Menstrual Hygiene Day
-
వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే : పీరియడ్స్ పరిశుభ్రత ముఖ్యం, లేదంటే చాలా ప్రమాదం
ఈ రోజు మే నెల 28వ తేదీ! ఈ రోజుకో ప్రత్యేకత ఉందండోయ్! అంతర్జాతీయంగా మెనుస్ట్రువల్ హైజీన్ డేగా జరుపుకుంటారు. మహిళల నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించాల్సిన అవసరం, పాటించకపోతే వచే ప్రమాదాల గురించి అందరిలో అవగాహన కల్పించడం దీని లక్ష్యం. అలాగే.. నెలసరి నిర్వహణకు సంబంధించిన ఉత్పత్తులు అందరికీ, వీలైనంత చౌకగా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కూడా ఈ రోజున ప్రయత్నాలు, చర్చలు జరుగుతాయి. పాఠశాలల్లో ఆడపిల్లలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు పంచిపెట్టినా.. మరే ఇతర కార్యక్రమం ద్వారానైనా ఆరోగ్యకరంగా రుతుస్రావ ప్రక్రియ పూర్తయ్యేందుకు తీసుకుంటున్న చర్యలే. ఓకే.. అంతా బాగానే ఉంది కానీ.. అసలు ఈ వరల్డ్ మెనుస్ట్రువల్ డే అనేది ఎలా ఆచరణలోకి వచ్చిందో మీకు తెలుసా? నెలసరి సమయంలో పరిశ్రుభత పాటించకపోవడం ఎంత ప్రమాదకరమో మీకు అవగాహన ఉందా? ఆలస్యమెందుకు తెలుసుకుందాం రండి...ఆవిర్భావమిలా...జర్మనీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘వాష్’ 2013లో ఏటా మే 28వ తేదీని వరల్డ్ మెనుస్ట్రువల్ హైజీన్ డేగా జరుపుకోవడం మొదలు పెట్టింది. రుతుస్రావం అనే అంశం ఏదో గుసగుసలాడుకునేది మిగిలిపోరాదని, అసంబద్ధ, మూఢవిశ్వాసాలతో కూడిన సామాజిక కట్టుబాట్ల నుంచి మహిళలు బయటపడాలన్న లక్ష్యంతో దీన్ని మొదలుపెట్టారు. అలాగే ప్రభుత్వాధినేతలు, అధికారులు ఈ అంశానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి తేవడమూ ఒక లక్ష్యమే. మహిళల్లో నెలసరి రుతుచక్రం 28 రోజులపాటు నడుస్తుంది కాబట్టి రుతుస్రావం ఐదు రోజులు కొనసాగుతుంది కాబట్టి ఏటా ఐదవ నెల 28వ తేదీన హైజీన్ డేను జరుపుకునేలా చర్యలు తీసుకున్నారు. పరిశుభ్రతతో ఆరోగ్య రక్షణ...సౌకర్యాల లేమి, సామాజిక, ఆర్థిక కారణాల రీత్యా లక్షలాది మంది అమ్మాయిలు, మహిళలు రుతుస్రావం సమయంలో పరిశుభ్రతను పాటించలేకపోతున్నారు. ఫలితంగా ఎన్నో నివారించదగ్గ రోగాల బారిన పడాల్సి వస్తోంది. పరిశుభ్రత పాటించకపోవడం వల్ల మూత్రాశయ నాళంతోపాటు పునరుత్పత్తి అవయవాలు కూడా ఇన్ఫెక్షన్లకు గురవుతాయి. ఇవి కాస్తా దీర్ఘకాలంలో పిల్లలు పుట్టకపోయేందుకూ, కాన్పు సమయంలో సమస్యలకు దారితీయవచ్చు. రుతుస్రావ సమయంలో జననేంద్రియ ప్రాంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, తరచూ దురద, పొక్కుల్లాంటివి ఏర్పడేందుకు కారణమవుతుంది. శానిటరీ ప్యాడ్లను మార్చుకునే సందర్భంలో చేతులను కూడా బాగా శుభ్రం చేసుకోవడం ద్వారా హెపటైటిస్-బీ, థ్రష్ వంటి రోగాలను నివారించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎక్కువ సేపు ఒకే ప్యాడ్ ధరించడం: మహిళలు 6-8 గంటలకోసారి శానిటరీ న్యాప్కిన్లను మార్చుకోవాలి. లేదంటే దద్దుర్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.చేతులు కడుక్కోకపోవడం: శానిటరీ నాప్కిన్లను మార్చే ముందు, మార్చిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. లేదంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్లు లేదా హెపటైటిస్ బికి దారి తీస్తుంది.వెనుక నుంచి ముందుకి కడగడం: రుతుస్రావం సమయంలో జననేంద్రియ ప్రాంతాలను శుభ్రం చేసుకునేందుకూ ఒక పద్ధతిని పాటించాలి. ముందు నుంచి వెనక్కు కడగడం అవసరం. ఇందుకు భిన్నంగా చేయడం వల్ల హానికారక బ్యాక్టీరియా పేవుల్లోకి చేరే అవకాశాలు పెరుగుతాయి.రుతుస్రావం సమయంలో భరించలేని నొప్పి, వికారం వాంతులు లాంటివి లక్షణాలు కనిపించినపుడు, వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. తగిన విశ్రాంతి తీసుకుంటూ, మంచి ఆహారం తీసుకోవాలి. -
దేశంలోనే ఏపీ అగ్రగామి.. చిట్టి తల్లులకు ‘స్వేచ్ఛ’
సాక్షి, అమరావతి: రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రేపటి పౌరులైన కిశోర బాలికల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సమర్థవంతంగా మెన్స్ట్రువల్ హైజీన్ (బహిష్టు సమయంలో పరిశుభ్రత) కార్యక్రమాల అమలులో కూడా మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంటోంది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నెలసరి సమయంలో స్కూళ్లు, కళాశాలల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్కిన్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా 2021–22లో 1.48 కోట్ల శానిటరీ నాప్కిన్ల పంపిణీతో తమిళనాడు దేశంలో మొదటి స్థానంలో ఉండగా, 1.16 కోట్లతో ఏపీ రెండో స్థానంలో ఉంది. ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు.. రుతుక్రమం ఇబ్బందులతో బాలికలు స్కూలుకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్ ప్రభుత్వం గుర్తించింది. డ్రాపౌట్స్‌ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న 10,01,860 మంది బాలికలకు ప్రతినెలా 10 నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. అంతేకాక.. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా అడోలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్‌లు.. ఇక కౌమార దశలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నివృత్తికి,వైద్యసేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అడోలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలివే.. ♦ నెలసరిలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయి. ♦ జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్దిమోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్ర పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడ్డాక సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెలి్వక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులొస్తాయి. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. చాలా మార్పు కనిపిస్తోంది ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల్లో చాలామంది పేద కుటుంబాలకు చెందినవారే. వీరు నెలసరిలో పాఠశాలకు గైర్హాజరయ్యే వారు. ప్రస్తుతం ప్రభుత్వమే ఉచితంగా శానిటరీ నాప్కిన్లు ఇస్తోంది. పాఠశాలల్లో బాత్రూమ్లు, ఇతర వసతులు మెరుగుపడ్డాయి. దీంతో గతంతో పోలిస్తే గైర్హాజరు తక్కువగా ఉంటోంది. – కేవీ పద్మావతి, ఉపాధ్యాయురాలు, అడవివరం, జెడ్పీ ఉన్నత పాఠశాల, విశాఖపట్నం ప్రతి స్కూల్లో అంబాసిడర్లుగా ఇద్దరు టీచర్లు మెన్స్ట్రువల్ హైజీన్ కార్యక్రమాలను విద్యా సంస్థల్లో నిర్వహించడానికి ప్రతి విద్యాసంస్థలో ఇద్దరు టీచర్లను హెల్త్, వెల్నెస్ అంబాసిడర్లుగా గుర్తించారు. వీరితోపాటు మెడికల్ ఆఫీసర్లకు ఎయిమ్స్ వైద్యుల ద్వారా మెన్స్ట్రువల్ హైజీన్‌పై శిక్షణ ఇప్పించాం. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, అడిషనల్ డైరెక్టర్ వైద్య శాఖ -
Menstrual Hygiene Day: ప్యాడ్ ఎక్కడ మార్చుకుందాం?
స్త్రీల బహిష్టు సమస్యలను ప్రపంచం 2013 నుంచి మాట్లాడటం మొదలెడితే భారతదేశం గత నాలుగైదేళ్లుగా మాట్లాడుతోంది. విద్యార్థినులకు ప్యాడ్స్ ఇవ్వడం, పేద వర్గాల మహిళలకు ప్యాడ్స్ అవసరం చెప్పడం ఇప్పుడిప్పుడే జరుగుతోంది. కాని నిజంగా బహిష్టును దాంతో పాటు స్త్రీలను అర్థం చేసుకుని దానితో ముడిపడిన సమస్యలకు పరిష్కారాన్ని, ఆపై స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని సమాజం ఇస్తోందా? బహిష్టులో ఉన్న స్త్రీ ఇంట్లో ఉంటే సరే, బయటకు వస్తే ప్యాడ్ ఎక్కడ మార్చుకోవాలో తెలియని ఆందోళన లో నేటికీ ఉందంటే బహిష్టు ధర్మం పట్ల ఈ సమాజం ఇంకా స్నేహంగా లేనట్టే లెక్క. మే 28 ‘బహిష్టు పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా కొన్ని చర్చలో ఉన్న ఆలోచనలు.... ఒక రచయిత్రి రాసిన తెలుగు కథలో ఒక మహిళా పాత్రధారి విమాన ప్రయాణం చేస్తూ ఉంటుంది. సడన్‌గా ఆమెకు పిరియెడ్స్ మొదలైపోతాయి. దగ్గర ప్యాడ్స్ ఉండవు. చీరలో ఉంటుంది. ప్రయాణ హడావిడిలో ప్యాంటిస్ కూడా వేసుకుని ఉండదు. ఒక పెద్ద దురవస్థగా ఉంటుందామెకు. విమానంలో మహిళలకు సడన్ గా పిరియడ్స్ వస్తాయేమోనని ప్యాడ్స్ ఉంచరు. ఇప్పటికీ ఎన్ని విమానాలలో ఈ సదుపాయం ఉందో మనకు తెలియదు. కాని తోటి ప్రయాణికులు ఆమెను అభ్యంతరకరంగా చూస్తూ ఉంటే ఎయిర్ హోస్టెస్‌లు సహకరిస్తే ఆ మహిళా పాత్రధారి ఆ దురవస్థ నుంచి బయటపడుతుంది. ఆ కథలో రచయిత్రి అంటుంది– ‘ఈ పాత్రధారి దురవస్థ సరే, దేశంలో బహిష్టు వస్త్రాన్ని ఉతికి మళ్లీ వాడుకునే కోట్లాది మహిళలు ఆ వస్త్రాలను ఆరేసుకోవాలంటే కొంచెం ఎండ కూడా దొరకదు’ అని. అంటే బహిరంగంగా వాటిని ఆరబెట్టుకోవడానికి ఈ సమాజం అంగీకరించదు అని. చీకటిలో, నీడలో, ఇంట్లో దండేలకు వాటిని ఆరబెట్టి తిరిగి వాడటం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో వచ్చాయో వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. ∙∙ విమానం వంటి ఖరీదైన వ్యవస్థలో, ‘నాగరికులు’ రాకపోకలు జరిపే ప్రయాణ సాధనాలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఈ దేశంలో నేటికీ రైళ్లలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, బస్సులలో ఎంతమేరకు స్త్రీలకు ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి? వాటి అవసరాన్ని ఈ సమాజం, వ్యవస్థలు ఏ మేరకు గుర్తించాయి? ఇంకా గుర్తించాల్సి ఉంది? ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు ఉన్నట్టు ప్యాడ్ బాక్స్‌లు ఎందుకు ఉండవు అని ఇంకా అడగాల్సిన పరిస్థితే ఉంది. ∙∙ గత సంవత్సరం కేరళ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయ్యాల్లో ఫ్రీ ప్యాడ్స్‌ను ఏర్పాటు చేయడమే కాక, వాడిన ప్యాడ్స్‌ను బూడిద చేసే ‘ఇన్సినెరేటర్’లు కూడా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. పిరియెడ్స్లో ఉన్న మహిళా ఉద్యోగులకు ఆఫీసులో ప్యాడ్స్ మార్చుకునే వీలు ఏదో మేరకు ఉన్నా అంతవరకూ ఉపయోగించిన ప్యాడ్‌ను ఎక్కడ పడేయాలనే వత్తిడిలో ఉంటారు. అందువల్ల ఒకే ప్యాడ్‌ను ఎక్కువ సేపు వాడుతూ ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. వాటిని మార్చుకునే స్థలంతో పాటు వాటిని ఎవరూ చూడకుండా చేసే బూడిద యంత్రాలు అందుబాటులో ఉన్నప్పుడే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది. అయితే మహిళలు ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేస్తారా? ప్రయివేటు ఆఫీసుల్లో చేయరా? ఎన్ని ప్రయివేటు కార్యాలయాలు ఇలాంటి ఏర్పాటు చేస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. మహిళలు తమ బహిష్టు పరిశుభ్రతను పాటించాలంటే సమాజం మొత్తం అడుగడుగునా అందుకు అవసరమైన స్నేహాన్ని, సౌకర్యాన్ని కలిగించాల్సి ఉంటుంది. ∙∙ ‘బాడీ లిటరసీ’ అనే మాటను వాడుతున్నారు మహిళల కోసం పని చేసే కార్యకర్తలు, ఆలోచనాపరులు. అంటే స్త్రీ శరీర ధర్మాలను సమాజం సరిగ్గా అర్థం చేసుకుని ఆ ధర్మాలను గౌరవించే స్థాయిలో విద్యావంతం కావాలి. అప్పుడే ‘బహిష్టు’కు సంబంధించిన కట్టుబాట్లు, ఏహ్యత, వెలి దూరం అవుతాయి. స్త్రీల శరీరం గురించి స్త్రీలకు తెలుసు. స్త్రీలు తమ లోపలి దొంతరల్లో మొదట ఈ శరీర ధర్మాల పట్ల స్వీయగౌరవం పెంచుకోవడం ఎంత అవసరమో ఇంటి పురుషులతో మొదలెట్టి అధికార పదవులలో కూచుని పురుషదృష్టితో పాలసీలు చేసే పాలకుల వరకూ వీటి పట్ల గౌరవం కలిగించడం కూడా అంతే అవసరం. ఇంట్లోని తల్లి, కుమార్తె బహిష్టు గురించి నార్మల్‌గా మాట్లాడే పరిస్థితితోపాటు తండ్రి, కుమారుడు కూడా అంతే నార్మల్‌గా మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు అవసరమైన మార్పు వస్తుంది. ∙∙ బహిష్టు పట్ల ఉండే చూపును, అప్రకటిత నిబంధనలను వ్యతిరేకిస్తూ ‘హ్యాపీ టు బ్లీడ్’తో మొదలెట్టి ఇటీవలి కాలంలో ఎన్నో విజ్ఞాన నిరసనలు స్త్రీలు చేస్తున్నారు. తమ శరీర ధర్మాన్ని తాము ఓన్ చేసుకోవడం అవసరమని, గట్టిగా మాట్లాడటం కూడా అవసరమే అని వారు తెలుసుకుని మాట్లాడుతున్నారు. దాంతోపాటు ‘నల్ల కవర్‌ను పారేయడం’ గురించి కూడా మాట్లాడుతున్నారు. మెడికల్ షాప్‌కు వెళ్లి ప్యాడ్స్ అడిగితే వాటిని ఒక నల్ల కవర్లో చుట్టి ఇచ్చే ఆనవాయితీ ఉంది ఈ దేశంలో. ఎందుకు నల్లకవర్? అదేమైనా తప్పు పదార్థమా? మామూలు టానిక్‌లు ఎంత ఓపెన్ గా కొంటామో అంతే ఓపెన్‌గా వీటిని కొని, తీసుకెళ్లే పరిస్థితి ఉండాలని స్త్రీలు అంటారు. భార్యకు అవసరమైన ప్యాడ్స్ కోసం భర్త, కుమార్తెకు అవసరమైన ప్యాడ్స్ కోసం తండ్రి మెడికల్ షాపుకు వెళ్లడం ఏ మేరకు ఉంది... వాటిని తెచ్చిపెట్టడం లో ఇబ్బంది/నామోషీ ఎందుకు ఉంది అని ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన రోజు ఈ రోజు. ∙∙ సాధారణంగా స్త్రీలకు పిరియెడ్స్ 28 రోజులకు వస్తాయి. అవి ఐదు రోజులు ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఐదో నెల అయిన మేలో, 28వ తేదీని ‘మెన్స్ట్రువల్ హైజీన్ డే’గా పాటిస్తున్నారు. ఈ రోజు స్త్రీలు తమ శరీర ధర్మం పట్ల సమాజంలో రావాల్సిన మార్పు గురించి మాట్లాడతారు. గుర్తు చేస్తారు. సమాజం దీనిగురించి స్పందించాల్సి ఉంటుంది. స్త్రీల గురించి ఎన్నో చేయాలి. అనుక్షణం ఆలోచించాలి. ప్రత్యేకంగా రోజులను ఖరారు చేసి పదే పదే చెప్పేది అందుకే. స్త్రీలు కోరే ‘విద్యావంతమైన’ సమాజం త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
‘అబ్బాయిలు కూడా తెలుసుకోవాలి’
ముంబై: రుతుస్రావం గురించి అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. గురువారం మెన్స్స్ట్రవల్ హైజీన్ డే సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. ‘జన ఔషధి కేంద్రాలలో లక్షల మంది మహిళల కోసం శానిటరీ నాప్కిన్లను ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో ఉంచాం. అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు రుతుస్రావం గురించి అవగాహన కల్పిద్దాం. రుతుస్రావం సిగ్గుపడాల్సిన విషయం కాదు’ అని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. (‘కోహ్లి.. అనుష్కకు విడాకులు ఇచ్చేయ్’) దీనిపై మంత్రి మన్సూక్ మాండవీయా స్పందిస్తూ ఈ మహమ్మారి కాలంలో మాత్రమే కాకుండా మామూలు రోజుల్లో కూడా రుతుస్రావ సమయంలో జాగ్రత్తలు పాటించడం అవసరమని తెలిపారు. రుతుస్రావం గురించి చర్చించడం సిగ్గు పడాల్సిన విషయం కాదని పేర్కొన్నారు. ఎందుకంటే రుతుస్రావం వల్ల మహిళలు రక్తాన్ని కోల్పొతారు కానీ, గౌరవాన్ని కాదు అని ట్వీట్ చేశారు. రుతుస్రావ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది మే 28న మెన్స్స్ట్రవల్ హైజీన్ డేను నిర్వహిస్తున్నారు. (వైరస్ భయం: ఫ్లైట్‌లో ‘ఆ నలుగురు’) -
మౌనం వీడకుంటే ఎలా?!
మహిళలకు అన్ని రోజులూ ఒక్కలా ఉండవు. నెలలో ఐదు రోజుల బాధ నుంచి బయట పడడమంటే ముప్పిరిగొన్న దాడుల నుంచి తమను తాము కాచుకోవడమే. తన దేహంతో తానే యుద్ధానికి సిద్ధపడడమే. దేహంలో ఎదురయ్యే ఒడిదొడుకులను ఓర్పుతో సహించాలి. ఓర్పుతో సహించడం వరకు అయితే, తప్పదు ఎలాగోలా నెట్టుకురావచ్చు. కానీ ఆ బాధ గురించి ఎవరితో చెప్పుకోకూడదు, నోరు విప్పి మాట్లాడకూడదు, విషయాన్ని గుట్టుగా ఉంచాలి. ఇన్నేళ్ల పాటు సాగిన సామాజిక నిషేధం ఇది. నెలసరి గురించి మాట్లాడడమే పెద్ద తప్పయిపోతే నెలసరిలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి చర్చించేదెలా? పరిశుభ్రత గురించి చెప్పడానికి ఎవరైనా ముందుకొచ్చినా వినడానికి సిగ్గుతో తలుపుచాటుకు పోయే అమ్మాయిలకు.. అది బిడియపడాల్సిన విషయం ఏమాత్రం కాదు, మాతృత్వం కోసం కొనసాగించాల్సిన దేహధర్మం అని చెప్పేదెలా? అందుకే దీనికి ఓ రోజు ఆవిర్భవించింది? మెన్స్ట్రువల్ హైజీన్ డే! అది ఈ రోజే. అంటే మే నెల 28. ఎప్పుడు! ఎక్కడ! జర్మనీకి చెందిన వాష్ (వాటర్, శానిటేషన్, హైజీన్లకు సంక్షిప్తరూపం) అనే ఎన్జీవో చేసిన ప్రయత్నం ఇది. మహిళల్లో, ముఖ్యంగా కౌమారదశలో ఉన్న అమ్మాయిలకు రుతుక్రమం మీద ఉండే అపోహలు, బిడియాలు పోగొట్టి వ్యక్తిగత పరిశుభ్రత నేర్పించడం ప్రధాన ఉద్దేశం. పరిశుభ్రత పాటించడానికి తమ అవసరాలను ఎటువంటి సంశయాలూ లేకుండా తెలియ చేయగలిగిన కాన్ఫిడెన్స్‌ని కలిగించడం కూడా. 2012లో ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆరోగ్యం మీద పని చేస్తున్న అనేక సంస్థల సమావేశంలో ఈ మౌనాన్ని ఛేదించి తీరాలనే నిర్ణయం జరిగింది. మరుసటి ఏడాది ‘వాష్’ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలుపెట్టింది. 2014లో మే నెల 28వ తేదీన మెన్స్ట్రువల్ హైజీన్ కోరుతూ 145 సంస్థల ప్రతినిధులు ఊరేగింపు, ప్రదర్శన, సినిమా ప్రదర్శన, వర్క్‌షాపులు, ప్రసంగాలు నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా ఇదే రోజున మెన్స్ట్రువల్ హైజీన్ డే నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ రోజే ఎందుకు? రుతు చక్రం 28 రోజులు, రుతుస్రావం సరాసరిన ఐదు రోజులు. ఈ రెండింటినీ కలుపుతూ ఏడాదిలో ఐదవ నెల అయిన మే నెలను, రుతుచక్రానికి ప్రతీకగా 28వ తేదీని మెన్స్ట్రువల్ హైజీన్ డే గా నిర్ణయించారు. – మను -
రుతుస్రావంపై పోస్టు చేసిన హీరో!
మహిళల రుతుస్రావంపై సమాజంలో అనేక మూఢనమ్మకాలు, దుష్ప్రచారాలు ఉన్నాయి. మహిళల పిరియడ్స్ గురించి మాట్లాడటమే తప్పు, ఈ విషయాన్ని గుప్తంగా ఉంచాలి అన్నంతగా ఈ మూఢనమ్మకాలు ప్రబలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై క్రమంగా మార్పు వస్తున్నది. అయితే, ఈ అంశం గురించి ఇప్పటికీ సమాజంలో పలు దురభిప్రాయాలు లేకపోలేదు. పిరియడ్స్ గురించి మాట్లాడలంటే 'ఆ రోజుల్లో' అని మాట్లాడే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు 'టు బ్లీడ్ వితౌట్ వాయిలెన్స్' పేరిట అరణ్య జోహర్ ఓ పవర్ఫుల్ కవితను చదివి వినిపించారు. పిరియడ్స్‌ను బలహీనతకు సంకేతంగానో, రహస్య అంశంగానో చూడకూడదని, మహిళ సాధికారితలో ఇది కూడా భాగంగా పరిగణించి.. వారిని ప్రోత్సహించాలంటూ ఆమె పఠించిన ఈ కవితను బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసుకున్నారు. రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై మౌనాన్ని వీడాలంటూ ఆయన ట్వీట్ చేశారు. అక్షయ్ తన రాబోవు చిత్రంలో ప్యాడ్మన్గా కనిపించబోతున్నాడు. తన గ్రామంలోని మహిళలకు తక్కువ ధరకు సానిటరీ ప్యాడ్స్ అందించడం ద్వారా సమాజంలో అవగాహన కల్పించిన అరుణాచలం మురుగనాథమ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. Break the silence on menstruation, periods are nothing to hide! #MenstrualHygieneDay --> https://t.co/BoNedwz20C pic.twitter.com/DvV0HvEsHx — Akshay Kumar (@akshaykumar) 28 May 2017