![Who is Parvesh Sahib Singh Verma](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/parvesh%20verma.jpg.webp?itok=8D0SBf5T)
ఢిల్లీ: 27ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కషాయ జెండా ఎగిరింది. దేశ రాజధానిలో కంట్లో నలుసుగా, కొరకరానికి కొయ్యగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) ని బీజేపీ చిత్తు చేతింది. ఆ పార్టీ చేతిలో రెండు సార్లు ఓటమి చవిచూసిన బీజేపీ (bjp) మూడోసారి విజయం సాధించింది. దీంతో ఢిల్లీ సీఎం ఎవరు?హస్తినలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువు దీరనుంది? అనే ప్రశ్నల పరంపర కొనసాగుతుంది.
ఈ తరుణంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన తర్వాతే ఢిల్లీ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. రేపటి నుంచి నాలుగు రోజులపాటు మోదీ అమెరికా, ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. పర్యటన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ప్రస్తుత ఢిల్లీ సీఎంగా ఉన్న అతిశీ మార్లేనా తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించారు. అతిశీ రాజీనామా అనంతరం, ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఉత్తర్వులు వెలువరించారు.
ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల కావడంతో కేజ్రీవాల్‌ను ఓడించి జైంట్ కిల్లర్‌గా ఆవిర్భవించిన పర్వేష్ వర్మ (parvesh verma) గవర్నర్ సక్సేనాతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. ఈ వరుస పరిణామాలతో ఢిల్లీ సీఎంగా పర్వేష్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. కాగా,బీజేపీ తరఫున చివరి సారిగా పర్వేష్ వర్మ తండ్రి సాహెబ్ సింగ్ వర్మ సీఎంగా పనిచేశారు.
శనివారం విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను 4,089 ఓట్లతో పర్వేష్ వర్మ విజయం సాధించారు. కేజ్రీవాల్‌కు 25,999 ఓట్లు, వర్మకు 30,088ఓట్లు వచ్చాయి. వర్మ అంతకుముందు 2013లో అసెంబ్లీకి, ఆ తర్వాత 2014,2019 పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వచ్చించారు.
ఎవరీ పర్వేష్ వర్మ?
ఢిల్లీలోని ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలలో పర్వేష్ వర్మ కుటుంబం ఒకటి. పర్వేష్ వర్మ బీజేపీలో పంజాబీ జాట్ నేత. ఆయన 'రాష్ట్రీయ స్వయం' అనే సామాజిక సేవా సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. పర్వేష్ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఆయన మామ ఆజాద్ సింగ్ ఒకప్పుడు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. పర్వేష్ వర్మ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ముండ్కా నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. పర్వేష్ భార్య స్వాతి సింగ్ మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు విక్రమ్ వర్మ కుమార్తె. పర్వేష్ వర్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
పర్వేష్ వర్మ విజయంపై ఆయన కుమార్తెలు త్రిష, సనిధి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.‘అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తికి ఢిల్లీ ప్రజలు రెండవ అవకాశం ఇచ్చే తప్పును ఎప్పటికీ చేయరు మా తండ్రి గెలుపుతో పాటు పార్టీ గెలుపుపై నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికల్లో స్పష్టమైన విజయం ఉంటుందని మాకు తెలుసు. మేము సరైన సమయం కోసం ఎదురు చూశాం. ఆ సమయం రానే వచ్చింది.ఈసారి ఢిల్లీ ప్రజలు అబద్ధాలను గెలవనివ్వలేదు’ అని వ్యాఖ్యనించారు.
Comments
Please login to add a commentAdd a comment