ఏఐ సదస్సు.. కలవని చేతులు.. వీడియో వైరల్‌ | Sam Altman And Dario Amodei avoid holding hands Video Viral | Sakshi
Sakshi News home page

ఏఐ సదస్సు.. కలవని చేతులు.. వీడియో వైరల్‌

Feb 20 2026 7:17 AM | Updated on Feb 20 2026 11:00 AM

Sam Altman And Dario Amodei avoid holding hands Video Viral

న్యూఢిల్లీ: ఓపెన్‌ ఏఐ, ఆంత్రోపిక్‌. ఏఐ రంగంలో ఢీ అంటే ఢీ అంటున్న ప్రత్యర్థులు. వాటి సీఈఓలు శామ్‌ ఆల్ట్‌మన్, దరియో అమొదెయ్‌ గురువారం ఒకే వేదికపైకి వచ్చారు. కానీ చేతులు కలిపేందుకు మాత్రం ససేమిరా అన్నారు! ఈ ఇబ్బందికర క్షణాలకు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు వేదికైంది.

ప్రధాని మోదీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం టెక్‌ దిగ్గజాలంతా వేదికపైకి వెళ్లారు. గ్రూప్‌ ఫొటో సందర్భంగా అందరూ చేతులు కలిపి పైకెత్తారు. యాదృచ్ఛికంగా పక్కపక్కనే నిలబడ్డ ఆల్ట్‌మన్, అమొదెయ్‌ మాత్రం అందుకు నిరాకరించారు. ఎవరికి వారు విడిగా పిడికిళ్లు బిగించి పైకెత్తి సరిపెట్టారు. పైగా నిలబడ్డంతసేపూ ఇద్దరూ చాలా అసౌకర్యంగా కూడా కన్పించారు. ఈ దృశ్యం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అనంతరం ఈ ఉదంతంపై ఆల్ట్‌మన్‌ స్పందించారు. ‘నేను అయోమయానికి గురయ్యా. ఎందుకంటే ఆ సమయంలో ఏం చేయాలో నాకు తెలియలేదు. మోదీ నా చేతిని పట్టుకుని పైకెత్తారు. దాంతో ఏం జరుగుతోందో కాసేపటిదాకా అర్థమే కాలేదు’ అని చెప్పుకొచ్చారు.

మాజీ సహోద్యోగులే..
కాగా, ఆల్ట్‌మన్, అమొదెయ్‌ ఒకప్పుడు సహోద్యోగులే కావడం విశేషం. ఆల్ట్‌మన్‌తో పాటు అమొదెయ్‌ కూడా ఓపెన్‌ ఏఐలోనే పని చేశారు. ఆయనతో విభేదాల నేపథ్యంలో 2020లో కంపెనీని వీడారు.  

ఇక, అంతకుముందు శామ్‌ ఆల్ట్‌మన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కృత్రిమ మేధ ఫలాలు అందరికీ అందాలంటే దాన్ని పూర్తిగా ప్రజాస్వామీకరించడమే ఏకైక మార్గం. అదే సముచితం కూడా అని కుండబద్దలు కొట్టారు. ఏఎస్‌ఐ ఆగమనానికి ఓపెన్‌ ఏఐ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రజాస్వామిక ఏఐ అన్నది ఈ విషయంలో మేం విశ్వసించే మౌలిక సూత్రాల్లో మొట్టమొదటిది. మానవాళి సమగ్ర ప్రగతికి అదే అత్యుత్తమ మార్గం. 2028 చివరికల్లా ప్రపంచ మేధోసామర్థ్యమంతా దాదాపుగా డేటా సెంటర్లలోనే నిక్షిప్తమై ఉంటుందని ఆల్ట్‌మన్‌ అంచనా వేశారు. ఏఐ సాంకేతికత మున్ముందు సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ తీరుతెన్నులనే సమూలంగా మార్చేయనుందని జోస్యం చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement