
తిరుమలరావు కరుకోల, సాక్షి, విజయవాడ
కోరుకున్న కొలువులో కుదురుకోవాలనుకునే యువతకు ఆ గ్రంథాలయమే కోచింగ్ సెంటర్. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆలంబనగా ఉంటున్న ఆ గ్రంథాలయం వేలాదిమంది యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోను, ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగులుగా ఎంపికయ్యేందుకు బాటలు వేస్తోంది. అందుకే ఆ గ్రంథాలయాన్ని నిరుద్యోగుల కోచింగ్ సెంటర్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఆ విజ్ఞాన నిలయమే విజయవాడలోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం(Rabindranath Tagore Memorial Library).
రెండు పత్రికలతో ప్రారంభం
గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం 1955లో విజయవాడ గాంధీనగర్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రారంభమైంది. రెండు దినపత్రికలు, మూడు మాసపత్రికలతో మొదలైన ఈ గ్రంథాలయం రవీంద్రనాథ్ ఠాగూర్ శత జయంతి ఉత్సవాల నాటికి ఠాగూర్ స్మారక గ్రంథాలయంగా రూపాంతరం చెందింది. పీడబ్ల్యూడీ విభాగం ఈ గ్రంథాలయానికి స్థలం కేటాయించింది. నిధుల కొరతతో సకాలంలో నిర్మాణం చేపట్టలేకపోయారు.
ఈ దశలో దీనికి కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. అయితే, అప్పటి మంత్రి కాకాని వెంకటరత్నం సాహితీ అభిమాని కావడంతో ఆ స్థలం గ్రంథాలయ సంస్థకు దక్కేలా చొరవ తీసుకున్నారు. అందువల్ల ఆయన గౌరవార్థం ఇక్కడి భవనానికి కాకాని పౌర గ్రంథాలయంగా నామకరణం చేశారు. అయితే, అధికారికంగా ఠాగూర్ స్మారక గ్రంథాలయంగానే ప్రభుత్వ రికార్డుల్లో ఉంది.
కోచింగ్ కేంద్రాన్ని తలపించే వాతావరణం
విశాలమైన గదులు, విడివిడిగా క్యాబిన్లు, పుస్తకాలు, మాగజీన్లతో కళకళలాడే ర్యాకులు వంటి సౌకర్యాలతో పాటు ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం సొంతం. ఈ గ్రంథాలయంలోని స్టడీ హాళ్లు, ఆరుబయట వరండాలు పుస్తకాలతో కుస్తీపడుతున్న నిరుద్యోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. భారీ ఫీజులు చెల్లించి, కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.
సివిల్స్, గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే తదితర పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువత ఇక్కడ అందుబాటులో ఉండే పుస్తకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే మెటీరియల్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా గ్రంథాలయ సిబ్బంది ఇతోధికంగా సహకరిస్తున్నారు. ఈ గ్రంథాలయంలో కంప్యూటర్లను, ఉచిత వైఫైని కూడా ఏర్పాటు చేశారు. కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ వాడుకోవడానికి గంటకు ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు.
నాటి దినపత్రికలు.. అరలక్షకు పైగా పుస్తకాలు
ఈ గ్రంథాలయంలో 1976 నాటి నుంచి నేటి వరకు తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలను భద్రంగా బైండ్ చేసి, అందుబాటులో ఉంచారు. దాతల నుంచి సేకరించిన వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు సహా ఇక్కడ యాభైవేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ దొరికే అరుదైన పుస్తకాల్లో 1990 వరకు ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ గెజిట్ ప్రతులు, 1670–1926 వరకు మద్రాస్ సెయింట్ జార్జ్ నివేదికలు కూడా ఉండటం విశేషం.
రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన పలువురు పీహెచ్‌డీ స్కాలర్లు సైతం తమకు అవసరమైన సమాచారం కోసం ఇక్కడకు వస్తుంటారు. ఈ గ్రంథాలయంలో వివిధ పుస్తక విభాగాలతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం ప్రత్యేకమైన గది, సమావేశ మందిరం కూడా ఉన్నాయి. ఈ సమావేశ మందిరంలో తరచు సాహితీ కళా సాంస్కృతిక సమావేశాలు, ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఇక్కడకు పఠనాభిలాష గల గృహిణులు కూడా ఎక్కువగా వస్తుంటారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకునే స్తోమత లేనివారంతా ఇక్కడి సౌకర్యాల పట్ల అమితానందం వ్యక్తం చేస్తున్నారు.
విజేతలకు సన్మానం
గత రెండు దశాబ్దాల్లో ఈ గ్రంథాలయంలో చదువుకున్న ఎందరో పోటీ పరీక్షల్లో విజయం సాధించి, ఉద్యోగాలు సంపాదించు కున్నారు. ఇక్కడ చదువుకుని, పోటీ పరీక్షల్లో విజయం సాధించిన వారిని కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సన్మానిస్తోంది. ఠాగూర్ గ్రంథాలయం తమలాంటి వారి పాలిట దేవాలయమని నిరుద్యోగులు అభివర్ణిస్తున్నారు. ఎందరో నిరుద్యోగుల కలలను నిజం చేస్తున్న ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రస్థానం మరిన్ని వసంతాల పాటు విరాజిల్లాలని ఆశిద్దాం.
చొరవ అవసరం
దాదాపు ఏడు దశాబ్దాల నాటి ఈ గ్రంథాలయ భవనాల ఆధునికీకరణపై దృష్టి సారించాలి. పెరుగుతున్న విద్యార్థుల తాకిడికి అనుగుణంగా కొత్త గదుల నిర్మాణం చేపట్టాలి. పోటీ పరీక్షార్థులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, బల్లలను ఏర్పాటు చేయాలి. ఈ పనులకు ప్రభుత్వ సçహకారంతో పాటు దాతల చొరవ ఎంతో అవసరం. – రవికుమార్, జిల్లా గ్రంథాలయాల కార్యదర్శి, రమాదేవి, నిర్వాహకురాలు
Comments
Please login to add a commentAdd a comment