
న్యూఢిల్లీ: ఆప్‌కు చెందిన ప్రతిపక్ష నేత ఆతిశీ సహా సస్పెండైన ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీ అసెంబ్లీ గేట్ వద్దే ధర్నాకు దిగారు. వారంతా అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయతి్నంచగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, గేటు వెలుపలే నిరసన చేపట్టారు. మంగళవారం అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగం సమయంలో ఆప్ సభ్యులు అంతరాయం కలిగించారు.
సీఎం కార్యాలయంలో ఉన్న భగత్ సింగ్, అంబేడ్కర్ చిత్రపటాలను బీజేపీ ప్రభుత్వం తొలగించడంపై ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు ఆప్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలకుగాను సభలో ఉన్న 21 మందిని మూడు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ విజేంద్ర గుప్తా ప్రకటించారు. అనంతరం ఆప్ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపారు. తిరిగి గురువారం అసెంబ్లీ ప్రారంభమవగానే ఆవరణలోకి వచ్చేందుకు ఆప్ ఎమ్మెల్యేలు ప్రయతి్నంచగా సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్దే వారిని అడ్డుకున్నారు. దీనిపై ఆతిశీ మండిపడ్డారు.
బీజేపీ నియంతృత్వ పోకడలకు హద్దే లేకుండా పోతోందన్నారు. అసెంబ్లీ గేటు వెలుపలే పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆమె ధర్నాకు దిగారు. అంబేడ్కర్ ఫొటోలున్న ప్లకార్డులను చేబూని ‘జై భీం, బీజేపీ నియంతృత్వం చెల్లదు’అంటూ కంజర వాయిస్తూ నినాదాలు చేశారు. ‘అసెంబ్లీలో జై భీం అని నినాదాలు చేసినందుకే మమ్మల్ని మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ రోజు, మమ్మల్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా అడుగుపెట్టనివ్వలేదు. ఇది చాలా తప్పు. ప్రతిపక్షం గొంతు మీరెలా నొక్కుతారు? యావత్తూ ప్రతిపక్షాన్ని అసెంబ్లీకి దూరంగా ఎలా ఉంచుతారు?’అని ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ ప్రశ్నించారు.
మాకు సమయమివ్వండి..: రాష్ట్రపతికి ఆప్ లేఖ
శాసన సభ్యులను అసెంబ్లీ ఆవరణలోకి రాకుండా అడ్డుకోవడంపై ఆప్‌నకు చెందిన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఆతిశీ గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. ‘రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, షహీద్ భగత్ సింగ్‌ల చిత్రపటాలను బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించింది. ఈ చర్య ఈ ఇద్దరు మహనీయులకే కాదు, దళితులు, వెనుకబడిన, అణగారిన వర్గాల వారికీ అవమానం.
ఈ చర్యను ఆప్ వ్యతిరేకించింది. అసెంబ్లీలో దీనిపై ప్రస్తావించేందుకు ప్రయత్నించిన ఆప్ ఎమ్మెల్యేలను స్పీకర్ మూడు రోజులపాటు అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారు’అని ఆ లేఖలో ఆతిశీ వివరించారు. ‘గురువారం, అసెంబ్లీ గేటు వద్ద భారీ బారికేడ్లు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం శాసనసభ్యులను అసెంబ్లీ ఆవరణలోకి రానివ్వలేదు. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులును శాసనసభలోకి రానివ్వకపోవడం అప్రజాస్వామికం. తీవ్రమైన ఈ విషయంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని, 28వ తేదీన మీతో మాట్లాడేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వగలరు’అని అందులో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment