రాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుత కరోనా కాలంలో గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు దాదాపు మాస్కులను ఉపయోగిస్తున్నారు. ఒకసారి వాడి పారేసిన మాస్కుల ద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా వాటిని ఎక్కడికక్కడే శాస్త్రీయ విధానంలో తగలబెట్టడానికి ప్రతి గ్రామానికి ఒక అధునాతన యంత్రాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా యంత్రాల ద్వారా 500–700 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద వాడిపారేసిన మాస్క్‌లను దహనం చేస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి పొగ కూడా రాదు. వీటిని ఇన్సినెరేటర్లుగా పిలుస్తారు. మాస్కులతోపాటు సాధారణ రోజుల్లో మహిళలు, ఆడపిల్లలు ఉపయోగించే శానిటరీ నాప్కిన్స్ను ఈ యంత్రాల ద్వారా సురక్షిత మార్గాలలో తగలబెట్టే వీలుంటుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అన్ని రకాల బయో వ్యర్థాలను సైతం ఈ యంత్రాల ద్వారా నిర్వీర్యం చేయొచ్చని అధికారులు వెల్లడించారు. ► పట్టణాలలో ఈ తరహా వ్యర్థాల కోసం ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంది. అన్ని ఆస్పత్రుల నుంచి బయో వేస్ట్ మెటీరియల్‌ను ఎప్పటికప్పుడు సేకరించి, వాటిని నిర్వీర్యం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఒక ఏజెన్సీ పనిచేస్తుంది. ► గ్రామాల్లోనూ ఇలాంటి వ్యవస్థ ఉండాలని పారిశుధ్య కార్యక్రమాల అమలుపై పంచాయతీరాజ్ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఆదేశించడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ► మన రాష్ట్రంలో మహిళలకు ఏటా 8 కోట్ల నాప్కిన్స్ ప్యాడ్స్ సరఫరా జరుగుతున్నట్టు అంచనా. అలాగే ఇప్పుడు మాస్కుల వినియోగం పెరిగింది. గ్రామాల్లోని ఆస్పత్రుల్లోనూ బయోవ్యర్థాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటిని సురక్షిత పద్ధతిలో నిర్వీర్యం చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ► ఇప్పటికే 8 వేల ఇన్సినెరేటర్లను కొనుగోలు చేశారు. ఏపీలో 13,371 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్కటి చొప్పున వీటిని అందుబాటులో ఉంచేందుకుగాను మరో 6 వేల దాకా కొనుగోలుకు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లోనూ పూర్తిస్థాయిలో వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండీ సంపత్‌కుమార్ ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ► జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోనూ ఇంటింటి నుంచి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించనుంది. ఇందులో వాడిపారేసిన మాస్క్‌లు, నాప్కిన్ ప్యాడ్స్ వంటి వాటిని వేరుగా వర్గీకరించి, వాటిని ఈ యంత్రాల ద్వారా నిర్వీర్యం చేస్తారు. -
స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్కిన్స్ సరఫరా
సాక్షి, అమరావతి: ఆరోగ్యకరమైన సమాజంలో బాలికలు పెరిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న వారికి ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రారంభించనున్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 12–18 సంవత్సరాల విద్యార్థినులకు ప్రభుత్వం వీటిని ఇవ్వనుంది. శానిటరీ న్యాప్కిన్స్ కూడా కొనుగోలు చేయలేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. దీని వల్ల బాలికల విద్యకు విఘాతం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న కౌమార దశ బాలికలు 12.50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఒక్కొక్కరికి సంవత్సరానికి 120 ప్యాడ్స్ ప్రకారం 15 కోట్ల ప్యాడ్స్ కావాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకోసం రూ.41.4 కోట్ల నిధులు అవసరం అవుతాయి. తక్కువ ధరతో సరఫరాకు ఆలోచన ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వైఎస్సార్ చేయూత దుకాణాల్లో శానిటరీ న్యాప్కిన్లను మహిళలకు తక్కువ ధరలకు విక్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ► ఇందు కోసం మెప్మా, సెర్ప్‌లు రాష్ట్ర స్థాయిలో టెండర్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ శానిటరీ నాప్కిన్లు లబ్ధిదారులకు ఎల్–1 రేటు కంటే 15% మార్జిన్‌తో అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో చేయూత స్టోర్లు 35,105, పట్టణాల్లో 31,631 ఉన్నాయి. ► రాష్ట్రంలో 18–50 ఏళ్ల వయస్సు ఉన్న మహిళల సంఖ్య సుమారు 1.26 కోట్లు ఉంటుదని అంచనా. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే– 4 (2015–16) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 67.5% మంది నెలవారీ పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. జాతీయ సగటు 57.6%గా ఉంది. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – వి (2019–20) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 85.1% మంది రక్షణకు పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. (పట్టణాల్లో 90.6%, గ్రామీణ ప్రాంతాల్లో 82.5%) పరిశుభ్రమైన పద్ధతిలో స్థానికంగా తయారు చేసిన న్యాప్కిన్లు, శానిటరీ న్యాప్కిన్లు, టాంపోన్లు ప్రస్తుతం అందుతున్నాయి. మిగిలిన వారందరూ కూడా ఆరోగ్యకరమైన పద్ధతిని పాటించడం కోసమే ప్రభుత్వం చొరవ తీసుకుంది. -
బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ: సీఎం జగన్
అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల నుంచి ల్యాప్‌టాప్‌ల ఆప్షన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ల్యాప్‌టాప్‌ల సహకారంతో వారికి కోచింగ్ ఇవ్వాలి. ఇందు కోసం ఇంటరాక్టివ్ విధానంలో, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఎంపిక చేసిన నిపుణుల సహకారం తీసుకోవాలి. తద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. బాలికల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇందులో భాగంగా బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్కిన్స్ను ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బాలికలకు శానిటరీ నేప్కిన్స్ పంపిణీపై విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్చి 8 (మహిళా దినోత్సవం)న ఉచిత శానిటరీ నేప్కిన్స్ పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ఏప్రిల్ ఆఖరుకు ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో సెర్ప్, మెప్మా.. ఎంఓయూలు కుదుర్చుకుంటాయని సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినులకు జూలై 1 నుంచి ప్రతి నెలా ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్కిన్స్ ఇస్తామని, ఇందు కోసం సుమారు రూ.41.4 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందని వెల్లడించారు. ఆసరా, చేయూత కిరాణా స్టోర్స్‌లో తక్కువ ధరకే మంచి నాణ్యత కలిగిన, బయోడీగ్రేడబుల్ (త్వరగా భూమిలో కలిసిపోయే) శానిటరీ నేప్కిన్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. ఇందు కోసం శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే అత్యుత్తమ కంపెనీలతో మెప్మా, సెర్ప్ ఎంఓయూ చేసుకుంటాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శిక్షణ కోసం ప్రఖ్యాత సంస్థల సహకారం విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందు కోసం లాప్టాప్లను వాడుకోవాలని సూచించారు. అమ్మఒడి పథకంలో లాప్‌టాప్‌లు కావాలనుకున్న 9వ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు ఇప్పటికే ఆప్షన్ ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. శిక్షణ కోసం ప్రఖ్యాత సంస్థలు, కోచింగ్ సెంటర్ల సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు లాప్టాప్లను ఇచ్చే సమయానికి, దాన్ని గరిష్టంగా వాడుకుని ఎలా లబ్ధి పొందవచ్చో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.