![CM Jagan Launches Swechha Program Over Women And Girls Health Care - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/5/Swechha-Program.jpg.webp?itok=N9NI0EmO)
సాక్షి, తాడేపల్లి: మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ కార్యకమ్ర లక్ష్యమని తెలిపారు. రుతుక్రమ సమస్యలతో చదువులు ఆగిపోతున్నాయని, 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు అందజేస్తామని తెలిపారు. 10లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాపికిన్లు పంపిణీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10, 388 స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్‌కిన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి నెల జేసీ (ఆసరా) ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరగాలని పేర్కొన్నారు. మహిళా టీచర్లు, ఏఎన్‌ఎంలు బాలికలకు అవగాహన కల్పించాలని, ‘స్వేచ్ఛ’ పథకం అమలుపై నోడల్ అధికారిగా మహిళా టీచర్‌ను నియమించామని తెలిపారు. దిశ యాప్, దిశ చట్టం గురించి వివరించాలని అన్నారు. మహిళా సాధికారతలో ఏపీ మొదటి స్థానంలో ఉందని సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ చేయూత స్టోర్లలో శానిటరీ న్యాప్‌కిన్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చరిత్రను మార్చే శక్తి మహిళలకే ఉందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం తమదని సీఎం జగన్ తెలిపారు.
విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు చదువులకు దూరం కాకుండా చూడటమే లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్‌కిన్స్ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు చేపట్టింది.
యూనిసెఫ్, వాష్, పీ అండ్ జీ తదితర సంస్థలతో కలసి అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమంపై అపోహలు తొలగించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూళ్లు, కాలేజీలలో న్యాప్‌కిన్స్ పంపిణీకి చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment