
ఢిల్లీ: ఆప్‌నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషి అసెంబ్లీ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. కీలక పదవిని చేపట్టిన తొలి మహిళా నేతగా ఆమె చరిత్రలో నిలిచారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక మహిళా ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించనున్న అతిషి.. ఢిల్లీ మహిళా సీఎంతో తలపడనున్నారు.
ఆదివారం నిర్వహించిన ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో అతిషిని ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కీలక పదవి కోసం ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించారు. తనను విశ్వసించినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌కు, శాసనసభా పక్షానికి అతిషి కృతజ్ఞతలు తెలిపారు.
బలమైన ప్రతిపక్షం ప్రజల గొంతుకకు ప్రతీకగా నిలుస్తోందని అతిషి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల మొదటి సెషన్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో గత ఆప్ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ పేర్కొంది.
ఫిబ్రవరి 5న జరిగిన ఎన్నికల్లో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. కేజ్రీవాల్‌పై అవినీతి మరకలు, పదేళ్ల పాలన నేపథ్యంలో ఆప్‌పై ప్రభుత్వ వ్యతిరేకత అందుకు తోడయ్యాయి. దీంతో ఫలితాల్లో బీజేపీ ఏకంగా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా ఆప్ 22 సీట్లకు పరిమితమైంది. మెజారిటీ మార్కుకు 14 స్థానాల దూరంలో నిలిచి తన పురిటిగడ్డ అయిన ఢిల్లీలో తొలిసారి ఓటమిని రుచిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment