సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న టీనేజీ పిల్లలకు టీకా పంపిణీలోనూ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో 24.41 లక్షల మంది పిల్లలకు టీకా పంపిణీ చేయాలన్న కేంద్రం లక్ష్యాన్ని అనతి కాలంలోనే అధిగమించింది. అదనపు టీకాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పంపిణీ చేస్తోంది. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 24,91,079 మంది పిల్లలకు తొలి డోసు టీకా వేశారు. వీరిలో 36.53 శాతం మందికి అంటే 9,10,042 మందికి రెండో డోసు టీకా కూడా వేశారు.
76.86 శాతం మందికి ప్రికాషన్ డోసు
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో గత నెలలో 60 ఏళ్లు పైబడిన వారికి, ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లకు ప్రికాషన్ డోసు టీకా వేస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వారిలో కోమార్బిడిటీస్ (బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, ఇతర జబ్బులు)తో బాధపడే వారికి ఈ డోసు వేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్రంలో మాత్రం కోమార్బిడిటీస్‌తో పాటు 60 ఏళ్లు పైబడి, రెండు డోసులు వేసుకుని 39 వారాలు దాటిన వారందరికీ ప్రభుత్వం ప్రికాషన్ డోసు వేస్తోంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ప్రికాషన్ డోసుకు 14,52,854 మంది అర్హులు కాగా వీరిలో 76.86 శాతం మందికి అంటే 11,16,669 మందికి ఈ డోసు వేశారు. వీరిలో 5,47,403 మంది 60 ఏళ్లు పైబడిన వారు, 3,14,374 మంది ఫ్రంట్‌లైన్, 2,54,892 మంది హెల్త్‌కేర్ వర్కర్లు ఉన్నారు.
కొనసాగుతున్న 38వ విడత ఫీవర్ సర్వే
కరోనా నియంత్రణలో ఫీవర్ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటివరకు 37 విడతలు ఫీవర్ సర్వే చేపట్టింది. 38వ విడత సర్వే కొనసాగుతోంది. కరోనా అనుమానిత లక్షణాలను గుర్తించి, వారి ద్వారా ఎక్కువ మందికి వైరస్ వ్యాపించకుండా నియంత్రించడం, అనుమానిత లక్షణాలతో ఉన్న వారికి చికిత్స అందించడం సర్వే ముఖ్య ఉద్ధేశం. 38వ విడతలో 1.26కోట్ల గృహాలకు గాను ఇప్పటికి 64.62 శాతం అంటే 1.05 కోట్ల గృహాల్లో సర్వే చేశారు. 1,480 మంది అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి వీరిలో 1,073 మందికి పరీక్షలు నిర్వహించారు. 9 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
Comments
Please login to add a commentAdd a comment