రవీంద్రనాథ్ టాగూర్‌ను తెలుసుకునేందుకు ఒకప్పుడు నేను గొప్ప వారైన ఇతర కవులతో ఆయనను పోల్చి చూడటం ప్రారంభించాను. హోమర్, విర్జిల్ డాంటే, మిల్టన్ లాంటి కవుల రచనలు మళ్లీ చదివాను. అలాగే శాంతినికేతన్ పేరిట సంపుటాలుగా వెలువడ్డ టాగూర్ ఉపన్యాస గ్రంథావళిని మరొకసారి చదవడం మొదలుపెట్టాను. చివరకు నా ప్రశ్నకు జవాబు దొరికింది. డాంటే కన్నా టాగూర్ గొప్పవాడా అంటే, అవును గొప్పవాడే! కాలగతిలో నిలిచే 20 మంది మహోన్నత రచయితల్లో టాగూర్ ఒకరని ప్రముఖ రచయిత నీరద్ సి. చౌధురి అన్న మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
టాగూర్‌ను అంత ఉన్నతస్థానంలో కూర్చోబెట్టడానికి అనేక కారణాలున్నాయి. భాష మీద ఆయనకున్న పట్టు అసాధారణం. ఆయన కలం నుంచి ప్రతి వాక్యం హాయిగా సాగిపోతుంది. ఆయన కేవలం కవే కాదు. నవలా రచయిత, అత్యుత్తమ కథానికలు రాసిన వ్యక్తి. పాటలకు బాణీలు కట్టడంలో దిట్ట. మంచి చిత్రకారుడు, విద్యావేత్త. అంతేకాకుండా, జన వ్యవహారాలలో మునిగి తేలిన వ్యక్తి. స్వతంత్ర భారతావనిని తీర్చిదిద్దిన మనిషి. ‘‘పరిమితమైన దానితో అపరిమితమైన దానిని అందుకోవడం వల్ల కలిగే సంతోషం మీదే నా రచనలన్నీ సాగాయి’’ అని టాగూర్ చెప్పుకున్నారు.
చాలామంది లాగా ఆయన ఎప్పుడూ తన దృష్టిని స్వర్గానికో, నరకానికో మాత్రమే పరిమితం చేయలేదు. ఆయన తన రచనల్లోని అతి గొప్ప పాటల్లో ఒక దానిలో ‘అఛే దుఖో, అఛే మృత్యు, విరహదహన్ లగే / తబువో శాంతి, తబు ఆనంద, తబు అనంత జాగే (దుఃఖం ఉంది. మరణమూ ఉంది. విరహమనే అగ్ని కూడా ఉంది. అయితే శాంతి, ఆనందం, శాశ్వతత్వం మేల్కొను గాక)’’ అని రాశారు.
ఆయన గురించి నిర్వచించే అంశాలన్నీ ఈ చైతన్యంలో నుంచి పొటమరించినవే! ఆయన కరుణ, ఆయన సామాజిక క్రియాశీలత, సహజ వాతావరణం పట్ల ఆయన అక్కర; స్త్రీలు, పిల్లలతో ఆయనకున్న సాన్నిహిత్యం లాంటివన్నీ ఆయనను ఇప్పటికీ లెక్కించాల్సిన వ్యక్తిని చేస్తున్నాయి. బెంగాలీలు చెప్పింది సరైన మాటే! టాగూర్ ‘విశ్వకవి’. బెంగాలీల ఆలోచనలను కూడా అధిగమించి టాగూర్ ఎదిగారని భావిస్తున్నాను.
– విలియమ్ ర్యాడిస్, బెంగాలీ సాహితీ పండితులు, టాగూర్ రచనల అనువాదకులు
Comments
Please login to add a commentAdd a comment