సాక్షి, అమరావతి : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువకుంటున్న 7 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థినిలకు శానిటరీ నేప్‌కిన్స్ పంపిణీపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 7 నుంచి 12 తరగతి వరకు విద్యార్థినిలకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్‌కిన్స్ ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
మార్చి 8 (మహిళా దినోత్సవం రోజున) ఉచిత శానిటరీ నేప్‌కిన్స్ పంపిణీ పథకం ప్రారంభం కానున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అయితే ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు వివరించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినిలకు శానిటరీ నేప్‌కిన్స్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 1 నుంచి ప్రతినెలా ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. కాగా నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్‌కిన్స్‌ను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దీని కోసం సుమారు రూ. 41.4 కోట్లు ఖర్చు చేయనుంది.
చదవండి: ఆ హక్కు ఎవరికీ లేదు: సీఎం జగన్
తక్కువ ధరకే శానిటరీ నేప్‌కిన్స్
గ్రామీణ ప్రాంతాల్లో చేయూత కిరాణా స్టోర్స్ ద్వారాతక్కువ ధరకే శానిటరీ నేప్‌కిన్స్ అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. చేయూత స్టోర్స్‌లో అందుబాటు ధరల్లో బ్రాండెడ్ కంపెనీల శానిటరీ నేప్‌కిన్స్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం శానిటరీ నాప్‌కిన్స్ తయారీలో అత్యుత్తమ కంపెనీలతో మెప్మా, సెర్ప్ ఎంఓయూ ఏకం కానున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థినిలకు అత్యుత్తమ శిక్షణ
విద్యార్థినిలకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. దీనికోసం లాప్‌టాప్‌లను వాడుకోవాలన్నారు. అమ్మఒడి పథకంలో లాప్‌టాప్‌లు కావాలనుకున్న 9 తరగతి ఆపైన విద్యార్థులకు ఇప్పటికే ఆప్షన్ ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న కంప్యూటర్స్‌తో పాటు రెప్యూటెడ్ సంస్ధలు (కోచింగ్ ఇనిస్టిట్యూషన్స్) సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల నుంచి ల్యాప్‌టాప్‌ల ఆప్షన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ల్యాప్‌టాప్‌ల సహకారంతో కోచింగ్ ఇవ్వాలన్నారు. ఇంటరాక్టివ్ విధానంలో, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఎంపిక చేసిన నిపుణుల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. దీని ద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. లాప్‌టాప్‌లను విద్యార్థినిలకు ఇచ్చే సమయానికి దాన్ని గరిష్టంగా వాడుకుని ఎలా లబ్ధి పొందవచ్చో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఉన్నత విద్యాశాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆర్థికశాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రి సెల్వి, ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment