
ఆడవాళ్ల నాప్కిన్స్ కు మగవాళ్ల హడావిడి
న్యూఢిల్లీ: దేశంలోని పాఠశాలల్లో, కాలేజీల్లో, ఆస్పత్రుల్లో, ఆఫీసుల్లో బాలికలకు, మహిళలకుశానిటరీ నాప్కిన్స్ సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. అయితే అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఈ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖది. పథకం అమలుకు వ్యూహరచన చేస్తోంది.
దేశవ్యాప్తంగా పథకాన్ని అమలు చేయాల్సిన తమ శాఖా కార్యాలయంలోనే మహిళలకు శానిటరీ నాప్కిన్స్ లేకపోతే ఎలా? అన్న సందేహం వచ్చినట్టుంది. వెంటనే నాలుగు శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మిషన్స్‌ను కొనుగోలు చేసి నిర్మన్ భవనంలోని తమ శాఖా కార్యాలయాల్లోని మహిళల వాష్‌రూముల్లో ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 11వ తేదీన ఆ శాఖ అదనపు కార్యదర్శి, జాతీయ ఆరోగ్య మిషన్ డెరైక్టర్ సీకే మిశ్రా ఆర్భాటంగా వెండింగ్ మిషన్ల ప్రారంభించి, వాటికి సంబంధించిన ఫొటోను మీడియాకు విడుదల చేశారు.
ఆ రోజు జరిగిన కార్యక్రమంతా మగవాళ్ల హడావిడిగానే కనిపించడం చిత్రం. ప్రారంభోత్సవ కార్యక్రమం ఫొటోలో ఒక్క మహిళ కూడా లేకపోవడం విచిత్రం. ఆ కార్యక్రమంలో మహిళలు కూడా పాల్గొన్నారని, అయితే వారెవరూ కెమెరా కంటికి కనపడలేదని, సీకే మిశ్రాపైనే దృష్టిని కేంద్రీకరించడం వల్ల అలా జరిగిందని ఆనక ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చుకున్నది. అయినా ఆడవాళ్ల నాప్కిన్స్ కార్యక్రమానికి మొగవాళ్ల హడావిడి ఏమిటని ప్రశ్నిస్తున్న వాళ్లు లేకపోలేదు.
వాళ్లకు ఒకటే సమాధానం. కండోమ్స్ కొనేందుకు సిగ్గుపడే మగాళ్లలో ఎక్కువ మంది ఎలాంటి బెరకు లేకుండా లేడీస్ నాప్కిన్స్ కొంటున్నారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. అంతెందుకు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు ఉపయోగించడం కోసం అతి చౌకైనా శానిటరీ నాప్కిన్స్‌ను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్న ‘గూంజ్’ అనే ఎన్జీవోకి అనూష్ గుప్తా నేతృత్వం వహిస్తున్నారు. అంతేకాదు, ఈ విషయంలో గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొస్తున్నందుకుగానూ ఆయనకు గత జూలై నెలలో అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన మెగసెసె అవార్డు కూడా ఇచ్చారు. ఆడవాళ్ల రుతుక్రమం పట్ల సమాజంలో పేరుకుపోయిన అపోహలను తొలగించేందుకు కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తల్లో కూడా మగవాళ్లే ఎక్కువ ఉన్నారు.