
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో అగ్ర కుల పేదలకు రిజర్వేషన్లు అమలు చేయడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. అగ్ర కుల పేదలకూ అన్నిరంగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని రైతుబంధు ప్రారంభ కార్యక్రమంలో హామీనిచ్చిన నేపథ్యంలో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి రాజ్యాంగపరంగా ఉన్న సమస్యలేమిటనే దానిపై లోతుగా అధ్యయనం చేయాలని న్యాయనిపుణులకు సూచించినట్లుగా సమాచారం.
విద్యాసంస్థల్లో అమలు...
అగ్రకుల పేదలకు తొలుత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని అగ్రకుల పేదలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని, చాలా మంది అగ్ర కుల కుటుంబాలు కూలి పనులకు వెళ్తున్నాయని సీఎం దృష్టికి వచ్చింది. కూలి పనులకు వెళ్తున్న పేదలు ఏ కులం వారైనా ప్రభుత్వ విద్యావకాశాలను పొందితే తప్పేమిటనే యోచనలో ఆయన ఉన్నట్లుగా సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ గురుకులాలు, ప్రభుత్వ కాలేజీల్లో అగ్ర కుల పేదలకు రిజర్వేషన్లు అమలుచేస్తూ నిర్ణయం తీసుకోవాలనే యోచనకు ముఖ్యమంత్రి వచ్చినట్లు, త్వరలోనే జీఓ ద్వారా ఈ మేరకు రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు కేసీఆర్ సన్నిహితుడొకరు చెప్పారు.
పూర్తి రిజర్వేషన్లు ఎలా...
అగ్రకుల పేదలకు అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయడంపైనా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లుగా టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి, ఇప్పుడున్న రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను అమలు చేస్తే అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుందని కొందరు న్యాయనిపుణులు కేసీఆర్‌కు సూచించినట్లుగా సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో క్రీమీలేయర్ అమలు ద్వారా అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశాలపై లోతుగా అధ్యయనం జరుపుతున్నట్టుగా పార్టీ నేతలు వెల్లడించారు. జూన్‌లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అగ్రకుల పేదలకు రిజర్వేషన్లతోపాటు పంచాయతీరాజ్ చట్టానికి సవరణపైనా ఆమోదించే అవకాశాలున్నాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment