Government institutions
-
‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ కార్యకమ్ర లక్ష్యమని తెలిపారు. రుతుక్రమ సమస్యలతో చదువులు ఆగిపోతున్నాయని, 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందజేస్తామని తెలిపారు. 10లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా న్యాపికిన్లు పంపిణీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10, 388 స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్కిన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి నెల జేసీ (ఆసరా) ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరగాలని పేర్కొన్నారు. మహిళా టీచర్లు, ఏఎన్ఎంలు బాలికలకు అవగాహన కల్పించాలని, ‘స్వేచ్ఛ’ పథకం అమలుపై నోడల్ అధికారిగా మహిళా టీచర్‌ను నియమించామని తెలిపారు. దిశ యాప్, దిశ చట్టం గురించి వివరించాలని అన్నారు. మహిళా సాధికారతలో ఏపీ మొదటి స్థానంలో ఉందని సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ చేయూత స్టోర్లలో శానిటరీ న్యాప్కిన్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చరిత్రను మార్చే శక్తి మహిళలకే ఉందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం తమదని సీఎం జగన్ తెలిపారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు చదువులకు దూరం కాకుండా చూడటమే లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్కిన్స్ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు చేపట్టింది. యూనిసెఫ్, వాష్, పీ అండ్ జీ తదితర సంస్థలతో కలసి అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమంపై అపోహలు తొలగించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూళ్లు, కాలేజీలలో న్యాప్కిన్స్ పంపిణీకి చర్యలు చేపట్టింది. -
బ్యాంకులు, కేంద్ర సంస్థలకు రఘురామ ఎగనామం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోసగించి 3 ఎఫ్ఐఆర్లు దాఖలైన కేసులో ఆ కంపెనీల డైరెక్టర్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ ఎంపీల సంతకాలతో కూడిన లేఖలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు పంపారు. తీవ్రమైన ఆర్థిక మోసాలకు పాల్పడిన ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని, పారిపోకుండా ప్రయాణాలపై నిషేధ ఉత్తర్వులివ్వాలని కోరారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఇండ్ భారత్ కంపెనీపై సీబీఐ మూడు కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఆ కంపెనీలు దురుద్దేశపూరితంగా బ్యాంకులను, ప్రభుత్వ రంగ సంస్థలను మోసగించిన తీరుకు ఈ మూడు ఎఫ్ఐఆర్లు రుజువని లేఖలో వివరించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సక్రమంగా లేదని, దీనివల్ల ప్రజలకు దర్యాప్తు సంస్థలపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దురుద్దేశాలను ఒప్పుకుంది.. ఇండ్–భారత్ లిమిటెడ్ 660 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును తమిళనాడులోని ట్యూటికొరిన్‌లో అభివృద్ధి చేసే ప్రతిపాదనతో ప్రభుత్వ సంస్థలు నిధులు సమకూర్చేలా ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అగ్రిమెంట్(టీఆర్ఏ) కుదుర్చుకుందని లేఖలో తెలిపారు. ఇండ్–భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, సంబంధిత కంపెనీలు ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థల నుంచి పెట్టుబడి రూపంలో తెచ్చిన మొత్తాన్ని చూపి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.569.43 కోట్ల మేర రుణాన్ని తీసుకున్నాయని 2016లో పీఎఫ్సీకి సమాచారం అందిందన్నారు. 2016 మే 4న ఇండ్–భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ తన దురుద్దేశపూరిత చర్యలను అంగీకరించిందని, అప్పుగా తెచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్లను తాకట్టు పెట్టి స్వల్పకాలిక రుణాలు తెచ్చినట్టు ఒప్పుకుందని వివరించారు. ఈ మోసాలపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసిందని, ఎస్బీఐ కూడా ఫిర్యాదు చేసిందని వివరించారు. బ్యాంకు కన్సార్షియాన్ని ఇండ్–భారత్ మోసగించిందని ఫిర్యాదులో పేర్కొందన్నారు. విజయ్ మాల్యా తరహాలో విదేశాలకు పారిపోకుండా డైరెక్టర్లపై ప్రయాణ నిషేధ ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు. మోసగించిన సొమ్మును రికవరీ చేసి డైరెక్టర్లను, కంపెనీలను బాధ్యులను చేయాలన్నారు. కంపెనీల డైరెక్టర్లపై కస్టోడియల్ విచారణ జరపాలని కోరారు. రూ.941.71 కోట్ల ప్రజాధనం స్వాహా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌ల నుంచి ఇండ్–భారత్ పవర్(మద్రాస్), దాని మాతృసంస్థ ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం) లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్లు కె.రఘురామకృష్ణరాజు, మధుసూదన్‌రెడ్డి, వారి గ్రూప్ కంపెనీలు రూ.941.71 కోట్ల మేర ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు లేఖలో తెలిపారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఢిల్లీ పోలీస్ శాఖ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేసినా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఆ కంపెనీల డైరెక్టర్లు ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తెచ్చారు. -
ప్రభుత్వ సంస్థల్లో యోగా బ్రేక్
న్యూఢిల్లీ: వృత్తి నిపుణుల్లో పని ఒత్తిడిని తగ్గించడానికి రూపొందించిన 5 నిమిషాల యోగా విరామం (వై–బ్రేక్) త్వరలోనే ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో అమల్లోకి రానుంది. ఈ యోగా బ్రేక్‌లో 5 నిమిషాల్లో పూర్తి చేయగల కొన్ని తేలికైన వ్యాయామాలుంటాయి. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా విద్యాలయం, యోగా నిపుణుల సాయంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఈ వై–బ్రేక్ ప్రొటోకాల్ ట్రయల్స్‌ను సోమవారం ప్రారంభించింది. ఇందులో పాల్గొనడానికి టాటా కెమికల్స్, యాక్సిస్ బ్యాంక్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ తదితర 15 సంస్థలు ఆసక్తి చూపించాయని ఓ అధికారి తెలిపారు. ఈ వై–బ్రేక్ అనేది యోగా కోర్సు కాదని, కానీ కోర్సుకు సంక్షిప్త ప్రారంభ మాడ్యూల్ అని పేర్కొన్నారు. యోగా ప్రొటోకాల్స్ తయారీ ప్రక్రియ 3 నెలల క్రితమే తయారైందని తెలిపారు. వై–బ్రేక్ అభ్యాసంలో భాగంగా ఒక బుక్లెట్ తయారు చేశామని, పనిస్థలాల్లో ఎలా ఉండాలో దానికి సంబంధించిన స్థితులతో కూడిన వీడియో చిత్రాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. -
ఈబీసీలకు రిజర్వేషన్లు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో అగ్ర కుల పేదలకు రిజర్వేషన్లు అమలు చేయడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. అగ్ర కుల పేదలకూ అన్నిరంగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని రైతుబంధు ప్రారంభ కార్యక్రమంలో హామీనిచ్చిన నేపథ్యంలో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి రాజ్యాంగపరంగా ఉన్న సమస్యలేమిటనే దానిపై లోతుగా అధ్యయనం చేయాలని న్యాయనిపుణులకు సూచించినట్లుగా సమాచారం. విద్యాసంస్థల్లో అమలు... అగ్రకుల పేదలకు తొలుత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని అగ్రకుల పేదలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని, చాలా మంది అగ్ర కుల కుటుంబాలు కూలి పనులకు వెళ్తున్నాయని సీఎం దృష్టికి వచ్చింది. కూలి పనులకు వెళ్తున్న పేదలు ఏ కులం వారైనా ప్రభుత్వ విద్యావకాశాలను పొందితే తప్పేమిటనే యోచనలో ఆయన ఉన్నట్లుగా సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ గురుకులాలు, ప్రభుత్వ కాలేజీల్లో అగ్ర కుల పేదలకు రిజర్వేషన్లు అమలుచేస్తూ నిర్ణయం తీసుకోవాలనే యోచనకు ముఖ్యమంత్రి వచ్చినట్లు, త్వరలోనే జీఓ ద్వారా ఈ మేరకు రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు కేసీఆర్ సన్నిహితుడొకరు చెప్పారు. పూర్తి రిజర్వేషన్లు ఎలా... అగ్రకుల పేదలకు అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయడంపైనా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి, ఇప్పుడున్న రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను అమలు చేస్తే అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుందని కొందరు న్యాయనిపుణులు కేసీఆర్‌కు సూచించినట్లుగా సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో క్రీమీలేయర్ అమలు ద్వారా అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశాలపై లోతుగా అధ్యయనం జరుపుతున్నట్టుగా పార్టీ నేతలు వెల్లడించారు. జూన్‌లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అగ్రకుల పేదలకు రిజర్వేషన్లతోపాటు పంచాయతీరాజ్ చట్టానికి సవరణపైనా ఆమోదించే అవకాశాలున్నాయని సమాచారం. -
ఈజీగానే ఎంసెట్!
ఇంజనీరింగ్‌కు 92 శాతం.. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 88.02 శాతం హాజరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇంజనీరింగ్ పరీక్షకు అత్యధికంగా 92.34 శాతం మంది విద్యార్థులు హాజరు కాగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 88.02 శాతం మంది హాజరయ్యారు. నిమిషం నిబంధ న కారణంగా కొందరు పరీక్షకు దూరమయ్యారు. మొత్తమ్మీద ఈసారి ఎంసెట్ ఈజీగానే ఉందని విద్యార్థులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ పరీక్షకు మొత్తం 1,44,510 మంది దరఖాస్తు చేసుకోగా 1,33,442 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 1,02,012 మంది దరఖాస్తు చేసుకోగా 89,792 మంది హాజరయ్యారు. ఈసారి ఇంజనీరింగ్ కంటే అగ్రికల్చర్ మెడికల్‌లోనే ఎక్కువ మంది గైర్హాజరవడం గమనార్హం. కాగా, ఇంజనీరింగ్ పరీక్షకు సెట్‌కోడ్ ‘క్యూ’ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎంపిక చేయగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు సెట్‌కోడ్ ‘ఎస్’ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఎంపిక చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన 470 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులందరి బయో మెట్రిక్ డాటాను (వేలి ముద్రలు, డిజిటల్ ఫొటోలు) సేకరించారు. సులభంగా ప్రశ్నలు ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షలో ప్రశ్నలు గతేడాది కంటే ఈసారి సులభంగా వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌తో పోల్చినా సులభంగానే ఉందని నిపుణులు పేర్కొన్నారు. కొంతమంది విద్యార్థులైతే 160కి 160 మార్కులు పొందే వీలు ఉందని అంచనా వేశారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, జువాలజీలో డెరైక్ట్ ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయని, దీంతో విద్యార్థులు ఎక్కువ మార్కులను స్కోర్ చేసే వీలు ఏర్పడిందని పేర్కొంటున్నారు. గణితంలో యావరేజ్‌గా చాలా మందికి 55 నుంచి 60 మార్కులు వచ్చే వీలుందన్నారు. ప్రతిభావంతులైతే 80కి 80 మార్కులు సాధిస్తారంటున్నారు. మ్యాథ్స్‌లో ఆరు ప్రశ్నలు, కెమిస్ట్రీలో ఆరు ప్రశ్నలు కాస్త కఠినంగా వచ్చాయని నిపుణులు వెల్లడించారు. గతేడాది ఈ రెండు సబ్జెక్టుల్లో 20 ప్రశ్నల వరకు ఎక్కువ సమయం తీసుకునేవి వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రశ్నల్లో ఎక్కడా తప్పులు లేకపోయినా గణితంలో ‘బీ’ కోడ్ ప్రశ్నపత్రంలో 65వ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో జవాబు లేదని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. అదే బీ కోడ్ ప్రశ్నపత్రంలోని 62 ప్రశ్నకు (సీ కోడ్‌లో 16వ ప్రశ్న) ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో రెండు సరైన జవాబులున్న ఆప్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక కెమిస్ట్రీలో బీ కోడ్ ప్రశ్నపత్రంలోని 136వ ప్రశ్నకు (సీ కోడ్‌లో 125 ప్రశ్న) ఇచ్చిన ఆప్షన్లలో మూడు సరైన సమాధానాలు ఉన్నవే ఇచ్చినట్లు వివరించారు. భవిష్యత్తులో ఆన్‌లైన్‌వైపే మొగ్గు రాష్ట్రంలో మొదటిసారిగా ఆన్లైన్లో పరీక్ష నిర్వహించేందుకు చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు వెల్లడించారు. భవిష్యత్తులో ఇక అన్ని ఆన్లైన్ పరీక్షలే ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పరీక్ష కేంద్రంలో వర్షం కారణంగా షార్ట్ సర్క్యూట్ సమస్య తలెత్తింది. దీంతో జనరేటర్ పనిచేయకపోవడంతో 36 మంది విద్యార్థులు ఆన్లైన్లో పరీక్ష రాయలేకపోయారు. అయితే వారికి వెంటనే ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించినట్లు రమణరావు తెలిపారు. ఉస్మానియాలో 154 మందికి 6 ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆన్లైన్ సమస్య తలెత్తితే వెంటనే ఆఫ్‌లైన్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ముందే చేసినట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఆన్లైన్ పరీక్ష రాసేందుకు 534 మంది దరఖాస్తు చేయగా.. పరీక్షకు 444 మంది హాజరయ్యారు. కొందరు విద్యార్థులు కొన్ని పరీక్ష కే ంద్రాల్లో పాత హాల్‌టికెట్లతో వచ్చినా వారికి బఫర్ ఓఎంఆర్ జవాబు పత్రం ఇచ్చి పరీక్షకు అనుమతించారు. మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, ఎలాంటి తప్పులు దొర్లలేదని వెల్లడించారు. ‘కీ’పై 18 వరకు అభ్యంతరాల స్వీకరణ ప్రాథమిక కీని ఎంసెట్ వెబ్సైట్ www.tseamcet.inలో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వాటిపై తమ అభ్యంతరాలను ఈ నెల 18 వరకు ఇ-మెయిల్ www.tseamcet.in ద్వారా పంపించవచ్చని ఎంసెట్ కన్వీనర్ వివరించారు. ఏపీ కేంద్రాల్లో తక్కువ హాజరు టీఎంసెట్ కోసం ఏపీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో తెలంగాణతో పోలిస్తే హాజరు శాతం తక్కువగా నమోదైంది. కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఇంజనీరింగ్ పరీక్షకు 18,047 మంది దరఖాస్తు చేసుకోగా.. 13,074 మంది (72.44 శాతం) హాజరయ్యారు. 4,973 మంది గైర్హాజరయ్యారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 27,029 మంది దరఖాస్తు చేయగా.. 21,301 మంది (78.80 శాతం) హాజరయ్యారు. 20న ఎంసెట్ ర్యాంకులు! ఎంసెట్ ర్యాంకులను ఈ నెల 20న విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంసెట్ కమిటీ దృష్టి సారించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాల పరిశీలన, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకులను 19న ఖరారు చేయాలని భావిస్తోంది. 19న ఆ పనులు పూర్తయితే 20న ర్యాంకులను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ ఆలస్యమైతే 21, 22 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ కేంద్రాల్లో పక్కాగా పరీక్ష ప్రభుత్వ విద్యా సంస్థలు, శిక్షణ సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఎంసెట్‌ను పక్కాగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. మొదటిసారిగా కేవలం ప్రభుత్వ సంస్థల్లోనే 470 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే విద్యార్థులు పరీక్ష కేంద్రాలను వెతుక్కోవడంలో అక్కడక్కడా కొంత ఇబ్బంది పడ్డారు. ఎంసెట్ కమిటీ అధికారులు పరీక్షలకు ముందురోజు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లు శనివారం కురిసిన వర్షం, గాలి కారణంగా కొట్టుకుపోయాయి. హైదరాబాద్‌లో పలు పరీక్ష కేంద్రాల వద్ద వర్షపు నీరు నిలవడం, వైర్లు తెగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెస్ట్‌మారేడుపల్లిలోని ప్రభుత్వ ఎలక్ట్రానిక్ కాలేజీలో వైర్లు తెగి పడడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడి ంది. నిమిషం నిబంధనతో కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు, నిజాం కాలే జీలో ఇద్దరు అభ్యర్థులను అధికారులు పరీక్షకు అనుమతించలేదు.