ప్రపంచ ధనవంతులలో ఒకరు, మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) ఇటీవల ఓ ఖరీదైన, అరుదైన వాచ్ కట్టుకుని కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వాచ్ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
మార్క్ జుకర్‌బర్గ్ కట్టుకున్న వాచ్ గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1'. దీని ధర 9,00,000 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వాచ్ ధర కోట్లలో ఉండటం వల్ల దీనిని కొనొగోలు చేసేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే ఈ వాచ్ కలిగిన కుబేరుల జాబితాలో జుకర్‌బర్గ్ ఒకరు.
గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1' వాచ్
'హ్యాండ్ మేడ్ 1' (Hand Made 1) అనేది విలాసవంతమైన, ఖరీదైన వాచ్‌ల జాబితాలో ఒకటి. దీనిని ప్రఖ్యాత స్విస్ వాచ్‌మేకర్ గ్రూబెల్ ఫోర్సే ఎస్ఏ ఉత్పత్తి చేసింది. ఇవి చాలా అరుదైన వాచ్‌లు. ఎందుకంటే కంపెనీ కూడా వీటిని తక్కువ సంఖ్యలో (ఏడాదికి రెండు లేదా మూడు) మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.
మార్క్ జుకర్‌బర్గ్ ఖరీదైన వాచ్‌లు కట్టుకుని కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈయన పటెక్ ఫిలిప్, ఎఫ్‌పీ జర్న్ వంటి బ్రాండ్ వాచ్‌లను కట్టుకుని కనిపించారు. కాగా ఇప్పుడు గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1' వాచ్‌తో కనిపించారు. ప్రస్తుతం ఫేస్‌బుక్ సీఈఓ ధరించిన వాచ్ మీద పలువురు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
మార్క్ జుకర్‌బర్గ్ ఖరీదైన గడియారాన్ని కట్టుకోవడం వెనుక ఏమైనా ఆలోచన ఉందా? అని ఒకరు అన్నారు. ఫేస్‌బుక్ సత్యం, వాస్తవాలపై దృష్టి పెట్టాలని మరొకరు పేర్కొన్నారు. ఈ వాచ్ ఖరీదు చాలామంది ఇళ్ల ఖరీదు కంటే ఎక్కువ అని ఇంకొకరు అన్నారు. ఇలా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
వాచ్‌ల మీద అమితాసక్తి కలిగిన మార్క్ జుకర్‌బర్గ్.. అనంత్ అంబానీ & రాధికా మర్చంట్‌ల వివాహానికి హాజరైనప్పుడు కూడా వాచ్‌ల ప్రస్తావన వచ్చింది. జుకర్‌బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్, అనంత్ ధరించిన విలాసవంతమైన గడియారాన్ని మెచ్చుకోవడానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది.
ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్
అనంత్ అంబానీ వాచ్
ముకేశ్ అంబానీ తనయుడు.. అనంత్ అంబానీ ఇటీవల రూ. 22 కోట్ల విలువైన వాచ్ కట్టుకుని కనిపించారు. ఆ వాచ్ ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ అని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఈ వాచ్ రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' ప్రెస్ సెక్రటరీ 'డిమిత్రి పెస్కోవ్' (Dmitry Peskov) వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్‌తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment