
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ మంత్రి పర్వేష్ వర్మ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష నేత అతిషీని ఉద్దేశించి మంత్రి పర్వేష్ వర్మ చేసిన ‘భాయ్’ వ్యాఖ్యలపై ఆప్ ఆందోళనకు దిగింది. అతిషీకి వర్మ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.
ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి పర్వేష్ వర్మ ప్రశ్నోత్తరాల టైంలో మాట్లాడుతూ.. గతేడాది బడ్జెట్‌లో తీర్థయాత్ర పథకానికి రూ.80 కోట్ల బడ్జెట్ కేటాయించినప్పటికీ.. అప్పటి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. కేవలం పబ్లిసిటీ మాత్రమే చేశారంటూ ఆరోపణలు గుప్పించారు.
ఈ క్రమంలో.. అతిషీ సహా ఆప్ ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి మంత్రి ప్రసంగానికి అడ్డుతగిలారు. ఈ క్రమంలో వర్మ అసహనం వ్యక్తం చేస్తూ.. ‘‘ఎక్కడి నుంచి ఈమెను తెచ్చారు భాయ్’’ అంటూ అతిషిని ఉద్దేశించి ఆప్ ఎమ్మెల్యేలతో అన్నారు. దీంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది.
వర్మ అతిషిపై అన్‌పార్లమెంటరీ పదజాలం ఉపయోగించారని ఆప్ నిరసనకు దిగింది. అయితే భాయ్ అనడంలో తప్పేముందంటూ వర్మ ఆప్ ఎమ్మెల్యేలను ప్రశ్నించగా.. స్పీకర్ విజేందర్ గుప్తా సైతం మంత్రికి మద్దతుగా నిలిచారు. స్పీకర్ విజ్ఞప్తి చేసినా ఆప్ సభ్యులు శాంతించకపోవడంతో మార్షల్స్ సాయంతో ఎమ్మెల్యేలు విశేష్ రవి, కులదీప్ కుమార్‌లను బయటకు పంపించారు.