
ఢిల్లీ: తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు కుట్ర పన్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీ సీఎం అతిషి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ రక్షణ కోసం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన భద్రతా బృందాన్ని బీజేపీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ ఉపసంహరించిందంటూ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఈ అంశంపై స్పందించాలని.. కేజ్రీవాల్‌కు పంజాబ్ ప్రభుత్వం కల్పించిన భద్రతను పునరుద్ధరించాలన్నారు. కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు కలిగించడానికి ఇప్పటి వరకు జరిగిన దాడులపై విచారణ జరిపించాలని అప్ సీఎంలు డిమాండ్ చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో ఢిల్లీ పోలీసులు పనిచేస్తున్నారని అతిషి, భగవంత్ మాన్ మండిపడ్డారు. కేజ్రీవాల్‌పై పదేపదే దాడులు జరుగుతున్నా కానీ వారు పట్టించుకోవడం లేదని.. అందుకే వారిపై తమ పార్టీకి నమ్మకం లేదంటూ వారు చెప్పుకొచ్చారు. దీనిపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బీజేపీ నుంచి సీఎం ఆఫర్ వచ్చింది.. సిసోడియా సంచలన వ్యాఖ్యలు