Menstrual Hygiene Day 2021 Special Story In Telugu - Sakshi
Sakshi News home page

Menstrual Hygiene Day: ప్యాడ్‌ ఎక్కడ మార్చుకుందాం?

Published Fri, May 28 2021 5:13 AM | Last Updated on Fri, May 28 2021 2:44 PM

Sakshi Special Story On Menstrual Hygiene Day

స్త్రీల బహిష్టు సమస్యలను ప్రపంచం 2013 నుంచి మాట్లాడటం మొదలెడితే భారతదేశం గత నాలుగైదేళ్లుగా మాట్లాడుతోంది. విద్యార్థినులకు ప్యాడ్స్‌ ఇవ్వడం, పేద వర్గాల మహిళలకు ప్యాడ్స్‌ అవసరం చెప్పడం ఇప్పుడిప్పుడే జరుగుతోంది. కాని నిజంగా బహిష్టును దాంతో పాటు స్త్రీలను అర్థం చేసుకుని దానితో ముడిపడిన సమస్యలకు పరిష్కారాన్ని, ఆపై స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని సమాజం ఇస్తోందా? బహిష్టులో ఉన్న స్త్రీ ఇంట్లో ఉంటే సరే, బయటకు వస్తే ప్యాడ్‌ ఎక్కడ మార్చుకోవాలో తెలియని ఆందోళన లో నేటికీ ఉందంటే బహిష్టు ధర్మం పట్ల ఈ సమాజం ఇంకా స్నేహంగా లేనట్టే లెక్క. మే 28 ‘బహిష్టు పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా కొన్ని చర్చలో ఉన్న ఆలోచనలు....

ఒక రచయిత్రి రాసిన తెలుగు కథలో ఒక మహిళా పాత్రధారి విమాన ప్రయాణం చేస్తూ ఉంటుంది. సడన్‌గా ఆమెకు పిరియెడ్స్‌ మొదలైపోతాయి. దగ్గర ప్యాడ్స్‌ ఉండవు. చీరలో ఉంటుంది. ప్రయాణ హడావిడిలో ప్యాంటిస్‌ కూడా వేసుకుని ఉండదు. ఒక పెద్ద దురవస్థగా ఉంటుందామెకు. విమానంలో మహిళలకు సడన్‌ గా పిరియడ్స్‌ వస్తాయేమోనని ప్యాడ్స్‌ ఉంచరు. ఇప్పటికీ ఎన్ని విమానాలలో ఈ సదుపాయం ఉందో మనకు తెలియదు. కాని తోటి ప్రయాణికులు ఆమెను అభ్యంతరకరంగా చూస్తూ ఉంటే ఎయిర్‌ హోస్టెస్‌లు సహకరిస్తే ఆ మహిళా పాత్రధారి ఆ దురవస్థ నుంచి బయటపడుతుంది. ఆ కథలో రచయిత్రి అంటుంది– ‘ఈ పాత్రధారి దురవస్థ సరే, దేశంలో బహిష్టు వస్త్రాన్ని ఉతికి మళ్లీ వాడుకునే కోట్లాది మహిళలు ఆ వస్త్రాలను ఆరేసుకోవాలంటే కొంచెం ఎండ కూడా దొరకదు’ అని. అంటే బహిరంగంగా వాటిని ఆరబెట్టుకోవడానికి ఈ సమాజం అంగీకరించదు అని. చీకటిలో, నీడలో, ఇంట్లో దండేలకు వాటిని ఆరబెట్టి తిరిగి వాడటం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో వచ్చాయో వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు.
∙∙
విమానం వంటి ఖరీదైన వ్యవస్థలో, ‘నాగరికులు’ రాకపోకలు జరిపే ప్రయాణ సాధనాలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఈ దేశంలో నేటికీ రైళ్లలో, రైల్వే స్టేషన్‌లలో, బస్టాండ్‌లలో, బస్సులలో ఎంతమేరకు స్త్రీలకు ప్యాడ్స్‌ అందుబాటులో ఉన్నాయి? వాటి అవసరాన్ని ఈ సమాజం, వ్యవస్థలు ఏ మేరకు గుర్తించాయి? ఇంకా గుర్తించాల్సి ఉంది? ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌లు ఉన్నట్టు ప్యాడ్‌ బాక్స్‌లు ఎందుకు ఉండవు అని ఇంకా అడగాల్సిన పరిస్థితే ఉంది.
∙∙
గత సంవత్సరం కేరళ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయ్యాల్లో ఫ్రీ ప్యాడ్స్‌ను ఏర్పాటు చేయడమే కాక, వాడిన ప్యాడ్స్‌ను బూడిద చేసే ‘ఇన్‌సినెరేటర్‌’లు కూడా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. పిరియెడ్స్‌లో ఉన్న మహిళా ఉద్యోగులకు ఆఫీసులో ప్యాడ్స్‌ మార్చుకునే వీలు ఏదో మేరకు ఉన్నా అంతవరకూ ఉపయోగించిన ప్యాడ్‌ను ఎక్కడ పడేయాలనే వత్తిడిలో ఉంటారు. అందువల్ల ఒకే ప్యాడ్‌ను ఎక్కువ సేపు వాడుతూ ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. వాటిని మార్చుకునే స్థలంతో పాటు వాటిని ఎవరూ చూడకుండా చేసే బూడిద యంత్రాలు అందుబాటులో ఉన్నప్పుడే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది. అయితే మహిళలు ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేస్తారా? ప్రయివేటు ఆఫీసుల్లో చేయరా? ఎన్ని ప్రయివేటు కార్యాలయాలు ఇలాంటి ఏర్పాటు చేస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. మహిళలు తమ బహిష్టు పరిశుభ్రతను పాటించాలంటే సమాజం మొత్తం అడుగడుగునా అందుకు అవసరమైన స్నేహాన్ని, సౌకర్యాన్ని కలిగించాల్సి ఉంటుంది.
∙∙
‘బాడీ లిటరసీ’ అనే మాటను వాడుతున్నారు మహిళల కోసం పని చేసే కార్యకర్తలు, ఆలోచనాపరులు. అంటే స్త్రీ శరీర ధర్మాలను సమాజం సరిగ్గా అర్థం చేసుకుని ఆ ధర్మాలను గౌరవించే స్థాయిలో విద్యావంతం కావాలి. అప్పుడే ‘బహిష్టు’కు సంబంధించిన కట్టుబాట్లు, ఏహ్యత, వెలి దూరం అవుతాయి. స్త్రీల శరీరం గురించి స్త్రీలకు తెలుసు. స్త్రీలు తమ లోపలి దొంతరల్లో మొదట ఈ శరీర ధర్మాల పట్ల స్వీయగౌరవం పెంచుకోవడం ఎంత అవసరమో ఇంటి పురుషులతో మొదలెట్టి అధికార పదవులలో కూచుని పురుషదృష్టితో పాలసీలు చేసే  పాలకుల వరకూ వీటి పట్ల గౌరవం కలిగించడం కూడా అంతే అవసరం. ఇంట్లోని తల్లి, కుమార్తె బహిష్టు గురించి నార్మల్‌గా మాట్లాడే పరిస్థితితోపాటు తండ్రి, కుమారుడు కూడా అంతే నార్మల్‌గా మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు అవసరమైన మార్పు వస్తుంది.
∙∙
బహిష్టు పట్ల ఉండే చూపును, అప్రకటిత నిబంధనలను వ్యతిరేకిస్తూ ‘హ్యాపీ టు బ్లీడ్‌’తో మొదలెట్టి ఇటీవలి కాలంలో ఎన్నో విజ్ఞాన నిరసనలు స్త్రీలు చేస్తున్నారు. తమ శరీర ధర్మాన్ని తాము ఓన్‌ చేసుకోవడం అవసరమని, గట్టిగా మాట్లాడటం కూడా అవసరమే అని వారు తెలుసుకుని మాట్లాడుతున్నారు. దాంతోపాటు ‘నల్ల కవర్‌ను పారేయడం’ గురించి కూడా మాట్లాడుతున్నారు. మెడికల్‌ షాప్‌కు వెళ్లి ప్యాడ్స్‌ అడిగితే వాటిని ఒక నల్ల కవర్‌లో చుట్టి ఇచ్చే ఆనవాయితీ ఉంది ఈ దేశంలో. ఎందుకు నల్లకవర్‌? అదేమైనా తప్పు పదార్థమా? మామూలు టానిక్‌లు ఎంత ఓపెన్‌ గా కొంటామో అంతే ఓపెన్‌గా వీటిని కొని, తీసుకెళ్లే పరిస్థితి ఉండాలని స్త్రీలు అంటారు. భార్యకు అవసరమైన ప్యాడ్స్‌ కోసం భర్త, కుమార్తెకు అవసరమైన ప్యాడ్స్‌ కోసం తండ్రి మెడికల్‌ షాపుకు వెళ్లడం ఏ మేరకు ఉంది... వాటిని తెచ్చిపెట్టడం లో ఇబ్బంది/నామోషీ ఎందుకు ఉంది అని ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన రోజు ఈ రోజు.
∙∙
సాధారణంగా స్త్రీలకు పిరియెడ్స్‌ 28 రోజులకు వస్తాయి. అవి ఐదు రోజులు ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఐదో నెల అయిన మేలో, 28వ తేదీని ‘మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ డే’గా పాటిస్తున్నారు. ఈ రోజు స్త్రీలు తమ శరీర ధర్మం పట్ల సమాజంలో రావాల్సిన మార్పు గురించి మాట్లాడతారు. గుర్తు చేస్తారు. సమాజం దీనిగురించి స్పందించాల్సి ఉంటుంది. స్త్రీల గురించి ఎన్నో చేయాలి. అనుక్షణం ఆలోచించాలి. ప్రత్యేకంగా రోజులను ఖరారు చేసి పదే పదే చెప్పేది అందుకే. స్త్రీలు కోరే ‘విద్యావంతమైన’ సమాజం త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement