జీవన్‌జ్యోత్ కౌర్
పదిమంది తప్పుడు మార్గంలో నడుస్తున్నారని, మనం కూడా వారితో కలిసి నడిస్తేనే మనుగడ ఉంటుందనుకోవడం పొరపాటు. ఎవరి మద్దతూ లభించకపోయినా చేసేది మంచి పని అయితే ఒంటరిగా తల వంచుకుని ముందుకు సాగితే ఆ పనికి ఏదో ఒక రోజు గుర్తింపు, గౌరవ మర్యాదలు తప్పకుండా దక్కుతాయని నిరూపించింది ఆమ్‌ఆద్మీ పార్టీ నేత జీవన్‌జ్యోత్ కౌర్.
యాభై ఏళ్ల జీవన్‌జ్యోత్ కౌర్ పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో పుట్టింది. చిన్నప్పటినుంచి చాలా చురుకుగా ఉండే అమ్మాయి. అన్ని విషయాల్లో ఆల్‌రౌండర్‌గా ఉండడమేగాక, మంచి వక్తగా పేరు తెచ్చుకుంది. చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తరువాత తల్లిదండ్రులు నడుపుతోన్న ‘శ్రీ హేమ్‌కుంత్ ఎడ్యుకేషన్ సొసైటీ(ఎస్‌హెచ్‌ఈఎస్)లో పనిచేయాలని నిర్ణయించుకుంది.
విద్య, ఆరోగ్య, మహిళల సంక్షేమాభివృద్ధికి పాటుపడే ఎన్జీవో ఇది. దీనిలో అనేక పనుల్లో పాలుపంచుకుంటోంది. ఇలా ఉండగా... పంజాబ్ స్కూళ్లలోని చాలామంది అమ్మాయిలు శానిటరీ న్యాప్కిన్స్ కొనుక్కోలేని పరిస్థితి. దీంతో వాడిన బట్టనే వాడుతూ అనారోగ్యాల బారిన పడుతున్నట్లు సర్వే ద్వారా తెలుసుకుంది జీవన్. అప్పటినుంచి స్కూళ్లకు వెళ్లి ఉచితంగా బాలికలకు ప్యాడ్స్‌ను అందించేది. తరవాత జైళ్లు, ఓల్డేజ్ హోమ్‌లలో పనిచేసే వారి పంపిణీ చేసేది. ఇలా ప్యాడ్స్ పంచుతూ పంజాబీ ప్యాడ్ ఉమెన్‌గా పాపులర్ అయింది.
ఇకో షీ రివల్యూషన్
పాండిచ్చేరీకి చెందిన ఇకోఫెమ్మే,, ఇంకా స్విట్జర్లాండ్ కంపెనీలతో కలసి సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన రీ యూజబుల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్యాడ్‌లను జీవన్ పంపిణీ చేస్తూనే, ఇకో షీ రివల్యూషన్ పేరు మీద రెండు గంటలపాటు రుతుక్రమం మీద అవగాహన కార్యక్రమాలను నిర్వహించేది. ఐదువందల స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు హర్యాణ, బిహార్‌లలో కూడా నిర్వహిస్తోంది.ఎస్‌హెచ్‌ఈ ఎన్జీవోకు జీవన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇకో షీ రివల్యూషన్‌తోపాటు, ‘ఆబాద్’ బదల్వ్, ఏక్ నయీ సోచ్, ఎస్‌హెచ్‌పీ స్కూల్ వంటి ప్రాజెక్టులను నిర్వహిస్తూ బాలికలు, మహిళల అభ్యున్నతికి కృషిచేస్తోంది.
సీనియర్లను ఓడించి..
సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే జీవన్‌కు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అస్సలు లేదు. రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదనుకుంది తను. కానీ జీవన్ తల్లి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వీరాభిమాని కావడంతో ఆప్‌లో చేరమని ఒత్తిడి తెచ్చింది. దీంతో 2015లో జీవన్ ఆప్‌లో చేరింది. పార్టీలో చేరినప్పటినుంచి కష్టపడి అంకితభావంతో పనిచేసే వ్యక్తిగా గుర్తింపు పొందింది.
ఆప్‌లో అధికార ప్రతినిధిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన జీవన్ తన పనితీరుతో పంజాబీ ఉమెన్ వింగ్‌కు కో–ప్రెసిడెంట్‌గానూ, తరువాత అమృత్‌సర్ ఆప్ ప్రెసిడెంట్‌గానూ ఎంపికైంది. 2019 నుంచి మరింత చురుకుగా పనిచేస్తూ పార్టీ ప్రచార కోఆర్డినేటర్‌గా మారింది. తరువాత ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా మారింది. అంకిత భావంతో పనిచేస్తూ ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో తొలిసారి పోటీచేసింది. ఈ ఎన్నికల్లో ఎంతో సీనియర్ నాయకులైన నవజ్యోత్ సింగ్ సిద్ధు, అకాలీ దల్ నాయకుడు విక్రమ్ సింగ్ మజితాయ్‌లను ఓడించి చరిత్రాత్మక విజయం సాధించింది.
మనమే పూలబాటగా మార్చుకోవాలి
‘‘ఎమ్‌ఎల్‌ఏగా గెలిచినప్పటికీ మహిళా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తాను. 117 పంజాబ్ అసెంబ్లీలో స్థానాల్లో కేవలం 13 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ద్వారా మహిళలను ప్రగతి పథంలో నడిపించడమేగాక, మరింతమందిని రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే స్థాయికి తీసుకురావడానికి కృషిచేస్తాను. ఏదీ కష్టమైన పనికాదు. యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. యువత రాజకీయాల్లోకి రావాలి. మాదక ద్రవ్యాలకు బానిసలవ్వడం, నిరుద్యోగ సమస్యలు ఎప్పుడూ ఉండేవే. ఎవరికి పూలబాటలు పరిచి ఉండవు, ఒక్కో ముల్లును తీసేసి మీ బాటను మీరే పూలబాటలా మార్చుకోవాలి’’ అని యువతకు బోధిస్తున్నారు కౌర్.
Comments
Please login to add a commentAdd a comment