‘చెడు’జోలికి పోకుండా
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే 25.3 కోట్ల మందితో అత్యధికంగా యువత కలిగిన దేశం భారత్. ఈ యువతలో ప్రతి ఐదుగురిలో ఒకరు 10 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య కౌమార దశలో (టీనేజిలో) ఉన్నారు. కౌమార దశలో ఉన్న బాలబాలికలు చెడు ప్రభావాలకు గురికాకుండా లైంగిక, పునరుత్పత్తి, ఆరోగ్య సమస్యలపై అన్ని రాష్ట్రాల్లో కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ క్లినిక్స్‌లో నమోదు చేసుకునే కౌమార బాలల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇది ఆరోగ్యకరమైన పరిణామం అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో, వివిధ రాష్ట్రాలవారీగా కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో నమోదు సంఖ్య, కౌన్సెలింగ్ తీరుపై విశ్లేషణాత్మక నివేదికను ఈ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021–22లో వివిధ రాష్ట్రాల్లో క్లినిక్‌లలో నమోదు చేసుకున్న వారి సంఖ్య పెరిగిందని నివేదిక తెలిపింది.
2020–21లో కోవిడ్ నేపథ్యంలో ప్రతి లక్ష జనాభాలో 383 మంది ఈ క్లినిక్‌లలో కౌన్సెలింగ్‌కు పేర్లు నమోదు చేసుకోగా 2021–22లో ఆ సంఖ్య 601కు పెరిగిందని పేర్కొంది. రాష్ట్రంలో కూడా 2020–21లో ప్రతి లక్ష మందిలో 283 మంది నమోదు చేసుకోగా 2021–22లో ఆ సంఖ్య 1,673కు పెరిగిందని పేర్కొంది. యుక్త వయస్సులోని యువతీ యువకులను ఆరోగ్యంగా, విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడతారని, ఈ నేపథ్యంలోనే కౌమార దశలోని బాలికలు, బాలురకు పని, విద్య, వివాహం, సామాజిక సంబంధాల విషయంలో చెడు ప్రభావాలకు లోనుకాకుండా చేయడమే స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో కౌన్సెలింగ్ అని నివేదిక పేర్కొంది.
రాష్ట్రీయ కిశోర్ స్వాస్త్య కార్యక్రమం కింద కౌమార ఆరోగ్య సమస్యలు, పౌష్టికాహారం, లింగ ఆధారిత హింస, నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు, మానసిక ఆరోగ్యంతోపాటు పెడ ధోరణులకు లోనుకాకుండా వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. శిక్షణ పొందిన సర్విస్ ప్రొవైడర్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఈ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో 36,56,271 మంది బాలురు, 45,73,844 మంది బాలికలు నమోదయ్యారు.
2021–22లో కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో 60 శాతం పైగా కౌమార దశలోని బాల బాలికలు క్లినికల్ సేవలు, కౌన్సెలింగ్ పొందినట్లు నివేదిక పేర్కొంది. 2021–22లో దేశం మొత్తమీద 70 శాతం బాలికలు, 66 శాతం బాలురు క్లినికల్ సేవలు పొందారు. అలాగే 76 శాతం బాలికలు, 69 శాతం బాలురు కౌన్సెలింగ్ తీసుకున్నారు. మన రాష్టంలో 2021 నాటికి 5,28,95,000 జనాభా ఉండగా అందులో 8,85,150 మంది కౌమార బాలలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది.