Rabindranath Tagore
-
ఆ గ్రంథాలయం... కోచింగ్ కేంద్రం
తిరుమలరావు కరుకోల, సాక్షి, విజయవాడ కోరుకున్న కొలువులో కుదురుకోవాలనుకునే యువతకు ఆ గ్రంథాలయమే కోచింగ్ సెంటర్. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆలంబనగా ఉంటున్న ఆ గ్రంథాలయం వేలాదిమంది యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోను, ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగులుగా ఎంపికయ్యేందుకు బాటలు వేస్తోంది. అందుకే ఆ గ్రంథాలయాన్ని నిరుద్యోగుల కోచింగ్ సెంటర్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఆ విజ్ఞాన నిలయమే విజయవాడలోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం(Rabindranath Tagore Memorial Library).రెండు పత్రికలతో ప్రారంభంగ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం 1955లో విజయవాడ గాంధీనగర్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రారంభమైంది. రెండు దినపత్రికలు, మూడు మాసపత్రికలతో మొదలైన ఈ గ్రంథాలయం రవీంద్రనాథ్ ఠాగూర్ శత జయంతి ఉత్సవాల నాటికి ఠాగూర్ స్మారక గ్రంథాలయంగా రూపాంతరం చెందింది. పీడబ్ల్యూడీ విభాగం ఈ గ్రంథాలయానికి స్థలం కేటాయించింది. నిధుల కొరతతో సకాలంలో నిర్మాణం చేపట్టలేకపోయారు.ఈ దశలో దీనికి కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. అయితే, అప్పటి మంత్రి కాకాని వెంకటరత్నం సాహితీ అభిమాని కావడంతో ఆ స్థలం గ్రంథాలయ సంస్థకు దక్కేలా చొరవ తీసుకున్నారు. అందువల్ల ఆయన గౌరవార్థం ఇక్కడి భవనానికి కాకాని పౌర గ్రంథాలయంగా నామకరణం చేశారు. అయితే, అధికారికంగా ఠాగూర్ స్మారక గ్రంథాలయంగానే ప్రభుత్వ రికార్డుల్లో ఉంది.కోచింగ్ కేంద్రాన్ని తలపించే వాతావరణంవిశాలమైన గదులు, విడివిడిగా క్యాబిన్లు, పుస్తకాలు, మాగజీన్లతో కళకళలాడే ర్యాకులు వంటి సౌకర్యాలతో పాటు ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం సొంతం. ఈ గ్రంథాలయంలోని స్టడీ హాళ్లు, ఆరుబయట వరండాలు పుస్తకాలతో కుస్తీపడుతున్న నిరుద్యోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. భారీ ఫీజులు చెల్లించి, కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.సివిల్స్, గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే తదితర పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువత ఇక్కడ అందుబాటులో ఉండే పుస్తకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే మెటీరియల్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా గ్రంథాలయ సిబ్బంది ఇతోధికంగా సహకరిస్తున్నారు. ఈ గ్రంథాలయంలో కంప్యూటర్లను, ఉచిత వైఫైని కూడా ఏర్పాటు చేశారు. కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ వాడుకోవడానికి గంటకు ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు.నాటి దినపత్రికలు.. అరలక్షకు పైగా పుస్తకాలు ఈ గ్రంథాలయంలో 1976 నాటి నుంచి నేటి వరకు తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలను భద్రంగా బైండ్ చేసి, అందుబాటులో ఉంచారు. దాతల నుంచి సేకరించిన వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు సహా ఇక్కడ యాభైవేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ దొరికే అరుదైన పుస్తకాల్లో 1990 వరకు ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ గెజిట్ ప్రతులు, 1670–1926 వరకు మద్రాస్ సెయింట్ జార్జ్ నివేదికలు కూడా ఉండటం విశేషం.రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన పలువురు పీహెచ్డీ స్కాలర్లు సైతం తమకు అవసరమైన సమాచారం కోసం ఇక్కడకు వస్తుంటారు. ఈ గ్రంథాలయంలో వివిధ పుస్తక విభాగాలతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం ప్రత్యేకమైన గది, సమావేశ మందిరం కూడా ఉన్నాయి. ఈ సమావేశ మందిరంలో తరచు సాహితీ కళా సాంస్కృతిక సమావేశాలు, ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఇక్కడకు పఠనాభిలాష గల గృహిణులు కూడా ఎక్కువగా వస్తుంటారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకునే స్తోమత లేనివారంతా ఇక్కడి సౌకర్యాల పట్ల అమితానందం వ్యక్తం చేస్తున్నారు.విజేతలకు సన్మానం గత రెండు దశాబ్దాల్లో ఈ గ్రంథాలయంలో చదువుకున్న ఎందరో పోటీ పరీక్షల్లో విజయం సాధించి, ఉద్యోగాలు సంపాదించు కున్నారు. ఇక్కడ చదువుకుని, పోటీ పరీక్షల్లో విజయం సాధించిన వారిని కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సన్మానిస్తోంది. ఠాగూర్ గ్రంథాలయం తమలాంటి వారి పాలిట దేవాలయమని నిరుద్యోగులు అభివర్ణిస్తున్నారు. ఎందరో నిరుద్యోగుల కలలను నిజం చేస్తున్న ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రస్థానం మరిన్ని వసంతాల పాటు విరాజిల్లాలని ఆశిద్దాం. చొరవ అవసరం దాదాపు ఏడు దశాబ్దాల నాటి ఈ గ్రంథాలయ భవనాల ఆధునికీకరణపై దృష్టి సారించాలి. పెరుగుతున్న విద్యార్థుల తాకిడికి అనుగుణంగా కొత్త గదుల నిర్మాణం చేపట్టాలి. పోటీ పరీక్షార్థులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, బల్లలను ఏర్పాటు చేయాలి. ఈ పనులకు ప్రభుత్వ సçహకారంతో పాటు దాతల చొరవ ఎంతో అవసరం. – రవికుమార్, జిల్లా గ్రంథాలయాల కార్యదర్శి, రమాదేవి, నిర్వాహకురాలు -
నెహ్రూ ఆత్మకథకు పొంగిపోయిన రవీంద్రుడు
జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రో ద్యమంలో పాల్గొని జైలు జీవితం గడుపుతున్న దశలో 1934–35 మధ్య కాలంలో తన ఆత్మకథ (టువార్డ్ ఫ్రీడమ్) రాసుకున్నారు. బానిస సంకెళ్లు తెంచుకుని, దేశం స్వేచ్ఛ కోసం తపిస్తున్న దశలో తన అనుభవాల్ని నమోదు చేసుకున్నారు. నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య కమలా నెహ్రూ అనారోగ్యంతో మంచానపడి ఉన్నారు. కూతురు ఇందిర చిన్నపిల్ల. ఆమె ఆలనాపాలనా చూసేవారు ఎవరూ లేకపోవడం వల్ల, తరచూ రవీంద్రుడి శాంతినికేతన్‌కు పంపు తుండేవారు. అందరినీ, అన్నింటినీ ప్రేమగా చూసే లక్షణం ఆ బాలికలో ఉందని గ్రహించి రవీంద్రనాథ్ టాగూర్ ఆమెను ‘ప్రియదర్శిని’ అన్నారు. అప్పటి నుండి ఆమె ఇందిరా ప్రియ దర్శిని అయ్యింది. పండిట్ నెహ్రూకు సాహిత్యం, కళల పట్ల ఉన్న అవ్యా జమైన ప్రేమ జగద్విదితం. ఆయన ఆత్మకథను చదివి ‘విశ్వ కవి’ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉత్తరం రాశారు. 1936 మే 31న శాంతినికేతన్ నుండి రవీంద్రుడు రాసిన ఉత్తరం ఇలా ఉంది: ‘‘ప్రియమైన జవహర్లాల్! మీ పుస్తకం చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. నిజంగా అది చాలా గొప్ప పుస్తకం. చదువుతూ ఎంతో చలించిపోయాను. మీరు సాధించిన విజయాలు తెలుసుకుని గర్వపడుతున్నాను. అన్నింటినీ మించి అట్టడుగున ప్రవహించే లోతైన మీ మానవత్వపు దృక్కోణం, సంక్లిష్టమైన చిక్కుముడులనన్నింటినీ విప్పుతూ ఉంది. వాస్తవాల్ని నిబ్బరంగా బహిర్గతం చేస్తూ ఉంది. ఇంతవరకూ సాధించిన విజయాలకు మించిన మహో న్నతమైన వ్యక్తిత్వం మీది – అనే విషయం తెలిసిపోతూ ఉంది. సమకాలీన స్థితిగతుల నుంచి నిజాయతీ అయిన ఒక నిఖార్స యిన మీ వ్యక్తిత్వం గోచరిస్తూ ఉంది.’’ సాహిత్యకారుడు అయిన నెహ్రూకు, అమృతా షేర్గిల్, సరోజినీ నాయుడు, ఫ్రెంచ్ సాహిత్యకారుడు రోమా రోలా వంటి దిగ్గజాల నుండి ఉత్తరాలు వస్తుండేవి. ఆ రోజుల్లో లేఖలు రాయడం కూడా ఒక కళగా పరిగణింపబడుతూ ఉండేది. జైలు నుండి నెహ్రూజీ తన కూతురికి రాసిన ఉత్తరాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ఆ ఉత్తరాల్లో సాహిత్య, సామాజిక, చారి త్రక, స్వాతంత్య్రోద్యమ అంశాలు; దేశ, కాల పరిస్థితుల గురించి చర్చించారు. తరువాత కాలంలో ఆ లేఖలన్నీ పుస్తక రూపంలో వెలువడ్డాయి. పిల్లల పట్ల ఆయనకు గల ప్రత్యే కమైన శ్రద్ధ, ప్రేమల వల్ల ఎన్నో సంస్థలకు, ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. చాచా నెహ్రూగా శాశ్వతత్వం పొందారు. అందుకే ఆయన పుట్టినరోజు 14 నవంబర్‌ను పిల్లల దినంగా జరుపుకొంటున్నాం. జాతీయ సంస్థల్ని ప్రారంభించి నిలబెట్టింది నెహ్రూజీ అయితే, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసింది మోదీజీ. తొలి ప్రధాని నుండి ఇటీవలి కాలం వరకు ఏ ప్రధానీ చేయని ‘ఘన’మైన పనులు ఇప్పటి ప్రధాని చేశారు. పటేల్ విగ్రహం నెలకొల్పారు. దాన్ని ఐక్యతా విగ్రహం అన్నారు. బావుంది. ప్రారంభోత్సవ సభలో నేటి హోంమంత్రి కనబడలేదు. విగ్రహం తొలి హోంమంత్రిది కదా? పైగా వేల సంఖ్యలో మత గురువుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అసలది మతానికేం సంబంధం? ఏమీ మాట్లాడలేక వారసత్వ పాలనకు నెహ్రూయే కారణమని నిందిస్తారు. ఆయన మరణానంతరం జరిగిన సంఘటనలకు నెహ్రూ ఎలా బాధ్యులవుతారు? ఆ రోజుల్లో ఆసేతు హిమాచలం స్వాతంత్య్ర సమర యోధులు లక్షలమంది ఉండి ఉంటారు. వారందరిలోకి నాయ కత్వ లక్షణాలు, చురుకుదనం, విశాల భావాలు, అభ్యుదయ ధోరణి, విదేశాంగ విధానాల మీద పట్టు, చదువు, సంస్కారం అన్నీ పుణికిపుచ్చుకుని ఉన్నారు గనుక నెహ్రూ తొలి ప్రధాని కాగలిగారు. సుదీర్ఘ కాలం ఆ పదవిలో మనగలిగారు. మనిషిలో ఎంతో సంయమనం ఉంటేగానీ అలా నిలబడలేరు. ధనం, స్థాయి, స్థోమత ఏమీ లేనివాడు త్యాగం చేయడానికి ఏముం టుంది? కానీ, నెహ్రూజీకి ఇవన్నీ ఉండి కూడా అన్నింటినీ త్యజించి, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం గొప్ప. పైగా కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడై ఉండి, నిరీశ్వరవాది కావడం అంతకన్నా గొప్ప! డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త రచయిత, సామాజికాంశాల వ్యాఖ్యాత -
మహోజ్వల భారతి: జాతీయోద్యమ కవియోధుడు
రవీంద్రనాథ్ టాగూర్ స్వాతంత్య్ర సమరయోధులు కూడా అయినప్పటికీ ఆయన ‘విశ్వ కవి’గా మాత్రమే గుర్తింపు పొందారు. తొలి నుంచీ ఆయన జాతీయ భావాలున్నవారు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడారు. పృథ్వీరాజు పరాజయం గురించి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించారు. బ్రిటిష్ ప్రభుత్వం తిలక్‌ను నిర్భంధించినపుడు ప్రభుత్వాన్ని రాగూర్ తీవ్రంగా విమర్శించారు. బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో కూడా టాగూర్ పాత్ర తక్కువేమీ కాదు. జాతీయ నిధి కోసం ఆయన జోలె పట్టి విరాళాలు వసూలు చేశారు. 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో.. బంకిం చంద్ర చటర్జీ ‘వందేమాతరం’ గీతాన్ని మొట్టమొదటిగా తనే ఆలపించారు టాగూర్. ఆయన రాసిన ‘జనగణమణ’ ను జాతీయగీతంగా ప్రకటించేముందు ‘వందేమాతరం’, ‘జనగణమన’ లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి ‘జనగణమన’ దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న ‘జనగణమన’ ను జాతీయగీతంగా, వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించారు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేశారు. ‘గీతాంజలి’ రవీంద్రునికి కవిగా ప్రపంచఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ కావ్యంలోని.. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్.. గీతం మహాత్మాగాంధీకి ఇష్టమైనది. తన జీవితంపై రవీంద్రుని ప్రభావమెంతో ఉన్నదని జవహర్లాల్ నెహ్రూ కూడా స్వయంగా చెప్పుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు టాగూర్ మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురి అయ్యారు. చికిత్స వల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. 1941 ఆగస్టు 7న తన 80 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. క్విట్ ఇండియా కార్యకర్త ఎం.ఎస్. గురుపాదస్వామి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కార్యకర్త. రాజకీయ నేత. రెండుసార్లు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. నేడు ఆయన జయంతి. 1924 ఆగస్టు 7న మైసూరు జిల్లాలోని మలంగిలో జన్మించాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సమయంలో అఖిల భారత విద్యార్థుల సమాఖ్యలో సభ్యుడిగా ఉన్నాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలో చేరారు. తర్వాత కాంగ్రెస్, జనతా, జనతాదళ్ పార్టీలకు మారారు. -
కాలాతీత సృజనశీలి: రవీంద్రనాథ్ టాగూర్ (1861–1941)
రవీంద్రనాథ్ టాగూర్‌ను తెలుసుకునేందుకు ఒకప్పుడు నేను గొప్ప వారైన ఇతర కవులతో ఆయనను పోల్చి చూడటం ప్రారంభించాను. హోమర్, విర్జిల్ డాంటే, మిల్టన్ లాంటి కవుల రచనలు మళ్లీ చదివాను. అలాగే శాంతినికేతన్ పేరిట సంపుటాలుగా వెలువడ్డ టాగూర్ ఉపన్యాస గ్రంథావళిని మరొకసారి చదవడం మొదలుపెట్టాను. చివరకు నా ప్రశ్నకు జవాబు దొరికింది. డాంటే కన్నా టాగూర్ గొప్పవాడా అంటే, అవును గొప్పవాడే! కాలగతిలో నిలిచే 20 మంది మహోన్నత రచయితల్లో టాగూర్ ఒకరని ప్రముఖ రచయిత నీరద్ సి. చౌధురి అన్న మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. టాగూర్‌ను అంత ఉన్నతస్థానంలో కూర్చోబెట్టడానికి అనేక కారణాలున్నాయి. భాష మీద ఆయనకున్న పట్టు అసాధారణం. ఆయన కలం నుంచి ప్రతి వాక్యం హాయిగా సాగిపోతుంది. ఆయన కేవలం కవే కాదు. నవలా రచయిత, అత్యుత్తమ కథానికలు రాసిన వ్యక్తి. పాటలకు బాణీలు కట్టడంలో దిట్ట. మంచి చిత్రకారుడు, విద్యావేత్త. అంతేకాకుండా, జన వ్యవహారాలలో మునిగి తేలిన వ్యక్తి. స్వతంత్ర భారతావనిని తీర్చిదిద్దిన మనిషి. ‘‘పరిమితమైన దానితో అపరిమితమైన దానిని అందుకోవడం వల్ల కలిగే సంతోషం మీదే నా రచనలన్నీ సాగాయి’’ అని టాగూర్ చెప్పుకున్నారు. చాలామంది లాగా ఆయన ఎప్పుడూ తన దృష్టిని స్వర్గానికో, నరకానికో మాత్రమే పరిమితం చేయలేదు. ఆయన తన రచనల్లోని అతి గొప్ప పాటల్లో ఒక దానిలో ‘అఛే దుఖో, అఛే మృత్యు, విరహదహన్ లగే / తబువో శాంతి, తబు ఆనంద, తబు అనంత జాగే (దుఃఖం ఉంది. మరణమూ ఉంది. విరహమనే అగ్ని కూడా ఉంది. అయితే శాంతి, ఆనందం, శాశ్వతత్వం మేల్కొను గాక)’’ అని రాశారు. ఆయన గురించి నిర్వచించే అంశాలన్నీ ఈ చైతన్యంలో నుంచి పొటమరించినవే! ఆయన కరుణ, ఆయన సామాజిక క్రియాశీలత, సహజ వాతావరణం పట్ల ఆయన అక్కర; స్త్రీలు, పిల్లలతో ఆయనకున్న సాన్నిహిత్యం లాంటివన్నీ ఆయనను ఇప్పటికీ లెక్కించాల్సిన వ్యక్తిని చేస్తున్నాయి. బెంగాలీలు చెప్పింది సరైన మాటే! టాగూర్ ‘విశ్వకవి’. బెంగాలీల ఆలోచనలను కూడా అధిగమించి టాగూర్ ఎదిగారని భావిస్తున్నాను. – విలియమ్ ర్యాడిస్, బెంగాలీ సాహితీ పండితులు, టాగూర్ రచనల అనువాదకులు -
జైహింద్ స్పెషల్: జాతీయ గీతానికి ‘మదన’పల్లె రాగం
గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ (1861–1941) బెంగాలీ భాషలో రచించిన ‘జనగణమన’ గీతాన్ని మదనపల్లెలో ఇంగ్లీష్ లోకి అనువదించారనీ, అక్కడే ఆ గీతానికి రాగాలు కట్టారని చరిత్ర చెబుతోంది! ఏమిటి మదనపల్లెకు, ఠాగూరు గీతానికి సంబంధం? కేవలం 52 సెకన్ల నిడివి గల ‘జనగణమన’ గీతాన్ని స్వాతంత్య్రం పొందిన భారతదేశం 1950 జనవరి 24న జాతీయగీతంగా స్వీకరించింది. తొలి రిపబ్లిక్ దినోత్సవానికి రెండు రోజుల ముందు అన్నమాట! రాగానికి ముందే గానం కలకత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో 1911 డిసెంబర్ 27న తొలిసారి ఈ గీతాన్ని (ఓ పెద్ద సమావేశంలో) పాడారు. అంతకుముందు పాట సిద్ధమయ్యాక 1911 డిసెంబర్ 11న రిహార్సల్స్ చేసినప్పుడు పాడారు. తర్వాత 1912 జనవరిలో కలకత్తాలో జరిగిన బ్రహ్మ సమాజం ప్రార్థనా సమావేశంలో (మూడోసారి) పాడారు. అంతేకాక బ్రహ్మ సమాజం వారి తత్వబోధిని పత్రిక 1912 జనవరి సంచికలో ఈ గీతం అచ్చయ్యింది. ఠాగూరు మేనకోడలు సరళాదేవి చౌదరి 1912లో పాడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనలన్నీ కలకత్తాలోనే జరిగాయి. ఆ పాట బెంగాలీ భాషలో పాడబడింది. 1913లో సాహిత్యపు నోబెల్ బహుమతి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ రచనకు రావడం మరో విశేషం. ఇది భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే తొలి నోబెల్ బహుమతి! దక్షిణాదికి ‘దివ్యజ్ఞానం’ 1914లో బాలగంగాధర తిలక్ మహాశయుడు పూనా పట్టణంలో ‘హోమ్ రూల్ లీగ్’ ను స్థాపించి ఉద్యమంగా చేపట్టారు. అనిబిసెంట్ కు ఇది బాగా నచ్చింది. దక్షిణాదిలో ఇలాంటి ఉద్యమాన్ని అదే పేరుతో 1916లో ప్రారంభించారు. దీనికి ముందే అనిబిసెంట్ పూనికతో ‘దివ్యజ్ఞాన సమాజం’ మద్రాసులో ఏర్పడి, మంచి వనరులు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంతో 1915లో మదనపల్లెలో బీసెంట్ థియోసాఫికల్ కళాశాల (బి.టి.కాలేజి) స్థాపించారు. అంతకుముందు ఇండియన్ బాయ్స్ స్కౌట్ మూవ్మెంట్, నేషనల్ ఎడ్యుకేషన్ స్కీమ్ నిర్వహించి, ఆ ప్రాంతానికి కళాశాల అవసరమని భావించి, దివ్యజ్ఞాన సమాజం వారు మదనపల్లెలోనే ప్రారంభించారు. ధర్మవరం, మదనపల్లె, చిత్తూరు, చంద్రగిరి, కడప వంటిచోట్ల థియోసాఫికల్ సొసైటీ వారి లాడ్జిలు (కేంద్రాలు) ఏర్పడ్డాయి. మదనపల్లెకు ఠాగూర్ తెలుగు ప్రాంతాలలో హోమ్ రూల్ ఉద్యమం దివ్యజ్ఞాన సమాజం వ్యక్తుల చేయూతతో పుంజుకుంది. హోమ్ రూల్ ఉద్యమ వ్యాప్తికి ’ఆంధ్ర తిలక్’ గాడిచర్ల హరిసర్వోత్తమరావు చేసిన కృషి విశేషమైనది. బి.టి.కళాశాల విద్యార్థులు హోమ్ రూల్ ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలు వివిధ ప్రాంతాలలో అందజేసేవారు. బ్రిటిష్ వారికిది కంటగింపుగా తయారైంది. ఫలితంగా 1917 జూన్ 16న బి.పి. వాడియా, జి.ఎస్.ఆరండేల్ తో కలసి అనిబిసెంట్ ను అరెస్టు చేశారు. ఈ సమయంలో బి.టి. కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా సమావేశాలు నిర్వహించారు. ఇలాంటి సమావేశాలకు బి.టి. కళాశాల కేంద్ర బిందువు అయ్యింది. ఈ విషయాలను బ్రిటిషు ప్రభుత్వం గుర్తు పెట్టుకుంది. 1917 సెప్టెంబరులో అనిబిసెంట్, ఆమె సహచరులు కారాగారం నుంచి విముక్తులయ్యారు. కానీ, బి.టి. కళాశాలకు మద్రాసు విశ్వవిద్యాలయపు అనుబంధాన్ని రద్దు చేశారు. ఈ సమయంలో అనిబిసెంట్ విభిన్నంగా ఆలోచించి రవీంద్రనాథ్ ఠాగోర్ నిర్వహించే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా చేశారు. ఇదీ నేపథ్యం! కనుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెను సందర్శించారు. గురుదేవుని గీతాలాపన గురుదేవులు 1919లో మదనపల్లె వచ్చినపుడు బి.టి. కళాశాలలోని బిసెంట్ హాల్ లో ఫిబ్రవరి 28న ‘జనగణమన’ గీతాన్ని స్వయంగా పాడారు. ఆ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న మార్గరెట్ కజిన్ (Mrs Margaret Cousins) ఈ గీతాన్ని ఠాగూర్ సలహాల మేరకు పాశ్చాత్య బాణిలో రాగాలు రాశారు. మార్గరెట్ కజిన్స్ ఐరిష్ కవి డా. జేమ్స్ కజిన్స్ శ్రీమతి. ఈ సంగతులన్నీ డా. జేమ్స్ కజిన్స్ రాసిన ఆత్మకథ ‘వుయ్ టు టుగెదర్’ అనే గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి! అదే సమయంలో ఠాగూర్ ‘జనగణమన’ బెంగాలి గీతాన్ని ‘ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’గా తనే ఆంగ్లంలోకి అనువదించారు. 2018–19 సమయంలో మదనపల్లెలోని బి.టి. కళాశాలలో ఈ అపురూప సంఘటనలకు శత వార్షిక ఉత్సవాలు జరిగాయి. కానీ కలకత్తా వెలుపల మొట్టమొదటిసారి ‘జనగణమన’ గీతం పాడబడింది మదనపల్లెలోనే. ఈ రకంగా మదనపల్లె పట్టణానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ ఊరితో మన జాతీయ గీతానికి సంబంధించి ఇన్ని సందర్భాలు ముడిపడి ఉన్నాయి. భారత్‌కు ముందే బోస్! అప్పటికి ఈ గీతానికి పెద్ద ప్రాచుర్యం లేదు. 1935లో డెహ్రడూన్ స్కూల్ లో పాఠశాల గీతంగా స్వీకరించారు. సుభాష్ చంద్రబోస్ తన ఐఎన్ఏ సమావేశంలో 1942 సెప్టెంబరు 11న ఈ పాటను భారతదేశపు జాతీయ గీతంగా పాడించారు. 1945 లో ‘హమ్ రహి’ సినిమాలో తొలిసారిగా వాడారు. ఠాగూర్ 1941లో గతించారు, ఈ గీతానికి సంబంధించి ఏ వైభవాన్నీ వారు చూడలేదు! ‘జనగణమన’ గీతచరిత్రలో మదనపల్లె చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది! -డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
గోడలు కూలిపోయే రోజు కోసం...
ఇవాళ రవీంద్రుడి పుట్టిన రోజు. ఆయన ఎక్కడ పుట్టారో, ఎప్పుడు పుట్టారో సులభంగా మనం తెలుసుకునే అవకాశం ఉంది. కానీ రవీంద్రుడి సాహిత్యాన్నీ, ఆ సాహిత్యం ఇచ్చే సంస్కారాన్నీ తెలుసుకోవడం ఇప్పటి తరానికి ఎంతైనా అవసరం. రవీంద్రుడి బాల్యం చిత్రంగా గడిచింది. అతను నాలుగు గోడల్ని బద్దలు కొట్టడం నేర్చుకున్నారు. ప్రకృతిని గొప్ప పాఠశాలగా భావించారు. పరిశీలన, ప్రకృతితో మమేకం కావడం ద్వారా ఆయన జ్ఞానవంతుడయ్యారు. ‘ప్రపంచ రహస్యాన్ని’ తెలుసుకునే క్రమంలో విజయం సాధించారు. ప్రకృతిని ఆస్వాదించే హృదయాన్ని పొందిన టాగూర్, అక్కడినుండే సాహిత్యాన్ని సృష్టించడం మొదలు పెట్టారు. ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. సంస్కృత కావ్యాలు చదివారు. ఆంగ్ల సాహిత్యాన్ని పరిశీలించారు. బాల్యంలోనే ‘సంధ్యాగీత’ ప్రకటించారు. అది అందరి మన్ననలు పొందింది. రవీంద్రుని ప్రసిద్ధ గేయం ఊరకే అతని హృదయం నుండి రాలేదు. (Satyajit Ray: నవ్యచిత్ర వైతాళికుడు) ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో/ఎక్కడ మాన వుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో/ ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో/ ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో’’ అంటూ ఒక స్వేచ్ఛా స్వర్గంలోకి, తన దేశాన్ని మేలుకునేట్లు చేయమని ప్రార్థించారు. ఈ వాక్యాలు ఇప్పటికీ నెర వేరలేదు. రవీంద్రుడు విశ్వమానవ వాదాన్ని కోరుకున్నారు. పరిశుభ్ర ప్రపంచాన్ని ఆశించారు. ఆధునిక వచన కవితలో తన భావాల్ని పొందు పరిచారు. ‘గీతాంజలి’లో ఎంత గొప్ప కవిత్వం అందించారో వేరే చెప్పాల్సిన పని లేదు. గీతాంజలి దేశ హద్దుల్ని దాటి, ప్రపంచం అంతా వినిపించింది. (చదవండి: ‘జై హింద్’ నినాదకర్త మనోడే!) తన సాహిత్యం ద్వారా టాగూర్ ఈ దేశంలో కుల, మత, వర్గాలకు అతీతంగా మానవుడు తయారుకావాలని అభిలషించారు. మతం మనిషిని విభజించరాదని తెలియజేశారు. తన ఎనభై ఏళ్ళ జీవిత ప్రస్థానంలో అనేక నవలలు, నాటికలు, కవితా సంపుటాలు, గేయాలు రచించి సంపూర్ణ సాహిత్యకారుడిగా ఆవిష్కరించుకున్నారు. ‘విశ్వకవి’ అందించిన భావాలను పాడటమో, చదవ టమో కాదు. వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే రవీంద్రుని ఆశయం నెరవేరినట్టు! – డాక్టర్ సుంకర గోపాల్ తెలుగు శాఖాధిపతి, డీఆర్జీ ప్రభుత్వ కళాశాల, తాడేపల్లిగూడెం (మే 7న టాగూర్ జయంతి) -
Gandhi Jayanti: జాతిపిత ముచ్చట్లు
‘ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతో మొదలు కానీ’ అన్నారు గాంధీజీ. ఏవైతే ఎదుటివారిలో వద్దు అనుకుంటామో వాటిని ముందు మనం పరిహరించుకోవాలి. ‘చెడు అనవద్దు వినవద్దు కనవద్దు’ అన్నాడాయన. అసత్యం, అబద్ధం, ద్వేషం, మోసం, ద్రోహం, నేరం... ఇవి ఇప్పుడు పూర్తి చెడుకు కారణం అవుతున్నాయి. స్నేహం, త్యాగం, సమభావన, సహ జీవనం ఇవి విలువైనవిగా మారాయి. విలువలే మనుషుల్ని మహనీయులని చేస్తాయి. గాంధీజీని గౌరవించడం అంటే విలువల్ని కాపాడుకోవడమే. గాంధీ జయంతి వస్తే తెలిసిన విషయాలు మళ్లీ తెలుస్తూ ఉంటాయి. కాని అంతగా తెలియని విషయాలు కొన్ని తెలుసుకుందాం. గాంధీజీకి ప్రపంచ మహనీయులతో గాఢస్నేహం ఉండేది. రష్యన్ రచయిత టాల్‌స్టాయ్ రచనలతో గాంధీజీ ప్రభావితం అయ్యారు. సౌత్ ఆఫ్రికాలో ‘టాల్‌స్టాయ్ ఫామ్’ పేరుతో వ్యవసాయ క్షేత్రాన్ని నడిపారు. చార్లిచాప్లిన్, గాంధీజీ ఉత్తరాలు రాసుకునేవారు. లండన్ వెళ్లినప్పుడు గాంధీజీని చార్లిచాప్లిన్ ప్రత్యేకంగా కలిశారు. గాంధీజీ ప్రభావంతో చాప్లిన్ ‘మోడరన్ టైమ్స్’ సినిమా తీశారని అంటారు. ఐన్‌స్టీన్ గాంధీజీ గురించి అన్నమాట తెలిసిందే– ‘ఈ భూమి మీద ఇలాంటి మానవుడు నడయాడాడని తెలుసుకుని భావితరాలు ఆశ్చర్యపోతాయి’. ఇక విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్తో గాంధీకి ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. గాంధీజీకి ‘మహాత్మ’ అనే సంబోధనా గౌరవం ఇచ్చింది టాగోర్ అంటారు. ఆ తర్వాత గాంధీ పేరు ముందు మహాత్మ ఒక ఇంటి పేరులా మారిపోయింది. ► గాంధీజీ ఫుట్‌బాల్ ప్రియుడు. ఆయన ఎప్పుడూ ఆ ఆట ఆడకపోయినా సౌత్ ఆఫ్రికాలో ఉండగా వర్ణవివక్ష వ్యతిరేక స్ఫూర్తిని కలిగించేలా జొహన్నాస్బర్గ్లో, ప్రెటోరియాలో రెండు ఫుట్‌బాల్ టీమ్‌లను స్థాపించాడు. ► గాంధీజీ ప్రకృతి వైద్యాన్ని విశ్వసించేవారు. ఒకసారి గోపాలకృష్ణ గోఖలే అనారోగ్యం పాలైతే గాంధీ ఆయనకు చాలా తేలికపాటి ఆహారం ఇవ్వసాగారు. గోఖలే దీనిని వ్యతిరేకించినా ఆయన వినలేదు. అంతేనా... ఇద్దరూ ఎక్కడికైనా ఆతిథ్యానికి వెళితే ‘గోఖలే ఏమీ తినడు’ అని ముందే ప్రకటించేసేవారు గాంధీజీ. అదే వరుసలో ఒక ఇంటికి ఆతిథ్యానికి వెళితే గోఖలే సత్యాగ్రహానికి కూచున్నారు. ‘నాకు నచ్చినవి తిననిస్తేనే కదులుతాను’ అన్నారు. గాంధీజీకి ఒప్పుకోక తప్పలేదు. అప్పుడు గోఖలే నవ్వుతూ అన్నారట ‘చూశారా.. సత్యాగ్రాహిని సత్యాగ్రహంతోనే ఓడించాను’ అని. గాంధీజీ సుభాష్‌చంద్రబోస్‌కు కూడా డైట్ చార్ట్ ఇచ్చారు. ‘ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. పచ్చి వెల్లుల్లి రక్తపోటుకు మంచిది. ఖర్జూరాలు తిను. కాని ఎండు ద్రాక్షను మర్చిపోకు. టీ, కాఫీలు ఆరోగ్యానికి అవసరం అని నేను భావించను’ అని బోస్‌కు రాశాడాయన. ► గాంధీజీ ప్రతిపాదించిన అహింసా సిద్ధాంతం ప్రపంచాన్ని గొప్పగా ప్రభావితం చేసింది. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా హక్కుల కోసం పోరాడాల్సిందేనన్న గాంధీజీ స్ఫూర్తితో 12 దేశాలలో కాలక్రమంలో హక్కుల ఉద్యమాలు జరిగాయి. ► గాంధీజీకి నివాళిగా చిన్న చిన్న బస్తీలకు, వీధులకు ఆయన పేరు పెట్టడం ఆనవాయితీ. వాటి లెక్కను మినహాయిస్తే మన మొత్తం దేశంలో 53 రోడ్లకు ఆయన పేరు ఉంది. అది విశేషం కాదు. విదేశాలలో 48 రోడ్లకు ఆయన పేరు ఉంది. ► అహింసను ఆయుధంగా స్వీకరించిన గాంధీజీకి నోబెల్ బహుమతి రాలేదు. ఆయన పేరు 1937, 1938, 1939, 1947లలో నామినేట్ అయ్యింది. చివరకు ఆయన మరణించిన 1948లో ఆఖరుసారి నామినేట్ అయ్యింది. అయినా సరే నోబెల్ బహుమతి ఆయనకు రాలేదు. అన్నట్టు గాంధీజీ అంతిమయాత్ర 8 కిలోమీటర్లు సాగింది. ► 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జవహర్లాల్ నెహ్రు దేశ స్వాతంత్య్ర ప్రకటన సందర్భంగా చేసిన చరిత్రాత్మక ప్రసంగ సమయంలో గాంధీజీ ఆయన పక్కన లేరు. ► ఒకసారి గాంధీజీ ఒక మీటింగ్‌లో ఉంటే ఒక పసివాడు ఆయనను చూడటానికి వచ్చాడు. ‘నీకు చొక్కా లేదా’ అని ఆశ్చర్యపోయాడు. ‘నా దగ్గర అన్ని డబ్బులు లేవు నాయనా’ అన్నాడు గాంధీజీ. పసివాడికి జాలి పుట్టింది. ‘మా అమ్మ నా బట్టలు కుడుతుంది. నీకు కుట్టి తెస్తాలే’ అన్నాడు. ‘మీ అమ్మ ఎన్ని కుడుతుంది. నువ్వు ఎన్ని తేగలవు. నాలా చొక్కాలు, ఒంటి నిండా బట్టలు లేనివారు 40 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. వారు తొడుక్కోకుండా నేను తొడుక్కుంటే ఏం బాగుంటుంది’ అన్నారు గాంధీజీ ఆ పసివాడితో. ► కంప్యూటర్ దిగ్గజం స్టీవ్‌జాబ్స్ గాంధీజీ అభిమాని. వృత్తాకార కళ్లద్దాలు గాంధీ కళ్లద్దాలుగా పేరు పొందడం తెలిసిందే. గాంధీజీ మీద గౌరవంతో స్టీవ్‌జాబ్స్ అలాంటి కళ్లద్దాలనే ధరించాడు. ► గాంధీజీ డార్జిలింగ్‌లో టాయ్‌ట్రైన్‌లో వెళుతున్నప్పుడు ఇంజన్లో సమస్య వచ్చింది. ట్రైన్ వెనక్కు నడవసాగింది. అందరూ భయభ్రాంతం అవుతుంటే గాంధీజీ తన సెక్రెట్రీకి ఉత్తరాలు డిక్టేట్ చేయసాగారు. అప్పుడు సెక్రెటరీ ‘బాపూ... మనం ఏ నిమిషం అయినా పోయేలా ఉన్నాం తెలుసా?’... దానికి గాంధీజీ జవాబు ‘పోతే పోతాం. కాని బతికితే పోతామేమో అని ఆందోళన పడిన సమయం అంతా వృధా చేసిన వాళ్లం అవుతాం. కనుక డిక్టేషన్ తీసుకో’. అన్నాడు. కాలం విలువ తెలియ చేసిన మహనీయుడు ఆయన. -
అమ్మకానికి రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన గృహం
లండన్: నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ లండన్‌లో కొంత కాలం పాటు నివసించిన గృహం తాజాగా అమ్మకానికి వచ్చింది. 1912లో ఠాగూర్గీతాంజలిని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేశారు. ఆ సమయంలో హాంపస్టెడ్ హీత్‌లోని హీత్ విల్లాలో నివసించారు. అప్పటి నుంచి ఈ విల్లాకు ప్రాముఖ్యత పెరిగింది. 2015, 17లలో బెంగాల్ సీఎం మమత యూకేను సందర్శించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ విల్లాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. లండన్‌లోని భారత హై కమిషన్‌తో ఆమె అప్పట్లో ఈ విషయంపై మాట్లాడారు. ఠాగూర్ నివసించిన ఆ ఇంటిని ఓ మ్యూజియంగా మార్చాలని ఆమె అభిలషించారు. ఎస్టేట్ ఏజెంట్ ఫిలిప్ గ్రీన్ మాట్లాడుతూ.. తమ కస్టమర్లు అత్యధిక విలువను పొందడమే లక్ష్యమని, బ్రిటిష్ చట్టాలను అనుగుణంగా కొనుగోలు చేస్తే తమకు సమస్యేమీ లేదని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ విల్లా కొనుగోలుపై బెంగాల్ ప్రభుత్వంగానీ, కేంద్రంగానీ ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదని లండన్‌లో భారత హైకమిషన్ తెలిపింది. -
Rabindranath Tagore: విశ్వగురువు
రవీంద్రనాథ్ టాగోర్ జీవనయానంలో, కీర్తి పతాకలో మూడు మైలు రాళ్ళుగా చెప్పుకోవలసినవి : (1) 1911లో రాసి ఆలపించిన ‘జనగణమన’ జాతీయగీతం, (2) ‘గీతాంజలి’ గేయ సంకలనానికి 1913వ సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం, (3) 1921లో శాంతినికేతన్లో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం. టాగోర్‌కి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మూడవ దాని గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. (1) ‘జనగణమన’ గేయాన్ని రవీంద్రుడు 11–12–1911న రాసి, స్వరకల్పన చేస్తే, 17 రోజుల తరువాత అంటే 28–12–1911న కలకత్తాలో జరిగిన 28వ జాతీయ కాంగ్రెస్ మహాసభలో రవీంద్రుడు స్వయంగా పాడే అవకాశం వచ్చింది. హిందీ, ఉర్దూ భాషల్లోకి ‘జనగణమన’ గేయాన్ని 1912లోనే అబీద్ ఆలీ అనువదించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలోని బెసెంట్ థియోసాఫికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కజిన్స్ అభ్యర్థన మేరకు మదనపల్లెలోనే 28–02–1919వ తేదీన ఆంగ్లంలోకి ‘భారతదేశ సూర్యోదయ గీతం’ అనే పేరుతో రవీంద్రులే స్వయంగా అనువదించగా, డాక్టర్ కజిన్స్ భార్య మార్గరేట్ స్వరకల్పన చేశారు. సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో బెర్లిన్‌లో 1941 నవంబర్ 2వ తేదీన జరిగిన ‘ఆజాద్ హింద్’ సమావేశంలో ‘జనగణమన’ను జాతీయగీతంగా, ‘జైహింద్’ను జాతీయ నినాదంగా ఆమోదిం చారు. 1950 జనవరి 24న జనగణమన భారత జాతీయగీతంగా రాష్ట్రపతి ఆమోదముద్ర పొందింది. 2) గీతాంజలిని బెంగాలీలో మొదటగా 1910లో రవీంద్రుడు రచించారు. 1912లో దీనిని టాగోర్ ఆంగ్లం లోకి ‘గీతాంజలి : సాంగ్ ఆఫరింగ్స్’ అనే పేరుతో అనువదించగా, విలియమ్ బట్లర్ ఏట్స్ అనే బ్రిటిష్ కవి 20 పేజీల ముందుమాటను రాశారు. 1913లోనే ఈ గీతాంజలి ఆంగ్ల అనువాదానికి నోబెల్ బహుమతి వచ్చింది. గీతాంజలిని చలం రమ్యంగా అనువదించారు. (3) విశ్వభారతి విశ్వవిద్యాలయం : ప్రస్తుతం నూరు వసంతాలు (శతాబ్ది) నిండిన ఈ విశ్వవిద్యాలయం రవీం ద్రుని కలల సాకారం, ఆయన ఆశయాలకు ప్రతిరూపం, ఆయన సామాజిక çస్పృహకు, సేవాతత్పరతకు నిదర్శనం. తన సొంత నిధులతో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయం గురించి ఒక్కసారి తెలుసుకుంటే టాగోర్‌కు విద్య మీద ఎటువంటి ఉన్నత భావాలు కలవో, ఎటువంటి నాణ్యత గల విద్యను అందించాలనుకున్నారో, యువతను ఏవిధంగా, ఎటువంటి విద్యావంతులుగా తయారు చేయాలనుకున్నారో అర్థమవుతుంది. శాంతినికేతన్, శ్రీనికేతన్ల ప్రాంగణాలలో స్థాపించిన ఈ విద్యా సంస్థలలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని విభాగాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ శాస్త్రాల విజ్ఞానాన్ని, వివిధ రంగాల, వృత్తివిద్యా నైపుణ్యాలను విద్యార్థులకు అందించే ధ్యేయంతో స్థాపించిన విద్యాలయం ఇది. ఒక వ్యక్తి ఏ రంగంలో నిష్ణాతులవ్వాలనుకున్నా ఇక్కడ అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ సమస్యకు పరిష్కారం చూపే దిశగా విద్య సాగేది. శాంతి నికేతన్‌లోని విభాగాలు అన్ని రకాల శాస్త్రాల, కళల అధ్యయనానికి తోడ్పడితే, శ్రీనికేతన్ మాత్రం వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన కోర్సులను అందిస్తుంది. నిజానికి విశ్వవిద్యాలయం ఎలా ఉండాలి, ఎటువంటి విద్య, కళలను విద్యార్థులకు నేర్పించాలి అనే ప్రశ్నలకు సమాధానమే కలకత్తాకు సుమారుగా 212 కిలోమీటర్ల దూరంలో ‘విశ్వ గురువు’ స్థాపించిన ఈ విశ్వభారతి విశ్వవిద్యాలయం. ‘విశ్వభారతి’ అంటేనే ప్రపంచాన్నంతటినీ ఒకే రకపు విశ్వాసం, నమ్మకం, ఆశయం కల సమూహంగా తయారుచేయడం. ఈ లక్ష్యసాధన కోసమే ‘ప్రపంచమంతా నివసించగలిగే ఏకైక గూడు’ను విశ్వ భారతి ఆశయంగా ఎంపిక చేశారు. ఇక్కడ బెంగాలీ, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు, సంస్కృతం లాంటి భారతీయ భాషలలోను, అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, పెర్షియన్, రష్యన్, టిబెటన్ లాంటి విదేశీ భాషలలోను బోధన జరుగుతుంది. సత్యజిత్‌రే, మహాశ్వేతాదేవి, ఇందిరాగాంధీ, అమర్త్యసేన్ లాంటి దేశీయ ప్రముఖులతో పాటు, ఎంతో మంది విదేశీ ప్రముఖులు కూడా ఇక్కడ విద్యనభ్యసిం చారు. 1951లో దీనిని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చారు. 1905లో టాగోర్ రాసిన ‘నా బంగారు బంగ్లా’నే బంగ్లాదేశ్ తన జాతీయ గీతంగా స్వీకరించిన కారణంగా ప్రపంచంలో రెండు దేశాల జాతీయ గీతాలను రాసిన ఏకైక వ్యక్తిగా టాగోర్ చరిత్రలో నిలిచిపోయారు. సర్వదేశాల సంస్కృతీసంప్రదాయాలను మన సంస్కృతీసంప్రదాయాలతో సమ్మిళతం చేయడానికి కృషిసల్పిన విశ్వ గురువు, విశ్వ కవి, గురు దేవుడాయన. -ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు వ్యాసకర్త మాజీ ఉపకులపతి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఈ–మెయిల్ : mnaidumurru@gmail.com (మే 7న, శత వసంతాల విశ్వభారతి విశ్వవిద్యాలయ సృష్టికర్త టాగోర్ జయంతి) -
ఠాగూర్ కోరుకున్నది ‘ఆత్మనిర్భర్ భారత్’నే
శాంతినికేతన్: భారత్‌తోపాటు ప్రపంచం సాధికారత సాధిం చాలని గురుదేవుడు రవీం ద్రనాథ్ ఠాగూర్ ఆకాంక్షిం చారనీ, అదే లక్ష్యంగా తమ ప్రభుత్వం‘ఆత్మనిర్భర్ భారత్’ను ప్రకటించిందని ప్రధాని మోదీ తెలిపారు. విశ్వకవి రవీంద్రుడు స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన ఉత్సవాలనుద్దేశించి ప్రధాని గురువారం ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈ వర్సిటీ, అనంతరం కాలంలో విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం విశేషంగా కృషి చేసిందని ప్రధాని కొనియాడారు. కాగా, ఈ ఉత్సవాలకు తనను ఆహ్వానించలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ పరిణామం కేంద్రం, టీఎంసీ ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేపింది. ఆ పేరులోనే ఉంది గురుదేవుడు కలలుగన్న విశ్వ–భారతి రూపమే ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్. భారత్ అభివృద్ధి, తద్వారా ప్రపంచ పురోగతియే ప్రభుత్వ లక్ష్యం. దీనిద్వారా భారత్ సాధికారత, అభివృద్ధి.. అంతిమంగా ప్రపంచ అభివృద్ధి సాధ్యం’అని అన్నారు. ‘జాతీయవాద భావనతోపాటు సర్వమానవ సౌభ్రాతృత్వం సాధించేందుకు ఠాగూర్ ఈ సంస్థను స్ధాపించారు. భారత్‌ను ప్రపంచానికి గల సంబంధం ‘విశ్వ భారతి’పేరులోనే ఉంది. భారత్‌లో ఉత్తమమైన వాటి నుంచి ప్రపంచం ప్రయోజనం పొందాలి అనేదే రవీంద్రుని కల’ అని తెలిపారు. ఇలా ఉండగా, జమ్మూకశ్మీర్ వాసులకు ఆరోగ్య బీమా వర్తింప జేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని శనివారం ప్రధాని ప్రారంభించనున్నారు. -
క్షమాపణలు కోరిన విశ్వభారతి వర్సిటీ వీసీ
కోల్‌కతా : శాంతినికేతన్ (విశ్వభారతి) యూనివర్సిటీలో రవీంద్రనాథ్ ఠాగూర్ బయటివ్యక్తి (అవుట్ సైడర్ ) అంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కతీసుకుంటున్నట్లు వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ బిద్యూత్ చక్రవర్తి ప్రకటించారు. తన వ్యాఖ్యలు ఇతరుల మరోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరుతున్నా అని పేర్కొన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం బోల్పూర్ నుంచి ఇన్స్టిట్యూట్కు వచ్చారని, ఆయన కూడా అవుట్‌సైడరే అంటూ వీసి చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. సహ అధ్యాపకులు, విద్యార్థుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. ఠాగూర్ స్థాపించిన సంస్థకి ఆయనే బయటివ్యక్తి ఎలా అయ్యారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎవరినీ నొప్పించడం తన ఉద్దేశం కాదని, తాను కేవంలం చారిత్రక, భౌగోళిక వాస్తవాలనే ప్రస్తావించానని వైస్ చాన్సలర్ వివరణ ఇచ్చారు. (జేఈఈ మెయిన్స్: 4 మార్కులు కలపనున్న ఎన్టీఏ) అయితే తన వ్యాఖ్యలు ఇతరుల మనోభావాలను దెబ్బతీసినందున క్షమాపణలు కోరుతున్నా అంటూ పేర్కొన్నారు. ఇక 1921లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతికేతన్ ఇన్స్టిట్యూట్ 1951లో కేంద్ర విశ్వవిద్యాలయంగా మారింది. ఇక ఇన్స్టిట్యూట్ సమీపాన ఉన్న పౌష్ మేళా మైదానంలో జరిగిన హింసాకాండపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు కోరుకుంటున్నామని చక్రవర్తి అన్నారు. ఈ దాడి వెనక టీఎంసీ నాయకులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేవారు. ఆగస్టు 17న ఇన్స్టిట్యూట్లోని ఓ గేటును కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే తాను బీజేపీ పక్షం ఉన్నానని, కావాలనే లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నానన్న ఆరోపణలను వీసీ చక్రవర్తి కొట్టిపారేశారు. ఒకవేళ అది నిజమైతే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. (మేం మర్చిపోం, మర్చిపోనివ్వం: ఫడ్నవీస్) -
విశ్వకవి జయంతి: ‘దాడి’ ఫస్ట్‌లుక్ రిలీజ్
శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దాడి’. మధు శోభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శంకర్.ఏ నిర్మిస్తున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. గీతాంజలి కావ్యాన్ని, జాతీయ గీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలతో ఒక వ్యవస్థను కథగా రాసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నామని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు మధు శోభ.టి మాట్లాడుతూ.. ‘సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా దాడి చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. నిర్మాత శంకర్.ఏ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బాగా వస్తోంది, త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియజేస్తాం’ అని అన్నారు. గణేష్ వెంకట రమణ, ముఖేష్ ఋషి, చరణ్ రాజ్, అజయ్ , అజయ్ రత్నం, నాగినీడు, అజయ్ ఘోష్, మధు, అలోక్, రాజా రవీంద్ర, సలీమ్ పాండ, దిల్ రమేష్, సితార తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. రాజు సుందరం, శివశంకర్, శేఖర్ మాస్టర్లు డ్యాన్స్ కొరియాగ్రాఫర్స్గా పనిచేస్తున్నారు. కనల్ కన్నన్, వెంకట్ ఫైట్ మాస్టర్లు. కాసర్ల శ్యామ్, భాష్య శ్రీ సాహిత్యం అందించారు. -
అదే నీకు సరిపడే కవిత
టాగూర్ గీతాంజలిని అనువదించి, దానికి రాసిన ముందుమాటలో కవిత్వాన్ని ఎట్లా దర్శించాలో చలం పంచుకున్న అభిప్రాయం ఇక్కడ: గొప్ప ఆర్టు, ముఖ్యం కవిత్వం వినోదం కాదు. అనుభవం. మానవుడి హృదయానికి విశాలత్వాన్నిచ్చి, ఉన్నత పరివర్తనం కలగచెయ్యాలని ప్రయత్నిస్తుంది. గీతాంజలి కొంతవరకైనా అర్థం కావాలంటే కవిత్వరసాన్ని హృదయానుభవంగా తీసుకోగల సంస్కారం వుండాలి. గీతాంజలి సంపూర్ణంగా అర్థం కావాలన్నా, అనుభవంలోకి రావాలన్నా, ఈశ్వరుడిలో విశ్వాసం ఉండాలి. మానవుడికి ఈశ్వరుడితో ప్రత్యక్ష సంబంధం Personal Relation ఉండడానికి వీలు వుంటుందని అంగీకరించుకోవాలి. కాకపోతే ఈ గీతాలు మొహమ్మొత్తే కూని రాగాలు. వుత్త చర్విత చరణాలు. గొప్ప కవిత్వం ప్రధాన లక్షణ మేమిటంటే, ఎవరి తాహతుని బట్టి వారికి ఏదో కొంత అనుభూతిని అందించగలగడం. కొంత స్పష్టంగా తెలుస్తుంది. జయదేవుడి అష్టపదులు, కృష్ణశాస్త్రి గీతాలు, మాటల అర్థంతో ఎంత చెపుతాయో, ధ్వనితో, సంగీతంతో, భాషామాధుర్యంతో అంతకన్నా ఎక్కువ చెపుతాయి. గీతాంజలి బెంగాలీ పాటల సంగతి అదే చెపుతారు. అవి పాడగా విన్నవారికి అవి పూర్తిగా తెలీక పోవొచ్చు. కాని వాటి గానం, శబ్దలాలిత్యం, పదాల ధ్వని విన్యాసం, ఇవన్నీ శ్రవణాన్ని, మనసుని ఆకర్షించి, మనసును దాటి ఎక్కడో అంతఃకరణంలో ఆత్మలో మాధుర్యాన్నీ తేజస్సునీ నింపుతాయి. ఆ శ్రోత అంతరాంతరంలో ఏం మార్పు జరుగుతుందో అతని మనసుకే తెలీదు. ఈ రహస్యం గుర్తించక పోవడం వల్లనే, ఈనాడు తిండికీ, వొంటికీ, మనసు పై పొరల ఆహ్లాదాలకీ ఉపయోగపడని కళ, కళ కాకుండా పోతోంది. లోకం ఇంత విడిపోయింది. గొప్ప కవిత్వ సృష్టిగాని, అనుభవం గాని మనసు వెనక ఎంతో లోతునవుండే Sublime or Supernal Planeలో జరుగుతుంది. మనసుకు తెలిసేది స్వల్పం. గీతాంజలి అంతరార్థం చలానికేం తెలుసు? టాగూరు కెంతమాత్రం తెలుసు? ‘‘నీ పాటల అర్థాలన్నీ చెప్పమని అడుగుతారు. ఏం చెప్పాలో నాకు తెలీదు. ఏమో, వాటి అర్థమేమిటో ఎవరికి తెలుసు? అంటాను!’’ అంటారు టాగూర్. తన Emotional అనుభవానికి రూపకల్పన చేస్తాడు కవి. తమ విరహాన్ని, నిరాశని, విశ్వాసాన్ని, భయాన్ని ఎన్నోవిధాల పాడారు, ్కట్చ ఝటరాసిన భక్తులూ, మీరా, కబీర్, రామదాసు, త్యాగరాజు. అంత భక్త పరాధీనుడైన ప్రభువు తనెంత తపించినా దర్శనమివ్వడేమని త్యాగరాజు వ్యథ, ఆశ్చర్యం, భయం; దాని కంతకీ రూపమిచ్చి: ఖగరాజ నీ యానతి విని వేగ చనలేదో గగనానికి ఇలకు బహు దూరం బనినాడో కాకపోతే నువ్వెందుకు రావు? అని పాడతాడు కవి. ఆ విరహం నీ హృదయంలో ఏ కొద్దిగా మండినా, అతని తపనని నీకు అర్థం చెయ్యడానికి అతనిచ్చిన రూపకల్పన విష్ణూ, వాహనం గరుడుడూ నీకు అనుభవాన్నియ్యడానికి అభ్యంతరాలు కానక్కర్లేదు. కవి చెప్పేది నీకు పూర్తి అనుభవంలో వుంటే ఆ కవిత్వం నీకు అనవసరం. కవిత్వం చదివిన తరవాత కూడా నీ అనుభవానికి విషయం ఏ మాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృథా! నీకు తోచనిదీ కనపడనిదీ కవి చెప్పిన తరవాత నీ అనుభవంలోకి ఎంతో కొంత వొచ్చేదీ, అదే నీకు సరిపడే కవిత. -
పడవెళ్లి పోతున్నది
ఉద్యోగంలో చేరగానే మొదట ఉలాపూర్ గ్రామానికి పోస్ట్‌మాస్టర్‌గా రావలసి వచ్చింది. ఉలాపూర్ చిన్న ఊరు. దగ్గిరలో నీలిమందు కార్ఖానా ఉంది. ఆ కార్ఖానా దొర ఎంతో ప్రయత్నం చేసి, ఈ క్రొత్త పోస్టాఫీసు పెట్టించగలిగాడు. పోస్ట్ మాస్టరు కలకత్తా బిడ్డ. నీళ్లలోని చేపను ఒడ్డున పడేస్తే ఏమవుతుందో, ఈ కుగ్రామానికి వచ్చిన పోస్ట్ మాస్టరు స్థితి కూడా అంతే అయింది. చీకటి కోణంగా ఉండే ఒక యింట్లో అతడి ఆఫీసు. దగ్గరలో నాచుతో కప్పివుండే చెరువు. దానికి నాలుగు వైపులా అడవి. స్థానికంగా ఉండేవారితో అతడు కలిసిపోలేకపోయాడు. పైగా చేతికి ఎక్కువ పనిలేదు. అప్పుడప్పుడు ఒకటి అర కవితలు వ్రాయటానికి ప్రయత్నించేవాడు. రోజంతా ఆకాశంలోని మేఘాల్ని చూస్తూ కూచుంటే జీవితం సుఖంగా గడిచిపోతుంది – అన్న భావం వ్యక్తం అవుతూవుంటుంది, ఆ కవితల్లో. పోస్ట్ మాస్టరు జీతం చాలా తక్కువ. తానే వంట చేసుకుని తినాలి. ఊళ్లో తల్లీ తండ్రీ లేని ఒక అనాథ బాలిక అతడి పనులు చేసిపెడుతూ ఉండేది. ఆమెకి నాలుగు మెతుకులు తినటానికి దొరికేవి. పేరు రతన్. పన్నెండు పదమూడేళ్లుంటాయి. పెళ్లయే అవకాశం ఏమీ కన్పించదు. సంజెవేళ పశువుల పాకల్లోంచి పొగలు వర్తులాకారంగా లేస్తూ ఉంటాయి. పొదల గుబురుల్లోంచి కీచురాళ్లు కూస్తుంటాయి. చీకట్లో వసారాలో ఒంటరిగా కూర్చుని ఆకుల కదలికలు చూస్తుంటే, కవి హృదయంలో రవంత సంచలనం కలిగినప్పుడిహ ఇంట్లో మూల గుడ్డిదీపం వెలిగించి ‘రతన్’ అని పిలిచేవాడు. రతన్ గుమ్మంలో కూర్చుని ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తూండేది. ‘‘ఏం చేస్తున్నావ్ నువ్వు?’’ ‘‘పొయ్యి వెలిగించటానికి వెళ్లాలి. వంటింట్లో–’’ ‘‘వంటింటి పనులు తర్వాత చేసుకుందువుగాని– ముందు ఒకమాటు చిలుంగొట్టం సిద్ధం చేసి ఇయ్యి’’ బుగ్గలు రెండు ఉబ్బించి చిలుంగొట్టం ఊదుకుంటూ రతన్ ప్రవేశించేది. ఆమె చేతిలోని గొట్టాన్ని అందుకుని, ‘‘అవును కాని రతన్, మీ అమ్మ జ్ఞాపకం వస్తూంటుందా’’ అని అడిగేవాడు. చాలా సంగతులవన్నీ. కొన్ని జ్ఞాపకం వస్తాయి, కొన్ని రావు. తల్లి కంటే తండ్రి ఆమెను ఎక్కువ ఆపేక్షగా చూసేవాడు. ఆమెకొక తమ్ముడుండేవాడు. ఒకనాడు వర్షంగా ఉన్న రోజున ఒక గుంటగట్టున ఇద్దరూ కలిసి, చెట్టున విరిగిన సమ్మటి కొమ్మను గాలం చేసుకుని ఉత్తుత్తి చేపలు పట్టే ఆట ఆడుకున్నారు. ఇలా మాటల్లో మధ్య మధ్య రాత్రి చాలా ప్రొద్దుపోతూ ఉండేది. అప్పుడిహ బద్దకం కొద్దీ పోస్ట్ మాస్టరు వంట చేసుకోటానికి ఇచ్చగించేవాడు కాదు. ప్రొద్దున చల్లారిపోయిన కూరలవీ ఉండేవి. రతన్ గబగబా పొయ్యి వెలిగించి, కాసిని రొట్టెలు కాల్చి తీసుకువచ్చేది. వాటితోనే ఆ రాత్రి ఇద్దరికీ తిండి వెళ్లిపోయేది. ఒకొకరోజున ఆ పెద్ద ఎనిమిది దూలాల ఆఫీసు గృహంలో ఒకవైపున బల్లమీద కూర్చుని పోస్ట్ మాస్టరు తన యింటి సంగతులు ఏకరువు పెట్టేవాడు. తల్లి, తమ్ముడు అక్కల సంగతులు– ప్రవాసంలో ఒంటరిగా ఇంట్లో కూర్చున్నప్పుడు మనస్సు ఎవరికోసం కొట్టుకుంటూ ఉంటుందో వారి సంగతులు చదువు సంస్కారంలేని ఆ చిన్నబాలికతో చెప్పుకునేవాడు. అతడా సంగతులన్నీ చెపుతున్నప్పుడు ఆ బాలిక వాళ్ల యింట్లో వాళ్లని అమ్మ, అక్క, అన్న అని వరసలు కలిపి మాట్లాడేదాకా వచ్చింది. తన చిన్న హృదయ పటం మీద వారి ఊహారూపాలను కూడా చిత్రించుకుంది. వర్షాకాలంలో మబ్బులు లేని ఒకనాటి మధ్యాహ్నవేళ చక్కని నులివెచ్చని గాలి వీస్తోంది. అలసిపోయి ఉన్న ధరణి వేడి నిట్టూర్పు ఒంటికి తగులుతున్నట్లుంది. పోస్ట్ మాస్టరు వాటికేసి చూస్తూ– ఈ సమయంలో హృదయానికి హత్తుకునే అనురాగ పుత్తలిౖయెన మానవమూర్తి సరసన ఉంటే అని భావించుకోసాగాడు. ఒక చిన్న పల్లెటూరులో కొద్ది జీతం తెచ్చుకునే సబ్ పోస్ట్ మాస్టరు మనసులో ఒక సెలవునాటి మధ్యాహ్న వేళ ఇలాంటి భావాలు తలెత్తాయని అంటే ఎవరూ నమ్మనూ నమ్మరు; అర్థమూ చేసుకోలేరు. పెద్దనిట్టూర్పు విడిచి ‘రత్నా’ అని పిలిచాడు. రతన్ అప్పుడు జామచెట్టు కింద, కాళ్లు చాచుకుని పచ్చిజామకాయ తింటూ కూర్చుంది. యజమాని గొంతు విన్పించగానే హడావుడిగా పరుగెత్తుకొచ్చి, ‘‘బాబుగారూ, పిలిచారా?’’ అన్నది. ‘‘నీకు కాస్త చదువు నేర్పుతాను’’ అని ఆ మధ్యాహ్నమంతా అఆలు నేర్పడం మొదలెట్టాడు. కొద్దిరోజుల్లోనే ఆమెకి ఒత్తులు కూడా వచ్చేశాయి. ఒకనాడు ప్రొద్దున్నుంచి తెరిపిలేకుండా కురుస్తోంది వర్షం. పోస్ట్ మాస్టరు శిష్యురాలు చాలాసేపటినుంచి గుమ్మం దగ్గిర కనిపెట్టుకుని కూచుని ఉంది. కాని ఎంతసేపటికీ పిలుపు రాకపోవటంతో తన పుస్తకాలు, కలం పెట్టుకున్న చిన్న పెట్టె తీసుకుని తానే లోపలికి వెళ్లింది. మాస్టర్ మంచం మీద పడుకుని ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నాడనుకుని, చప్పుడు కానీయకుండా మళ్లీ మెల్లిగా గదిలోంచి బయటకు వెళ్లబోయింది. చటుక్కున ‘‘రత్నా’’ అని పిలుపు విన్పించింది. ‘‘ఒంట్లో బాగున్నట్టు లేదు, నుదురు మీద చెయ్యివేసి చూడు’’ అన్నాడు. తోడు ఎవరూ లేని ఈ ప్రవాసంలో, జోరుగా కురుస్తున్న వర్షంలో, అస్వస్థతగా ఉన్న శరీరానికి కాస్త శుశ్రూష కావాలనిపించింది. కాలిపోతున్న నుదురు మీద గాజుల చేతి కోమలస్పర్శ తలపుకు వచ్చింది. ఈ దుస్సహమైన రోగ బాధలో స్నేహరూపిణులైన తల్లి, అక్క ప్రక్కన ఉండాలనిపిస్తుంది. బాలిక అయిన రతన్ ఇంక బాలికగా ఉండిపోలేదు. ఆమె తల్లిస్థానాన్ని, అధికారాన్ని చేపట్టింది. వైద్యుణ్ని పిలిపించింది. వేళకు మందు తాగించేది. తానే పథ్యం వండిపెట్టేది. ‘‘బాబుగారూ, కాస్త తేలిగ్గా ఉన్నట్లుందా?’’ అని ఒకటికి పదిసార్లు అడిగేది. చాలా రోజులకి పోస్ట్ మాస్టరు చిక్కి శల్యమై రోగశయ్య మీదినుంచి లేచాడు. ఇహ లాభం లేదు. ఇక్కడినుంచి ఎలాగయినా సరే బదిలీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతపు అస్వస్థతను వ్యక్తం చేస్తూ పై అధికారులకు దరఖాస్తు పంపుకున్నాడు. రతన్ మళ్లీ గుమ్మం బయట తన స్వస్థానాన్ని ఆక్రమించుకుంది. కాని వెనుకటిలాగా ఇప్పుడామెకి పిలుపు రావడం లేదు. బయట కూర్చుని తన పాతపాఠాలు వెయ్యేసిసార్లు చదివేది. చటుక్కున ఎప్పుడు పిలుపు వస్తుందో, ఆ సమయానికి తనకు వచ్చిన ఒత్తులన్నీ ఎక్కడ తారుమారవుతాయో అని ఆమెకొక భయం ఉండేది. చివరికి వారం పోయాక ఒకనాడు సంజెవేళ పిలుపు వచ్చింది. ‘‘బాబుగారూ పిలిచారా నన్ను?’’ ‘‘రత్నా, రేపే నేను వెళ్లిపోతున్నాను’’ అని చెప్పాడు పోస్ట్ మాస్టర్. ‘‘ఎక్కడికి వెడతారు?’’ ‘‘ఇంటికి వెడుతున్నా’’ ‘‘మళ్లీ ఎప్పుడొస్తారు?’’ ‘‘ఇంక రాను’’ రతన్ ఇంకేమీ అడగలేదు. బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నాననీ, మంజూరు కాలేదనీ, అంచేత ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతున్నాననీ చెప్పాడు. చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. మినుకు మినుకు మంటూ దీపం వెలుగుతోంది. కొంచెం సేపయాక రతన్ మెల్లిగా లేచి, రొట్టెలు చెయ్యిటానికి వంటింట్లోకి వెళ్లింది. పోస్ట్ మాస్టర్ భోజనమయిన తర్వాత– ‘‘బాబుగారూ! నన్ను మీ ఇంటికి తీసుకువెళ్లరాదూ’’ అని అడిగింది. పోస్ట్ మాస్టర్ నవ్వి– ‘‘అది యెలా సాధ్యమవుతుంది?’’ అన్నాడు. అసలు విషయమేమిటో, ఎందువల్ల సాధ్యం కాదో ఆ బాలికకు నచ్చజెప్పటం ఆవశ్యకమని అనుకోలేదు. రాత్రంతా మెలకువగా ఉన్నప్పుడు, కలలోనూ కూడా ‘అది యెలా సాధ్యమవుతుంది’ అని నవ్వుతూ మాస్టర్ అన్న మాట ఆ బాలిక చెవుల్లో ప్రతిధ్వనించ సాగింది. పోస్ట్ మాస్టర్ తెల్లారకట్లనే లేచి చూసేసరికి స్నానానికి నీళ్లు సిద్ధంగా పెట్టి ఉన్నాయి. అతడు యెప్పుడు బయలుదేరుతున్నదీ బాలిక యెందుచేతనో అడగలేక పోయింది. ప్రొద్దున్నే అవసరమొస్తాయో అని క్రితం రాత్రే నది నుంచి నీళ్లు తీసుకొచ్చిపెట్టింది. స్నానం అయాక రత్నకి పిలుపు వచ్చింది. ‘‘నా స్థానంలో వచ్చే అతడితో నేను చెప్పి వెడతాను. అతడు నిన్ను, నాలాగానే ఆదరిస్తాడు. నువ్వేమీ బెంగపెట్టుకోనక్కర్లేదు’’ అన్నాడు. ఈ మాటలు దయార్ద్ర హృదయంలోంచి వచ్చినవే. కాని స్త్రీ హృదయాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఈ మెత్తని మాటలను ఆమె సహించలేకపోయింది. ఒక్కసారి బావురుమని యేడుస్తూ– ‘‘వద్దు వద్దు. మీరెవరికీ యేమీ చెప్పనవసరం లేదు. నేనిక్కడ ఉండాలనుకోవటం లేదు’’ అన్నది. రత్న ఇలా వ్యవహరించటం మాస్టర్ యెన్నడూ చూసి యెరుగడు. చటుక్కున తెల్లబోయాడు. క్రొత్త పోస్ట్ మాస్టర్ వచ్చాడు. అతడికి ఛార్జి అప్పగించి, పాత మాస్టర్ ప్రయాణోన్ముఖుడయాడు. రత్నను పిలిచి– ‘‘నీకెప్పుడూ నేనేమీ యివ్వలేకపోయాను’’ అన్నాడు. త్రోవ ఖర్చుకు పోనూ తనకు వచ్చిన జీతం పైకం మొత్తమంతా జేబులోంచి పైకి తీశాడు. ‘‘బాబుగారూ, మీ కాళ్లు రెంటూ పట్టుకుంటున్నా. నాకేమీ యివ్వద్దు, నన్ను గురించి ఎవరూ ఏమీ దిగులు పెట్టుకోనక్ఖర్లేదు’’ అని ఒక్క పరుగున పారిపోయింది. పాత మాస్టర్ నిట్టూర్పు విడిచి, గొడుగు పైన వేసుకుని, రేకుట్రంకు కూలివాడి నెత్తిన యెత్తి పడవల రేవుకి బయలుదేరాడు. పడవ యెక్కి, బయలుదేరేసరికి అతడి హృదయంలో అపరిమితమైన వేదన కలగసాగింది. ‘‘తిరిగి వెడదాం, జగతి ఒడినుంచి జారిపోయిన ఆ అనాథను తీసుకువద్దాం’’ అనిపించిందొకసారి. కాని అప్పటికి తెరచాపకు గాలి బాగా అందుకుంది. నదీ ప్రవాహం వడిగా ఉంది. ఊరు దాటిపోయి, నదీ ఒడ్డున ఉండే శ్మశానం కన్పిస్తోంది. పథికుని ఉదాసీన హృదయంలో– ‘‘జీవితంలో ఇలాంటి ఎన్ని విఛ్చేదాలు, ఎన్ని మృత్యువులున్నాయో? తిరిగి వెళ్లటం వల్ల లాభమేమిటి? పృథివిలో ఎవరికి ఎవరు?’’ అన్న వైరాగ్యం ఉదయించింది. ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ టాగూర్ (1861–1941) కథ ‘పోస్ట్ మాస్టర్’కు ఇది సంక్షిప్త రూపం. రచనాకాలం 1891. దీన్ని తెలుగులోకి అనువదించింది మద్దిపట్ల సూరి. ‘గీతాంజలి’ టాగూర్ ప్రసిద్ధ రచన. రవీంద్రనాథ్ టాగూర్ -
గురుదేవుడి మహాత్ముడు
రవీంద్రనాథ్ టాగోర్ గాంధీజీని ‘మహాత్ముడు’ అన్నాడు.ఆయన ఇచ్చిన ఆ గౌరవ సంబోధనను జాతి స్వీకరించడంతో గాంధీ ‘మహాత్మా గాంధీ’ అయ్యాడు.టాగోర్ని గాంధీజీ ‘గురుదేవ్’ అన్నాడు.అప్పటి నుంచి టాగోర్ అనే పేరుకు ‘గురుదేవ్’ సమానార్థకం అయ్యింది.టాగోర్, గాంధీజీ ఆత్మీయులు. పరస్పరం సత్యాన్ని అన్వేషించినవారు. సత్యాన్వేషణ కోసం పరస్పరం ఘర్షించుకున్నవారు.గురు దేవుని దృష్టి నుంచి మహాత్ముడిని చూసినప్పుడు మామూలు మనుషులుగా మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది.పాలకులు, యువత, ప్రజలు మహాత్ముడి ఆత్మధోరణిని సంపూర్తిగా అక్కర్లేదు... సహస్రాంశం అనుసరించినా ఈ దేశం సర్వోన్నతం అవుతుందనిపిస్తుంది.గురుదేవులు టాగోర్ వివిధ సందర్భాలలో గాంధీజీని ఉద్దేశించి అన్న మాటలు ఇవి. మహాత్ముడంటే గాంధీజీని నేను మహాత్ముడని అన్నాను. ఆ మాటకు నిజమైన అర్థమేమిటి? ఎవరి ఆత్మ అయితే విముక్తి చెంది అన్ని ఆత్మల్లోనూ దర్శనమిస్తుందో ఆ ఆత్మ కలిగినవాడే మహాత్ముడు. ఆ అర్థంలో గాంధీజీ మహాత్ముడు. మహాత్ముల కార్యకలాపాలు ఒకరి కోసమో ఇద్దరి కోసమో కావు. అవి మొత్తం ప్రపంచమంతటి కోసం. వాటికి పరిమితులేమీ లేవు. నిర్బంధాలు లేవు. అవి మొత్తం విశ్వం కోసం. గాంధీజీ కార్యకలాపాలు ఒక కులం మతం జాతి కోసం కాదు. అవి సకల మానవాళి కోసం. అందుకే ఆయన మహాత్ముడు. స్వీయ సేవను చేసుకోగలమా? మహాత్మునికి ఉన్న స్వీయ క్రమశిక్షణ మనలో ఎంతమందికి ఉంది... ఎప్పటికైనా ఆ క్రమశిక్షణను వదలకుండా ఆచరించదగ్గ చిత్తశుద్ధిని పొందగలమా చూసుకోవాలి. ఒకసారి మార్చి నెలలో గాంధీజీ శాంతినికేతన్లో కొద్ది రోజులు గడిపారు. దక్షిణాఫ్రికాలో మొదలుపెట్టుకున్న నియమావళికి అనుగుణంగా శాంతినికేతన్లో కూడా ఆయన ఏ సేవకుడి సహాయమూ కోరలేదు. తన గది తనే తుడుచుకున్నాడు. తన పక్క తనే సర్దుకున్నాడు. తన గిన్నెలు తనే కడుక్కున్నాడు. తన గుడ్డలు తనే ఉతుక్కున్నాడు. శాంతినికేతన్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇది చూసి ప్రభావితులయ్యారు.వాళ్లల్లో చాలామంది గాంధీని అనుసరించాలని ఆరాటపడ్డారు. మార్చి 10వ తేదీన ఒక ప్రయత్నంగా విద్యార్థులు వంటవాళ్ల పనివాళ్ల పాకీవాళ్ల సేవల్ని పక్కన పెట్టేశారు. ఇదంతా గాంధీజీ పర్యవేక్షణలో జరిగింది. కాని కొన్నాళ్లకు కొన్ని ఇబ్బందుల వల్ల విద్యార్థులు ఈ స్వీయ సేవను విడిచిపెట్టారు. కాని గాంధీజీ విడిచిపెట్టలేదు. విడువక పోవడమే మహాత్ముల లక్షణం. ఆయన త్యాగమూర్తి చాలామంది ప్రజానాయకులు త్యాగాలు చేస్తుంటారు. కాని అవి రేపు తాము పొందబోయే ఆకర్షణీయమైన లాభాలకు పెట్టుబడి అని భావిస్తారు. గాంధీజీ అందుకు విరుద్ధం. ఆయన త్యాగానికి మరోపేరు. ఆయన ఎట్లాంటి అధికారాన్నిగాని పదవినిగానీ సంపదనుగానీ పేరునుగానీ కీర్తిగానీ కోరుకోలేదు. కోరుకోరు. మొత్తం భారతదేశ సింహాసనాన్ని ఆయనకు సమర్పిస్తే ఆయన స్వీకరించడు. పైగా ఆ సింహాసనానికున్న వజ్రాలను ఒలిచి పేదలకు పంచి పెట్టేస్తాడు. అమెరికాలో ఉన్న డబ్బంతా ఆయనకు ఇస్తే దానిని మానవాళిని ఉద్ధరించడానికి పనికొచ్చే ఏదో ఒక పనికి ఖర్చు పెట్టేస్తాడు. ఇతరులకు ఏదైనా ఇవ్వడం కోసమే ఆయన ఆత్మ ఎప్పటికీ ఆరాటపడుతూ ఉంటుంది. అందుకు ప్రతిఫలంగా ఆయనేదీ ఆశించడు. చివరకు కృతజ్ఞతలు కూడా. ఆయనది క్రీస్తు ప్రభావం నన్నెవరన్నా గొంతు నులమబోతే నేను సహాయం కోసం అరుస్తాను. కాని గాంధీజీకి ఆ పరిస్థితి ఎదురైతే ఆయన సహాయం కోసం అరవడని కచ్చితంగా చెప్పగలను. తన గొంతు నులిమేవాడిని చూసి ఆయన చిరునవ్వు నవ్వుతాడు. తాను మరణించవలసి వస్తే చిరునవ్వుతోనే మరణిస్తాడు. క్రీస్తు ప్రభావం అని మనం దేన్నయితే అంటామో అది ఆయనకుంది. ఆయన గురించి ఎంత తెలుçసుకుంటే అంత ప్రేమించగలుగుతాం. చెడును ద్వేషించాలి... చెడ్డవారిని కాదు మనం ద్వేషించవలసింది చెడును తప్ప చెడ్డవారిని కాదని మహాత్ముడు చెప్పాడు. దీనిని పాటించడం అసాధ్యం అనిపిస్తుంది. కాని దాన్నాయన తన జీవితంలో పాటించడం నేను చూశాను. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బహిష్కరించిన ఒక ప్రసిద్ధ రాజకీయవేత్తతో ఆయన మాట్లాడుతుండగా నేనక్కడున్నాడు. ఆ పెద్దమనిషితో మాట్లాడుతున్నది వేరే కాంగ్రెస్ నాయకుడైతే ఆ నాయకుడు ఆ పెద్దమనిషిని చాలా ఏహ్యభావంతో చూసి ఉండేవాడు. కాని గాంధీజీ అలా చేయలేదు. అతడు చెప్తున్నది సహనంతో సానుభూతితో పూర్తిగా విన్నాడు. అతన్ని కించపరిచే మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. అది చూసి నేను ‘గాంధీజీ తాను ప్రవచిస్తున్న సిద్ధాంతాల కన్నా ఉన్నతుడు’ అని అనుకున్నాను. ముందు తన మీదే.... మహాత్ముడు సమాజం కోసం ఒక ప్రయోగాన్ని ప్రతిపాదించే ముందు ఆ కఠిన పరీక్షని తన మీద తాను విధించుకుంటాడు. త్యాగం కోసం ఎదుటివాళ్లకు పిలుపునిచ్చేముందు తనే స్వయంగా దాని మూల్యం చెల్లిస్తాడు. ముందు ఆయన తన సౌకర్యాలని వదులుకుని తక్కినవాళ్లను త్యాగం చేయమనడానికి సాహసిస్తాడు. ఒక చెడు విజయం కోసం ఆత్మను తాకట్టు పెట్టుకోవడం కన్నా సర్వం కోల్పోవడమే మంచిదనేది గాంధీజీ ఆదర్శం. ఈ ఆదర్శాన్ని రాజకీయాలలో ఆయన బలంగా ప్రతిపాదించాడు. ఇందుకు మనం మహాత్మాగాంధీని గౌరవించుకోవాలి. అవమానాన్ని ధైర్యంగా సహిస్తూ బాధను సహిస్తూ కూడా మనం తిరిగి హింసకు పూనుకోకపోతే మన మీద పీడన చేసే వారు తెల్లముఖం వేసి అశక్తులవుతారని ఆయన నేతృత్వంలో భారతదేశం ప్రతిరోజూ నిరూపిస్తూనే ఉంది. ఆ మనిషి నిజంగానే దేవదూత.ఆయనను మనం మహాత్ముడని పిలుచు కోవడం సముచితం. ఆయన నివసిస్తున్నది ఒక వ్యక్తిగత, సంకుచిత శరీరంలో కాదు. ఈరోజు భారతదేశంలో జన్మించిన రేపు జన్మించనున్న లక్షలాది ప్రజా హృదయాలలో ఆయన నివసిస్తున్నాడు. -
12 నిజ జీవిత పాత్రల్లో యంగ్ హీరో
ఎమ్ఎస్ ధోని బయోపిక్‌తో ఒక్కసారిగా స్టార్ లీగ్‌లో ఎంటర్ అయిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ధోని పాత్రలో జీవించిన ఈ యువ నటుడు ఇప్పుడు మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 12 నిజజీవిత పాత్రల్లో నటించేందుకు ఓకె చెప్పాడు. 540బిసి నుంచి 2015 ఏడి మధ్య కాలానికి చెందిన 12 మంది మేధావుల జీవితాలను సిరీస్‌గా రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌లో చాణక్యుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి వారి జీవితాలను తెరకెక్కించనున్నారు. ఈ 12 కథలో లీడ్ రోల్స్‌లో నటించేందుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రెడీ అవుతున్నాడు. తన స్నేహితుడు వరుణ్ మథుర్‌తో కలిసి సుశాంత్ ఈ సిరీస్‌ను స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ధోని సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ ఈ సిరీస్ మరింత పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. -
ఎం.ఎన్. రాయ్‌కి ఐన్‌స్టీన్ మద్దతు
ప్రపంచ ప్రసిద్ధి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత, సాపేక్షతా సిద్ధాంత కర్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ (1879–1955)కు భారతీయ ప్రముఖుల్లో రవీం ద్రనాథ ఠాగోర్ బాగా తెలుసు. ఆ తరువాత మహాత్మాగాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరి పారు. మరో ఇద్దరు ముగ్గురు సైంటిస్టులతో పరిచయం వున్నది. అయితే సైంటిస్టు కాని మానవవాద సిద్ధాంతకర్త ఎమ్.ఎన్.రాయ్ (1887–1954)తో పరిచయం వుండటం ఆశ్చర్యకరమైన విషయం. 1930లో ఎమ్.ఎన్. రాయ్ 17 సంవత్సరాల తర్వాత బొంబాయిలో మహమ్మూద్ అనే మారుపేరుతో అడుగు పెట్టాడు. ఆయన 1920 నుంచి 1930 వరకు ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, రష్యాలలో ఉన్నాడు. అప్పట్లో భారత స్వాతంత్య్ర పోరాటాన్ని విదేశాల నుండే వివిధ రీతులలో జరిపించారు. కానీ, 1931 జూలై 31న బొంబాయిలో బ్రిటిష్ పోలీసులు ఎమ్.ఎన్.రాయ్‌ను అరెస్టు చేశారు. ఆ వార్త తెలిసి ఐన్‌స్టీన్ వెంటనే భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి పూర్వక లేఖ రాశారు. అది జర్మన్ భాషలో ఉన్నది. జెరూసలేంలోని ఐన్‌స్టీన్ పురావస్తు పుస్తక పరిశోధనాలయంలో ఉంది. ఎమ్.ఎన్.రాయ్‌ను హింసిం చకుండా మానవ దృక్పథంతో చూడాలని కోరారు. మేథావులపై క్రూరంగా పగతీర్చుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. అప్పటికే ఐన్‌స్టీన్ జర్మనీలో హిట్లర్ భయానికి అమెరికా వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎమ్.ఎన్.రాయ్‌తో పరి చయం అయిందో తెలియదు. కానీ ఒక అసాధారణ సైంటిస్టు అలా రాయటం ఆశ్చర్యకరమైన విషయం. సాధారణంగా ఐన్‌స్టీన్ ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకోడు. దీనిని బట్టి వారిరువురికీ సన్నిహిత పరిచయం ఉండి ఉండాలి. ఎమ్.ఎన్.రాయ్ సైన్సు పట్ల తీవ్రస్థాయిలో ఆసక్తి కనబరిచినట్లు సైంటిస్టులతో పరిచయం ఉన్నట్లు జైలు నుంచి ఆయన రాసిన లేఖలను బట్టి తెలుస్తున్నది. జైలులో ఆధునిక విజ్ఞాన శాస్త్రాల తాత్విక ఫలితాలు అనే అంశాన్ని ఐదువేల పేజీలలో రాశారు. అందులో ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతాన్ని చర్చించారు. తనకున్న సందేహాలను రాసి పారిస్‌లో ఉన్న ఎలెన్‌కు పంపి ఆయా సైంటిస్టులకు అందజేసి సమాధానాలు తెప్పించమన్నారు. దానినిబట్టి కూడా సైన్స్ లోతుపాతులు గ్రహించిన వ్యక్తిగా స్పష్టపడింది. కొందరు సైంటిస్టులు సమాధానాలిచ్చారు కూడా. జైలులో రాసిన రచనల సారాంశాన్ని ‘సైన్స్ అండ్ ఫిలాసఫీ’ పేరిట 1948లో చిన్న పుస్తకంగా వెలువరించారు. మిగిలిన రచన ఎడిట్ చేసి ప్రచురించవలసి ఉంటుందని ఆయన అనుచరుడు సైన్సు రచయిత అమృతలాల్ బిక్కుషా అభిప్రాయపడ్డారు. ఐన్‌స్టీన్‌తో ఎమ్.ఎన్.రాయ్ మొదటి భార్య ఎవిలిన్ (1892–1970)కు పరిచయం ఉంది. అణ్వాయుధ నిషేధ ఉద్యమం చేపట్టిన ఐన్‌స్టీన్ విరాళాల కోసం ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఆమె కొంత వరకు సహాయపడింది. ఎమ్.ఎన్.రాయ్‌తోపాటు ఎవిలిన్ కూడా 1926 వరకు యూరోప్‌లో ఉంది. అప్పుడు ఐన్‌స్టీన్‌తో పరిచయం ఉండే అవకాశం ఉన్నది. ఆ పరిచయం వల్లనే 1950లో ఐన్‌స్టీన్ విరాళాలకై అమెరికాలో ఉంటున్న ఎవిలి న్కు విజ్ఞప్తి చేశాడు. వీటన్నిటి బట్టి చూస్తే ఎమ్.ఎన్.రాయ్ యూరోప్‌లో ఐన్‌స్టీన్‌ను కలిసి ఉండవచ్చునని భావిస్తున్నారు. రీజన్–రొమాంటిసిజమ్, రివల్యూషన్ అనే శీర్షికతో రెండు సంపుటాలు ఎమ్.ఎన్.రాయ్ ప్రచురించినప్పుడు సుప్రసిద్ధ సైకాలజిస్టు ఎరిక్ ఫ్రాం తన పుస్తకం సేన్ సొసైటీలో–ఎవరైనా యూరోప్ పునర్వికాసాన్ని గురించి అవగాహనకు రావాలి అంటే ఎమ్.ఎన్.రాయ్ గ్రంథం చదవమనటం పెద్ద విశేషం. ఈ విధంగా ఒక వైపున రాజకీయాలలో నిమగ్నుడై సతమతమైనా, మరొకవైపు సైన్సు పట్ల సైంటిస్టుల పట్ల ఆసక్తి చూపటమే కాక ప్రజోపయోగకరమైన రచనలు వెలువరించటం గమనార్హం. ఐన్‌స్టీన్ – రాయ్ పరిచయాలపై లోతైన పరిశీలన జరగవలసి ఉన్నది. (మానవవాద సిద్ధాంతకర్త ఎమ్.ఎన్.రాయ్‌ని 1931 జూలై 31న ముంబైలో అరెస్టు చేసిన ఘటనపై తక్షణ స్పందనగా భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు ఐన్‌స్టీన్ లేఖ రాసిన సందర్భంగా) -నరిసెట్టి ఇన్నయ్య సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్ : innaiah@gmail.com -
మళ్లీ తప్పులో కాలేసిన గూగుల్
సాక్షి, న్యూఢిల్లీ: సెర్చింజన్ దిగ్గజం గూగుల్ వరుస తప్పులతో అభాసుపాలు అవుతోంది. ఆ మధ్య నెహ్రూ సంబంధిత సమాచారానికి మోదీ ఫొటోను ఉంచి ట్రోలింగ్‌ను ఎదుర్కున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి పొరపాటే చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 157వ జయంతి సందర్భంగా గూగుల్‌లో ‘భారత జాతీయ కవి’ పేరిట టాప్ ట్రెండింగ్‌ను సృష్టించింది. అయితే గూగుల్‌లో ఆ పేరుతో పరిశోధించిన వారు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. నోబెల్ గ్రహీత ఠాగూర్ ప్లేస్‌లో.. ఆధ్యాత్మిక వేత్త శ్రీ అరబిందో ఫోటో ప్రదర్శితమైంది. దీనికితోడు మే 9న ఠాగూర్ పుట్టిన రోజు అయితే... తేదీని మే 7 అని తప్పుగా చూపిస్తోంది. ఈ వ్యవహారంపై బెంగాలీలు మండిపడుతున్నారు. తప్పులు లేకుండా ప్రచురించటం గూగుల్‌కి సాధ్యం కాదా? అంటూ కొందరు నిలదీస్తున్నారు. మరికొందరు తమదైన శైలిలో సోషల్ మీడియాలో గూగుల్‌పై సెటైర్లు పేలుస్తున్నారు. -
పగటి విశ్రాంతి
రవీంద్రనాథ్ టాగోర్ని ‘స్పిరిచువల్ హ్యూమనిస్ట్’ అంటారు. పెద్ద మాటే! కానీ ఇంకే విధమైన మాటకూ ఈ విశ్వ కవీంద్రుడిని మనకు అర్థం చేయించే శక్తి ఉండదేమో అనిపిస్తుంది. ఆధ్యాత్మికత కన్నా పైస్థితి స్పిరిచువాలిటీ. మనిషి కన్నా పైస్థితి మానవీయత. ఈ రెండు పైస్థితులపైనా ఉంటారేమో టాగోర్. ఇలాక్కూడా ఆయన అందకపోతే చిన్న కథనేదైనా వెదుక్కోవాలి మనం. గాంధీజీ ఓసారి రవీంద్రుని ఆశ్రమానికి వెళ్లారు. ఇద్దరూ మధ్యాహ్న భోజనం ముగించాక గాంధీజీ విశ్రమించారు. కొద్దిసేపటికే ఆశ్రమ సేవకులు వచ్చి, ‘‘మహాత్మా, రవీంద్రునికి చెప్పండి. విశ్రాంతి తీసుకొమ్మని. ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని మాకు ఆందోళనగా ఉంది. మేము చెబితే వినడం లేదు. మీరు చెబితే వింటారని మా ఆశ అన్నారు’. గాంధీజీ రవీంద్రుని గదికి వెళ్లారు. ‘‘అప్పుడే మీ విశ్రాంతి ముగిసిందా!’’ అని గాంధీజీని అడిగారు రవీంద్రుడు. ‘‘లేదు. మిమ్మల్ని విశ్రాంతి తీసుకొమ్మని చెప్పేందుకు వచ్చాను. మీ రాత పనులను కొంతసేపు పక్కనపెట్టొచ్చు కదా’’ అన్నారు గాంధీజీ. రవీంద్రుడు నవ్వారు. ‘‘పగటిపూట విశ్రాంతి తీసుకోకూడదని నా పన్నెడవ యేటే తీర్మానించుకున్నాను’’.. అని చెప్పారు. నిజంగానే రవీంద్రనాథ్ టాగోర్ అరవై తొమ్మిదేళ్ల పాటు పగటిపూట విశ్రాంతీ విరామం తీసుకోనేలేదు! మరి కర్తవ్య నిర్వహణలో క్షణమైనా విశ్రమించని వ్యక్తిని స్పిరిచువల్ హ్యూమనిస్ట్ అనుకోవచ్చా? ‘కర్తవ్యాన్ని దైవంలా భావించి, నిరంతరాయమైన కర్తవ్య నిర్వహణను అభౌతిక మానవీయ ధర్మంగా భావించిన వ్యక్తి’ అనే అర్థంలోనైతే ఆయన్ని స్పిరిచువల్ హ్యూమనిస్ట్ అనే అనుకోవాలి. -
జన గణ మనకు 'వంద'నం
అఖండ భారతావనిని ఒక్కటి చేసిన జనగణమన గీతానికి వందేళ్ల పండుగొచ్చింది. విశ్వకవి రవీంద్రనాథ్ఠాగూర్ విరచించి తొలిసారి స్వయంగా ఆలపించి ఈ గీతం ఈ నెల 28 నాటికి వందో ఏట అడుగుపెడుతోంది. ఆ మహనీయుడు ఆలపించింది మరెక్కడో కాదు.. మదనపల్లె బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాలలో..అందరం ఒక్కటే..మనందరి గీతం ఒక్కటేనంటూ జాతికి అంకితం చేసిన జాతీయగీతానికి బాణి కట్టింది కూడా ఇక్కడే.. వేష, భాషలు వేరైనా, కట్టుబాట్లు, విశ్వాసాలు విభేదించినా, రైతు నుంచి సరిహద్దులో సైనికుడి వరకు, పలుగు, పార పట్టే శ్రామికుడి నుంచి మరయంత్రాల మధ్య నరయంత్రంలా పని చేసే కార్మికుడి వరకు ఏ గీతం వింటే గుండె నిండా దేశభక్తి అలుముకుంటుందో ఆ జనగణమనకు రేపేశత వసంతాల సంబరం జరుగనుంది. మదనపల్లె సిటీ వందేళ్ల ఉత్సవాలకు శ్రీకారం ఈ నెల 24 నుంచి 28 వరకు భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహణకు కళాశాల యాజమాన్యం కసరత్తులు ప్రారంభించారు. కళాశాల కరస్పాడెంట్ విజయభాస్కర్‌చౌదరి, బీజేపీ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి కలిసి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి ఉత్సవాలను ఆహ్వానించారు. ఠాగూర్ కాటేజీ రవీంద్రనాథ్ ఠాగూర్ బస చేసిన గదిని కాటేజీ ఏర్పాటు చేశారు. అందులో విశ్వకవి చిత్రపటాలను పెట్టారు. కాటేజీ ఎదురుగా రవీంద్రుడి 90 కిలోల పాలరాతి విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఠాగూర్ ఆడిటోరియం నిర్మాణం జరుగుతోంది. లక్ష గళార్చన విశ్వకవి రవీంద్రుడి 150 జన్మదిన వేడుకలు పురస్కరించుకుని 2012లో బి.టి.కళాశాలలో లక్ష గళార్చన నిర్వహించారు. భారీ ఎత్తున జరిగిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 20 వేల విద్యార్థులచే ఐదు సార్లు జాతీయగీతం ఆలపించారు. దక్షిణ భారతదేశంలో శాంతినికేతన్‌గా పేరుపొందిన బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాల(బి.టి) జాతీయగీతం వందేళ్ల పండుగకు ముస్తాబవుతోంది. విశ్వ కవి రవీంద్రనాథ్ఠాగూర్ జనగణమనను ఆంగ్లంలోకి తర్జుమా చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి చరిత్రలో చెరగని స్థానం దక్కింది. మారుమూల ప్రాంత యువతకు విద్యను అందించాలన్న ధ్యేయంతో 1915లో డాక్టర్ అనిబీసెంట్ ఏర్పాటు చేసిన బీటీ కళాశాల స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది. ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఎందరెందరో దేశభక్తులను తయారు చేసింది. తొలిసారిగా.. దక్షిణ భారతదేశ పర్యటనను బెంగుళూరుకు వచ్చిన విశ్వకవి రవీంద్రనాథ్ఠాగూర్ విశ్రాంతికి 1919 ఫిబ్రవరి 25న మదనపల్లెకు విచ్చేశారు. ఇక్కడ వాతావరణానికి ముగ్ధుడైన ఆయన మార్చి 2 వరకు మదనపల్లెలోని బి.టి.కళాశాలలో బస చేశారు. ఈ సమయంలో ఇండోర్ గేమ్స్, సంగీత పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీల్లో విద్యార్థుల గళం నుంచి జాలువారిన దేశభక్తి గీతాలకు స్పందించిన ఠాగూర్ పోటీల అనంతరం ఆర్ట్స్ రూములో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తాను బెంగాల్ భాషలో రాసిన జనగణమణ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. అప్పటి బీటీ కళాశాల ప్రిన్సిపాల్ జేమ్స్ హెచ్.కజిన్స్ భార్య మార్గరేట్ కజిన్స్ సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఠాగూర్ అనువదించిన జనగణమణ గీతాన్ని మార్గరేట్ కజిన్స్ బాణి సమకూర్చారు. కళాశాలలో పెద్ద ఎత్తున జరిగిన పోటీల్లో ముగింపు సమావేశంలో ఈ గీతాన్ని తొలిసారిగా తానే స్వయంగా ఆలపించారు. ఠాగూర్ అనువదించిన జనగణమణ గీతాన్ని మార్గరేట్ కజిన్స్ బాణి సమకూర్చి విద్యార్థులతో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. 1950 జనవరి 24న జనగణమణను భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయగీతంగా ప్రకటించింది. 1950 జనవరి గణతంత్ర దినోత్సవాల్లో జాతీయగీతాన్ని అధికారికంగా మెట్టమొదట ఆలపించారు. మన జాతీయగీతానికిఅర్థం ఇది.. ‘జనులందరి మనస్సుకూఅధినేతవు. భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక. పంజాబు, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగ దేశాలతోనూ వింధ్య, హిమాలయ పర్వతాలతోనూ, యమునా గంగ ప్రవాహాలతోనూ, ఉవ్వెత్తుగా లేచే సముద్ర తరంగాలతోనూ శోభించే ఓ భారత విధాతా! వాటికి నీ శుభ నామం ఉద్భోద కలిగిస్తుంది. అవి నీ ఆశీస్సులు అర్థిస్తాయి. నీ జయగాథల్ని గానం చేస్తాయి. సమస్త జనులకూ మంగళ ప్రదాతవు. భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగు గాక! జయమగుగాక! జయమగుగాక!’ -
ఠాగూర్ పాఠ్యాంశాలను తొలగించట్లేదు..
న్యూఢిల్లీ: పాఠ్యపుస్తకాల నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరును తొలగించట్లేదని కేంద్రమానవ వనరుల శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ఈమేరకు రాజ్యసభలో జీరో అవర్‌లో తృనముల్ కాంగ్రస్ ఎంపీ దేరక్ ఒబ్రైన్ అగిన ప్రశ్నకు జవదేకర్ స్పందించారు. దేశం కోసం పాటుపడిన కవి, జాతీయ గీతం రచయత ఠాగూర్‌తోపాటు అందరిని బీజేపీ ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. పాఠ్యపుస్తకాల్లో దేనిని తొలగించట్లేదని, కేవలం ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఉన్న లోపాలను తెపాలని కోరినట్లు తెలిపారు. దీంతో పాటు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ పుస్తకాల్లోని ఉర్దూపదాలను తొలగించాలని సూచించారు. దీనిపై మెత్తం ఏడువేల సూచనలు, సలహాలు వచ్చాయన్నారు. సమస్యలు తలెత్తే ఏ పనిని కూడా తాము చేయబోమని మంత్రి తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ఎవరి సర్టిఫికేట్, మద్దతు అవసరం లేదని ఆయన అన్నారు. -
మానవీయతా మకుటధారి..!
ఆలోచనం కిస గౌతమి అనే స్త్రీ మరణించిన తన బిడ్డని బతికించమని అడిగినపుడు బుద్ద భగవానుడు, తల్లో, బిడ్డో, స్నేహితులో, బంధువులో ఇలా ఇంతవరకూ ఎవరూ మరణించని ఇంటి నుండి గుప్పెడు ఆవాలు తెమ్మన్నాడట, ఎవరూ మరణించని ఇల్లు ఈ భూమిపైన ఎక్కడయినా ఉంటుందా? ఆ గుప్పెడు ఆవాల కోసం తిరిగి అలిసిపోయిన గౌతమికి జననమరణాలు అత్యంత సహజమని తెలియవచ్చింది. సుఖదుఃఖాలు కూడా అంతే. ఈ పృథ్విపై సుఖాన్ని మాత్రమే అనుభవించే మనుషులు ఎవరూ వుండరు. కానీ కష్టాన్ని అనుభవించడం ఎంతో కష్టం. నాకొచ్చిన అటువంటి అత్యంత కష్టంలో సాంత్వనమిచ్చిన వాడు టాగోర్. టాగోర్ రాసిన 2230 పాటలలో ఒక పాట ‘‘ఎయి కోరేచి బాలో నిటుర్ హే’’. అందులో టాగోర్ అంటాడు కదా ‘‘నన్ను దుఃఖంతో జ్వలింపజేస్తున్నావ్ మంచిదే, ధూపం నిప్పులలో దహించబడకపోతే సుగం ధం వస్తుందా, దీపం జ్వలించకపోతే వెలుగు పుట్టదు కదా’’ అని. ఈ పాటను నాకు మానవి బందోపాధ్యాయ అనే ట్రాన్స్‌పర్సన్ పరి చయం చేశారు. తృతీయ ప్రకృతిగా మానవ సమూహాల నుంచి హేళనను ఎదుర్కొంటున్నపుడు, తనచేతిలో లేని తన పుట్టుక తనని బాధపెడుతున్నపుడు ఆ పాట ఇచ్చిన ఓదార్పు అనన్యమైనదని ఆమె చెప్పారు. నన్ను, మానవినే కాదు, కష్టసందర్భాలనే కాదు, టాగోర్ పాటలు మానవుని జీవితంలోని ప్రతి సందర్భాన్ని పలకరిస్తాయని ఆ పాట లను బెంగాలీ నుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్న సందర్భంలో నాకు అర్థమయింది. ఇవాళ వైశాఖం 25వ తేదీ, టాగోర్ పుట్టిన రోజు. కొంతమంది జీవించినపుడే కాదు, జీవితానంతరమూ జీవిస్తారు. మానవ సమాజ ఔన్నత్యానికి ఏమేంకావాలో అంచనావేయగల శక్తి వారిని కాలాతీతులను చేస్తుంది. టాగోర్ అటువంటి దార్శనికుడు. కథకుడిగా, కవిగా, వ్యాసకర్తగా, నాట కకర్త, గేయరచయిత ఇలా టాగోర్ సాహిత్య సృజనకారుడిగా అనేక రూపాలను సమర్థవంతంగా పోషించారు. ఆయన స్పృశించని మానవజీవన కోణమూ, ప్రశ్నించకుండా వదిలిన మూఢత్వమూ బహుశా లేవు. మాష్టారు గారు కథలో హరలాల్, రాస మణి కొడుకు కథలో కాళీ పద్ మరో మార్గమేమీ లేకుండా పేదరికానికి బలికావడం, పోస్ట్ మాస్టర్ కథలో రతన్, సమాప్తిలో తనకు తెలియకనే బాల్యం నుంచి యవ్వనంలోకి సాగిన చిన్ని మ్రున్మయి, ఎప్పుడు ఎందుకు అట్లా జరిగిందో తెలియక దుఃఖాన్ని గుప్తంగా గుండెల్లో దాచ ప్రయత్నించి ఓడిన చారులత, కులం గురించి మాట్లాడిన చండాలిక, సౌందర్యం గురించి చర్చించిన చిత్రాంగద రవీంద్రుని రచనా నైపుణ్యానికి మృదువైన చిరునామాలు. భార్య రాసిన లేఖ అనే కథలో రవీంద్రుడు తానే భార్యగా, ఒక స్త్రీ హృదయాన్ని చది వినట్లు, చీరకి నిప్పంటించుకుని చనిపోయిన తన అనాథ బాంధవి గురించి ‘ఊళ్లో వాళ్ళందరూ రేగారు. ఆడవాళ్ళు చీరెలకు నిప్పంటించుకుని చచ్చిపోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది’ అన్నారు. ఇదంతా నాటకం అన్నారు మీరు. కావచ్చు. కానీ ఈ నాటక క్రీడ–కేవలం బెంగాలీ స్త్రీల చీరెల మీదుగానే జరుగుతుందేం? బెంగాలీ వీర పురుషుల ధోవతుల అంచుల మీదుగా జరగదెందుకనీ? అది కూడా ఆలోచించి చూడ టం యుక్తం..! అని 1913 లోనే స్త్రీల తరపున నిర్ద్వంద్వపు వకాల్తా పుచ్చుకున్నాడు. నోబెల్ బహుమతి పొందిన గీతాంజలి ఆయన రచనలో ఒక చిన్ని పాలు మాత్రమే. టాగోర్ పూర్వీకులలో కొందరు ముస్లిం మతంలోకి మారగా, మిగిలిన వారిని పిరాలి బ్రాహ్మణులంటూ సమాజం వెలివేసింది. ఈ కారణం చేత టాగోర్ కుటుంబం తమకున్న అనేకానేక వ్యాపారాల చేత ఆర్థికంగా సంపన్న వర్గంగా ఉన్నప్పటికీ కులపరంగా చిన్నచూపును అనుభవించారు. వీరి ఇంటి పిల్లలకి సరయిన వివాహ సంబంధాలు రాక కాదంబరి, మృణాళిని వంటి పేదపిల్లలని వివాహమాడారు. అందుకే టాగోర్ తనపై మహమ్మదీయుల, హిందువుల, ఆంగ్లేయుల ప్రభావం ఉందనీ ఒక చోట అన్నాడు. మనుషులందరం ఒక్కటిగానే పుట్టాం దుర్మార్గులు కొందరు హెచ్చు తగ్గులను సృష్టిం చారు అన్న కబీరును టాగోర్ అనువదించడం వెనుక ఈ ప్రభావం కూడా ఉంది. ఈ రోజు ఉదాత్తులనుకునే కొంతమంది కులాలు లేవు మనందరం భారతీయులం అంటుండగా, టాగోర్ ఆ రోజులలోనే నా ప్రాణం ఉండగా నేను మానవీయతకంటే జాతీయత గొప్పది అనే భావనను అంగీకరించను అన్నాడు. ‘ఇంట బయట’లో ఆ విషయాలను చర్చించాడు. ఈ రోజు మనం మాట్లాడుతున్న మారిటల్ రేప్ గురించి అనేక ఏళ్ళ క్రితం ‘కుముదిని’లో చర్చించి, గర్భము, వివాహం, సమాజం స్త్రీ జీవితాన్ని ఎలా సంకెలలో ఉంచేస్తుందో చెప్తాడు. ‘‘నేను గే లాగా జీవించడమనేది, మైనారిటీలో ఉండ టం అంటే ఏమిటన్న అంశంపై నాకు లోతైన అవగాహనను ఇచ్చింది, నిత్యం ఇతర మైనారిటీ బృందాలలోని వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి తోడ్పడింది’’ అన్నాడు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్. బహుశా టాగోర్ పిరాలి బ్రాహ్మణత్వం, మాతృ లేమి, ప్రియబాంధవి కాదంబరి మరణము, సునిశితహృదయం అన్నీ కలిపి సమాజాన్ని కులము, మతము, లింగము, దేశము అనే భావనలకు అతీతంగా చూడటం నేర్పాయేమో. ఏది ఏమయినా టాగోర్, నెహ్రూ చెప్పినట్టు ఒక ‘‘సుప్రీమ్ హ్యూమన్’’. నాటికీ నేటికీ ఆయన మార్గం అనుసరణీయం. రాజులకు మరణం ఉంటుంది, కవులకు కాదు కదా. ఈ గొప్ప సాహిత్యకారుడికి, మానవీయ మూర్తికి, శాంతి నికేతన్ వ్యవస్థాపకునికి అత్యంత ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు! వ్యాసకర్త: సామాన్య కిరణ్ ప్రముఖ రచయిత్రి - 91635 69966 -
ఆ డాక్టరేట్‌కు ఎంతో గౌరవం
- ఇప్పటివరకు 47 మందికి ఓయూ గౌరవ డాక్టరేట్లు - ఠాగూర్ నుంచి నెహ్రూ దాకా ఎందరో ప్రముఖులు.. సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా.. అంతర్జాతీయ ఖ్యాతిని తన సిగలో ఇముడ్చుకున్న విశ్వవిద్యాలయం! ఈ వర్సిటీ డిగ్రీకి మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ చదువుకునేందుకు దేశ విదేశీయులు సైతం క్యూ కడుతుంటారు. మరి అలాంటి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందుకోవడమంటే అషామాషీ కాదు. ఎంతో నిపుణత ఉండాలి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన శాస్త్ర, సాంకేతిక నిపుణులు, మేధావులు, రాజకీయ, సాహితీవేత్తల సేవలను గుర్తించి వారిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించడం అనవాయితీగా వస్తోంది. 1917లో ప్రెసిడెన్సీ కాలేజీ బెంగాల్ లఖ్‌నవ్ కాలేజీలో అరబిక్ ప్రొఫెసర్‌గా పని చేసిన నవాజ్ ఇమాదుల్ ముల్క్ బహదూర్ ముల్క్కు తొలి గౌరవ డాక్టరేటు(డాక్టర్ ఆఫ్ లాస్)ను ప్రధానం చేసింది. ఆ తర్వాత సాహితీవేత్త రవీంద్రనాధ్ ఠాగూర్, భారత మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, సి.రాజగోపాలాచారి సహా మొత్తం 47 మందికి గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేసింది. 2001లో చివరి సారిగా అరుణ్ నేత్రావలికి(డాక్టర్ ఆఫ్ సైన్స్ విభాగం)గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఆ తర్వాతి నుంచి ఇప్పటివరకు గౌరవ డాక్టరేట్లను ఎవరికి ప్రకటించలేదు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడంతోపాటు మరో 51 మంది నిపుణులను ఘనంగా సన్మానించాలని భావించింది. ఆ మేరకు ఆయా రంగాల్లోని ప్రముఖులను ఎంపిక చేసింది. అయితే ఈ ఎంపికపై విద్యార్థులు, మేధావుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు వర్సిటీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, అభిప్రాయబేధాలు వల్ల గౌరవ డాక్టరేట్ ప్రదానంతో పాటు సన్మానాలను వాయిదా వేసింది. ఓయూ గౌరవ డాక్టరేట్లు పొందిన కొందరు ప్రముఖులు.. 1. రవీంద్రనాధ్ ఠాగూర్ (డాక్టర్ ఆఫ్ లిటరేచర్) 1938 2. సి.రాజగోపాలాచారి (డాక్టర్ ఆఫ్ లాస్)1944 3. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ (డాక్టర్ ఆఫ్ లాస్)1947 4. బాబూ రాజేంద్రప్రసాద్ (డాక్టర్ ఆఫ్ లాస్)1951 5. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (డాక్టర్ ఆఫ్ లిటరేచర్) 1953 6. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (డాక్టర్ ఆఫ్ లిటరేచర్)1953 7. బూర్గుల రామకృష్ణరావు (డాక్టర్ ఆఫ్ లాస్)1956 8. యాసర్ అరాఫత్ (డాక్టర్ ఆఫ్ లాస్) 1982 9. డాక్టర్ వై.నాయుడమ్మ (డాక్టర్ ఆఫ్ సైన్స్) 1982 10. డాక్టర్ మన్మోహన్ సింగ్ (డాక్టర్ ఆఫ్ లిటరేచర్) 1996 11. డాక్టర్ అరుణ్ నేత్రావలి (డాక్టర్ ఆఫ్ సైన్స్) 2001 -
వందేమాతరం ‘హోదా’ ఏమిటి?
- దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య భూమిక - జనం హృదయాల్లో నిలిచిపోయిన గేయం - చట్ట, రాజ్యాంగపరమైన గుర్తింపు మాత్రం లేదు! ‘వందేమాతరం’ గేయం భారత స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించింది. స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే భారతీయుల కాంక్షకు భావో ద్వేగ భూమికగా నిలిచింది. ఎందరో పోరాట యోధు లు వందేమాతరం ఆలపించి జైలు జీవితం అనుభవించారు. అంతగా పోరాట స్ఫూర్తిని నింపిన ‘వందేమాతరం’ గేయం దేశ స్వాతంత్య్రానంతరం తగిన గౌరవం పొందినా.. చట్టపరమైన, రాజ్యాంగపరమైన గుర్తింపు, రక్షణ దక్కలేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వందేమాతరం ఆలపించలేదని ఏడుగురు ముస్లిం కౌన్సెలర్ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానించారు. తాము వందేమాతరం ఆలపించబోమని, అయినా తమ సభ్యత్వం రద్దు చెల్లదని ఆ కౌన్సెలర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వందేమాతరం’ గేయం, దానికి చట్టపర గుర్తింపునకు సంబంధించిన పరిస్థితి వివరాలివీ.. స్వాతంత్య్ర కాంక్షకు ప్రతీక బంకిమ్ చంద్ర చటర్జీ 1876లోనే వందేమాతరం గేయాన్ని రాశారు. అయితే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరాలు కూర్చి ఆలపించాక బాగా ప్రాచు ర్యంలోకి వచ్చింది. 1896లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సభలో రవీంద్రుడు వందేమాతరం గేయాన్ని ఆలపించారు. అనంతర కాలంలో అది దేశవ్యాప్తమైంది. దేశభక్తికి, «బ్రిటిష్ పాలనపై ధిక్కారానికి ప్రతీకగా నిలిచింది. వందేమాతరం అని నినదించి ఎందరో జైలు జీవితాలు అనుభవించారు. 1911లో ఠాగూర్ ‘జనగణమన’ను రచించారు. దాన్ని ఆ ఏడాది డిసెంబర్ చివర్లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో ఆలపించారు. 1947 ఆగస్టు14న రాత్రి 11 గంటలకు సమావేశమైన భారత రాజ్యాంగ సభ కూడా ఎజెండాలో మొదటి అంశంగా వందేమాతరంలోని మొదటి చరణాన్ని ఆలపించింది. ముస్లింలీగ్ అభ్యంతరం మేరకు మొత్తం గీతాన్ని పాడలేదు. సమావేశం చివర్లో జనగణమనను పాడారు. స్వాతంత్య్రం వచ్చాక వందేమాతరం, జనగణమనల్లో ఏది జాతీయ గీతంగా ఉండాలనే చర్చ ప్రారంభమైంది. రాజ్యాంగ సభ దీనిపై నిర్ణయాన్ని వెలువరించాలి. కాంగ్రెస్ ‘జనగణమన’ వైపు మొగ్గింది. కారణం.. బహిరంగ రహస్యమే. ముస్లింలను నొప్పించకూడదని! రాజ్యాంగ సభ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. తీర్మానం ప్రవేశపెట్టి.. చర్చ అనంతరం అవసరమైతే ఓటింగ్ చేపట్టాలని భావించారు. కానీ ఆ అవసరం రాకుండా.. నాటి పెద్దలంతా ఒక అవగాహనకు వచ్చారు. దాంతో రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్.. ‘‘జనగణమన.. భారతదేశానికి జాతీయగీతంగా ఉంటుంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రక పాత్రను పోషించిన వందేమాతరం గేయాన్ని జనగణమనతో సమానంగా గౌరవించాలి. తప్పకుండా సమాన హోదా ఉండాలి..’’ అని ప్రకటించారు. ‘వందేమాతరం’పై నిబంధనలేమీ లేవు! ► రాజ్యాంగ, చట్టపరమైన రక్షణలేవీ వందేమా తరం గేయానికి లేవు. ► 1971 డిసెంబర్ 23న జాతీయ చిహ్నలను అవ మానించడాన్ని నిరోధించే చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. రాజ్యాంగం, జాతీయజెండా, జాతీయ గీతాలను అవమానించకుండా నిరోధించే నిబంధనలను అందులో పొందుపర్చారు. కానీ జాతీయగీతంతో సమాన హోదా ఉండాల్సిన జాతీయగేయం ‘వందేమాతరం’ ప్రస్తావన ఆ చట్టంలో ఎక్కడాలేదు. ► 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని ‘ఆర్టికల్51ఎ’లో పొందుపర్చారు. ‘ప్రతి భారత పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యాంగ విలువలను, సంస్థలను, జాతీయజెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి’ అని అందులో పేర్కొన్నారు. అందులోనూ వందేమాతరం ప్రస్తావన లేదు. ► జాతీయ గేయమైన వందేమాతరానికి జనగణమనతో సమాన హోదా కల్పించాలని, ఆ మేరకు చట్ట సవరణ చేసేలా ఆదేశించాలని కోరుతూ గతేడాది నవంబర్‌లో గౌతమ్ ఆర్ మొరార్కా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ► ఈ పిల్ దాఖలైన తర్వాత.. ‘ఏయే సందర్భాల్లో వందేమాతరం ఆలపించాలనే విషయానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. వందేమాతరం గేయానికి న్యాయం జరగాలంటే ఆ మేరకు నిబంధనలను రూపొందించాల్సిన అవసరముంది’ అని ప్రభుత్వం 2016 నవంబర్ 22న రాజ్యసభకు తెలిపింది. ► మొరార్కా పిల్‌పై హైకోర్టు ఇచ్చిన నోటీసుకు 2017 ఫిబ్రవరి8న కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.‘‘భారతీయుల మదిలో వందేమాతరం గేయానికి విశిష్ట స్థానముంది. అయితే జనగణమనతో సమానంగా దీనిని చూడలేం. సృజనాత్మకతను గౌరవించడానికి చట్టపరమైన రక్షణ కల్పించడం ఒక్కటే మార్గం కాదు. దేశానికి ఒకే జెండా, ఒకే జాతీయగీతం ఉంటాయి. అలాగని ఇతర గేయాలు, ప్రార్థనలకు తక్కువ గౌరవం ఇచ్చినట్లు కాదు. తమ మనసుకు నచ్చిన గీతాలు, పుస్తకాలు, చిహ్నాలను గౌరవించుకోకుండా పౌరులెవరినీ నిరోధించి నట్లు కాదు..’’ అని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఠాగూర్ నోబెల్ మెడల్ చోరీ కేసులో కొత్త మలుపు
కోల్ కతా: ప్రఖ్యాత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కు 1913లో వచ్చిన నోబెల్ బహుమతిని విశ్వభారతి మ్యూజియం నుంచి దొంగిలించిన గ్రూపుకు సాయం చేసిన వ్యక్తిని సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. బెంగాల్ జానపద గీతాలు(బాల్) సింగర్ ప్రదీప్ బౌరీ నిందితులకు సహకరించాడని పేర్కొన్నారు. బౌరీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాడానికి గుజరాత్ కు తరలించనున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. బౌరీ బిర్బూమ్ జిల్లాలోని అతని స్వగ్రామం రుప్పుర్ లో అరెస్టు చేసి విచారణకు తరలించినట్లు చెప్పారు. గత రెండు వారాలుగా బౌరీని ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు.. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ మెడల్ దొంగతనంతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. 1998 నుంచి 2003 వరకూ రుప్పూర్ గ్రామ సర్పంచ్ గా పనిచేసిన బౌరీ.. నోబెల్ మెడల్ ను దొంగతనం చేసేందుకు నిందితులకు సాయం చేయడమే కాకుండా రాష్ట్రం నుంచి పారిపోయేందుకు కూడా సహకరించినట్లు తెలిసింది. ఓ బంగ్లాదేశీ జాతీయుడు, ఇద్దరు యూరోపియన్ జాతీయులు ఈ దొంగతనంలో పాల్గొన్నట్లు బౌరీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. 2004లో మ్యూజియం నుంచి దొంగతనానికి గురైన మెడల్ ను తిరిగి తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పడంతో కేసులో విచారణ వేగవంతమైంది. -
పశుసంవర్ధకశాఖను ప్రగతి పథంలో నడిపిస్తా
lనూతన జేడీడాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు కేటాయించిన పథకాలు సక్రమంగా అమలు చేసి, పశుసంవర్ధకశాఖను ప్రగతి పథంలో నడిపించడానికి శాయశక్తులా కృషి చేస్తానని పశుసంవర్ధకశాఖ కొత్త జాయింట్ డైరెక్టర్ (జేడీ) డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్ అన్నారు. ప్రకాశం జిల్లాలో డీడీగా పనిచేస్తూ పదోన్నతిపై జిల్లాకు జేడీగా బదిలీపై వచ్చిన ఆయన సోమవారం స్థానిక పశుశాఖ కార్యాలయంలో ఇన్చార్జ్ జేడీ డాక్టర్ కె.జయకుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. పలువురు ఏడీలు, డాక్టర్లు, కార్యాలయ సిబ్బంది జేడీకి పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. -
స్వేచ్ఛా విహంగాలు (స్ట్రే బర్డ్స్)
ఎందుకు అనువదించానంటే? తెలుగునాట చలం ద్వారా రవీంద్రనాథ్ టాగోర్ కవిత్వానికి అభిమానులైన అనేకమందిలో నేనూ ఒకడిని. ఆ మార్ధవం, లాలిత్యం, తాత్వికత, మరీముఖ్యంగా కవిత్వం నన్నెంతో ఆకర్షించాయి. టాగోర్ ఇతర రచనలకోసం అంతర్జాలంలో వెతకగా దొరికినవాటిలో నన్ను ఆకర్షించినవి స్ట్రే బర్డ్స్, క్రిసెంట్ మూన్. స్ట్రే బర్డ్స్ 1916లో వచ్చింది. నేటికి సరిగ్గా వందేళ్ళు. ఇది రెండుమూడు వాక్యాలుండే 326 లఘు కవితల సంపుటి. ఒక్కో కవితా హైకూలా ఉంటుంది కానీ పాదవిభజన ఉండదు. ఏక వాక్యంలా సాగుతుంది. ఒక్కొక్కటి స్వేచ్ఛగా తిరిగే విహంగాల లాంటి ఆలోచనలకు అక్షర రూపాలు. ఇవి ఒక అందమైన పదచిత్రాన్నో లేక జీవితసత్యాన్నో తెలుపుతాయి. గుంపుగా ఎగిరే విహంగాలకు వేటి స్వేచ్ఛ వాటికుంటుంది. కానీ అన్నీ ఒకే మార్గంలో ప్రయాణిస్తాయి. ఆ మార్గమే టాగోర్ కవితాత్మ. 1915లో టాగోర్ ఒకనాడు- నది ఒడ్డున ప్రశాంత జలాలనుండి అనంతాకాశంలోకి ఎగిరిపోతున్న కొంగల గుంపును చూసి, ఆ పక్షుల చలనం స్వేచ్ఛా జీవనానికీ, ఆలోచనకూ ప్రతీక అని భావించి ఈ పుస్తకానికి ‘స్ట్రే బర్డ్స్’ అన్న పేరు పెట్టాడంటారు. స్ట్రే బర్డ్స్లోని వాక్యాలలోని కొన్ని టాగోర్ ఇతర రచనలైన ‘కణిక’,‘లేఖన్’లలో కనిసిస్తాయి. వీటిని బెంగాలీ నుంచి ఇంగ్లీషులోకి టాగోరే స్వయంగా అనువదించుకొన్నాడు. ఇతర కవితలను నేరుగా ఇంగ్లీషులోనే రచించాడు.తొలిసారిగా చదివినపుడు స్ట్రే బర్డ్స్ నన్ను సమ్మోహపరచింది. మరల మరల చదువుకొన్నప్పుడు ఆ కవితలలో గొప్ప సార్వజనీనత, తాత్వికత, సరళత కనిపించాయి. నాకు కలిగిన అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలని అనిపించి 2008లో అనువదించి, నా బ్లాగులో పెట్టినపుడు మంచి స్పందిన లభించింది. దీనిని ‘స్వేచ్ఛా విహంగాలు’ పేరిట ఇప్పుడు పుస్తకంగా తెచ్చాను. ‘అతను తన ఆయుధాలను/ తన దేవుళ్ళుగా చేసుకొన్నాడు/ అతని ఆయుధాల విజయం అతని ఓటమి’ అన్న వాక్యంలో టాగోర్ మానవజాతి ప్రస్థానాన్ని మూడు ముక్కల్లో చెప్పాడా అనిపిస్తుంది. ఈ పుస్తకం వచ్చిన సమయంలో మొదటి ప్రపంచయుద్ధం జరుగుతూన్నది. ఒక తుపాకి పేలటం మానవత్వం ఓటమిగా భావించాలన్న టాగోర్ మాట కాలదోషం పట్టని ప్రాపంచిక విషయం. ‘మృత్యువు అనే ముద్ర, జీవితం అనే నాణేనికి యోగ్యతనిస్తుంది/అప్పుడు మాత్రమే దానితో ప్రియమైన వాటిని కొనగలం’ అనే వాక్యంలో, జీవితాన్ని ప్రేమమయం చేసేది మృత్యువు మాత్రమేనన్న గొప్ప తాత్వికతను చాల సరళంగా చెపుతాడు టాగోర్. ‘చిన్నారి గడ్డిపోచా!/ నీ పాదం చిన్నదే కావొచ్చు కానీ/ పుడమి మొత్తం నీ అడుగుల క్రిందే ఉంది’ అనే వాక్యం పైకి ప్రకృతి వర్ణణలా అనిపించినా తరచి చూస్తే దానిలో జీవితం పట్ల ఉండాల్సిన ఆశావహ దృక్పథం వ్యక్తమౌతుంది.ఈ అనువాదం చేసేటపుడు రూపస్వేచ్ఛా, అక్కడక్కడా భావస్వేచ్ఛా తీసుకొన్నాను. ఇది నాకు అర్థమైన కోణాన్ని ఆవిష్కరించటానికి చేసిన ఒక ప్రయత్నంగానే భావిస్తాను. స్వేచ్ఛా విహంగాలు; మూలం: టాగోర్; పేజీలు: 68; వెల: 75; ప్రతులకు: అనువాదకుడు, 30-7-31, సూర్యనారాయణపురం, కాకినాడ. రచయిత: బొల్లోజు బాబా 9849320443 -
విశ్వకవికి చైనా నీరాజనం
భారత-చైనాల మధ్య సాహిత్య సాంస్కృతిక బంధాలకు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ పునాది వేశారు. తొమ్మిది దశాబ్దాల క్రితం ఆ మహాకవి చేసిన చైనా సందర్శన అక్కడి మేధావులను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ మహానుభావుడిని ఆ దేశం ఈనాటికీ గౌరవిస్తూనే ఉంది.మొన్న డిసెంబరు నెలలో చైనాలో పర్యటించిన మా భారత-చైనా మిత్రమండలి బృందం దృష్టిని ఈ విషయం విశేషంగా ఆకర్షించింది. చైనాలోని పాఠశాల విద్యలో ‘ఫ్రూట్ గ్యాదరింగ్’ అన్న టాగూర్ రచనను పాఠ్యాంశంగా పెట్టడం ద్వారా ఆ కవితా ధారను ఆ జాతి యావత్తూ బాల్యం నుంచే ఆస్వాదించే అవకాశాన్ని కల్పించారు. హైదరాబాదులో ఏడాదికోసారి పుస్తక ప్రదర్శన పెడితేనే పుస్తక ప్రియులకు పండుగ చేసుకున్నట్టుంటుంది. చైనా ఆర్థిక రాజధాని షాంఘై మహానగరంలో ఉన్న ఏడంతస్తుల ‘షాంఘై బుక్ సిటీ’లో మాత్రం ప్రతి రోజూ పుస్తక పండుగే. మన పుస్తక ప్రదర్శనకు ఎన్నో రెట్లుండే బుక్ సిటీలో లూషన్, గోర్కీ వంటి మహామహుల చిత్రపటాలతోపాటు రవీంద్రుడి చిత్రపటాన్ని కూడా పెట్టారు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా వాసిగా ఆయన గురించి వారు గర్వపడతారు. టాగూర్ కమ్యూనిస్టు కారు. నోబెల్ బహుమతి పొందిన ఆయన ‘గీతాంజలి’ని చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దిగ్గజాలలో ఒకరైన చెన్ డుగ్జియు చైనా భాషలోకి 1915లోనే అనువాదం చేశారు. భారతదేశంలో చైనాపై అధ్యయనానికి ‘విశ్వభారతి’లో రవీంద్రుడు ఏర్పాటు చేసిన చైనా భవనం తొలి భారత-చైనా సాంస్కృతిక సంబంధాలకు ఎంతగానో దోహదపడింది. తాన్యున్ వంటి చైనా మేధావులు, ఉపాధ్యాయులు ఈ చైనా భవనంలో చాలా కాలం గడిపారు. చైనా నాగరికత, ఆధునిక అభివృద్ధి గురించి అర్థం చేసుకోవడానికి ఈ భవనం ఎంతగానో ఉపయోగపడింది. బ్రిటిషు ఇండియాలో ఎక్కువగా పండించే నల్లమందును చైనాపై రుద్దడాన్ని టాగూర్ తన ఇరవయ్యవ ఏటనే వ్యతిరేకించారు. ‘చీనీ మార్నరే బేబస్’ అంటే ‘చైనాలో ప్రజలను చంపే వ్యాపారం’ అన్న శీర్షికన నల్లమందు వ్యాపారంపై 1881లోనే వ్యాసం రాశారు. చైనా సందర్శనకు ముందే టాగూర్‌కు ప్రముఖుడిగా గుర్తింపు ఉంది. రెండు నాగరికతల మధ్య ప్రేమ, సోదర ప్రియత్వం వెల్లివిరియాలనీ, పరస్పర ప్రయోజనాలను పొందే సంబంధాలను కొనసాగించాలనీ చైనా పర్యటన సందర్భంగా ఆ మహాకవి ఆకాంక్షించారు. ‘మీ నుంచి కొన్ని కలలు పుట్టుకొస్తాయి. మీనుంచి వచ్చే ప్రేమ సందేశం విభేదాలను తొలగిస్తుందని భావిస్తున్నా. ఏది సాధ్యమో అది చేశా. స్నేహితులను సంపాదించుకున్నా’ అని చైనాలో తన చివరి మాటగా టాగూర్ అన్న మూడు దశాబ్దాల తరువాత పంచశీల సూత్రాలపై ఉభయ దేశాలూ సంతకాలు చేశాయి. (వ్యాసకర్త : రాఘవశర్మ 9493226180) -
ఆ మాట రవీంద్రుడిదే
మోహన్‌దాస్ గాంధీకి ‘మహాత్మ’ అన్న బిరుదు ఇచ్చినదెవరు? నిస్సందేహంగా విశ్వకవి రవీంద్రనాథ్ టాగూరేనని గుజరాత్ హైకోర్టు మూడు రోజుల క్రితం తీర్పు చెప్పింది. ఈ విషయం చిన్న తరగతుల పాఠ్య గ్రంథాలలోనే ఉందనీ, నిజానికి ఈ విషయాన్ని జాతికి తెలియచేసిన ఘనత వాటిదేననీ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జేబీ పార్దివాలా తీర్పు చెప్పారు. రాజ్‌కోట్ జిల్లా పంచాయతీ శిక్షణ సమితి ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో గాంధీజీని మహాత్మ అని మొదట పిలిచినవారు ఒక పత్రికా రచయిత అని పేర్కొంది. దీని మీద సంధ్యా మారు అనే యువతి కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంతో మహాత్మ అని గాంధీజీని మొదట పిలిచినవారు రవీంద్రులేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఈ సంధిగ్ధం తొలగిపోయినందుకు సంతోషిద్దాం. -
'మహాత్మ' టైటిల్ పై మళ్లీ వివాదం!
అహ్మదాబాద్: భారత జాతిపిత గాంధీని ఉద్దేశించి నోబెల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ తొలిసారిగా 'మహాత్మ' అని సంబోధించారన్నది మనందరికీ తెలిసిన విషయం. దేశవ్యాప్తంగా ఉన్న పాఠ్యపుస్తకాల్లోనూ ఇదే ఉంటుంది. కానీ గుజరాత్ ప్రభుత్వం మాత్రం గాంధీకి 'మహాత్మ' బిరుదుని ఇచ్చింది టాగోర్ కాదు.. సౌరాష్ట్రలోని జెత్పూర్ పట్టణానికి చెందిన ఓ గుర్తు తెలియని విలేకరి అని పేర్కొంటున్నది. రాజ్‌కోట్ రెవెన్యూ డిపార్ట్మెంటులో పోస్టుల భర్తీ కోసం జిల్లా పంచాయతీ శిక్షణ సమితి ఇటీవల పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో గాంధీకి 'మహాత్మ' బిరుదు ఎవరు ఇచ్చారన్న ప్రశ్నకు సంబంధించిన వివాదం గుజరాత్ హైకోర్టు ముందుకు వచ్చింది. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉండగానే.. ఆయనను జెత్‌పూర్‌కు చెందిన ఓ విలేకరి 'మహాత్మ' అని సంబోధిస్తూ లేఖ రాశారని, ఈ విషయాన్ని గాంధేయవాది నారాయణ్ దేశాయ్ తన పుస్తకంలో వెల్లడించారని పంచాయతీ శిక్షణ సమితి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. అయితే, ఆ జర్నలిస్టు పేరు తెలియదని వెల్లడించింది. గాంధీకి 'మహాత్మ' అన్న బిరుదు టాగోర్ ఇచ్చారని మొదటి కీలో సమాధానంగా పేర్కొని.. ఫైనల్ 'కీ'లో గుర్తుతెలియని జర్నలిస్టు అని సమాధానంగా పేర్కొనడాన్ని తప్పబడుతూ.. ఈ పరీక్షకు హాజరైన సంధ్య మారు అనే అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం మూడు ప్రశ్నలకు సంబంధించి మొదటి 'కీ'లో సరైన సమాధానాలు ఇచ్చి.. ఫైనల్ కీలో దానిని మార్చారని ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. -
టాగూర్‌కు తగని అనువాదం
‘వెయ్యేళ్లలో స్ట్రేబర్డ్స్తో సరిపోల్చదగ్గ కవిత్వం రాలేదు. మళ్లీ చదివి స్పందించినందుకు అనువాదకుడికి కృతజ్ఞతలు మాత్రం చెప్పక తప్పదు’. విశ్వకవి రవీంద్రుడి నిరాడంబరతను, హృదయసౌందర్యాన్ని ప్రతిఫలించే ‘స్ట్రేబర్డ్స్’ కవితా సంకలనాన్ని గతంలో చాలా మంది చైనా భాషలోకి అనువదించారు. అయితే, ఫెంగ్‌టాంగ్ తాజాగా చేసిన అనువాదం వివాదాస్పదమైంది. అది అసభ్యకరంగా ఉందనీ, మూలరచనకు దూరంగా జరిగిందనీ అక్కడి సాహితీలోకం, పత్రికాప్రపంచం విరుచుకుపడింది. ఫెంగ్‌టాంగ్ అనువాదాన్ని తూర్పారబడుతూ ‘చైనా డెయిలీ’లో రేమండ్ జో అనే రచయిత పెద్ద వ్యాసమే రాయగా, ‘పీపుల్స్ డెయిలీ’ ఏకంగా సంపాదకీయమే రాసింది. మన దేశంలో కూడా ఫెంగ్‌టాంగ్ అనువాదంపైన నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఖంగుతిన్న జిజియాంగ్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ పబ్లిషింగ్ హౌస్ ఆ అనువాద ప్రతులను వెనక్కి తీసుకుంది. ఫెంగ్‌టాంగ్ కలం పేరుతో రాసే జాంగ్హైపెంగ్(44) చైనాలో ప్రసిద్ధ నవలా రచయిత. వైద్య శాస్త్రం చదివిన ఈయన ఎంసీకిన్సే కన్సల్టెంట్గానూ, ప్రభుత్వ కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌గానూ పనిచేసి, ఏడాది క్రితం రాజీనామా చేసి, వ్యాపారంలో స్థిరపడ్డాడు. స్ట్రేబర్డ్స్ లాంటి క్లాసిక్స్‌ను ప్రజల భాషలో సరళంగా రాస్తే బాగుంటుందని బూతులు రాశాడు. ‘ద వరల్డ్ టేక్స్ ఆఫ్ ఇట్స్ మాస్క్ ఆఫ్ వాస్ట్నెస్ ఫర్ ఇట్స్ లవర్’ అన్న రవీంద్రుడి మాటకు,‘ద వరల్డ్ అన్జిప్ప్డ్ హిజ్ ప్యాంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ లవర్’ అని అనువాదం చేశాడు. ఇలాంటి తప్పుడు అనువాదాల్ని పత్రికల్లో చాలా ఉదహరించారు. ఒక భాషా పదానికి సరైన సమీప పదం మరో భాషలో అరుదుగా మాత్రమే లభిస్తుంది. మంచి అనువాదకులు మూలానికి ఏ పదం తగిందో ఎంపిక చేసుకుంటారు. అది వారి వారి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ‘తన సొంత రచనను తన సొంత బాణీలో రాసుకునే స్వేచ్ఛ ఫెంగ్టాంగ్కు ఉంది. అలాంటి రచనను ఇష్టపడే పాఠకులు కూడా ఉంటారు. అందులో తప్పు లేదు. ఇలాంటి వక్రీకరణలను మాత్రం అనువాదాలనలేం’ అని పీపుల్స్ డెయిలీ తన సంపాదకీయంలో అభిప్రాయపడింది. ఇక, ఫెంగ్‌టాంగ్ అనువాదంపై రేమండ్ జో వ్యంగ్య బాణాలు సంధించాడు. ‘వైద్యశాస్త్రం చదివిన ఇతను దారి తప్పి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పొందాడు. తన మనసులో దాగి ఉన్న వాంఛ మేరకు సాహిత్యంలో నిష్ణాతుడు కావాలనుకున్నాడు. వీటన్నిటికీ తోడు అతనికి టెస్టోస్టిరోన్ ఎక్కువగా పనిచేయడం వల్లనే అసభ్యత ప్రదర్శించాడు’ అని జో రాశాడు. ‘ఫెంగ్ రాసినవి ఒక్కొక్కసారి లయాత్మకంగా ఉంటాయి. కానీ అవి అంతర్గత లయను పట్టివ్వలేవు. వెయ్యేళ్లలో స్ట్రేబర్డ్స్తో సరిపోల్చదగ్గ కవిత్వం రాలేదు. మళ్లీ చదివి స్పందించినందుకు అనువాదకుడికి కృతజ్ఞతలు మాత్రం చెప్పక తప్పదు’ అన్నాడు. అయితే, ఫెంగ్‌టాంగ్ మాత్రం వీటికి చలించలేదు. ‘చైనా భాషను నేను చాలా బాగా వాడగలను. నాకా గట్టి నమ్మకముంది. నా అనువాదం సరైనదే. ఆ అనువాదం తనని తాను చెప్పనివ్వండి. దాని మంచి చెడులను కాలమే నిర్ణయిస్తుంది,’ అన్న ఆయన సమాధానం ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న కృష్ణశాస్త్రి మాటలను గుర్తుచేయట్లేదూ! రాఘవ శర్మ 9493226180 -
జాతీయ గీతం వివాదం వెనుక..
న్యూఢిల్లీ: జాతీయ గీతం 'జన గణ మన అధినాయక జయ హే' పై మళ్లీ వివాదం రేగింది. రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఈ గీతంలో 'అధినాయక జయ హే'అన్న చరణాన్ని మార్చాలని డిమాండ్ చేయడంతో ఈ గీతం పూర్వపరాల్లోకి వెళ్లి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ గీతంపై వివాదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. వాస్తవానికి వందేళ్ల క్రితమే వివాదం మొదలైంది. భారత పర్యటనకు వచ్చిన కింగ్ జార్జ్-5 గౌరవార్థం కోల్‌కతాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 1911, డిసెంబర్ 27వ తేదీన ఓ భారీ సదస్సును ఏర్పాటు చేసింది. ఆ సదస్సు సాధారణ దేవుడి ప్రార్థనాగీతంతో ప్రారంభమైంది. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'జన గణ మన అధినాయక జయ హే' అన్న గీతాన్ని తొలిసారిగాబాలబాలికలు ఆలపించారు. అనంతరం ఐదవ కింగ్ జార్జ్‌ను సన్మానించి ఓ తీర్మానాన్ని ఆమోదించారు. చివరను కింగ్ జార్జ్‌ను ప్రశంసిస్తూ రాంభూజ్ చౌదరి రాసిన హిందీ గీతాన్ని ఆలపించారు. దీన్ని ఆంగ్లో-ఇండియా ప్రెస్ తప్పుగా కవర్ చేయడం వివాదానికి దారితీసింది. 'బ్రిటిష్ ఎంపరర్ గౌరవార్థం రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రత్యేకంగా రాసిన గీతాలాపనతో సదస్సు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి-ది ఇంగ్లీష్‌మేన్, డిసెంబర్ 28, 1911'. 'ఎంపరర్‌కు స్వాగతం చెబుతూ బెంగాల్ కవి ఠాగూర్ రాసిన గీతాలాపనతో సదస్సు ప్రారంభమైంది-ది స్టేట్స్‌మేన్, డిసెంబర్ 28, 1911'. '1911 డిసెంబర్ 27 తేదీ బుధవారం నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎంపరర్‌ను స్వాగతిస్తూ బెంగాలీలో పాడిన పాటతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఎంపరర్‌ను స్వాగతిస్తూ కాంగ్రెస్ సదస్సు ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించింది-ది ఇండియన్, డిసెంబర్ 29, 1911' 'దేవుడిని పొగుడుతూ పాడిన బెంగాలీ ప్రార్థనా గీతంతో కాంగ్రెస్ సదస్సు ప్రారంభమైంది. ఐదవ కింగ్ జార్జికి విధేయతను ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించారు. అనంతరం ఆయన్ని ప్రశంసిస్తూ హిందీలో ఓ గీతాలాపన చేశారు-ది అమృత బజార్ పత్రిక, డిసెంబర్ 28, 1911' ఇలాంటి కథనాలు ఆ తర్వాత ఠాగూర్ రాసిన జాతీయ గీతంపై వివాదానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఠాగూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఠాగూర్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాంతినికేతన్ పాఠశాలలో పిల్లలను చదివించకూడదంటూ కూడా ఆదేశాలు జారి చేసింది. 1930లో మళ్లీ దీనిపై వివాదం రేగింది. బంకిం చంద్ర ఛటర్జీ రాసిన 'వందేమాతరం'ను జాతీయ గీతంగా ఎంపిక చేద్దామంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గం పట్టుబట్టడంతో ఈ వివాదం ఏర్పడింది. అయితే వందేమాతరం గీతంలో దేశాన్ని దుర్గాదేవితో పోల్చడం వల్ల అది ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని (వారు అల్లాను తప్పించి మరొకరిని ప్రార్థించరుకనుక) అభిప్రాయపడి ఠాగూర్ గీతం జోలికి వెళ్లలేదు. 1937, నవంబర్ 10వ తేదీన పులిన్ బిహారి సేన్‌కు ఠాగూర్ తాను స్వయంగా రాసిన లేఖలో తాను రాసిన జాతీయ గీతం గురించి ప్రస్తావించారు. తాను కింగ్ జార్జ్ ఐదు లేదా ఆరు రాజుల గురించి రాయలేదని, అంతటి దౌర్భాగ్య పరిస్థితికి తాను ఎన్నడూ దిగజారనని స్పష్టం చేశారు. తాను అధినాయక్ అన్న పదాన్ని భారత దేశానికి, ఉద్యమానికి నాయకత్వం వహించే సారథి అనే అర్థంలోనే రాశానని వివరించారు. ఒక్క చరణం చదివి విశ్లేషిస్తే ఇలాగే ఉంటుందని, మొత్తం తాను రాసిన ఐదు చరణాలను చదవి, తన ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాలని అన్నారు. ఠాగూర్ వ్యక్తిత్వం, సాహిత్యోద్యమం గురించి బాగా తెలిసిన వారు కూడా గీతంలో బ్రిటీష్ ఎంపరర్‌ను ప్రశంసిస్తూ రాయలేదని ఇప్పటికి వాదిస్తారు. ఎప్పుడో సద్దుమణిగిందనుకున్న ఈ వివాదం బాబ్రీ మసీదుకు వ్యతిరేకంగా 1980 దశకంలో హిందుత్వ శక్తుల ఉద్యమంతో మళ్లీ రాజుకుంది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం వరకు కొనసాగింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్‌కు కూడా ఈ వివాదం సుపరిచితమే. అందుకనే ఆయనకు మళ్లీ ఈ వివాదం గుర్తొంచి మాట్లాడుతున్నట్టున్నారు. -
మౌనంగా ఎదిగిన మహావృక్షం
సందర్భం : 7న టాగోర్ జయంతి ఈ నెల 7 నుంచి రవీంద్రనాథ్ టాగోర్ 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. ప్రపంచం ఈ విశ్వకవికి వివిధ కార్యక్రమాల ద్వారా ఘనమైన నివాళి ఇవ్వబోతోంది. పైగా ఇది టాగోర్ ‘నైట్‌హుడ్’ పొందిన శత సంవత్సరం కూడా. 1915లో బ్రిటిష్ చక్రవర్తి 5వ జార్జి ఈ టైటిల్‌ను టాగోర్‌కి ప్రదానం చేశారు. ఆ తర్వాత ఆయన నైట్‌హుడ్‌ను తిరిగి ఇచ్చేయడం వేరే సందర్భం. ‘కనస్యూర్’ అనే ఇంగ్లిష్ మాటకు ‘రసహృదయ ప్రావీణ్యుడు’ అని అర్థం. ఈ మాట కూడా అర్థం కాని వాళ్లు ‘రవీంద్రనాథ్ టాగోర్’ అని అర్థం చెప్పుకోవచ్చు. సాహిత్యం, సంగీతం, చిత్రకళల రుచి, శుచి తెలిసిన మనిషి టాగోర్. ‘జనగణమన’కు జాతీయగీతంగా అంత ప్రాముఖ్యం వచ్చింది టాగోర్ కవితాప్రావీణ్యం వల్లనే. మనదే కాదు, బంగ్లాదేశ్ జాతీయగీతం కూడా టాగోర్ రాసిందే. శ్రీలంక జాతీయగీతానికి సైతం మూలకణాలు టాగోర్ రచనలోనివే! ఆయన కనస్యూర్ మాత్రమే కాదు. ‘పాలీమేథ్’ కూడా. అంటే బహుముఖ ప్రజ్ఞాశీలి. ‘రబీ’ ఒంటరి పిల్లవాడు రవీంద్రనాథ్ టాగోర్ 1891 మే 7న కలకత్తాలో జన్మించారు. అన్నలు, అక్కలు కలిపి ఆయన తలపై ఉన్నవారు మొత్తం 13 మంది. ఇక చూడండి ఆ ‘బాసిజం’ ఎలా ఉంటుందో! సంప్రదాయ బాసిజం అన్నమాట! బాగా సంపన్న కుటుంబం. ప్రతి అన్నకీ, అక్కకీ ఏదో ఒక టాలెంట్ ఉంటేది. నాటకాలు రాసేవారు, కవితలు వినిపించేవారు, బ్రిటిష్ ప్రభుత్వంలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు... ఇలా! పెద్దపెద్ద సంగీతకారులు, సాహితీవేత్తలూ నిర్విరామంగా ఆ ఇంటికి వచ్చిపోతుండేవారు. చిన్నప్పుడు చూడాలి ‘రబీ’ (రవీంద్రనాథ్ టాగోర్) దాక్కుని దాక్కుని తిరిగేవారు. అమ్మ పోయాక రబీ మరీమౌనంగా అయిపోయాడు. ఒంటరిగా ఉండిపోయేవాడు. టాగోర్ పదమూడో ఏట తల్లి శారదాదేవి చనిపోయారు. ఎస్టేట్ పనుల మీద తండ్రి దేవేంద్రనాథ్ టాగోర్ ఎప్పుడూ దేశాలు పట్టుకుని తిరిగేవారు. టాగోర్‌కి స్కూల్ అంటే ఇష్టం లేదు, ద్వేషం కూడా! ఇక లాభం లేదని పెద్దన్నయ్య టాగోర్ని ఇంట్లోనే ఉంచి లిటరేచర్, హిస్టరీ, జాగ్రఫీ, మేథ్స్, శాంస్క్రిట్, ఇంగ్లిష్, డ్రాయింగ్ నేర్పారు. ఇంట్లో నేర్చుకోవడం కూడా టాగోర్‌కి ఇష్టం లేదు. అతడి దృష్టంతా బయటి ప్రకృతి మీదే. గంగానదిలో ఈదాలని, కొండలు గుట్టలు ఎక్కాలనీ.. అదో లోకంలో ఉండేవాడు. ఆ లోకంలోంచి ఆవిర్భవించిందే, పెద్దయ్యాక టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ పాఠశాల. చెట్ల మధ్య ఆరుబయటి తరగతి గదుల స్కూల్ అది. ఇరవై ఏళ్లలో రెండు వేలు! టాగోర్ ప్రధానంగా రచయిత. కవి. చిన్నచిన్న కథలు చాలా రాశారు. గొప్పగొప్ప కవితలల్లారు. పాటలు రాశారు. నాటక రచయితగా కూడా ప్రసిద్ధులయ్యారు. ఆయన కవితా సంకలం ‘గీతాంజలి’ ఆయనకు నోబెల్ బహుమతి సంపాదించిపెట్టింది. అలా ఆసియా ఖండానికి తొలి నోబెల్ దక్కింది. టాగోర్ మంచి చిత్రకారుడు కూడా. కానీ ఆయనకు ఆ అభిరుచి 60 యేట మొదలైనది! ఆయన 80 ఏళ్లు బతికారు. ఈ ఇరవై ఏళ్ల కాలంలో టాగోర్ రెండు వేల చిత్రాలు గీశారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పైగా అవన్నీ జీవ కళ ఉట్టిపడేవి. ఆర్ట్ ఆయన నేర్చుకున్నది కాదు. తనకు తానుగా తీర్చిదిద్దుకున్నది. ఆర్ట్‌ను అధ్యయనం చేయడం కోసం టాగోర్ ఐరోపా ఖండం తిరిగొచ్చారు. పాల్ క్లీ, హెన్రీ మెటిస్సీ, కాండిన్స్కీ వంటి మహనీయుల చిత్రలేఖన రీతులను సునిశితంగా పరిశీలించారు. ఆ అవగాహనతో ప్రకృతి దృశ్యాలు, పోట్రెయిట్‌లు, నైరూప్య చిత్రాలు గీశారు. టాగోర్ చిత్రాలు గాఢమైన రంగుల కలగాపులగంలా ఉంటాయి. ‘‘ఏంటీ మనిషి, వర్ణాల వ్యత్యాసాన్ని గుర్తించలేడా’’అని టాగోర్ని విమర్శించినవారూ ఉన్నారు. నైట్‌హుడ్ తిరస్కారం టాగోర్‌లోని రసహృదయ ప్రావీణ్యాన్నీ, బహుముఖ ప్రజ్ఞాశీలతను గుర్తించిన బ్రిటిష్ రాజు ఆయనకు ‘నైట్‌హుడ్’ను ప్రదానం చేశారు. అంటే టాగోర్ అప్పటి నుంచి ‘సర్’ టాగోర్ అని. అయితే 1919తో జలియన్‌వాలా బాగ్‌లో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్న వందలాదిమంది భారతీయులను బ్రిటిష్ ప్రభుత్వం కాల్చిచంపడంతో టాగోర్ తీవ్రమనస్థాపానికి గురయ్యారు. తన నైట్ హుడ్ను తిరిగి ఇచ్చేశారు. టాగోర్ 1941 ఆగస్టు 7న చనిపోయారు. ఆయన పుట్టిన రోజు, మరణించి రోజు 7వ తేదీ కావడం విశేషం. -
హిందూదేశంగా మార్చాలి: భాగవత్
సాగర్: నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఆకాంక్షించినట్లు హిందూ మతం భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తుందని.. భారత్‌ను హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఆదివారం ముగిసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భాగవత్ ప్రసంగిస్తూ.. భారత్ హిందూ దేశంగా మారాలంటూ అందుకు ఠాగూర్ రచించిన ‘స్వదేశీ సమాజ్’ పుస్తకాన్ని ఉటంకించారు. ‘ పుస్తకంలో ఠాగూర్ బ్రిటిష్‌వారిని విమర్శించారు. హిందువులు, ముస్లింలు తమలో తాము కొట్లాడుకోవటం ద్వారా ఒకరినొకరు అంతం చేసుకోబోరని వారు ఉమ్మడిగా ఒక మార్గం కనిపెడతారని ఆ మార్గం హిందూదేశమని చెప్పారు’ అని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని, సామరస్యాన్ని హిందుత్వం సమర్థిస్తుందన్నారు. ఒక దేశ ప్రజలు అభద్రతాభావంలో ఉన్నప్పుడు ఆ దేశం భద్రంగా ఉన్నట్లు చెప్పలేమన్నారు. ఎడారి, తక్కువ, జనాభా, విదేశీ దాడులు వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. ‘భారత్‌కు 5,000 కిలోమీటర్ల భూమి ఉంది. కోట్లాది మంది జనాభా ఉంది. శక్తిమంతమైన నాయకులు ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ మనల్ని దాటి ముందుకెళ్లిపోయింది’ అని అన్నారు. -
తెలుగు వెలుగు..గురజాడ!
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మేలిమలుపు తిప్పిన ఘనత మహాకవి గురజాడ అప్పారావుకు దక్కుతుందనడంలో సందేహం లేదు. బెంగాలీలకు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలాగో తెలుగువారికి గురజాడ అంతటి గొప్ప కవి. ఆదివారం ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. ఒంగోలు కల్చరల్ : కవిత్వంలో మూస విధానాన్ని బద్దలు కొడుతూ ముత్యాల సరమనే కొత్త ఛందాన్ని సృష్టించి గేయ కవితలు రచించిం ది గురజాడ అప్పారావే. దేశభక్తి గేయంతో పాటు పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.. కన్యక వంటి పలు కవితా ఖండికలు గురజాడ కవిత్వ ప్రతిభకు మచ్చుతునకలు. గుర జాడ సృష్టించిన వినూత్న కవిత్వ మార్గమే తనకు మార్గదర్శకమైందని స్వయంగా శ్రీశ్రీ పేర్కొనడం విశేషం. రాళ్లురప్పలతో కూడిన ముళ్లబాటలో గురజాడ వెలుగుబాట వేస్తే ఆ మార్గాన్ని తాను మరింత వెడల్పు చేశానని, తన మహాప్రస్థానంలోని గేయాలన్నీ ఆ ప్రభావంతో రచించినవేనని శ్రీశ్రీ పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం సాహిత్యాభిమానులకు తెలిసిందే. గురజాడ అప్పారావు సమాజంలోని అంధవిశ్వాసాలను నిరసించారు. అందరూ తోక చుక్కను చూసి భయపడే రోజుల్లో భూమికి దూరపు బంధువైన తోకచుక్క అరిష్టదాయకం కాదని ధైర్యం చెప్పడమేగాక ఆ తోక చుక్కకు సాదర ఆహ్వానం పలికారు గురజాడ. దురాచారంపై దూసిన ఖడ్గం కన్యాశుల్కం గురజాడ కీర్తిని శాశ్వతం చేసిన కన్యాశుల్కం నాటకం ఒక చారిత్రక అవసరాన్ని నెరవేర్చింది. ఆనాటి సమాజంలో అమాయక స్త్రీల జీవితాలను సంక్షుభితం చేస్తున్న కన్యాశుల్క దురాచారానికి మంగళం పాడేందుకు సాహిత్యాన్ని గురజాడ వజ్రాయుధంలా సంధిం చారు. తదనంతరం కాలంలో ఆ నాటకం వల్ల కన్యాశుల్క దురాచారం తగ్గుముఖం పట్టిందని చెప్పడంలో సందేహం లేదు. సమాజానికి మేలు చేసేదే నిజమైన సాిహ త్యమనే విమర్శకుల అభిప్రాయాన్ని గురజాడ నిజమని నిరూపించారు. కన్యాశుల్కం నాటకం రచించి వందేళ్లకు పైబడినా ఆ నాటకం నేటికీ నిత్యనూతనం. గురజాడ నిస్సందేహంగా ప్రజాకవి, మహాకవి, యుగకవి. ప్రజల కోసం, వ్యవస్థలో నిజమైన మార్పు కోసం అక్షర సమరం సాగించిన భాషాయోధుడు. వ్యావహారికభాషగా తెలుగుకు తగిన గుర్తింపు తేవడం కోసం అవిశ్రాంతంగా శ్రమించిన పోరాటశీలి. సాంఘిక సంస్కరణకు తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి. గురజాడ మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరణీయం. గురజాడ రచించి న ‘దేశమును ప్రేమించుమన్న.. మంచి అన్నది పెంచుమన్న.. ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టి మేల్ తలపెట్టవోయి..! అనే దేశభక్తి గేయం ఒక్కటిచాలు ఆయన కీర్తిని అజరామరం చేసేందుకు. ఆ గేయం నేటికీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని ప్ర సాదిస్తూనే ఉంది. దేశమంటే ఏమిటో ప్రజలంటే ఎవరో చాటిచెబుతూ జాతిని జాగృతం చేస్తూనే ఉంది. నాటికీ నేటికీ ఒక్కటే అడుగుజాడ.. అదే గురజాడ సృష్టించిన వెలుగు జాడ! -
బ్రహ్మానందంలో బయటపడిన రెండోకోణం
బ్రహ్మానందం అనగానే గతంలో తెలుగు లెక్చరర్ అని, ప్రస్తుతం హాస్యనటుడని మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయనలో మనందరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. కేవలం హాస్య కళ మాత్రమే కాక.. శిల్పాలు చేయడం కూడా మన బ్రహ్మానందానికి వచ్చు! ఈ విషయం ఇన్నాళ్ల పాటు ఎప్పుడూ వెలుగులోకి రాలేదు. తాజాగా ఆయన బంకమట్టితో ఓ విగ్రహాన్ని రూపొందించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మను ఆయన జీవం ఉట్టిపడేలా తయారు చేశారు. ఈ విగ్రహాన్ని తయారుచేసే క్రమంలో ఉన్న ఫొటోలను కూడా బ్రహ్మానందం తన ఫేస్బుక్ పేజీలో అభిమానులందరికీ షేర్ చేశారు. దాంతో ఆయనలో్ ఉన్న రెండో కోణం కూడా అభిమానులకు తెలిసింది. -
పాదాల కష్టం!
గ్రంథపు చెక్క మనిషి పాదం అతను నుంచొని భూమి మీద నడవడానికి అనుకూలంగా రూపొందింది. కానీ ఏ రోజు నుండి జోళ్ళు తొడుక్కోవడం ప్రారంభమయ్యిందో అప్పటి నుండి పాదాలకు ధూళి తగలకుండా జాగ్రత్త పడడం వల్ల పాదాల పాకృతిక అవసరం, ఉద్దేశం రెండూ మట్టిలో కలిసిపోయాయి. ఇంతవరకు మన పాదాలు మన బరువును మోసే శక్తిని కలిగి ఉన్నాయి. కాని ఈరోజు పాదాల బరువును మనం మోస్తున్నాం. చెప్పులు లేకుండా ఒట్టి కాళ్ళతో నడవవలసి వస్తే పాదాలు మనకు సహాయం చేయడం మాట అటుంచి కష్టం కలిగిస్తున్నాయి. మన మనసును, బుద్ధిని పాదాల సేవకు ఉపయోగించకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంచెం చలి తగిలితే తుమ్ములు వస్తాయి. నీళ్లు తగిలితే జ్వరం వస్తుంది. ఏమీ చేయలేక జోళ్ళు, స్లిపర్స్, బూట్ల ద్వారా వాటిని పూజించవలసి వస్తోంది. ఈ కృత్రిమ ఉపకరణలనే ఆశ్రయించి వాటినే సౌకర్యంగా భావిస్తూ ప్రాకృతిక శక్తిని అసౌకర్యంగా భావిస్తున్నాం. వస్త్రాలు తొడిగి తొడిగి ఏ స్థితికి తెచ్చామంటే మన మాంసం కంటే, చర్మం కంటే అవి విలువైపోయాయి. మనం మన ప్రాచీన కాలం వైపు చూసినట్లయితే గుడ్డివాని చేతికర్ర వలె వస్త్రాలు. చెప్పులు మనకు తప్పనిసరి అనే నియమం మన ఉష్ణదేశాల్లో లేదని తెలుస్తుంది. మనం అతి తక్కువ వస్త్రాలను ధరించేవాళ్లం. మన పిల్లలు బాల్యంలో చాలా సంవత్సరాల వరకు బట్టలు, చెప్పులు తొడుక్కునేవారే కారు.కేవలం విదేశాలకు వెళ్లి వచ్చిన సజ్జనులే కాదు, మన నగరాల్లో ఉండే సాధారణ గృహస్థులు కూడా తమ పిల్లలు, బంధువులు, అతిథుల ఎదురుగా నగ్నంగా ఉండడం చూసి సిగ్గు పడుతున్నారు. సంకోచపడుతున్నారు. ఇలా చేయడం వల్ల విద్యావంతుల్లో ఒక కృత్రిమమైన సిగ్గు ఏర్పడుతోంది. పరిస్థితి ఈ విధంగానే ఉంటే కొంత కాలానికి కుర్చీలు, బల్లల కాళ్ళు కూడా నగ్నంగా ఉంటే చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. - రవీంద్రనాథ్ టాగూర్ ‘విద్య’ పుస్తకం నుంచి. (తెలుగు: విజయ నీలగ్రీవం) -
నోబెల్ బహుమతిని సాధించిన మొదటి మహిళ?
నోబెల్ బహుమతులు నోబెల్ బహుమతులను స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఏర్పాటు చేశారు. అక్టోబర్ 21, 1833లో ఆల్ఫ్రెడ్ నోబెల్ జన్మించారు. ఆయన 355 ఆవిష్కరణలు చేశారు. అందులో అత్యంత ప్రధానమైంది డైనమైట్. నోబెల్ 1895లో రాసిన వీలునామా ప్రకారం ఈ బహుమతుల ను ఇస్తున్నారు. మానవాళి అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఐదు రంగాల్లో బహుమతులు ఇవ్వాలని వీలునామాలో రాసి డిసెంబర్ 10, 1896లో నోబెల్ మరణించారు. ఆయన పేర్కొన్న ఐదు విభాగాలు భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం లేదా ఫిజియాలజీ, సాహిత్యం, శాంతి. నోబెల్ బహుమతులను తొలిసారి 1901లో ప్రదానం చేశారు. వీటిని ప్రతి ఏటా ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న బహూకరిస్తారు. స్వీడన్ కేంద్ర బ్యాంక్ ‘స్వెర్జిస్ రిక్స్ బ్యాంక్’ 1968లో ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఆర్థిక శాస్త్రంలో బహుమతిని ఏర్పాటు చేసింది. 1969 నుంచి దీన్ని ప్రదానం చేస్తున్నారు. ప్రస్తుతం ఆరు విభాగా ల్లో నోబెల్ బహుమతులను ఇస్తున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌ల్లో నోబెల్ బహుమతులను స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడి ష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అందిస్తోంది. స్వీడన్ లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్.. మెడిసిన్‌లో, స్వీడిష్ అకాడమీ.. లిటరేచర్‌లో ్రపదానం చేస్తాయి. శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తుంది. మిగిలిన ఐదు బహుమతులు స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ్రపదానం చేస్తారు. ఒక్కో విభాగంలో ప్రైజ్‌మనీ 8 మిలియన్ స్వీడిష్ క్రోనార్ లేదా 1.1 మిలియన్ డాలర్లు. తొలి గ్రహీతలు(1901) ఫిజిక్స్ - విలియం రాంట్జెన్ (జర్మనీ) కెమిస్ట్రీ - జాకోబ్ వాంట్ హాఫ్ (నెదర్లాండ్స) మెడిసిన్- ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్ (జర్మనీ) లిటరేచర్ - సలీ ప్రధోమ్ (ఫ్రాన్స) శాంతి - హెన్రీ డ్యునాంట్ (స్విట్జర్లాండ్) ఫ్రెడరిక్ పాసీ(ఫ్రాన్స) 1969లో ఎకనామిక్స్‌లో తొలి నోబెల్‌ను రాగ్నర్ ఫ్రిష్ (నార్వే), జాన్ టింబర్ జాన్ (నెదర్లాండ్స) లకు ్రపదానం చేశారు. 1901 నుంచి 2014 వరకు నోబెల్ బహు మతులను 889 మంది వ్యక్తులు, సంస్థలు దక్కించుకున్నారు. ఇందులో భౌతికశాస్త్రంలో 199, రసాయన శాస్త్రంలో 169, వైద్యశాస్త్రంలో 207, సాహిత్యంలో 111, ఆర్థికశాస్త్రంలో 75 మంది గ్రహీతలున్నారు. శాంతి బహుమతిని 103 మంది వ్యక్తులు, 25 సంస్థలకు ్రపదానం చేశారు. మహిళా విజేతలు: ఇప్పటివరకు 46 మంది మహిళలకు నోబెల్ బహుమతి లభించింది. ఈ బహుమతి పొందిన మొదటి మహిళ మేరీ క్యూరీ (1903). మదర్ థెరిసా (1979), ఆంగ్‌సాన్ సూకీ (1991), షిరీన్ ఎబాదీ (2003), వంగరి మతాయ్ (2004), ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ (2011) వంటి వారు నోబెల్ బహుమతిని పొందారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలుచుకున్నవారు ద ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్‌క్రాస్ .. నోబెల్ శాంతి బహుమతిని మూడుసార్లు (1917, 1944,1963) గెలుచుకుంది. జె. బార్టీన్ ఫిజిక్స్‌లో రెండుసార్లు (1956, 1972) విజేతగా నిలిచారు. మేరీ క్యూరీ రెండు సార్లు (1903- ఫిజిక్స్, 1911- కెమిస్ట్రీ) నోబెల్ బహుమతులు సాధించారు. ఫ్రెడరిక్ సాంగర్ కెమిస్ట్రీలో రెండు సార్లు (1958, 1980)లో గెలుచుకోగా, యునెటైడ్ నేషన్స హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ సంస్థ (యుఎన్ హెచ్‌సీఆర్) నోబెల్ శాంతిని రెండుసార్లు (1954,1981) దక్కించుకుంది. లైనస్ పౌలింగ్ 1954లో కెమిస్ట్రీలో, 1962లో శాంతి బహుమతిని గెలుచు కున్నారు. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు వ్యక్తులు లేదా సంస్థలు ఒకటి కంటే ఎక్కువ సార్లు నోబెల్ బహుమతులు పొందారు. మరణానంతరం గ్రహీతలు: నోబెల్ బహు మతులను మరణానంతరం ఇవ్వరాదని 1974 లో నిర్ణయించారు. అంతకుముందు ఎరిక్ ఎక్సెల్ కార్ల ఫెల్డ్కు 1931లో సాహిత్యంలో, డాగ్ హామర్స జోల్డ్‌కు 1961లో శాంతి బహుమతి మరణానంతరం లభించాయి. భారత గ్రహీతలు: భారతదేశ పౌరసత్వం ఉన్న వారు, విదేశాల్లో స్థిరపడిన భారతీయులు మొత్తం ఎనిమిది మందికి నోబెల్ బహుమతి లభించింది. 1.రవీంద్రనాథ్ ఠాగూర్: 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ అవార్డు లభించిన తొలి ఆసియా ఖండవాసి ఠాగూర్. 1861, మే7న జన్మించిన ఠాగూర్ 1941, ఆగస్టు 7న మరణించారు. బెంగాల్‌కు చెందిన ఆయనను గురుదేవ్ అని సంబోధిస్తారు. ఆయన రచించిన గీతాంజలి విశ్వవిఖ్యాతి చెందింది. భారత జాతీయగీతం జన గణ మన, బంగ్లాదేశ్ జాతీయగీతం అమర్ శోనార్ బంగ్లా ఠాగూర్ రచనలే. 1915లో నైట్‌హుడ్‌తో సత్కరించారు. జలియన్ వాలాబాగ్ మారణకా ండకు నిరసనగా 1919లో ఠాగూర్ నైట్‌హుడ్‌ను తిరస్కరించారు. 2. సర్ సి.వి. రామన్: 1930లో ఫిజిక్స్‌లో నోబెల్ లభించింది. రామన్ ఎఫెక్ట్‌ను కను గొన్నందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. చంద్రశేఖర వెంకటరామన్ 1888, నవంబర్ 7న తమిళనాడులో జన్మించారు. 1928, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. అందువల్ల ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1929లో బ్రిటి షర్లు రామన్‌ను నైట్‌హుడ్‌తో సత్కరించారు. 1954లో భారతరత్న అవార్డు లభించింది. ఆయన 1970, నవంబర్ 21న బెంగళూరులో మరణించారు. 3. హర్గోబింద్ ఖొరానా: భారతీయ అమెరికన్ బయోకెమిస్ట్ అయిన హర్గోబింద్ ఖొరానాకు 1968లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. ఆయన 1922, జనవరి 9న పంజాబ్‌లో జన్మించారు. 1966లో అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించారు. 2011 నవంబర్ 9న యునెటైడ్ స్టేట్స్‌లోని మసాచుసెట్స్‌లో మరణించారు. 4. మదర్ థెరిసా: 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మదర్ థెరిసా 1910, ఆగస్టు 26న ఆప్పటి ఒట్టొమాన్ సామ్రాజ్యం లోని స్కోపేలో జన్మించారు. ఆమె అసలు పేరు ఏంజెజ్ గోంజె బొజాజియు. ఆమె 1929లో భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను 1950లో ఏర్పాటు చేశారు. మదర్ థెరిసాకు 1980లో భారతరత్న అవార్డు లభించింది. 1997 సెప్టెంబరు 5న కలకత్తాలో మరణించారు. 5. సుబ్రమణ్యన్ చంద్రశేఖర్: 1983లో ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి లభించింది. 1910, అక్టోబర్ 19న బ్రిటిష్ ఇండియాలోని లాహోర్ లో జన్మించారు. 1953లో యునెటైడ్ స్టేట్స్ పౌరస త్వాన్ని స్వీకరించారు. భారత ప్రభుత్వం 1968లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించి ంది. 1995, ఆగస్టు 21న అమెరికాలోని చికాగో నగరంలో మరణించారు. 6. అమర్త్యసేన్: సంక్షేమ ఆర్థికశాస్త్రంలో చేసిన కృషికిగాను 1998లో నోబెల్ బహుమతి లభించింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఏకైక భారతీయుడు. ఆయన 1933 నవంబర్ 3న బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీ (ప్రస్తుతం పశ్చిమబెంగాల్)లో జన్మించారు. 1972 నుంచి అమెరికా, యునెటైడ్ కింగ్‌డమ్‌లలోని పలు విశ్వ విద్యాల యాల్లో బోధించారు. ప్రస్తుతం బీహార్‌లోని నలందా విశ్వవిద్యాలయానికి చాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. 1999లో భారతరత్న లభించింది. అమర్త్యసేన్ పలు పుస్తకాలు రాశారు. డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్, ద ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్, ఐడెంటిటీ అండ్ వయొలెన్స: ద ఇల్యూజన్ ఆఫ్ డెస్టినీ, ద ఐడియా ఆఫ్ జస్టిస్ వంటివి ప్రముఖ రచనలు. 7.వెంకట్రామన్ రామకృష్ణన్: 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. 1952లో తమిళనాడులోని చిదంబ రంలో జన్మించిన వెంకట్రామన్ రామకృష్ణన్‌కు అమెరికా, బ్రిటిష్ పౌరసత్వాలున్నాయి. రైబోజోమ్‌లపై పరిశోధనకుగాను నోబెల్ లభించింది. 2010లో పద్మవిభూషణ్‌ను ప్రదా నం చేశారు. 8. కైలాష్ సత్యార్థి: 2014 నోబెల్ శాంతి బహుమతిని మలాలా యూసఫ్ జాయ్‌తో కలిసి గెలుచుకున్నారు. 1954, జనవరి 11న మధ్యప్రదేశ్‌లోని విదిషలో జన్మించారు. బాలల హక్కులపై పోరాడుతున్నారు. 1980లో ‘బచ్పన్ బచావో ఆందోళన్’ సంస్థను స్థాపించి బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 144 దేశాల్లో 83,000 మంది బాలబాలికల హక్కు లను పరిరక్షించారు. 2013 విజేతలు ఫిజిక్స్: బ్రిటన్‌కు చెందిన పీటర్ హిగ్‌స, బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఎంగ్లెర్టలకు దైవకణంపై పరిశోధనకుగాను లభించింది. కెమిస్ట్రీ: అమెరికాకు చెందిన మార్టిన్ కార్ప్లస్, మైకెల్ లెవిట్, ఏరియా వార్షెల్‌లకు దక్కింది. వైద్యశాస్త్రం: అమెరికాకు చెందిన జేమ్స్ రాథ్‌మన్, రాండీషెక్మన్, జర్మన్- అమెరికన్ థామస్ సుధోఫ్లు పొందారు. లిటరేచర్: ప్రఖ్యాత కెనడా రచయిత్రి అలైస్ మన్రో సాహిత్య బహుమతిని గెలుచుకున్నారు. ఆమె 2009లో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌ను కూడా సాధించారు. డ్యాన్స ఆఫ్ ది హ్యాపీ షేడ్స ఆమె ప్రముఖ రచన. ఎకనామిక్స్: అమెరికాకు చెందిన యుజీన్ ఫామా, లార్స పీటర్ హోన్సెన్, రాబర్ట షిల్లర్ అనే ముగ్గురు ఆర్థికవేత్తలకు సంయుక్తంగా లభించింది. పీస్: 2013 నోబెల్ శాంతి బహుమతిని ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స (ఓిపీసీడబ్ల్యూ) అనే సంస్థకు రసాయన ఆయుధాలను నిర్మూలించడంలో కృషి చేసినం దుకు ప్రదానం చేశారు. ఈ సంస్థ 1997, ఏప్రిల్ 29న నెదర్లాండ్‌సలోని ద హేగ్ నగరంలో ఏర్పడింది. టర్కీకి చెందిన అహ్మత్ ఉజుమ్చు ఓపీసీడబ్ల్యూ ప్రస్తుత డైరక్టర్ జనరల్. 2014 గ్రహీతలు భౌతికశాస్త్రం: విద్యుత్‌ను ఆదా చేసే లైట్ ఎమిటింగ్ డయోడ్స (ఎల్ఈడీ)ను కనుగొన్న జపాన్ శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో; జపాన్- అమెరికన్ శాస్త్రవేత్త.. ఘజి నకమురాలకు 2014లో భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి లభించింది. రసాయనశాస్త్రం: అమెరికా శాస్త్రవేత్తలు విలి యం మోర్నర్, ఎరిక్ బెట్జిగ్, జర్మనీకి చెందిన స్టీఫెన్ హెల్లను నోబెల్ వరించింది. ఈ ముగ్గు రు పరిశోధకులు మైక్రోస్కోపును మరింత మెరుగుపర్చారు. వైద్యశాస్త్రం: బ్రిటిష్- అమెరికన్ జాన్ ఒ కీఫ్, నార్వే జంట ఎడ్వర్డ మోసర్, మే బ్రిట్ మోసర్లకు వైద్య విభాగంలో నోబెల్ పురస్కారం లభించింది. వీరు మెదడుపై విస్తృత పరిశోధనలు చేశారు. సాహిత్యం: ఫ్రాన్సకు చెందిన నవలా రచయిత పాట్రిక్ మోడియానోకు 2014 నోబెల్ సాహితీ పురస్కారం దక్కింది. మిస్సింగ్ పర్సన్ ఆయన ప్రముఖ రచన. 2012లో ఆస్ట్రియన్ స్టేట్ప్రైజ్ ఫర్ యురోపియన్ లిటరేచర్ అవార్డు కూడా లభించింది. శాంతి: ఈ ఏడాది శాంతి బహుమతిని భారత్ పాకిస్థాన్‌లకు చెందిన సామాజిక కార్యకర్తలు కైలాష్ సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్‌లు సంయుక్తంగా దక్కించుకున్నారు. మదర్ థెరిసా తర్వాత నోబెల్ బహుమతికి భారత్ తరపున ఎంపికైన రెండోవ్యక్తి కైలాష్ సత్యార్థి. జన్మతః భారతీయుడైన వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి లభించడం ఇదే తొలిసారి. మలాలా యూసఫ్‌జాయ్ అతి చిన్న వయసు లో (17) నోబెల్ బహుమతికి ఎంపికైంది. ఇంతకుముందు ఈ రికార్డు లారెన్స బ్రాగ్ (25) పేరిట ఉండేది. మలాలా బాలికల విద్యాహక్కు కోసం ఉద్యమం కొనసాగిస్తోంది. ఆర్థిక శాస్త్రం: ఫ్రాన్సకు చెందిన ఆర్థికవేత్త జీన్ టీరోల్కు ఈ ఏడాది ఆర్థికశాస్త్ర నోబెల్ పుర స్కారం లభించింది. మార్కెట్ శక్తి, మార్కెట్ నియంత్రణలపై జీన్ టిరోల్ చేసిన పరిశోధ నలకు ఆయనను ఎంపిక చేశారు. -
డెబ్బయి ఏళ్లుగా మోగుతున్న జనఢంకా అరసం
వరంగల్ భారతీయ విద్యాభవన్‌లో సెప్టెంబర్ 27, 28 రెండు రోజులపాటు అరసం 17వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్న సందర్భంగా.... తెలుగు నేలపై ప్రగతిశీల సాహిత్యోద్యమం 1943లో మొదలైంది. దీనికి 1935లో ఇంగ్లాండ్‌లో పునాదులు పడ్డాయని చరిత్ర చెబుతున్నా 1936లో లక్నోలో జరిగిన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ తొలి సభలు ఇందుకు ఊపు తెచ్చాయి. సాక్షాత్తు రవీంద్రనాథ్ టాగోర్ మద్దతు, ప్రేమ్‌చంద్ వంటివారి వెన్నుదన్ను, మంటో, చుగ్తాయ్, ముల్క్‌రాజ్ ఆనంద్ వంటివారి భాగస్వామ్యంతో జరగడం వల్ల ఈ సభలు దేశం నలుమూలలా దృష్టినాకర్షించాయి. ఈ నేపథ్యంలో 1943 నాటికి విజయనగరంలో కూడా చాగంటి సోమయాజులు, శెట్టి ఈశ్వరరావు వంటి రచయితలు ఇటువంటి వేదిక ఆవిర్భావం కొరకు ఆలోచనలు చేస్తున్నారు. తెనాలి నుంచి చదలవాడ పిచ్చయ్య కూడా ఇలాంటి ఆలోచనతోనే వీరిని కలిశారు. అప్పటికే తెలుగు సాహిత్యంలో అనిశెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి, మగ్దూం, సోమసుందర్, వట్టికోట, కొడవటిగంటి, దాశరథి తదితర రచయితలు కార్యరంగంలో ఉన్నారు. వీరిలో చాలామందికి ఇలాంటి సంఘం ఒకటి ఏర్పడాలన్నది కోరిక. దాని సాకారం కొరకు చదలవాడ పిచ్చయ్య పూనిక మీద అందరూ వచ్చి పాల్గొనేందుకు వీలుగా తెనాలిలో 1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో తొలి ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం సభలు జరిగాయి. వీటికి తాపీ ధర్మారావు అధ్యక్షత వహించారు. తర్వాత రెండో మహాసభ విజయవాడలో, మూడవది రాజమండ్రిలో, ఆ తర్వాత గుంటూరు జిల్లా పెదపూడిలో సాహిత్య పాఠశాల... ఆ పై నాలుగో మహాసభ... ఈ వరుసలో దేశంలో ఏర్పడ్డ అనేక పరిణామాల వల్ల ఆ తరువాతి ఎనిమిదేళ్ల దాకా అంటే 1955 దాకా అరసం తన అయిదో మహాసభలు నిర్వహించుకోలేకపోయింది. 1955లో ఈ సభలు ఉప్పల లక్ష్మణరావు, శ్రీశ్రీ ఆధ్వర్యంలో జరిగాయి. ఇక ఆరో మహా సభలకు పట్టిన కాలం అక్షరాలా పందొమ్మిదేళ్లు. ఇవి ఒంగోలులో 1974లో జరిగాయి. ఈ పందొమ్మిదేళ్ల కాలంలో కొత్త కవితాస్వరాలు వచ్చి అలుముకున్న స్తబ్దతను ప్రశ్నించాయి. దిగంబర, పైగంబర వంటి కవితా ఉద్యమాలు తమ వంతు ప్రభావాన్ని ప్రసరించాయి. విశాఖ యువకుల కరపత్రం శ్రీశ్రీ షష్టిపూర్తికి విడుదల అయి ఆ దరిమిలా హైదరాబాద్‌లో 1970 జూలై 4న విరసం ఆవిర్భవించింది. అయినా అరసం తన ఆరవ సభలు జరుపుకోవడానికి ఇంకా నాలుగేళ్లు (1970 నుంచి 1974 దాకా) పట్టింది. ఆ తర్వాత అరసంలో రెండు వర్గాలు ఏర్పడి పోటాపోటీ సభలు నిర్వహించాయి. క్రమంగా అసలు అరసం స్తబ్దుగా అయిపోవడంతో కొత్త అరసం బలం పుంజుకుంది. తుదకు అరసం ఏ రాజకీయ పక్షానికీ అనుబంధ సంస్థ కాదని తేల్చి చెప్పిన చాసో కూడా ఆరుద్ర సూచనతో ఎమర్జెన్సీకి మద్దతు ఇచ్చిన సిపిఐవారి వేదికైన కొత్త అరసంలో చేరి తను మరణించే వరకు అంటే పదకొండో మహాసభ వరకూ సేవలందిస్తూనే వచ్చారు. వారి కాలంలోనూ ఆ తరువాత కూడా డా.పరుచూరి రాజారాం, డా.ఎస్.వి.సత్యనారాయణ, డా.చందు సుబ్బారావు, పెనుగొండ లక్ష్మీ నారాయణ ప్రభృతులు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అరసం ముఖ్యులలో ఆర్వీయార్, తుమ్మల వెంకట రామయ్య, ఏటుకూరి ప్రసాద్, సొదుం రామ్మోహన్ మొదలైనవారు విలువైన సేవలు తమ తమ రంగాలలో అందించారు. ప్రస్తుతం రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఇప్పటి అరసం కూడా ఇక ముందు రెండు రాష్ట్ర వేదికలుగా పని చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గత చరిత్రకు ఏ మేరకు బాధ్యత వహిస్తూ ఏ విశ్వాసాలతో ముందుకు వెళతారు అనేది ఆ మాటను రచయితలు ఎంత కచ్చితంగా చెప్తారనేది ప్రశ్న. తెలుగువారి అరసం ప్రపంచ అభ్యుదయ ప్రవాహంలో ఒక భాగం. అంతకన్నా తక్కువా కాదు, ఎక్కువా కాదు. అభ్యుదయ సాహిత్యం- భౌతిక అవసరాలు తీరే ఒక సమాజంలో జీవించే మానవాళి కోసం ఒక తాత్విక భూమికగా, ఆధిపత్య శక్తుల పట్ల ఒక సార్వత్రిక నిరసన కలిగి ఉంటుంది. ఆ ఉజ్వల ఘట్టాలపై సరైన గౌరవం లేకుండా ప్రమాదకర సంక్షిప్తీకరణలకు పూనుకోవడం, తమకు అనుకూలమైన చోట ఎక్కువ రాసుకుంటూ పోవడం అన్ని చరిత్రలకు మల్లే సాహిత్య చరిత్రకు కూడా శోభనివ్వదు. తొలి యాభై ఏళ్లలో కేవలం పది సభలు మాత్రమే జరుపుకుని అందులో సగం మొదటి అయిదు ఏళ్లలో ఏడాదికొకటిగా తరువాతి అయిదూ మిగిలిన నలభై అయిదు ఏళ్లలో జరుపుకోవాల్సి వచ్చిన కారణాలు ఏమిటో ప్రజలు ఆలోచిస్తారు. ఆ బాధ్యత తమది అని భావించే సాహిత్య వేదికలు తమ చరిత్రతో తామే కుప్పిగంతులు వేయవు. సభలు, సమీకరణాల కార్యాచరణ ఎట్లా ఉన్నా అరసం సాహిత్య చరిత్ర వ్యక్తుల చరిత్ర కాదు, అది అక్షరాల చరిత్ర. త్వమేవాహాల, వజ్రాయుధాల, మహా ప్రస్థానాల, అగ్నివీణల, భల్లూక స్వప్నాల, ప్రజల మనుషుల, రథ చక్రాల, తెలంగాణాల, పులిపంజాల, జన జీవన కోలాహల యాత్ర. ఏడు పదుల వెలుగు మేడ. అరసమొక సాహిత్య వారాశి. దాన్ని పెరటి చెరువులా పరిచయం చేయడం ఒక ప్రాంతీయ దుస్సాహసం. అరసానికి ప్రగతి యాత్ర శుభాకాంక్షలు. - రామతీర్థ 98492 00385 -
టాగోర్ గీతాంజలి: ప్రార్థనకు అల్లిన గీతమాలలు
కొత్త పుస్తకం గీతాంజలి- అనువాదం: డా.భార్గవి; వెల: రూ.300 ప్రతులకు: 08674-253210, 253366 రవీంద్రనాథ్ టాగోర్ రాసిన గీతాంజలి గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. దీని మూలాలు భారతీయ తాత్త్విక చింతనలో ఉన్నాయని దేశీయ విమర్శకులు భావిస్తే పాశ్చాత్యులు బైబిల్ ‘సాంగ్ ఆఫ్ సాంగ్స్’తో సామ్యాన్ని తరచి చూశారు. దైవాన్ని ప్రభువుగా సఖుడుగా మనుష్యుడిగా భావించుకుని మాటలతో పాటలతో ఆత్మను అర్పించుకునే ప్రయత్నం అందరూ చేశారు. జయదేవుని గీత గోవిందం 12వ శతాబ్దంలో ఈ పరంపరను బలమైన సాహిత్య ధోరణిగా స్థిరపరిచింది. బెంగాల్ ఆధ్యాత్మిక సాంస్కృతిక పరంపరను శతాబ్దాలుగా ప్రభావితం చేసిన వైష్ణవ భక్తి అక్కడే జన్మించిన రవీంద్రుని చేత ‘గీతాంజలి’ రాయించడంలో ఒక అదృశ్య రంగభూమిని సిద్ధం చేసి ఉండవచ్చని భావించేవారు ఉన్నారు. అయితే రవీంద్రుని జీవితంలో ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో చూసిన విషాదం, చోటు చేసుకున్న ఆప్తుల మరణాలు దైవంతో లేదా ప్రకృతితో లేదా తనలోని ఒక ఔన్నత్యమైన ఆత్మతో లేదా సృష్టిలో అణువణువూ నిండి ఉన్న తేజోశక్తితో లేదా ఒక ఊహామాత్రపు సఖుడితో లేదా ప్రియురాలితో సంభాషణకు పురిగొలిపి ఉండవచ్చు. నివేదించుకునే క్షణాలు, కనుకొలకుల్లోంచి అశ్రువులను దిగవిడిచే క్షణాలు, వేదన లేని ఉఛ్వాశ నిశ్వాసలను ఆశించే క్షణాలు, స్వచ్ఛమైన సుమం వలే తటస్థ కొలనులోని లేశమాత్రపు అల వలే మారి స్థిమిత పడే క్షణాలు, ప్రభూ... కురవని జల్లుల భారంతో వొంగిన మేఘంలాగా నా మనసు నీ ద్వారం వద్ద నమ్రతతో ప్రమాణం చేయనీ అని మొరపెట్టుకునే క్షణాలు, మృత్యువు కొరకు పరమాద్భుత రుచి కలిగిన తేనెతో ఎదురు చూసే క్షణాలు... ఇవన్నీ కవిత్వంగానే మారి తీరుతాయి. టాగోర్ అల్లిన ఆ గీతమాలలు అందుచేతనే ప్రపంచంలోని ప్రతి మేలిమి పాఠకుడి కంఠాన్నీ అలంకరించాయి. అంతేకాదు అనువాదమై పరివ్యాప్తమయ్యాయి. టాగోర్‌ను తెలుగులో అనువదించడానికి ఉత్సాహపడిన వారు ఎందరో ఉన్నారు. మెచ్చుకోలు పొందినవారు కొందరే ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తున్న అనువాదం కొంచెం చిత్రమైన కథ కలిగినది. డాక్టర్ భార్గవి తన 20 ఏళ్ల వయసులో టాగోర్ కవిత్వానికి సమ్మోహితులైన కేవలం ఏడెనిమిది రోజుల్లో గీతాంజలిని అనువాదం చేసి ఆ కావ్యానికి తన వంతు పూమాలను అర్పించేశాను అని తృప్తిపడి ఆ అనువాదాన్ని దాచేశారు. కాని ఇన్నేళ్ల తర్వాత అంటే ఒక ముప్పై ఏళ్ల తర్వాత వారూ వీరూ చూసి బావుందని మెచ్చుకొని పుస్తకం తెమ్మని బలవంతం చేస్తే తీసుకువచ్చారు. ఇరవై ఏళ్ల ఒక ఔత్సాహికురాలి అనువాదంలో ఇంత గాఢత ఉంటుందా? సరళత ఉంటుందా? బరువు ఉండాల్సిన చోట త్రాసు ఒంగి తేలిక పడాల్సిన చోట ఉల్లిపొర కాగితంలా తెమ్మరకు ఎగిరి... టాగోర్ హృదయంతో తన హృదయాన్ని తాడనం చేయాలని పెనుగులాడినప్పుడే ఇటువంటి అనువాదం సాధ్యం. మొత్తం 103 టాగోర్ గీతాలకు భార్గవి చేసిన అనువాదం పాఠకులను ఆకట్టుకుంటుంది. తోడుగా గిరిధర్ గౌడ్ వేసిన చిత్రాలు వర్ణతాండవం చేస్తాయి. ఆమె కవితను ఈయన బొమ్మను కలిపి గొప్పగా ముద్రించిన నరేంద్ర, శశికళలకు అభినందనలు. -
సాటిలేని పరిణీత నటి
నేడు మీనాకుమారి జయంతి మరణించే ముందు ‘నూర్జహాన్’ కవిత రూపంలో ‘‘మిత్రులారా దయచేసి నా సమాధి పక్కన ‘గుర్తుగా’ నా కోసం మొక్కను నాటకండి అని కోరిందట. ఎందుకంటే వసంతకాలంలో కోయిలలు వచ్చి గీతాన్ని ఆలపిస్తాయి. అలా ఆలపించే సమయం లో వాటి కన్నులలోంచి వెచ్చని కన్నీరు జారి నా సమాధి మీద పడుతుంది... ఎవరైనా కన్నీరు కారిస్తే నా కళ్లు చూడలేవు’’ అని రాసింది. ఎంత గొప్ప కవిత! కోయిల కన్నీరు కారిస్తే చూసి సహించలేని బేల హృదయం నూర్జహాన్దేతై... జీవితాన్ని ‘నలిపి’ వేసిన వారిని కూడా క్షమించి ‘‘మిగిలిన ‘సినిమా’ షూటింగ్‌ని పూర్తి చేసుకో, నేనెక్కువ కాలం బతకను’’ అని చివరి కాల్షీట్లనిచ్చి తన గుర్తుగా ‘పాకీజా’లాంటి సినిమాని మిగిల్చిపోయిన బేల హృదయం ‘మెహజబీన్బానో’ అన్న పేరు పెట్టబడిన మీనాకుమారిది. తల్లి ఇక్వాల్ ఉన్నీసా... తండ్రి ఆలీ బక్ష్. తల్లి స్వచ్ఛమైన హిందువు. రవీంద్రనాథ్ ఠాగూర్ తమ్ముడి మనవరాలు. అసలు పేరు ప్రభావతి. ఆమె నృత్యకళాకారిణి కూడా. దాంతో మెహజబీన్కి అటు సంగీతం, ఇటు నృత్యం రెండూ అబ్బాయి. ‘నటి’ కావాలనే తల్లి ఆశ మీనాకుమారి ద్వారా తీరుతుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. మీనాకుమారిని ‘గుర్తించి’ వేషమిచ్చింది విజయ్ భట్. మొదటి పారితోషికం పాతిక రూపాయలు. సినిమా పేరు లెదర్ఫేస్! మెహజబీన్ని ‘బేబీ మీనా’గా మార్చిందీ విజయ్ భట్గారే. మీనాకి హీరోయిన్గా మొదటి సినిమా కేదార్ శర్మగారి ‘దాదాజీ’. దురదృష్టం ఏమంటే సినిమా పూర్తయ్యాక ‘నెగటివ్’ పూర్తిగా కాలిపోయింది. తమాషా అనే పిక్చర్ షూటింగ్లో మీనాకుమారి కమాబ్ అమ్రోహీని కలిసింది. ఆయన ‘మవాల్’ (అశోక్ కుమార్, మధుబాల) సినీ చరిత్రని తిరగరాసింది. తండ్రి ఆలీబక్ష్‌కి తెలియకుండా సోదరి ‘మధు’ సాయంతో ‘సయ్యద్ అమీర్ హైదర్ కమాల్, నభ్వీ (కమాల్ అమ్రోహీ)ని పెళ్లి చేసుకుంది మీనా కుమారి. కమల్‌కి అప్పటికే ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు. 1953లో ఫిలింఫేర్ పత్రిక ప్రవేశ పెట్టిన తొట్ట తొలి ‘బెస్ట్ హీరోయిన్’ అవార్డు మీనాకుమారిని వరించింది. ‘బైజూ బావ్రా’ ఆమెని సూపర్‌స్టార్‌ని చేస్తే, ‘ఫుట్‌పాత్’ చిత్రం నెగిటివ్ కాలిపోయి మీనాకి దుఃఖాన్ని మిగిల్చింది. 1553లో కమాల్ అమ్రోహీ నిర్మించిన ‘దాయ్రా’లో నటిస్తూ ‘ఇంటి’ని వదిలి కమాల్ దగ్గరికి కట్టు బట్టల్తో వెళ్లిపోయింది మీనా. అది ఫ్లాప్. శరత్చంద్ర నవల ‘పరిణీత’లో నటించి (అశోక్ కుమార్ మీరా) 1954 సంవత్సరపు ఫిలింఫేర్ అవార్డుని అందుకుంది. ఒక పక్క సినిమా తర్వాత సినిమా, మరో పక్క కమాల్ అమ్రోహీ పెడుతున్న ఆంక్షలతో మీనాకుమారి నలిగిపోయింది. జీవితంలో ఒక్కో అడుగూ దిగిపోతూ మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ‘సాహబ్ బీబీ గౌర్ గులామ్’లో సహజత్వం కోసం మొట్టమొదట గొంతులో పోసుకున్న ‘బ్రాందీ’ మీనాకుమారికి జీవిత సహచరిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. అంతేగాదు, కమల్ అమ్రెహ ప్రొడక్షన్ మేనేజర్ బాకర్ ‘పింజ్డే కీ పంభీ’ (పంజరంలో పక్షి) షూటింగ్లో మీనాని చెంపదెబ్బ కొట్టడం. టాప్ హీరోయిన్ని ఆఫ్ట్రాల్ మేనేజర్ కొట్టడమా? ప్రేమ దొరక్క... ప్రేమ అనే ఆకలి తీరక మీనా ‘మందు’లో ప్రేమను వెదుక్కుంది. మీనా సహజ రచయిత్రి. కవితలల్లేది. మేరీ అప్నే - దుష్మన్... ఇవన్నీ అనారోగ్యంతో చేసిన సినిమాలే. అయినా ఆమెకి ఆమే సాటి అని నిరూపించాయి. మళ్లీ కమాల్‌కి ఫోన్ చేసి ‘నీ సినిమా పూర్తి చేసుకో’ అని ‘పాకీజా’ చిత్రాన్ని పూర్తి చేసింది. ఎవరికి ఏది ఎలా ఎప్పుడు ఇవ్వాలని ‘అల్లా’ నిర్ణయించాడో అంతిమ ‘గమ్యా’న్ని చేరింది మెహజబీన్బానో (సాటిలేనిది అని అర్థం). ఏదయితేనేం పాకీజా అద్భుత విజయాన్ని విన్న మీనా ‘ఇన్షా అల్లా’ అంది. ఇది ఆమె భూమి మీదకొచ్చిన తొలి దినం! అందుకే ఆమెను మళ్లీ మళ్లీ స్మరించుకుందాం! మన జ్ఞాపకాలలో ఆమెను బతికించుకుందాం!! - భువనచంద్ర (సినీ గీత రచయిత) -
జనరల్ నాలెడ్జ్
జాతీయ గీతం (జనగణమన) → ఆమోదించిన సంవత్సరం: 1950, జనవరి 24 → రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని తొలిసారిగా చిత్తుప్రతిపై ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో రచించారు. → జనగణమన గీతం బెంగాలీ భాషలో ఐదు చరణాల్లో రచించగా అందులోని తొలి ఎనిమిది లైన్లలను జాతీయగీతంగా తీసుకున్నారు. ఊ తొలిసారిగా 1911, డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో జాతీయగీతాన్ని ఆలపించారు. ఊ జాతీయగీతాన్ని ‘మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’ అనే పేరుతో తిరిగి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లంలోకి అనువదించారు. తర్వాత తత్వబోధిని పత్రికలో ‘భారత విధాత’ అనే పేరుతో 1912లో ప్రచురించారు. → జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకన్ల సమయం పడితే సంక్షిప్తంగా ఆలపించడానికి 20 సెకన్లు పడుతుంది. జాతీయ ముద్ర (చిహ్నం) → ఆమోదించిన సంవత్సరం: 1950, జనవరి 26 ఊ జాతీయ ముద్రగా అశోకుని సారనాథ్‌లోని ధర్మస్థూపంపై ఒకే పీఠం మీదున్న నాలుగు సింహాల బొమ్మను తీసుకున్నారు. ఊ ఈ స్థూపంపై నాలుగు సింహాలు, (మూడు మాత్రమే కనిపిస్తాయి) వాటి కింద పీఠం మధ్య భాగంలో అశోకుని ధర్మచక్రం, చక్రానికి కుడివైపు ఎద్దు, ఎడమవైపు గుర్రం నుంచున్నట్లు ఉంటాయి. ఎద్దు స్థిరత్వానికి, గుర్రం వేగానికి సూచికగా భావిస్తారు. ఊ పీఠం పై భాగంలో మాండకో పనిషత్ నుంచి గ్రహించిన ‘సత్యమేవ జయతే’ అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. -
కొత్త పుస్తకం
నివేదన (విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీ గీతం ‘కొరొ జాగొరితొ’కి పలువురు తెలుగు కవుల అనువాదాలు, అనుకరణలు) సంపాదకుడు: మోదుగుల రవికృష్ణపేజీలు: 140; వెల: 100 ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, హైదరాబాద్‌తోపాటు, సంపాదకుడు, 26-19-10, ‘0’ లేన్, మెయిన్ రోడ్, ఎ.టి.అగ్రహారం, గుంటూర్-522004. ఫోన్: 09440320580 ఒక ఆనందకారణం... ఇది సమీక్ష, అభిప్రాయం కన్నా- ఒక చిన్న పరిశీలన. ముందుగా పుస్తకం గురించి. ఇరవయ్యో శతాబ్దపు ఆరంభంలో రవీంద్రనాథ్ టాగోర్ వంగభాషలో ‘చిత్తొ జెథా భొయ్షున్నొ, ఉచ్ఛొ జెథా శిర్/ గ్యాన్ జెథా ముక్తొ, జెథా గ్రిహేర్ ప్రాచీర్’ గీతం రాశాడు. ఆయనే స్వయంగా ‘గీతాంజలి’ ఆంగ్ల సంకలనంలోకి దాన్ని అనువదించుకున్నాడు. తద్వారా అది ప్రపంచవ్యాప్తంగా ఎందరికో చేరువైంది; ఎన్నో భాషల్లోకి అనువాదమైంది; అలా తెలుగులోకీ వచ్చింది. 1913లో ఆదిపూడి సోమనాథరావుతో మొదలుపెట్టి, 2014లో షేక్‌బాబ్జీ దాకా... కొంగర జగ్గయ్య, చలం, చినవీరభద్రుడు, తిరుమల రామచంద్ర, దాశరథి, బెజవాడ గోపాలరెడ్డి, మధు రొండా, మో, రాయప్రోలు; ఇలా ఎందరో ఆ గీతాన్ని అనువదించారు. అలాంటి అనువాద ప్రేరేపకమైన గీతానికి వచ్చిన 41 తెలుగు తర్జుమాలతో 2003లో బి.ఎస్.ఆర్.కృష్ణ ‘నివేదన’ సంకలనం తెచ్చారు. దానికి రెట్టింపు జోడింపులతో వచ్చిన మలిముద్రణ ఇది. ఆంగ్లపాఠం ‘వేర్ ద మైండ్ ఈజ్ వితవుట్ ఫియర్’ కూడా కలుపుకొంటే పూర్తిగా వంద అనువాదాలు ఇందులో ఉన్నట్టు లెక్క! క్లుప్తంగా అనువాదకుల పరిచయాలు కూడా ఉన్నాయి. అయితే, వంగ గీతం అర్థం కాకపోయినా అందులో ఒక తూగువుంది; చక్కగా పాడుకోగలిగే అంత్యప్రాసల లయ ఉంది; అలాంటిది ఆంగ్లంలోకి కేవలం భావమే వచ్చింది; పైగా అది చేసుకున్నది స్వయంగా రవీంద్రుడే! అంటే, సాక్షాత్తూ గురుదేవుడే ‘ఫెయిల్’ అయ్యాడంటే, మిగిలిన అనువాదకులను తప్పు పట్టడానికి ఏముంది? అంటే, ఈ ఆహారం ఏమిటి? దేనికి మంచిది? ఎన్ని క్యాలరీలున్నాయి తరహా ఎన్సైక్లోపీడిక్ సర్వస్వం బట్వాడా అవుతుందేగానీ ‘రుచి’ బదిలీ కాదన్నమాట! ఇది సమస్త అనువాదాల సమస్య అనుకుంటాను. అయితే, ఈ విషయం టాగోర్‌కీ తెలుసు, అనువాదాలు చేసే పెద్దవాళ్లందరికీ తెలుసు. ఒక మూలభాషలో పలవరించింది, పూర్తిగా ఆ భాష పాఠకులకే చెందుతుంది. అంటే ప్రతి భాషా పాఠకులకూ - ఇంకా చెప్పాలంటే, ఆ భాష మాట్లాడేవాళ్లందరికీ కూడా- తాము మాత్రమే అనుభవించగలిగే ప్రత్యేక నిధి ఏదో ఉంటుందన్నమాట! భాషల అస్తిత్వాల స్పృహతో చూస్తే, ఇది కూడా ఆనందం కలిగించే విషయమే కదా! - రాజిరెడ్డి కొత్త పుస్తకాలు వాన కురిసిన రాత్రి (కవిత్వం) రచన: డా.బండి సత్యనారాయణ పేజీలు: 112; వెల: 60 ప్రతులకు: కవి, ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్నం-530003. ఫోన్: 8331841965 గుండెలవిసినచోట (కవిత్వం) రచన: సిరిసిల్లా గఫూర్‌శిక్షక్ పేజీలు: 112; వెల: 95; ప్రతులకు: తెలంగాణ రచయితల వేదిక, కేరాఫ్ జూలూరు గౌరీశంకర్, 1-8-702/33/20ఎ, పద్మ కాలనీ, నల్లకుంట, హైదరాబాద్-44. కవి ఫోన్: 9849062038 నేస్తం (కవిత్వం) రచన: అవధాని కడిమిళ్ల రమేష్ పేజీలు: 32; వెల: - ప్రతులకు: కడిమిళ్ల శ్రీవిరించి, 3-6-50, యర్రమిల్లివారి వీధి, నరసాపురం, ప.గో.-534275; ఫోన్: 9247879606 యోగసిద్ధి రచన: డా. పిట్టా సత్యనారాయణ పేజీలు: 60; వెల: 80; ప్రతులకు: పి.విజయలక్ష్మి, 24-7-199/1/1, ఎన్ఐటి దగ్గర, హన్మకొండ-4. ఫోన్: 9849812054 గర్జన (తెలంగాణ ముస్లింవాద కవిత్వం) రచన: మహమ్మద్ హనీఫ్ అలీ పేజీలు: 50; వెల: 40; ప్రతులకు: రచయిత, 5-9-68, మాన్యం చెల్క, గల్లీ, నల్గొండ. ఫోన్: 9346491023 ఉషోదయం రచన: రామదాసు వీరభద్రరావు పేజీలు: 72; వెల: 50; ప్రతులకు: రచయిత, ఎల్ఐజి 17, ఎపిహెచ్‌బి కాలనీ, రామచంద్రాపురం. తూ.గో. ఫోన్: 9542787287 హృదయాలాపన (కవిత్వం) రచన: చిత్రాడ కిషోర్‌కుమార్ పేజీలు: 60; వెల: 60; ప్రతులకు: మల్లెతీగ, 41-20/3-24, మన్నవ వారి వీధి, కృష్ణలంక, విజయవాడ-13. ఫోన్: 9246415150 స్త్రీచక్రం (నాటిక) రచన: పగడాల శ్యామ్‌సుందర్ పేజీలు: 40; వెల: 25; ప్రతులకు: 9291346318 -
సంధ్యాకాశంలా జీవితం...
గ్రంథపు చెక్క జీవితమంటే సుఖదుఃఖాలు రెండూ కలిసి ఉంటాయి. సంధ్యాకాశంలా ఉంటుంది జీవితం. వెలుగు చీకట్లు కలిసి. అయితే ఒక్కొక్కడి బ్రతుకు ఉదయసంధ్యలాగ ఉంటుంది. మరొక్కడిది సాయం సంధ్యలాగ ఉంటుంది. మొదటి రకం జీవితాన్ని చూస్తే మనకు ఉల్లాసం కలుగుతుంది. దానిలో వెలుగు పాలెక్కువ. రెండో రకపు దానిలో రక్తఛాయ ఎక్కువ. చీకట్ల పాలెక్కువలా ఉంటుంది. అందరి జీవితాల్లాంటిదే కవి జీవితమూను. ఎంత అల్పమైనదైనా ఒక్కొక్క అనుభూతి కవిని ఎక్కువ ఊపేయవచ్చు. కానీ, మొత్తం మీద, రకరకాల సుఖదుఃఖాలతో, ఇతర మానవ జీవితాల్లాగానే ఇతని జీవితమూ ఉంటుంది. అలాగే కొందరు కవుల జీవితాలను గూర్చి వివరాలను తెలుసుకున్నా, వారి రచనలు చదివినా... ఏదో చల్లగా, నిదానంగా అతగాడు నిండుగా బ్రతికాడనిపించి మనకు హాయిగా అనిపిస్తుంది. వర్డ్స్‌వర్త్, టెన్నీసన్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి కవులలాగ. మరి కొందరి జీవితగాథలు తెలుసుకుంటే దిగులు వేస్తుంది. తమ బ్రతుకుల్ని కాలరథచక్రాల క్రింద పారేసి, మార్గానికి కూడా రక్తపు మరకల్ని అంటించి, బలవంతంగా ముగించినట్టు తోస్తుంది. వీళ్ల రచనలు కూడా చెప్పలేని బెంగా, భయం కలిగిస్తాయి. - దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘కవి పరంపర’ నుంచి. -
కాలరేఖల మధ్య కలర్ బ్లైండ్!
విశ్వకవి రవీంద్రనాథ్ఠాగూర్ సాహిత్యం ఎన్నోసార్లు నాటకాలుగా రంగస్థల ప్రియులను ఆకట్టుకుంది. తాజాగా రచయిత, దర్శకుడు మానవ్ కౌల్ ‘కలర్ బ్లైండ్’ పేరుతో రవీంద్రుడి జీవితంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా ఒక నాటకాన్ని రూపొందించారు. ఈ నాటకం ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, ఫ్రెంచ్ భాషల్లో ప్రదర్శిస్తారు. బాలీవుడ్ హీరోయిన్ కల్కీ కోహిలిన్ ‘కలర్బ్లైండ్’ నాటకం ద్వారా తిరిగి స్టేజి ఎక్కుతున్నారు. గతంలో ఆమెకు నాటకాలు వేసిన అనుభవం ఉంది. విశేషమేమిటంటే ఈ నాటకానికి కల్కీ రచనా సహకారం అందించారు. దీనికోసం పలు పుస్తకాలు చదివారు. ‘‘వివిధ కాలరేఖల మధ్య నాటకం సంచరిస్తుంది. సంగీతం ప్రయోగాత్మకంగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి భాషతో పనేమీ లేదు. దృశ్యమే అన్నీ చెప్పేస్తుంది. ముంబాయి ప్రేక్షకుల కోసం బెంగాలీ నాటకంలో కొన్ని భాగాలను హిందీలోకి అనువదించాం’’ అని చెబుతుంది కల్కీ. ‘కలర్ బ్లైండ్’ కోసం రచయితలు చాలా అధ్యయనం చేశారు. ఠాగూర్‌లోని ఆధ్యాత్మిక కోణం, అర్జెంటీనా స్కాలర్ విక్టోరియా ఒకంపోతో ఆయన బంధం గురించి లోతుగా తెలుసుకున్నారు. ఠాగూర్ జీవితంలో వివిధ ఘట్టాలను రచయితలు పంచుకొన్నారు. నోట్స్ తయారుచేసుకున్నారు. ఒకంపో రచనల అధ్యయనం, రవీంద్రుడి సంగీతాన్ని వినడం వారికి నిత్యజీవిత కార్యక్రమంగా మారింది. నాటకంలో ఠాగూర్ ప్రసిద్ధ పాటలు, ‘మోర్ బిన ఒతే కోన్..’ పాట ఫ్రెంచ్ వెర్షన్‌తో సహా ఉన్నాయి. ‘‘కొత్తవారితో పని చేయడం మంచి అనుభవం. సవాలుగా అనిపించింది. మానవ్తో మరోసారి పని చేయాలనుకుంటున్నాను. పరిశోధన, రచన అనేవి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించేవి. థియేటర్ అనేది నటుల మాధ్యమం. నటులు చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సినిమాలతో పోల్చితే ఇక్కడ ఉండే క్రమశిక్షణ వేరు’’ అంటున్న కల్కీ ‘కలర్ బ్లైండ్’ నాటకంలో ఒకంపో, సమకాలీన భారతీయ యువతిగా రెండు పాత్రలు పోషించారు. సత్యజిత్ శర్మ ఠాగూర్‌గా, స్వనంద్ కిర్కిరె ‘మృత్యువు’గా నటించారు. ‘‘కల్కీ తన పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఆమె ఫ్రెంచ్ కూడా మాట్లాడుతుంది. థియేటర్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి’’ అని మెచ్చుకోలుగా అంటున్నారు మానవ్ కౌల్. థియేటర్ అనేది నటుల మాధ్యమం. నటులు చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సినిమాలతో పోల్చితే ఇక్కడ ఉండే క్రమశిక్షణ వేరు. - కల్కీ -
నోబెల్ ఇండియా పురస్కారం: రవీంద్రనాథ్ ఠాగూర్ అధినాయక కవి
ఆంగ్లేతర సాహిత్య రచనలతో అత్యంత ప్రతిష్ఠాకరమైన నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ప్రతిభాశాలి విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్. ఈయన రచించిన ‘గీతాంజలి’ తదితర బెంగాలీ రచనలు సమాజాన్ని ఉత్తేజరపరిచాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాయి. ఠాగూర్ రచనలు సర్వ మానవ సౌభ్రాతృత్వ భావనకు ప్రాణం పోశాయి. వీటిని రవీంద్రుడే స్వయంగా ఆంగ్లానువాదం చేయడం మరో విశేషం. ఈ అనువాదాల ద్వారా నోబెల్ కమిటీ ఈ రచనల సారాంశాన్ని గ్రహించింది. అతడిని 1913లో నోబెల్ బహుమానానికి అర్హుడిగా ప్రకటించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్‌కతా మహానగరంలోని బ్రాహ్మణ జమిందారీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి దేవేంద్రనాథ ఠాగూరు, తల్లి శారదాదేవి. ఈ దంపతుల 13వ సంతానం రవీంద్రుడు. ఇతడే కడపటివాడు. ‘ఠాగూర్’ అంటే ‘గౌరవప్రదమైన అయ్యా’ అని అర్థం. రవీంద్రుని తల్లి శారదాదేవి అతడి చిన్నతనంలోనే మరణించారు. దాంతో ఆయన నౌకర్ల చేతిలో పెరిగాడు. రవీంద్రుడి జ్యేష్ట సోదరుడైన ద్విజేంద్రనాథ ఠాగూరు సమాజంలో గౌరవం పొందిన కవి, తత్వవేత్త. మరొక సోదరుడు సత్యేంద్రనాథ్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఐసీఎస్ పదవి పొందిన తొలి భారతీయ అధికారి. మరొక సోదరుడు జ్యోతీంద్రనాథ నాటక ప్రయోక్త, సంగీతకారుడు. అందువల్ల జోరాశాంకో జమీందారీ బంగళా ఎప్పుడూ నాటకాలతో, పాశ్చాత్య, బెంగాలీ సంగీత సభలతో, సాహిత్య గోష్ఠులతో కళకళలాడుతూ ఉండేది. రవీంద్రుని సోదరి స్వర్ణకుమారి రచయిత్రి. రవీంద్రుడు ఏ పాఠశాలకు పోకుండానే ఇంటివద్దే విద్యాభ్యాసం చేశాడు. 8 సంవత్సరాల వయసులోనే రవీంద్రుడు పద్యాలు రాయటం ప్రారంభించాడు. ఆయన రాసిన మొట్టమొదటి పద్య సంపుటి ‘భాను సింహ’, అయితే దానిని బెంగాలీ పండితులు ఆమోదించలేదు. శాంతినికేతన్‌కు పయనం! రవీంద్రునికి 11 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆ తరువాత రవీంద్రుడు తన సోదరులతో కలిసి తండ్రి స్థాపించిన శాంతినికేతన్ ఎస్టేట్‌కు వెళ్లాడు. ఆ సమయంలోనే ఆయన హిమాలయాలలోని డల్హౌసీ, పర్వత ప్రాంతాలను దర్శించాడు. ఆ ప్రాంతాలు, శాంతినికేతన్, రవీంద్రుని మనస్సును ఆకట్టుకున్నాయి. రవీంద్రుడు సోదరులతో అక్కడే కొన్ని నెలల పాటు గడిపాడు. ఆ సమయంలోనే ఎందరో ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆయన తండ్రి జీవిత చరిత్ర, బెంజమిన్ ఫ్రాంక్లిన్ (రచయిత) జీవిత చరిత్ర, ఎడ్వర్ట్ గిబ్బన్ రాసిన రోమన్ సామ్రాజ్య తిరోగతి, పతనం, కాళిదాసు కవిత్వం మొదలైన రచనలను ఆకళింపు చేసుకున్నారు. తాను స్వయంగా రాయడం ప్రారంభించారు. న్యాయశాస్త్రం చదివించాలని! రవీంద్రుడిని బారిస్టర్‌ని చేయాలనేది తండ్రి దేవేంద్రనాథ్ కోరిక. 1878 సంవత్సరంలో రవీంద్రుణ్ని ఇంగ్లండుకి పంపించారు. ఇంగ్లండులో న్యాయ శాస్త్ర కళాశాలలో చేరినప్పటికీ ఆయన బారిష్టర్ కాలేదు. ఆ చదువు మధ్యలోనే మాని, షేక్స్పియర్ రచనలు ‘రెలిజియో మెడిసి’, ‘కొరియొలోనస్’, ‘ఆంటోనీ క్లియోపాత్రా’ మొదలైనవన్నీ ఆకళింపు చేసుకున్నారు. చక్కని ఆంగ్ల భాషలో మాట్లాడటం, రాయటం నేర్చుకున్నారు. ఐరిష్, స్కాటిష్ జానపద గేయాలను నేర్చుకుని, 1880లో స్వదేశం చేరుకున్నారు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను యూరప్ దేశాల సంస్కృతులతో మేళవించి, రెండింటిలోని మంచిని తాను నమ్మిన సిద్ధాంతాలకు అన్వయించాడు. వివాహం! రవీంద్రుని వివాహం 1883వ సంవత్సరంలో భవతారిణి శాఖకు చెందిన మృణాళినీదేవితో జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. 1890లో జమీ వ్యవహారాల బాధ్యత ఆయన మీద పడింది. ‘షి లై ద హా’ అనే అతిపెద్ద జమీందారీ ఎస్టేట్ (ఈ ప్రాంతం ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉంది) నిర్వహణలోని లోపాలను సవరించారాయన. వ్యవసాయ భూములను రైతులకు స్వాధీనం చేసి, వారి నుంచి నామ మాత్రపు శిస్తులు వసూలు చేసేవారు. జమీందారీ వ్యవహారాలు చూసుకుంటూనే రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌కు మకాం మార్చుకున్నారు. శాంతినికేతన్లో ఉన్నప్పుడు రవీంద్రుని పిల్లలిద్దరు, ఆయన భార్య మృణాళిని మరణించారు. దానితో రవీంద్రుడు విరాగిగా మారిపోయారు. 1905వ సంవత్సరంలో రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ మరణించడంతో రవీంద్రునికి జమీందారీ జీవితంపై ఆసక్తి నశించింది. రచనావ్యాసంగంలో మునిగిపోయి, ఆందులోనే సాంత్వన పొందారు. రచనలపై నెలకు వచ్చే రెండు వేల రూపాయల రాయల్టీతో సామన్యమైన జీవితం గడపటం ప్రారంభించాడు. ఠాగూర్ తన రచనలలో చాలా వాటికి స్వయంగా ఆంగ్లానువాదాలు చేశారు. నోబెల్ బహుమతి అందుకున్న తర్వాత బ్రిటన్ మహారాణి ఠాగూర్‌కు ‘నైట్’ బిరుదు ప్రదానం చేశారు. అయితే రవీంద్రుని దేశభక్తి ఆ బిరుదుని త్యజించేలా చేసింది. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో బ్రిటిష్ సైన్యం భారతీయులను హతమార్చిన సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. విశ్వకవి పై జాతిపిత ప్రభావం! మహాత్మాగాంధీతో పరిచయం ఏర్పడిన తర్వాత రవీంద్రుడు తనదైన శైలిలో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభించారు. కుల వివక్షను తొలగించటానికి బెంగాల్లో శ్రీకారం చుట్టి, దక్షిణాదిన గురువాయూరు దేవాలయంలో దళితులకు ప్రవేశం కల్పించి, అంటరానితనాన్ని నిర్మూలించటానికి ఎన్నో మార్గాలు సూచించారు. పల్లెల పునర్ నిర్మాణం కోసం వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ఎల్మ్‌హర్‌స్ట్‌తో కలిసి బెంగాల్లో ‘శ్రీ నికేతన్ సంక్షేమ సంస్థ’ను స్థాపించి, పల్లె ప్రజలలో మనోవికాసం తేవటానికి కృషి చేశారు. 1930 దశాబ్దంలో కుల నిర్మూలన ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దానికి సంబంధించిన ఎన్నో నవలలు, నాటకాలు రాశారు. భారతీయ ఔన్నత్యాన్ని చాటుతూ... రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక దేశాలు సందర్శించి ‘విశ్వంలోని మానవులంతా ఒక్కటే’ అనే సందేశాన్ని అందించారు. తాను నమ్మిన బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ద్వారా మతాలకు అతీతమైన పరబ్రహ్మమొక్కటే అందరికీ దైవం అని ప్రచారం చేసి ‘విశ్వకవి’, ‘గురుదేవ్’ బిరుదులను శాశ్వతం చేసుకున్నారు. ప్రపంచ పర్యటనలో 35కు పైగా దేశాలలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. విశ్వకవి రవీంద్రుడి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం. ఎవరు ఏ దృష్టితో శోధించినా దానికి సంబంధించిన విషయం, వివరణ లభించక మానదు. జనగణమన... అధినాయక..! గీతాంజలి, గోరా, ఘరే బైరే మొదలైన రచనలన్నీ సహజత్వం ఉట్టిపడుతూ సామాన్యులకు అర్థమయ్యేటట్లు వాడుకభాషలో, సరళమైన శబ్దాలతో ఉంటాయి. దేశభక్తిని, విశ్వమానవ సౌభ్రాతృత్వం చాటేటట్లు రాసిన రెండు గీతాలను భారతదేశం (జనగణమన), బంగ్లాదేశ్ (అమార సోనార్ బంగ్ల) జాతీయగీతాలుగా ఎంపిక చేసుకున్నాయి. ఠాగూర్ గీత రచయిత మాత్రమే కాదు... నాటక రచయిత, నాటక కర్త, వక్త, వ్యాఖ్యాత కూడ. రవీంద్రుని రచనలు: గీతాలు: మానసి (1890); సోనార్ తరి (1890); గీతాంజలి (1910); గీతిమాల్య (1914); తోటమాలి (1913) (వీటిని స్వయంగా ఆంగ్లంలోకి స్వేచ్ఛానువాదం చేశారు). నాటకాలు, కథలు: రాజా (1910); డాక్ ఘర్ (1912); అచలాయతన్ (1912) ; ముక్తధార (1922); రక్తక రవి (1926) ‘గోరా’(1910); ఘరే బైరే (1916); యోగా యోగాలు (1929) ; బికారిణి (1929) , నృత్యరూపకాలు: పాత్రపుత్( 1936), శేషసప్తక్ (1935), శ్యామ (1939), చండాలిక (1939) రవీంద్రుడు ఆరోగ్యం క్షీణించిన తర్వాత ‘చార్ అధ్యాయ్ (1934), విశ్వ పరిచయ్ (1937), తీన్‌సంగి, గల్పశిల్ప (1941)’ మొదలైన రచనలు చేశారు. 1941లో రవీంద్రుడు చనిపోయే ముందురోజు అప్పటి ఎలక్షన్ కమిషనర్ అయిన ఏకే సేన్ అనే మిత్రుణ్ని పిలిచి, తన తుది సందేశాన్ని చెప్పారు. ‘నా జన్మ మధ్యలోనే అంతరిస్తోంది. ఈ సమయంలో నా స్నేహితుల వెచ్చని స్పర్శ, ఈ పుడమితల్లి శాశ్వత ప్రేమ, మానవులందరి ఆశీస్సులను నాతో తీసుకుని వెళ్తున్నాను. నేను ఈ ప్రపంచానికి ఇవ్వవలసినదంతా ఇచ్చాను. ఈ రోజు నేను ఖాళీ సంచితో ఉన్నాను. మీరంతా కొంత ప్రేమ, క్షమాపణలు ఇస్తే ఈ ప్రపంచం లేని చోటకి శాశ్వతానందంతో వెళ్తాను’ అని రాయించారు ఠాగూర్. ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచే సందేశాన్నిచ్చిన విశ్వకవి 1941వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన శరీర త్యాగం చేశారు. - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు