సాక్షి, న్యూఢిల్లీ : మహిళలు వాడే శానిటరీ న్యాప్‌కిన్లపై ప్రస్తుతం విధిస్తున్న 12 శాతం జీఎస్టీని ఎత్తివేస్తున్నట్లు జీఎస్టీ మండలి శనివారం ప్రకటించిన వెంటనే పలు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల శానిటరీ న్యాప్‌కిన్ల ధర మార్కెట్‌లో తగ్గుతుందా? లేదా ? అన్నది ప్రస్తుత ప్రశ్న. తగ్గితే ఎంత తగ్గుతుంది ? పెరిగితే ఎంత పెరుగుతుంది? అన్నది కూడా ప్రశ్నే.
న్యాప్‌కిన్లపై వివిధ పన్నులు కలుపుకొని 13 శాతానికిపైగా పన్నులు పడుతుంటే తాము కేవలం 12 శాతం జీఎస్టీని విధించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించామంటూ 2017, జూలైలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వీడియో సాక్షిగా చేసిన వాదన ఎంత మేరకు కరెక్ట్ ? ఆ 12 శాతం జీఎస్టీని ఎత్తివేయడం వల్ల వినియోగదారుడికి ప్రస్తుతం కలిగే అదనపు ప్రయోజనం ఏమిటీ?
జీఎస్టీ ప్రకారం శానిటరీ న్యాప్‌కిన్ల ఉత్పత్తిదారులు కొనుగోలు చేసే ముడిసరుకుపై పన్ను పడుతుంది. మళ్లీ వారు ఉత్పత్తిచేస్తే వస్తువులను అమ్మినప్పుడు పన్ను పడుతుంది. ఇలా రెండుసార్లు పన్ను పడినప్పుడు మొదటిసారి పడిన పన్నును ‘ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్’గా పరిగణించి ప్రభుత్వం వెనక్కి ఇస్తుంది. అంటే ఓ న్యాప్‌కిన్ ముడిసరుకుపై ఐదు రూపాయలు పన్ను పడితే, న్యాప్‌కిన్ తయారయ్యాక దాని అమ్మకంపై ఆరు రూపాయలు పన్ను విధిస్తే.. మొదట వ్యాపారి చెల్లించిన ఐదు రూపాయల పన్ను మొత్తాన్ని ప్రభుత్వం వెనక్కి ఇచ్చేస్తుంది. ఇక్కడ న్యాప్‌కిన్ల అమ్మకంపై పడుతున్న 12 శాతం జీఎస్టీని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాటి ముడిసరకుపై పన్ను మినహాయింపును ప్రకటించలేదు. అంటే న్యాప్‌కిన్ల ముడిసరుకుకు వ్యాపారి చెల్లించిన పన్ను ప్రభుత్వం నుంచి వెనక్కి రాదు.
పైన పేర్కొన్న ఉదాహరణ ప్రకారం వ్యాపారి ముడిసరుకుపై చెల్లించిన ఐదు రూపాయలు వెనక్కి రావు. అమ్మకం సందర్భంగా విధించే ఆరు రూపాయలు ఇక చెల్లించాల్సిన అవసరం లేదు కనుక వ్యాపారికి ఒక రూపాయి పన్ను ఆదా అవుతుంది. ఆ ఆదా అయిన రూపాయిని వినియోగదారుడికి బదలాయించినప్పుడే అసలు లబ్ధి చేకూరుతుంది. ముడి సరుకుపై పన్ను తక్కువగా ఉండి అమ్మకంపై పన్ను ఎక్కువ ఉన్న సందర్భాల్లోనే ప్రభుత్వ నిర్ణయాల వల్ల వినియోగదారుడికి మేలు జరుతుంది లేదంటే లేదు. అరుణ్ జైట్లీ వీడియో వాదన కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. ఇంతకు న్యాప్‌కిన్లపై పన్ను రాయితీ ఏ మేరకు ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ అధికారులను సంప్రదించగా, న్యాప్‌కిన్ల ముడి పదార్థాలపై జీఎస్టీ నాలుగైదు శాతానికి మించదని తెలిపారు. అంటే 12 శాతం జీఎస్టీలో ఐదారు శాతం పన్ను కలసి వస్తోందన్న మాట. ఆ కలసివచ్చిన శాతాన్ని వ్యాపారి వినియోగదారులకు బదిలి చేయాలి.
ఈ విషయాన్ని పక్కన పెడితే చైనా, మరికొన్ని దేశాలు న్యాప్‌కిన్లు, మరికొన్ని వస్తువులపై విదేశీ జీఎస్టీని ఎత్తివేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఆయా దేశాలకు ప్రయోజనం కల్పించేందుకే కేంద్రం న్యాప్‌కిన్లపై జీఎస్టీని రద్దు చేసిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. న్యాప్‌కిన్ల విషయంలో చైనా మన దేశంతో ఎక్కువ పోటీ పడుతోంది. న్యాప్‌కిన్లపై జీఎస్టీని రద్దు చేయడం వల్ల చైనా న్యాప్‌కిన్లు మన మార్కెట్‌ను ముంచెత్తే అవకాశం ఉంది. అప్పుడు భారత వ్యాపారులు దెబ్బతింటే భారత వినియగదారులు లబ్ధి పొందుతారు.
Comments
Please login to add a commentAdd a comment