నోబెల్ ఇండియా పురస్కారం: రవీంద్రనాథ్ ఠాగూర్ అధినాయక కవి | India's first Nobel laureate `Rabindranath Tagore` | Sakshi
Sakshi News home page

నోబెల్ ఇండియా పురస్కారం: రవీంద్రనాథ్ ఠాగూర్ అధినాయక కవి

Published Sun, Nov 10 2013 3:38 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

నోబెల్ ఇండియా పురస్కారం:  రవీంద్రనాథ్ ఠాగూర్ అధినాయక కవి - Sakshi

నోబెల్ ఇండియా పురస్కారం: రవీంద్రనాథ్ ఠాగూర్ అధినాయక కవి

ఆంగ్లేతర సాహిత్య రచనలతో అత్యంత  ప్రతిష్ఠాకరమైన నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ప్రతిభాశాలి విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్. ఈయన రచించిన ‘గీతాంజలి’ తదితర బెంగాలీ రచనలు సమాజాన్ని ఉత్తేజరపరిచాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాయి. ఠాగూర్ రచనలు సర్వ మానవ సౌభ్రాతృత్వ భావనకు ప్రాణం పోశాయి. వీటిని రవీంద్రుడే స్వయంగా ఆంగ్లానువాదం చేయడం మరో విశేషం.
 
 ఈ అనువాదాల ద్వారా నోబెల్ కమిటీ
 ఈ రచనల సారాంశాన్ని గ్రహించింది. అతడిని 1913లో నోబెల్ బహుమానానికి అర్హుడిగా ప్రకటించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్‌కతా మహానగరంలోని బ్రాహ్మణ జమిందారీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి దేవేంద్రనాథ ఠాగూరు, తల్లి శారదాదేవి. ఈ దంపతుల 13వ సంతానం రవీంద్రుడు. ఇతడే కడపటివాడు. ‘ఠాగూర్’ అంటే ‘గౌరవప్రదమైన అయ్యా’ అని అర్థం. రవీంద్రుని తల్లి శారదాదేవి అతడి చిన్నతనంలోనే మరణించారు. దాంతో ఆయన నౌకర్ల చేతిలో పెరిగాడు. రవీంద్రుడి జ్యేష్ట సోదరుడైన ద్విజేంద్రనాథ ఠాగూరు సమాజంలో గౌరవం పొందిన కవి, తత్వవేత్త. మరొక సోదరుడు సత్యేంద్రనాథ్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఐసీఎస్ పదవి పొందిన తొలి భారతీయ అధికారి. మరొక సోదరుడు జ్యోతీంద్రనాథ నాటక ప్రయోక్త, సంగీతకారుడు. అందువల్ల జోరాశాంకో జమీందారీ బంగళా ఎప్పుడూ నాటకాలతో, పాశ్చాత్య, బెంగాలీ సంగీత సభలతో, సాహిత్య గోష్ఠులతో కళకళలాడుతూ ఉండేది. రవీంద్రుని సోదరి స్వర్ణకుమారి రచయిత్రి. రవీంద్రుడు ఏ పాఠశాలకు పోకుండానే ఇంటివద్దే విద్యాభ్యాసం చేశాడు. 8 సంవత్సరాల వయసులోనే రవీంద్రుడు పద్యాలు రాయటం ప్రారంభించాడు. ఆయన రాసిన మొట్టమొదటి పద్య సంపుటి ‘భాను సింహ’, అయితే దానిని బెంగాలీ పండితులు ఆమోదించలేదు.
 
 శాంతినికేతన్‌కు పయనం!
 రవీంద్రునికి 11 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆ తరువాత రవీంద్రుడు తన సోదరులతో కలిసి తండ్రి స్థాపించిన శాంతినికేతన్ ఎస్టేట్‌కు వెళ్లాడు. ఆ సమయంలోనే ఆయన హిమాలయాలలోని డల్హౌసీ, పర్వత ప్రాంతాలను దర్శించాడు. ఆ ప్రాంతాలు, శాంతినికేతన్, రవీంద్రుని మనస్సును ఆకట్టుకున్నాయి. రవీంద్రుడు సోదరులతో అక్కడే కొన్ని నెలల పాటు గడిపాడు. ఆ సమయంలోనే ఎందరో ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆయన తండ్రి జీవిత చరిత్ర, బెంజమిన్ ఫ్రాంక్లిన్ (రచయిత) జీవిత చరిత్ర, ఎడ్వర్ట్ గిబ్బన్ రాసిన రోమన్ సామ్రాజ్య తిరోగతి, పతనం, కాళిదాసు కవిత్వం మొదలైన రచనలను ఆకళింపు చేసుకున్నారు. తాను స్వయంగా రాయడం ప్రారంభించారు.
 
 న్యాయశాస్త్రం చదివించాలని!
 రవీంద్రుడిని బారిస్టర్‌ని చేయాలనేది తండ్రి దేవేంద్రనాథ్ కోరిక. 1878 సంవత్సరంలో రవీంద్రుణ్ని ఇంగ్లండుకి పంపించారు. ఇంగ్లండులో న్యాయ శాస్త్ర కళాశాలలో చేరినప్పటికీ ఆయన బారిష్టర్ కాలేదు. ఆ చదువు మధ్యలోనే మాని, షేక్‌స్పియర్ రచనలు ‘రెలిజియో మెడిసి’, ‘కొరియొలోనస్’, ‘ఆంటోనీ క్లియోపాత్రా’ మొదలైనవన్నీ ఆకళింపు చేసుకున్నారు. చక్కని ఆంగ్ల భాషలో మాట్లాడటం, రాయటం నేర్చుకున్నారు. ఐరిష్, స్కాటిష్ జానపద గేయాలను నేర్చుకుని, 1880లో స్వదేశం చేరుకున్నారు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను యూరప్ దేశాల సంస్కృతులతో మేళవించి, రెండింటిలోని మంచిని తాను నమ్మిన సిద్ధాంతాలకు అన్వయించాడు.
 
 వివాహం!
 రవీంద్రుని వివాహం 1883వ సంవత్సరంలో భవతారిణి శాఖకు చెందిన మృణాళినీదేవితో జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. 1890లో జమీ వ్యవహారాల బాధ్యత ఆయన మీద పడింది. ‘షి లై ద హా’ అనే అతిపెద్ద జమీందారీ ఎస్టేట్ (ఈ ప్రాంతం ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉంది) నిర్వహణలోని లోపాలను సవరించారాయన. వ్యవసాయ భూములను రైతులకు స్వాధీనం చేసి, వారి నుంచి నామ మాత్రపు శిస్తులు వసూలు చేసేవారు. జమీందారీ వ్యవహారాలు చూసుకుంటూనే రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌కు మకాం మార్చుకున్నారు. శాంతినికేతన్‌లో ఉన్నప్పుడు రవీంద్రుని పిల్లలిద్దరు, ఆయన భార్య మృణాళిని మరణించారు. దానితో రవీంద్రుడు విరాగిగా మారిపోయారు. 1905వ సంవత్సరంలో రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ మరణించడంతో రవీంద్రునికి జమీందారీ జీవితంపై ఆసక్తి నశించింది. రచనావ్యాసంగంలో మునిగిపోయి, ఆందులోనే సాంత్వన పొందారు. రచనలపై నెలకు వచ్చే రెండు వేల రూపాయల రాయల్టీతో సామన్యమైన జీవితం గడపటం ప్రారంభించాడు.
 
 ఠాగూర్ తన రచనలలో చాలా వాటికి స్వయంగా ఆంగ్లానువాదాలు చేశారు. నోబెల్ బహుమతి అందుకున్న తర్వాత బ్రిటన్ మహారాణి ఠాగూర్‌కు ‘నైట్’ బిరుదు ప్రదానం చేశారు. అయితే రవీంద్రుని దేశభక్తి ఆ బిరుదుని త్యజించేలా చేసింది. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో బ్రిటిష్ సైన్యం భారతీయులను హతమార్చిన సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
 
 విశ్వకవి పై జాతిపిత ప్రభావం!
 మహాత్మాగాంధీతో పరిచయం ఏర్పడిన తర్వాత రవీంద్రుడు తనదైన శైలిలో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభించారు.  కుల వివక్షను తొలగించటానికి బెంగాల్‌లో శ్రీకారం చుట్టి, దక్షిణాదిన గురువాయూరు దేవాలయంలో దళితులకు ప్రవేశం కల్పించి, అంటరానితనాన్ని నిర్మూలించటానికి ఎన్నో మార్గాలు సూచించారు. పల్లెల పునర్ నిర్మాణం కోసం వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ఎల్మ్‌హర్‌స్ట్‌తో కలిసి బెంగాల్‌లో ‘శ్రీ నికేతన్ సంక్షేమ సంస్థ’ను స్థాపించి, పల్లె ప్రజలలో మనోవికాసం తేవటానికి కృషి చేశారు. 1930 దశాబ్దంలో కుల నిర్మూలన ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దానికి సంబంధించిన ఎన్నో నవలలు, నాటకాలు రాశారు.
 
 భారతీయ ఔన్నత్యాన్ని చాటుతూ...
 రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక దేశాలు సందర్శించి ‘విశ్వంలోని మానవులంతా ఒక్కటే’ అనే సందేశాన్ని అందించారు. తాను నమ్మిన బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ద్వారా మతాలకు అతీతమైన పరబ్రహ్మమొక్కటే అందరికీ దైవం అని ప్రచారం చేసి ‘విశ్వకవి’, ‘గురుదేవ్’ బిరుదులను శాశ్వతం చేసుకున్నారు. ప్రపంచ పర్యటనలో 35కు పైగా దేశాలలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. విశ్వకవి రవీంద్రుడి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం. ఎవరు ఏ దృష్టితో శోధించినా దానికి సంబంధించిన విషయం, వివరణ లభించక మానదు.
 
 జనగణమన... అధినాయక..!
 గీతాంజలి,  గోరా, ఘరే బైరే మొదలైన రచనలన్నీ సహజత్వం ఉట్టిపడుతూ సామాన్యులకు అర్థమయ్యేటట్లు వాడుకభాషలో, సరళమైన శబ్దాలతో ఉంటాయి. దేశభక్తిని, విశ్వమానవ సౌభ్రాతృత్వం చాటేటట్లు రాసిన రెండు గీతాలను భారతదేశం (జనగణమన), బంగ్లాదేశ్ (అమార సోనార్ బంగ్ల) జాతీయగీతాలుగా ఎంపిక చేసుకున్నాయి. ఠాగూర్ గీత రచయిత మాత్రమే కాదు... నాటక రచయిత, నాటక కర్త, వక్త, వ్యాఖ్యాత కూడ.
 
 రవీంద్రుని రచనలు:
 గీతాలు: మానసి (1890); సోనార్ తరి (1890); గీతాంజలి (1910); గీతిమాల్య (1914); తోటమాలి (1913)  (వీటిని స్వయంగా ఆంగ్లంలోకి స్వేచ్ఛానువాదం చేశారు).
 నాటకాలు, కథలు: రాజా (1910); డాక్ ఘర్ (1912); అచలాయతన్ (1912) ; ముక్తధార (1922); రక్తక రవి (1926)
 ‘గోరా’(1910); ఘరే బైరే (1916); యోగా యోగాలు (1929) ; బికారిణి (1929) ,
 నృత్యరూపకాలు: పాత్రపుత్( 1936),  శేషసప్తక్ (1935), శ్యామ (1939), చండాలిక (1939)
 
 రవీంద్రుడు ఆరోగ్యం క్షీణించిన తర్వాత ‘చార్ అధ్యాయ్ (1934), విశ్వ పరిచయ్ (1937), తీన్‌సంగి, గల్పశిల్ప (1941)’ మొదలైన రచనలు చేశారు. 1941లో రవీంద్రుడు చనిపోయే ముందురోజు అప్పటి ఎలక్షన్ కమిషనర్ అయిన ఏకే సేన్ అనే మిత్రుణ్ని పిలిచి, తన తుది సందేశాన్ని చెప్పారు. ‘నా జన్మ మధ్యలోనే అంతరిస్తోంది. ఈ సమయంలో నా స్నేహితుల వెచ్చని స్పర్శ, ఈ పుడమితల్లి శాశ్వత ప్రేమ, మానవులందరి ఆశీస్సులను నాతో తీసుకుని వెళ్తున్నాను. నేను ఈ ప్రపంచానికి ఇవ్వవలసినదంతా ఇచ్చాను. ఈ రోజు నేను ఖాళీ సంచితో ఉన్నాను. మీరంతా కొంత ప్రేమ, క్షమాపణలు ఇస్తే ఈ ప్రపంచం లేని చోటకి శాశ్వతానందంతో వెళ్తాను’ అని రాయించారు ఠాగూర్. ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచే సందేశాన్నిచ్చిన విశ్వకవి 1941వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన శరీర త్యాగం చేశారు.
 - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు
 విశ్రాంత రసాయనాచార్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement