సాక్షి, అమరావతి: ప్రస్తుత కరోనా కాలంలో గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు దాదాపు మాస్కులను ఉపయోగిస్తున్నారు. ఒకసారి వాడి పారేసిన మాస్కుల ద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా వాటిని ఎక్కడికక్కడే శాస్త్రీయ విధానంలో తగలబెట్టడానికి ప్రతి గ్రామానికి ఒక అధునాతన యంత్రాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా యంత్రాల ద్వారా 500–700 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద వాడిపారేసిన మాస్క్‌లను దహనం చేస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి పొగ కూడా రాదు. వీటిని ఇన్‌సినెరేటర్‌లుగా పిలుస్తారు. మాస్కులతోపాటు సాధారణ రోజుల్లో మహిళలు, ఆడపిల్లలు ఉపయోగించే శానిటరీ నాప్‌కిన్స్‌ను ఈ యంత్రాల ద్వారా సురక్షిత మార్గాలలో తగలబెట్టే వీలుంటుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అన్ని రకాల బయో వ్యర్థాలను సైతం ఈ యంత్రాల ద్వారా నిర్వీర్యం చేయొచ్చని అధికారులు వెల్లడించారు.
► పట్టణాలలో ఈ తరహా వ్యర్థాల కోసం ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంది. అన్ని ఆస్పత్రుల నుంచి బయో వేస్ట్ మెటీరియల్‌ను ఎప్పటికప్పుడు సేకరించి, వాటిని నిర్వీర్యం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఒక ఏజెన్సీ పనిచేస్తుంది.
► గ్రామాల్లోనూ ఇలాంటి వ్యవస్థ ఉండాలని పారిశుధ్య కార్యక్రమాల అమలుపై పంచాయతీరాజ్ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఆదేశించడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
► మన రాష్ట్రంలో మహిళలకు ఏటా 8 కోట్ల నాప్‌కిన్స్ ప్యాడ్స్ సరఫరా జరుగుతున్నట్టు అంచనా. అలాగే ఇప్పుడు మాస్కుల వినియోగం పెరిగింది. గ్రామాల్లోని ఆస్పత్రుల్లోనూ బయోవ్యర్థాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటిని సురక్షిత పద్ధతిలో నిర్వీర్యం చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
► ఇప్పటికే 8 వేల ఇన్‌సినెరేటర్‌లను కొనుగోలు చేశారు. ఏపీలో 13,371 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్కటి చొప్పున వీటిని అందుబాటులో ఉంచేందుకుగాను మరో 6 వేల దాకా కొనుగోలుకు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లోనూ పూర్తిస్థాయిలో వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్వచ్చాంధ్ర కార్పోరేషన్ ఎండీ సంపత్‌కుమార్ ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు.
► జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోనూ ఇంటింటి నుంచి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించనుంది. ఇందులో వాడిపారేసిన మాస్క్‌లు, నాప్‌కిన్ ప్యాడ్స్ వంటి వాటిని వేరుగా వర్గీకరించి, వాటిని ఈ యంత్రాల ద్వారా
నిర్వీర్యం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment