మొదటి ప్రపంచ యుద్ధం ఇప్పటికీ ఉంది | Inventions That Starts World War 1 Till Continues | Sakshi
Sakshi News home page

మొదటి ప్రపంచ యుద్ధం ఇప్పటికీ ఉంది

Published Sat, Feb 6 2021 8:37 AM | Last Updated on Sat, Feb 6 2021 1:33 PM

Inventions That Starts World War 1 Till Continues - Sakshi

మొదటి ప్రపంచ యుద్ధానికి ఇదేమీ ‘టైమ్‌’ కాదు. టైమ్‌ అంటే సందర్భం. వరల్డ్‌ వార్‌–1 మొదలైంది 1914 జూలై 14. ముగిసింది 1918 నవంబర్‌ 11న. ప్రారంభానికీ, ముగింపునకు వందేళ్లు ఎప్పుడో దాటిపోయాయి. పోనీ ఈ ప్రథమ ప్రపంచ సంగ్రామానికి కారకుడైన బోస్నియా యువకుడు గవ్రిలో ప్రిన్సిప్‌ బర్త్, డెత్‌ల తేదీల కూడా దగ్గర్లో ఏమీ లేవు. మరేమిటి! అకస్మాత్తుగా యుద్ధం–1? ఒక విశేషం అయితే ఉంది. ఎయిడ్స్‌కు కారణమైన హెచ్‌.ఐ.వి. వైరస్‌ అసలు ఎక్కడి నుంచి సంక్రమించిందో కనిపెట్టేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న ఒక కెనడా ప్రొఫెసర్‌కు మధ్య ఆఫ్రికాలోని కామెరాన్‌లో మొదటి ప్రపంచ యుద్ధం మధ్య కాలం నాటి (1916) సైనికుడొకరు ఆకలికి తట్టుకోలేక ఒక చింపాజీని చంపి తినడంతో ఆ చింపాజీ నుంచి ఎయిడ్స్‌ క్రిమి సంక్రమించిన జాడలు కనిపించాయి.

అలా.. చింపాంజీ టు మనిషి.. ఎయిడ్స్‌ వచ్చి ఉంటుందని ఆ ప్రొఫెసర్‌ గారొక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సంగతిని తాజాగా  కెనడా, యూఎస్‌లలోని మెడికల్‌ జర్నల్స్‌ ప్రకటించాయి. ఎయిడ్స్‌ని అలా ఉంచితే.. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మానవాళికి ‘సంక్రమించిన’ కొన్ని ఇన్వెన్షన్స్‌ కూడా ఉన్నాయి. వాటిలో కొన్నివి.

చేతి వాచీ
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు మహిళలు మాత్రమే చేతివాచీలు ధరించేవారు. అయితే అవి వారికి ఆభరణాలుగా ఉండేవి. మగవారైతే కాలంతో తమకు పనేముంది అన్నట్లు ఉండేవారు. తెలియందేముంది! తామే కాలాన్ని నడిపిస్తున్నామన్న ఆ ఆధిక్య భావన భూమి పుట్టినప్పటి నుంచి మగజాతికి ఉన్నదే కదా! అయితే ఘరానా ఉండటం కోసం మాత్రం వాచీలను జేబుల్లో పైకి కనిపించేలా పెట్టుకుని తిరిగేవారు. యుద్ధం మొదలయ్యాక పగలూ రేయీ ఏకమై పురుషులు కూడా టైమ్‌ను చూసుకునేందుకు వీలుగా జేబుల్లోంచి తీసి చేతికి పెట్టుకోవలిసి వచ్చింది. ఆ రిస్ట్‌ వాచీలకు, పాకెట్‌ వాచీలకు మధ్యస్థ రూపం మరొకటి వచ్చింది. అవి ‘ట్రెంచ్‌ వాచీ’లు. వాటినే రిస్ట్‌లెట్స్‌ అనేవారు. ఒక గ్రేట్‌ వార్‌ వస్తే కానీ రిస్ట్‌వాచ్‌లు తగిలించుకోని ‘గ్రేట్‌’ పీపుల్‌ ఈ మగవాళ్లు! ఇది ఆవిష్కరణ కానీ, ఒక అలవాటుకు ఆరంభం. 

జిప్పులు
మగవాళ్ల ప్యాంట్‌లకు, ఆడవాళ్ల గౌన్లకు మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ‘హుక్‌లెస్‌ ఫాస్ట్‌నర్స్‌’ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనం చూస్తున్న జిప్పుల్లాంటివి అవి. లాంటివే కానీ, జిప్పులు కావు. గిడియోన్‌ సండ్‌బాక్‌ అనే స్వీడిష్‌ అమెరికన్‌ ఇంజినీరు చిక్కుపడని, కక్కేలు ఇరుక్కోని సాఫీగా ఉండే జిప్పులను హుక్కుతో పాటు 1914లో డిజైన్‌ చేశారు. ఆ యుద్ధ పరిస్థితుల్లో సైనిక వస్త్రాల అవసరాలకు కొత్త డిజైన్‌లలోని జిప్పులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చివరికి అవే మన్నికైనవిగా స్థిరపడ్డాయి. ఫ్యాషన్‌లు ఎన్ని మారినా, జిప్‌ డిజైన్‌ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అంతకుమించి జిప్పులను మెరుగు పరచడానికి ఏమీ లేదని, మెరుగు పరిచే అవసరమే లేదని తర్వాత్తర్వాత వచ్చిన ఇంజనీర్‌లు తేల్చేశారు!

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌
తుప్పు పట్టని విధంగా క్రోమిమంతో తయారు చేసిన స్వచ్ఛమైన ఉక్కు ‘స్టెయిన్‌లెస్‌ స్టీల్‌’. మొదటి ప్రపంచ యుద్ధకాలానికి ముందు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లేనేలేదు. యు.ఎ.లోని షెఫీల్డ్‌ ప్రాంతంలో ఉండే హ్యారీ బ్రియర్‌లీ యుద్ధ ప్రారంభ కాలమైన 1914 లో ఈ రకం స్టీల్‌ను కనిపెట్టారు. యుద్ధ విమానాల ఇంజిన్‌లు, మెస్‌ కిట్‌ సిల్వర్‌వేర్, వైద్య పరికరకాల తయారీకి ఒక మేలు రకమైన లోహం అవసరం అవడంతో, ఆ అవసరం నుంచి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ అవిర్భవించింది. 

పైలేట్స్‌ 
ఇదొక ఫిట్‌నెస్‌ టెక్నిక్‌. జోసెఫ్‌ పైలేట్స్‌ అనే జర్మన్‌ ఫిట్‌నెస్‌ మాస్టర్‌ ఈ టెక్నిక్‌ను (వ్యాయామ విధానం) మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తుండగా 1918 చివర్లలో వృద్ధి చేశారు. యుద్ధకాలంలో ఆయన ఆసుపత్రులలోని రోగుల నడకకు బలం చేకూర్చే పైలేట్స్‌ వ్యాయామం కోసం ‘క్యాడిలాక్‌’ అనే సాధనాన్ని రూపొందించారు. స్వయంగా ఆసుపత్రులకు వెళ్లి ఈ టెక్నిక్‌తో వ్యాయామ సేవలు కూడా అందిం
చారు. 

శానిటరీ నేప్‌కిన్స్‌
1914లో యూఎస్‌లోని కింబర్లీ క్లార్క్‌ అనే సంస్థ కలప గుజ్జుతో ఒక వస్త్రాన్ని తయారు చేసింది. యుద్ధ కాలంలో పత్తి కొరత ఏర్పడి, పత్తి వస్త్రాలకు అవసరం పెరగడంతో ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ గుజ్జు వస్త్రాన్ని కనిపెట్టింది. దానికి సెల్యుకాటన్‌ అని పేరుపెట్టింది. అమెరికా సైన్యంలోని క్షతగాత్రుల కోసం సర్జికల్‌ డ్రెస్సింగ్‌గా ఆ వస్త్రాన్ని సరఫరా చేసింది. రక్తస్రావాన్ని సెల్యుకాటన్‌ సమర్థం గా నిలువరించడంతో, యుద్ధానంతరం కొటెక్స్‌ శానిటరీ పాడ్స్‌ తయారు చేసి మార్కెట్‌లో విడుదల చేసింది. ఆ ప్రాడక్ట్‌కు అమితమైన ఆదరణ లభించింది. నేడు వాడుకలో ఉన్న శానిటరీ నేప్‌కిన్స్‌ వాటికి ఆధునాతన రూపమే. 

పోర్టబుల్‌ ఎక్స్‌–రేస్‌
తొలి ‘రేడియోలాజికల్‌ కారు’ అవిష్కరణ జరిగింది కూడా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే. ఈ కారును కనిపెట్టింది పోలెండ్‌ భౌతిక శాస్త్రవేత్త మేరీ క్యూరీ. ఈ వాహనంలో ఎక్స్‌ రే మిషన్‌ ఉండేది. ఫొటోగ్రాఫ్‌ డార్క్‌ రూమ్‌ పరికరాలు ఉండేవి. యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి ఆర్మీ సర్జన్‌లు నేరుగా యుద్ధ క్షేత్రంలోనికే ఈ రేడియోలాజికల్‌ కార్లను నడుపుకుంటూ వెళ్లేవారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement