Rebbapragada ramanjaneyulu
-
పురస్కారం: సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్
నోబెల్ ఇండియా : ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం అందుకున్న ప్రముఖ భారతీయులలో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు. ఈయన చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్) అంతటి ప్రతిభాశాలి. వీరికి 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. ఈ బహుమతిని ఆయన భౌతిక శాస్త్రాధ్యయనంలో తన తొలి గురువైన విలియమ్ ఎ.ఫౌలర్‌తో పంచుకున్నారు. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్... సర్ సి.వి.రామన్ సోదరుని కుమారుడు. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో లాహోర్ పట్టణంలో (ప్రస్తుత పాకిస్తాన్) 1910, అక్టోబర్ 19వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్, తల్లి సీతాలక్ష్మి. సుబ్రహ్మణ్య అయ్యర్ ఆగ్నేయ రైల్వే ఉద్యోగి. ఆయన ఉప-ఆడిటర్ జనరల్ అధికారిగా లాహోర్‌లో పనిచేస్తున్న రోజుల్లో చంద్రశేఖర్ జన్మించారు. చంద్రశేఖర్ చిన్నతనంలో తల్లి దగ్గరే చదువుకున్నారు. ఆయన చదువుకోసం 1922లో కుటుంబం చెన్నైకి మారింది. విద్యాభ్యాసం: చంద్రశేఖర్ చెన్నైలోని హిందూ హైస్కూల్లో చేరారు. తరువాత ఆయన చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్రంలో బీఎస్సీ ఆనర్స్ పట్టా పొందారు. చంద్రశేఖర్ బీఎస్సీ చదివే రోజుల్లో ఆర్నాల్డ్ సోమర్ఫెల్ట్ అనే శాస్త్రజ్ఞుడి ఉపన్యాసానికి ఉత్తేజితుడయ్యాడు. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో 1930లో ఇంగ్లండు వెళ్లి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ట్రినిటీ కాలేజీలో ప్రొఫెసర్ ఫౌలర్ వద్ద రీసెర్చి ప్రారంభించారు. చంద్రశేఖర్‌కు అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రం అంటే చాలా మక్కువ. ఇంగ్లండుకు బయలుదేరటానికి ముందే విశ్వాంతరాళంలో తారలు ఏర్పడే విధానం, తారలలో జరిగే పరిణామాలు, తారల స్థిరత్వం అనే అంశాలపై పరిశోధనలు జరిపి శాస్త్రజ్ఞులలో గుర్తింపు పొందారు. ట్రినిటీ కళాశాలలో చేసిన పరిశోధనలకు గాను, ఆయనకు 1933వ సంవత్సరంలో అంతరిక్ష శాస్త్రంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. ఒక పక్క ట్రినిటీ కళాశాలలో ఉన్నత విద్యనభ్యసిస్తూనే, జర్మనీ దేశంలో గొట్టింగెన్లోని బ్రౌన్ పరిశోధనాలయంలో, కోపెన్ హాగెన్లోని భౌతిక విజ్ఞాన శాస్త్ర సిద్ధాంత సంస్థలోనూ పరిశోధనలు చేశారు. పరమాణు నిర్మాణంపై అద్భుతమైన పరిశోధనలు చేసి పేరుపొందిన నీల్స్‌భోర్ శాస్త్రజ్ఞుడిని స్వయంగా కలుసుకున్నారు. ఆ తరువాతి సంవత్సరంలో ఆయన జీవితంలో మార్పులు వచ్చాయి. వివాహం! సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1936, సెప్టెంబర్‌లో లలితా దొరైస్వామిని వివాహమాడారు. లలిత ప్రెసిడెన్సీ కళాశాలలో చంద్రశేఖర్‌కు జూనియర్. అదే సంవత్సరంలో ఆయన అంతరిక్ష శాస్త్రంలో తాను ప్రతిపాదించిన (బ్లాక్ హోల్స్) కృష్ణబిల సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆర్థర్ ఎడింగ్టన్తో విభేదించి, అమెరికాకు వలస వెళ్లారు. అమెరికాలో ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగో యూనివర్సిటీలో భౌతిక, విజ్ఞాన శాస్త్రం అంతరిక్ష శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా (1937లో) చేరారు. పదవీవిరమణ చేసే వరకు అదే విశ్వవిద్యాలయంలో కొనసాగారు. 1985లో పదవీ విరమణ అనంతరం, ఎమరిటస్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈ సుదీర్ఘమైన కాలంలో అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్ర రంగంలో అనేక ఫలవంతమైన పరిశోధనలు చేసి, 1983లో భౌతిక విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో తాను చేరిన తొలి రోజుల్లో ప్రతిపాదించిన చిన్న నక్షత్రాల ద్రవ్యరాశికి గరిష్ట పరిమితి నిర్ణయం ‘చంద్రశేఖర్ పరిమితి’ అనే సిద్ధాంత వ్యాసానికి నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన ఈ పురస్కారాన్ని తన గురువైన డాక్టర్ ఎ.ఫౌలర్‌తో పంచుకున్నారు. అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రంలో ప్రొఫెసర్ చంద్రశేఖర్ జరిపిన ఫలవంతమైన పరిశోధనలెన్నో ఉన్నా ఆయన తొలి ఆవిష్కరణకే నోబెల్ పురస్కారం అందుకోవటం విశేషం. అంతరిక్షంలో ఏ నక్షత్రానికైనా ద్రవ్యరాశి చంద్రశేఖర్ అవధిలోనే ఉంటుంది. ఉదాహరణకు ‘వైట్ డ్వార్ఫ్’గా పిలవబడే చిన్న నక్షత్రం యొక్క గరిష్ట ద్రవ్యరాశి పరిమితిని చంద్రశేఖర్ క్వాంటమ్ సిద్ధాంతాల ఆధారంగా గణించి, 2.864ఁ 1030 కిలోగ్రాములుగా నిర్ధారించారు. ఈ ద్రవ్యరాశి విలువను దాటితే, ‘న్యూట్రాన్ నక్షత్రాలు’ ఏర్పడతాయని, అవే కృష్ణబిలాలుగా ఏర్పడతాయని, వాటిలోంచి విభిన్నమైన శకల శేషాలు ఆవిర్భావం చెందుతాయని చంద్రశేఖర్ ప్రతిపాదించారు. ఆయనకు రాయల్ సొసైటీ ఫెలోగా 1944లో ‘ఎఫ్.ఆర్.ఎస్’ గుర్తింపు ఇవ్వటం జరిగింది. 1968వ సంవత్సరంలో భారత ప్రభుత్వం చంద్రశేఖర్‌ను ‘పద్మ విభూషణ్’తో సత్కరించింది. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1966లో అమెరికా పౌరసత్వం అందుకున్నారు. ఆయనకు అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని ఇచ్చింది. చంద్రశేఖర్ అమెరికా ప్రభుత్వం చేపట్టిన అనేక నాసా పరిశోధనలలో సేవలందించారు. అద్భుత ఆవిష్కరణలను చేశారు. ఆయన సేవలకు గాను నాసావారు ఒక పరిశోధన ప్రయోగశాలకు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరుపెట్టారు. అంతరిక్ష శాస్త్రంలో ఆయన ఎనిమిదికి పైగా గ్రంథాలను ప్రచురించారు. ఇంతటి అద్వితీయ ప్రతిభాశాలి సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1995వ సంవత్సరం ఆగస్టు 21వ తేదీన చికాగోలో గుండె జబ్బుతో మరణించారు. ఆయన పరిశోధనలు మానవాళికి ఎంతో విజ్ఞానాన్నందిస్తాయి. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పరిశోధనలు...బిరుదులు... పురస్కారాలు! 1929-39: అంతరిక్ష నిర్మాణం, చంద్రశేఖర్ పరిమితి, అంతరిక్ష గతిశాస్త్ర పరిశోధనలు. 1939-43: న్యూట్రాన్ రేడియేటివ్ ట్రాన్స్ఫర్, రుణాత్మక హైడ్రోజన్ (హైడ్రైవ్ అయాన్)ల క్వాంటమ్ సిద్ధాంతం. 1943-50: హైడ్రో డైనమిక్, హైడ్రో మ్యాగ్నటిక్ స్థిరత్వం. 1950-69: ఎలిప్స్ ఆకృతిగల నిర్మాణాల సమతాస్థితి, స్థిరత్వాలు. 1971-83: కృష్ణబిలాల భౌతిక విజ్ఞాన గణిత సిద్ధాంతం 1980: గురుత్వాకర్షణ తరంగాల పరస్పర తాడనాల సిద్ధాంతం. పదవులు, ఆవిష్కరణలు: 1952-71: అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్ర జర్నల్. 1995 న్యూటన్ సిద్ధాంత సూత్రాల ప్రచురణ. 1983: నోబెల్ పురస్కారం (భౌతిక శాస్త్రంలో). 1968: పద్మ విభూషణ్ పురస్కారం. 1984: కోప్లే మెడల్ 1966: అమెరికా జాతీయ విజ్ఞానశాస్త్ర మెడల్. - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు -
పురస్కారం: మదర్ థెరిసా.. ప్రపంచ శాంతిదూత
నోబెల్ ఇండియా: అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో భారతదేశానికే కీర్తి తెచ్చిన స్త్రీ మదర్ థెరిసా. ఈమెకు 1979వ సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. మానవాళికి దారిద్య్రం నుంచి, బాధల నుంచి విముక్తి కల్పించటానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ బహుమతి అందజేశారు. మదర్ థెరిసా బాల్యం: మదర్ థెరిసా ఆల్బేనియా దేశంలోని ‘స్కోయె’ పట్టణంలో 1910వ సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీన జన్మించారు. ఆగస్టు 27వ తేదీన ఆమెను రోమన్ క్యాథలిక్ చర్చిలో బాప్టైజ్ చేసి, యాగ్నిస్ గోన్‌జా బొయాహు అని పేరు పెట్టారు. ఆల్బేనియన్ భాషలో గొన్జా అంటే గులాబీ మొగ్గ అని అర్థం. ఆమె తండ్రి నైకోల్ డ్రానాషిల్ బొయాహు. ఆయనకు నలుగురు సంతానం. వారిలో యాగ్నిస్ కడపటిది. చిన్నతనం నుంచి యాగ్నిస్కు రోమన్ క్యాథలిక్ మిషనరీల సేవలకు సంబంధించిన కథలంటే చాలా ఇష్టం. యాగ్నిస్ తండ్రి రాజకీయాలలో ఉంటూ, 1919వ సంవత్సరంలో మరణించారు. యాగ్నిస్ 12 సంవత్సరాల వయసులోనే దైవచింతనతో రోమన్ క్యాథలిక్ చర్చి వైపు ఆకర్షితమయ్యారు. 18 సంవత్సరాల వయసులో ఆమె లొరీటో ఐరిష్ నన్ల వ్యవస్థలో చేరి, ఆంగ్లంలో ప్రావీణ్యత పొంది, 1931 మే నెల 24వ తేదీన ‘నన్’గా ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే ఆమె భారతదేశంలోని కలకత్తా నగరానికి చేరుకుని, 1931 నుంచి 1948 వరకు కలకత్తాలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేశారు. భారత్‌లో సేవలు: రోమన్ క్యాథలిక్ మిషనరీల ఆచారం ప్రకారం, యాగ్నిస్ తొలి నామాన్ని థెరిసాగా మార్చుకుని, అందమైన హిమాలయాలలోని డార్జిలింగ్ నగరంలో రోమన్ క్యాథలిక్‌గా సేవలు ప్రారంభించారు. అనంతరం ఆమె కలకత్తా శివార్లలోని ‘ఎంటాలీ’ అనే చోట లొరీటో కాన్వెంట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ, అదే స్కూల్లో 1944వ సంవత్సరంలో ప్రధానోపాధ్యాయిని అయ్యారు. ఆ ఏడాది బెంగాల్ రాష్ట్రంలో కరువు వచ్చి, కలకత్తా నగరంలో ఆకలి వల్ల రోగాల వల్ల ఎందరో చనిపోయారు. దానికి తోడు, 1946లో హిందు, ముస్లిం మత వైషమ్యాలు, విధ్వంసకర సంఘటనలు కలకత్తా నగరాన్ని అల్లకల్లోలం చేసి, భయంకరంగా తయారుచేశాయి. మదర్ థెరిసా 1946 సెప్టెంబర్‌లో అంతఃకరణ ప్రబోధంతో సంఘసేవకు శ్రీకారం చుట్టారు. ఆమె కలకత్తా నగరంలోని పేదలు నివసించే పేటలలో తన సహాయ కార్యక్రమాలు ప్రారంభించి, మోతీజిల్ అనే మురికివాడలోని పిల్లలకు ఒక స్కూల్ ప్రారంభించి, అక్కడి పేదలకు సేవ చేయటం ప్రారంభించారు. రోగులకు సేవ చేయటం కోసం ఆమె బీహార్‌లోని పాట్నా నగరంలోని ఒక హాస్పిటల్లో కొద్ది నెలల మెడికల్ ట్రైనింగ్ పొందారు. బెంగాల్ కరువు రోజుల్లో ఆమె సేవను గుర్తించి, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎంతగానో ప్రశంసించారు. మదర్ థెరిసా రోమన్ క్యాథలిక్ కేంద్రమైన ‘వాటికన్’ నుంచి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ స్థాపనకు అనుమతి పొందారు. సాధారణంగా మిషనరీ నన్‌లు ధరించే దుస్తులకు బదులు నీలి అంచు తెల్ల చీరను తమ సంస్థకు గుర్తింపుగా నిర్ణయించారు. ఈ విధంగా థెరిసా రోమన్ క్యాథలిక్ వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ, స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ అనే సేవాసంస్థను నిర్వహించారు. మదర్‌కు నోబెల్: మదర్ థెరిసా సేవలను గుర్తించి, 1979వ సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. దారిద్య్రంలో బాధపడేవారికి, రోగులకు, అనాథలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులకు అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆమెకు నోబెల్ పురస్కారం ఇవ్వటం జరిగింది. ‘ఆమె ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ పురస్కారం అందుకుంటుంద’నే ప్రశ్నకు ‘‘నా రక్తం ఆల్బేనియాది. నా పౌరసత్వం భారత్‌ది. నా విశ్వాసం క్యాథలిక్ మతానిది. నా వ్యక్తిత్వం ప్రపంచానిది. నా హృదయం జీసస్కు చెందినది’’ అని ఉన్నతమైన సమాధానమిచ్చారు థెరిసా. ‘నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ప్రపంచశాంతిని నెలకొల్పేందుకు మీరిచ్చే సందేశం ఏమిట’ని ప్రశ్నించినప్పుడు ‘‘ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలను ప్రేమిస్తే చాలు, ప్రపంచశాంతి దానంతటదే నెలకొంటుంది’’ అన్నారు మదర్ థెరిసా. నోబెల్ పురస్కార స్వీకరణ ప్రసంగంలో ఆమె‘‘నేటి ప్రపంచంలో ‘దారిద్య్రం’ అనేది కేవలం వెనుకబడిన, ఆర్థికంగా పేద అయిన దేశాలకే పరిమితం కాదు. ఎన్నో విధాలుగాను పురోగమించిన దేశాలలో కూడా ఉందనటానికి చింతిస్తున్నాను. ఆకలితో ఉన్నవారికి ఆహారం సమకూర్చటం ద్వారా పేదరికం తొలగించవచ్చు కాని, సమాజంలో అణగదొక్కబడి, ఆదరణకు నోచుకోనివారికి, ఉగ్రవాదానికి భయపడి బతికేవారికి ఎదురవుతున్న ఆయా దారిద్య్రాలను తొలగించినప్పుడే నిజమైన శాంతి. అబార్షన్లతోపాటు విడాకుల నిర్మూలన కూడా జరిగినప్పుడే మానవులంతా శాంతితో జీవించగలరు’’ అన్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ కార్యక్రమాలు: వృద్ధాప్యంలో ఉన్న, మరణానికి చేరువలో ఉన్న అభాగ్యుల కోసం ఆశ్రమం నడపడం. ఈ ఆశ్రమంలో మరణించినవారికి వారి మత కట్టుబాట్లకు అనుగుణంగా ఉత్తర క్రియలు జరపటం(ఆశ్రమంలో మహమ్మదీయులు మరణిస్తే ఖొరాన్ పఠనం, హిందువులు మరణిస్తే వారికి గంగాజలంతో అంత్యక్రియలు, క్రైస్తవులకు చర్చి నిబంధనలకనుగుణంగా నిర్వహించటం) వంటి జనామోదకర విధానాల అమలు. కుష్ఠు రోగులకు ఆశ్రమం నిర్మించి, నగరంలో వివిధ ప్రాంతాలలో వారికి వైద్య సౌకర్యాలు కల్పించటం. 1955లో నిర్మలా శిశుభవనం స్థాపించటం. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’లో బ్రదర్స్ విభాగం, సిస్టర్స్ విభాగం, ఫాదర్స్ విభాగం ఏర్పాటు చేసి నిష్ణాతులైన సేవకులను తయారుచేయటం. ఇదే క్రమంలో మత ప్రవక్తలను కూడా తయారుచేయడం. దేశదేశాల్లో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థలను ప్రారంభించటం. మదర్ థెరిసా అకుంఠిత దీక్ష, కృషి, పరిశ్రమల ఫలితంగా 1996వ సంవత్సరం నాటికి 100కి పైగా దేశాలలో 517 మిషనరీస్ ఆఫ్ చారిటీ శాఖలు ప్రారంభమ య్యాయి. ఇవి ప్రపంచమంతటా మానవ సేవను కొనసాగిస్తూ ఉన్నాయి. మదర్ థెరిసా అవార్డులు... బహుమతులు: 1962 - పద్మశ్రీ బిరుదు; రామన్ మెగసెసే బహుమతి. 1971 - పోప్ జాన్ 23 శాంతి బహుమతి 1979 - నోబెల్ ‘శాంతి’ బహుమతి 1979 - బాల్జాన్ బహుమతి 1980 - {పపంచంలో అత్యధిక జనాదరణ కలిగిన పదిమందిలో ఒకరిగా గుర్తింపు 2010 - థెరిసా శతజయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఐదు రూపాయల నాణెం విడుదల 1983వ సంవత్సరంలో పోప్ జాన్‌పాల్-2ను దర్శించే నిమిత్తం రోమ్ వెళ్లిన మదర్ థెరిసాకు గుండె జబ్బు వచ్చింది. తరువాత 1991లో మెక్సికో నగరానికి వెళ్లినప్పుడు ఆమెకు న్యుమోనియా వచ్చింది. 1996లో ఆమెకు మలేరియా వచ్చి గుండెలో ఎడమ కవాటం పనిచేయటం మానేసింది. దాంతో థెరిసా ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థ అధ్యక్ష పదవిని పరిత్యజించారు. చివరకు 1997వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన కలకత్తా నగరంలో కన్నుమూశారు. నవీన్ చావ్లా అనే విశ్రాంత ఐసీఎస్ అధికారి, మదర్ జీవిత చరిత్రను పుస్తకంగా రాసి ప్రచురించారు. మదర్ థెరిసాకు ఎంతోమంది అభిమానులతో పాటు విమర్శకులు కూడా ఉన్నారు. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ని తన సామ్రాజ్యంగా భావించేవారని, ఆమె అబార్షన్, విడాకులను ప్రోత్సహించకపోవటం యువత స్వేచ్ఛకు ఆటంకమనీ విమర్శల అభిప్రాయం. ఇలాంటి ఎన్ని విమర్శలున్నా మదర్ థెరిసా పేరును ప్రపంచంలో అత్యధిక జనాదరణ గల మొదటి పదిమందిలో ఒకరుగా వరుసగా 18 సార్లు ప్రకటించడం ఆమె విశిష్ట వ్యక్తిత్వాన్ని, సేవా నిరతిని చాటుతున్నాయి. డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు -
నోబెల్ ఇండియా: సర్ సి.వి.రామన్ విజ్ఞాన కాంతిపుంజం
పురస్కారం: నోబెల్ పురస్కారం అందుకున్న భారతీయులలో రెండవ వారు సర్ చంద్రశేఖర వేంకట రామన్. సి.వి.రామన్ భౌతిక శాస్త్రంలో ‘కాంతి విక్షేపణము - రామన్ ఫలితం’ అనే అంశంపై విస్తృతంగా పరిశోధించారు. ఆ పరిశోధనలకు గాను 1930వ సంవత్సరపు నోబెల్ బహుమతిని అందుకున్నారు. భౌతిక విజ్ఞాన శాస్త్రంలో కాంతి (లైట్), శబ్దం (సౌండ్) విభాగాలలో వేంకట రామన్ ఎన్నో విజయవంతమైన ఆవిష్కరణలు చేశారు. ఆయా రంగాలలో 400కు పైగా పరిశోధన పత్రాలు, ఎనిమిది గ్రంథాలను ప్రచురించారు. రామన్ బాల్యం: చంద్రశేఖర వేంకట రామన్ తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో తిరువనైకోవిల్ గ్రామంలో 1888వ సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన జన్మించారు. రామన్ తండ్రి ఆర్. చంద్రశేఖర అయ్యర్ కళాశాల అధ్యాపకులు. గణిత, భౌతిక శాస్త్రాలు బోధించేవారు. తల్లి పార్వతి అమ్మాళ్ గృహిణి. ఈ దంపతుల రెండవ సంతానమే వేంకట రామన్. ఈయన చిన్నతనంలో చంద్రశేఖర అయ్యర్‌కు విశాఖపట్నం ఎ.వి.ఎన్. కళాశాలలో భౌతిక శాస్త్రాధ్యాపకునిగా ఉద్యోగం వచ్చింది. దాంతో ఆ కుటుంబం విశాఖపట్నానికి మారింది. వేంకట రామన్... విశాఖలోని సెయింట్ ఎలాషియస్ ఆంగ్లో ఇండియన్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఆయన 12 సంవత్సరాలకే మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన ప్రతిభాశాలి. ఆ రోజుల్లో ఇలాంటి మేధావులకు ప్రభుత్వ ప్రోత్సాహం బాగా ఉండేది. సర్కారు ఖర్చుతో ఉన్నత విద్యాభ్యాసానికి ఇంగ్లండు పంపేవారు. సి.వి.రామన్‌కు ఆ అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్యకారణాల వల్ల వైద్యుల ఆమోదం లభించలేదు. ఆ కారణంగా ఆయన ఇంగ్లండ్‌కు వెళ్లలేకపోయారు. కాలేజీ చదువులకు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. రామన్ 1904లో బంగారు పతకంతో బీఏ పట్టా అందుకున్నారు. 1907లో భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా సాధించారు. కాంతి విక్షేపణ, వివర్తనలపై రాసిన థీసిస్ 1906లో ప్రచురితమైంది. రామన్ ఉద్యోగ జీవితం: రామన్‌కు అసిస్టెంట్ అకౌంటెంట్‌గా కలకత్తాలో పోస్టింగ్ వచ్చింది. సర్కారు ఉద్యోగం చేస్తూనే రామన్ ఐఏసీఎస్ (ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్)లో చేరి భౌతిక శాస్త్రంలో ప్రయోగాలు చేశారు. ఏడాది తిరిగేసరికి (1917లో) కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌గా చేరారు. రామన్ 1921వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయం తరఫున ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన సముద్ర యానం చేశారు. ఆ ప్రయాణంలో ఓడ పైనుండి సముద్రాన్ని వీక్షించిన రామన్ మదిలో ఎన్నో సందేహాలు మొలకెత్తాయి. సముద్ర జలాలు ఆకుపచ్చ - నీలి రంగుతో ఎందుకు కనిపిస్తాయి? అనే సందేహం ప్రధానమైనది. కలకత్తాకు చేరగానే కాంతి వివర్తనం, విక్షేపాలపై ప్రయోగాలు ప్రారంభించారు. ఈ ప్రయోగాల ఫలితంగా రామన్ విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలోనే అత్యంత ప్రభావం కలిగిన ‘రామన్ ఫలితాన్ని’ కనుగొన్నారు. తన బలం... తెలిసిన క్షణం! రామన్‌కు తన పరిశోధనల విలువ తెలిసేలా, రామన్ ఫలితం గురించి ప్రపంచంలోని భౌతిక శాస్త్రజ్ఞులకు తెలిసేలా చేసిన సంఘటన క్రాంప్టన్కు నోబెల్ బహుమతి రావడమే. 1927లో కాంప్టన్‌కు నోబెల్ బహుమతి తెచ్చిన ప్రయోగంలో ‘ఎక్స్’ కిరణాలను పారదర్శకమైన యానకం గుండా పంపితే, కొన్ని కిరణాల తరంగ దైర్ఘ్యాలలో మార్పులు కలుగుతాయనీ, దీనినే కాంప్టన్ ఫలితం అంటారని కాంప్టన్ ప్రచురించాడు. వెంటనే రామన్ ఏకవర్ణ కాంతి తరంగాలతో (మెర్క్యూరీ ల్యాంప్ ఉపయోగించి) రామన్ ఫలితాన్ని, తరంగ దైర్ఘ్యంలో తగ్గుదల ఉన్న కాంతి కిరణాలను (వీటినే రామన్ లైన్స్ అంటారు) బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో జరిగిన శాస్త్రవేత్తల సెమినార్లో విజయవంతంగా ప్రయోగం చేసి ప్రదర్శించారు. ఫలితంగా డాక్టర్ చంద్రశేఖర వేంకట రామన్‌కు 1930వ సంవత్సరపు నోబెల్ బహుమతి ప్రకటించారు. నోబెల్ పురస్కారం లభించిన తర్వాత కూడా రామన్ శబ్ద తరంగాలపై పరిశోధనలను కొనసాగించారు. భారతీయ సంగీత వాద్యాలైన వయొలిన్, మృదంగం మొదలైన వాద్యాలలో శబ్ద తరంగాలు ఏ విధంగా శృతి పేయమైన శబ్దాలను ఉత్పాదిస్తాయో కనుగొని ఆ పరిశోధనలను ప్రచురించారు. భౌతిక, విజ్ఞాన శాస్త్రంలో రామన్ ప్రతిభకు తార్కాణంగా ప్రపంచంలోని ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు లభించాయి. భారత ప్రభుత్వం సి.వి.రామన్ ప్రతిభ, భారతదేశానికి పేరు తెచ్చిన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఆయనను 1954లో ‘భారతరత్న’ బిరుదుతో సత్కరించింది. వైవాహిక జీవితం: రామన్ 1906లో అమ్మాళ్‌ను వివాహమాడారు. వీరికి చంద్రశేఖర్, రాధాకృష్ణన్ అనే ఇద్దరు కుమారులు. సి.వి.రామన్ తన జీవితమంతా భౌతిక శాస్త్ర పరిశోధనలకే అంకితమై, అంతిమ క్షణాల వరకూ భౌతికశాస్త్ర విషయాలతోనే గడిపారు. రామన్ ఎఫెక్ట్ అనువర్తనాలతో వెయ్యికి పైగా పరిశోధన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. రామన్ వ్యక్తిత్వం! రామన్‌కు ‘భారతరత్న’ పురస్కారం లభించినప్పుడు, ఆ పురస్కారం అందుకోవటానికి ఢిల్లీకి రమ్మని స్వయంగా అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ఆహ్వానం వచ్చింది. అందుకు రామన్ రాసిన జవాబే ఆయన వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం. ‘‘మీరు నాపై చూపిన ఆదర సత్కారాలకు కృతజ్ఞుణ్ని. ప్రస్తుతం నేను నా విద్యార్థి ఒకరి పీహెచ్డీ పరిశోధన వ్యాసం పరిశీలనలో తుది దశలో ఉన్నాను. నా విద్యార్థి భవిష్యత్తు దృష్ట్యా ‘థీసిస్’ పని వాయిదా వేయలేను, క్షంతవ్యుడను’. ఈ ఉత్తరం సర్ రామన్‌కు తన కర్తవ్య ధర్మం పట్ల గల శ్రద్ధను తెలియపరుస్తుంది. 1943లో భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఛి)లో రిటైర్ అయిన వెంటనే బెంగళూరులో రామన్ పరిశోధనా సంస్థను స్థాపించారు. ఆ సంస్థలోనే 1970, నవంబర్ 21వ తేదీన అంతిమ శ్వాస తీసుకున్నారు. డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు రామన్ ఎఫెక్ట్ మెర్క్యూరీ ల్యాంప్ నుండి ఏకవర్ణ కాంతి తరంగాలను ఒక పారదర్శక యానకం గుండా ప్రసరింపజేస్తే, యానక ధర్మాలపై ఆధారపడి ఆ కాంతిలో కొంత భాగం వివర్తనం చెంది, తక్కువ తరంగ ధైర్ఘ్యం గల కాంతిగా బహిర్గతమౌతుంది. సముద్ర జలంపై ఇదే ప్రక్రియతో నీలి రంగు కాంతి బహిర్గతమవుతుంది. దీనినే ‘రామన్ ఫలితం’ (రామన్ ఎఫెక్ట్) అంటారు. రామన్ ఫలితాన్ని ఉపయోగించి, యానక పదార్థం యొక్క నిర్మాణాన్ని విశ్లేషించవచ్చు. ఈ విధంగా ఎన్నో పదార్థాల స్ఫటిక నిర్మాణాలను అవగతం చేసుకోవటానికి రామన్ ఫలితం ఉపయోగపడింది. రామన్ ఫలితాన్ని మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 28, 1928వ తేదీన సి.వి.రామన్, కె.ఎస్.క్రిష్ణన్‌ల రీసెర్చి ఫలితంగా ప్రచురించారు. రామన్‌కు లభించిన గౌరవ పురస్కారాలు 1924 - రాయల్ సొసైటీ ఫెలోషిప్ ఊఖ 1929 - బ్రిటిష్ మహారాణి నుండి నైట్‌హుడ్, సర్ 1930 - నోబెల్ పురస్కారం 1941 - ఫ్రాంక్లిన్ పతకం 1954 - భారతరత్న 1957 - లెనిన్ శాంతి బహుమతి 1917 - ఐఅఇ గౌరవ కార్యదర్శి 1933 - 48 భారతీయ విజ్ఞాన సంస్థ ఐఐఛి బెంగళూరులో ప్రొఫెసర్, 1948లో ఐఐఛిడెరైక్టర్ రామన్ రాసిన గ్రంథాలలో కొన్ని 1. కాంతి వివర్తనము (scattering of light) 2. అకాస్టిక్ (Acoustic) నాద తరంగ శాస్త్రం 3. ఆప్టికా (Optica) దృగ్గోచర కాంతి శాస్త్రం 4. ఖనిజములు, వజ్రముల కాంతి ధర్మాలు 5. స్ఫటికముల భౌతిక విజ్ఞానం 6. పుష్పాల రంగుల - అవగాహన 7. వీణ, వయొలిన్, తబల, మృదంగం మొదలైన సంగీత వాద్యాలలో శబ్ద తరంగాలు. పత్రికలు ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ స్థాపన, సంపాదకత్వం ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్స్ అండ్ జర్నల్ ఆఫ్ ద ఇండియన్ అకాడెమీ ఆఫ్ సెన్సైస్ కరెంట్ సైన్స్ జర్నల్ ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఫలితం ఆవిష్కరణకు గుర్తుగా జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం (నేషనల్ సైన్స్ డే) జరుపుకుంటారు. తన లక్ష్యాన్ని, ధ్యేయాన్ని గుర్తించి వాటి సాధన కోసం శ్రద్ధగా పనిచేసిన ప్రతిభాశాలి సర్ చంద్రశేఖర వేంకట రామన్. -
నోబెల్ ఇండియా పురస్కారం: రవీంద్రనాథ్ ఠాగూర్ అధినాయక కవి
ఆంగ్లేతర సాహిత్య రచనలతో అత్యంత ప్రతిష్ఠాకరమైన నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ప్రతిభాశాలి విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్. ఈయన రచించిన ‘గీతాంజలి’ తదితర బెంగాలీ రచనలు సమాజాన్ని ఉత్తేజరపరిచాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాయి. ఠాగూర్ రచనలు సర్వ మానవ సౌభ్రాతృత్వ భావనకు ప్రాణం పోశాయి. వీటిని రవీంద్రుడే స్వయంగా ఆంగ్లానువాదం చేయడం మరో విశేషం. ఈ అనువాదాల ద్వారా నోబెల్ కమిటీ ఈ రచనల సారాంశాన్ని గ్రహించింది. అతడిని 1913లో నోబెల్ బహుమానానికి అర్హుడిగా ప్రకటించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్‌కతా మహానగరంలోని బ్రాహ్మణ జమిందారీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి దేవేంద్రనాథ ఠాగూరు, తల్లి శారదాదేవి. ఈ దంపతుల 13వ సంతానం రవీంద్రుడు. ఇతడే కడపటివాడు. ‘ఠాగూర్’ అంటే ‘గౌరవప్రదమైన అయ్యా’ అని అర్థం. రవీంద్రుని తల్లి శారదాదేవి అతడి చిన్నతనంలోనే మరణించారు. దాంతో ఆయన నౌకర్ల చేతిలో పెరిగాడు. రవీంద్రుడి జ్యేష్ట సోదరుడైన ద్విజేంద్రనాథ ఠాగూరు సమాజంలో గౌరవం పొందిన కవి, తత్వవేత్త. మరొక సోదరుడు సత్యేంద్రనాథ్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఐసీఎస్ పదవి పొందిన తొలి భారతీయ అధికారి. మరొక సోదరుడు జ్యోతీంద్రనాథ నాటక ప్రయోక్త, సంగీతకారుడు. అందువల్ల జోరాశాంకో జమీందారీ బంగళా ఎప్పుడూ నాటకాలతో, పాశ్చాత్య, బెంగాలీ సంగీత సభలతో, సాహిత్య గోష్ఠులతో కళకళలాడుతూ ఉండేది. రవీంద్రుని సోదరి స్వర్ణకుమారి రచయిత్రి. రవీంద్రుడు ఏ పాఠశాలకు పోకుండానే ఇంటివద్దే విద్యాభ్యాసం చేశాడు. 8 సంవత్సరాల వయసులోనే రవీంద్రుడు పద్యాలు రాయటం ప్రారంభించాడు. ఆయన రాసిన మొట్టమొదటి పద్య సంపుటి ‘భాను సింహ’, అయితే దానిని బెంగాలీ పండితులు ఆమోదించలేదు. శాంతినికేతన్‌కు పయనం! రవీంద్రునికి 11 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆ తరువాత రవీంద్రుడు తన సోదరులతో కలిసి తండ్రి స్థాపించిన శాంతినికేతన్ ఎస్టేట్‌కు వెళ్లాడు. ఆ సమయంలోనే ఆయన హిమాలయాలలోని డల్హౌసీ, పర్వత ప్రాంతాలను దర్శించాడు. ఆ ప్రాంతాలు, శాంతినికేతన్, రవీంద్రుని మనస్సును ఆకట్టుకున్నాయి. రవీంద్రుడు సోదరులతో అక్కడే కొన్ని నెలల పాటు గడిపాడు. ఆ సమయంలోనే ఎందరో ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆయన తండ్రి జీవిత చరిత్ర, బెంజమిన్ ఫ్రాంక్లిన్ (రచయిత) జీవిత చరిత్ర, ఎడ్వర్ట్ గిబ్బన్ రాసిన రోమన్ సామ్రాజ్య తిరోగతి, పతనం, కాళిదాసు కవిత్వం మొదలైన రచనలను ఆకళింపు చేసుకున్నారు. తాను స్వయంగా రాయడం ప్రారంభించారు. న్యాయశాస్త్రం చదివించాలని! రవీంద్రుడిని బారిస్టర్‌ని చేయాలనేది తండ్రి దేవేంద్రనాథ్ కోరిక. 1878 సంవత్సరంలో రవీంద్రుణ్ని ఇంగ్లండుకి పంపించారు. ఇంగ్లండులో న్యాయ శాస్త్ర కళాశాలలో చేరినప్పటికీ ఆయన బారిష్టర్ కాలేదు. ఆ చదువు మధ్యలోనే మాని, షేక్స్పియర్ రచనలు ‘రెలిజియో మెడిసి’, ‘కొరియొలోనస్’, ‘ఆంటోనీ క్లియోపాత్రా’ మొదలైనవన్నీ ఆకళింపు చేసుకున్నారు. చక్కని ఆంగ్ల భాషలో మాట్లాడటం, రాయటం నేర్చుకున్నారు. ఐరిష్, స్కాటిష్ జానపద గేయాలను నేర్చుకుని, 1880లో స్వదేశం చేరుకున్నారు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను యూరప్ దేశాల సంస్కృతులతో మేళవించి, రెండింటిలోని మంచిని తాను నమ్మిన సిద్ధాంతాలకు అన్వయించాడు. వివాహం! రవీంద్రుని వివాహం 1883వ సంవత్సరంలో భవతారిణి శాఖకు చెందిన మృణాళినీదేవితో జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. 1890లో జమీ వ్యవహారాల బాధ్యత ఆయన మీద పడింది. ‘షి లై ద హా’ అనే అతిపెద్ద జమీందారీ ఎస్టేట్ (ఈ ప్రాంతం ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉంది) నిర్వహణలోని లోపాలను సవరించారాయన. వ్యవసాయ భూములను రైతులకు స్వాధీనం చేసి, వారి నుంచి నామ మాత్రపు శిస్తులు వసూలు చేసేవారు. జమీందారీ వ్యవహారాలు చూసుకుంటూనే రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌కు మకాం మార్చుకున్నారు. శాంతినికేతన్లో ఉన్నప్పుడు రవీంద్రుని పిల్లలిద్దరు, ఆయన భార్య మృణాళిని మరణించారు. దానితో రవీంద్రుడు విరాగిగా మారిపోయారు. 1905వ సంవత్సరంలో రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ మరణించడంతో రవీంద్రునికి జమీందారీ జీవితంపై ఆసక్తి నశించింది. రచనావ్యాసంగంలో మునిగిపోయి, ఆందులోనే సాంత్వన పొందారు. రచనలపై నెలకు వచ్చే రెండు వేల రూపాయల రాయల్టీతో సామన్యమైన జీవితం గడపటం ప్రారంభించాడు. ఠాగూర్ తన రచనలలో చాలా వాటికి స్వయంగా ఆంగ్లానువాదాలు చేశారు. నోబెల్ బహుమతి అందుకున్న తర్వాత బ్రిటన్ మహారాణి ఠాగూర్‌కు ‘నైట్’ బిరుదు ప్రదానం చేశారు. అయితే రవీంద్రుని దేశభక్తి ఆ బిరుదుని త్యజించేలా చేసింది. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో బ్రిటిష్ సైన్యం భారతీయులను హతమార్చిన సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. విశ్వకవి పై జాతిపిత ప్రభావం! మహాత్మాగాంధీతో పరిచయం ఏర్పడిన తర్వాత రవీంద్రుడు తనదైన శైలిలో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభించారు. కుల వివక్షను తొలగించటానికి బెంగాల్లో శ్రీకారం చుట్టి, దక్షిణాదిన గురువాయూరు దేవాలయంలో దళితులకు ప్రవేశం కల్పించి, అంటరానితనాన్ని నిర్మూలించటానికి ఎన్నో మార్గాలు సూచించారు. పల్లెల పునర్ నిర్మాణం కోసం వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ఎల్మ్‌హర్‌స్ట్‌తో కలిసి బెంగాల్లో ‘శ్రీ నికేతన్ సంక్షేమ సంస్థ’ను స్థాపించి, పల్లె ప్రజలలో మనోవికాసం తేవటానికి కృషి చేశారు. 1930 దశాబ్దంలో కుల నిర్మూలన ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దానికి సంబంధించిన ఎన్నో నవలలు, నాటకాలు రాశారు. భారతీయ ఔన్నత్యాన్ని చాటుతూ... రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక దేశాలు సందర్శించి ‘విశ్వంలోని మానవులంతా ఒక్కటే’ అనే సందేశాన్ని అందించారు. తాను నమ్మిన బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ద్వారా మతాలకు అతీతమైన పరబ్రహ్మమొక్కటే అందరికీ దైవం అని ప్రచారం చేసి ‘విశ్వకవి’, ‘గురుదేవ్’ బిరుదులను శాశ్వతం చేసుకున్నారు. ప్రపంచ పర్యటనలో 35కు పైగా దేశాలలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. విశ్వకవి రవీంద్రుడి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం. ఎవరు ఏ దృష్టితో శోధించినా దానికి సంబంధించిన విషయం, వివరణ లభించక మానదు. జనగణమన... అధినాయక..! గీతాంజలి, గోరా, ఘరే బైరే మొదలైన రచనలన్నీ సహజత్వం ఉట్టిపడుతూ సామాన్యులకు అర్థమయ్యేటట్లు వాడుకభాషలో, సరళమైన శబ్దాలతో ఉంటాయి. దేశభక్తిని, విశ్వమానవ సౌభ్రాతృత్వం చాటేటట్లు రాసిన రెండు గీతాలను భారతదేశం (జనగణమన), బంగ్లాదేశ్ (అమార సోనార్ బంగ్ల) జాతీయగీతాలుగా ఎంపిక చేసుకున్నాయి. ఠాగూర్ గీత రచయిత మాత్రమే కాదు... నాటక రచయిత, నాటక కర్త, వక్త, వ్యాఖ్యాత కూడ. రవీంద్రుని రచనలు: గీతాలు: మానసి (1890); సోనార్ తరి (1890); గీతాంజలి (1910); గీతిమాల్య (1914); తోటమాలి (1913) (వీటిని స్వయంగా ఆంగ్లంలోకి స్వేచ్ఛానువాదం చేశారు). నాటకాలు, కథలు: రాజా (1910); డాక్ ఘర్ (1912); అచలాయతన్ (1912) ; ముక్తధార (1922); రక్తక రవి (1926) ‘గోరా’(1910); ఘరే బైరే (1916); యోగా యోగాలు (1929) ; బికారిణి (1929) , నృత్యరూపకాలు: పాత్రపుత్( 1936), శేషసప్తక్ (1935), శ్యామ (1939), చండాలిక (1939) రవీంద్రుడు ఆరోగ్యం క్షీణించిన తర్వాత ‘చార్ అధ్యాయ్ (1934), విశ్వ పరిచయ్ (1937), తీన్‌సంగి, గల్పశిల్ప (1941)’ మొదలైన రచనలు చేశారు. 1941లో రవీంద్రుడు చనిపోయే ముందురోజు అప్పటి ఎలక్షన్ కమిషనర్ అయిన ఏకే సేన్ అనే మిత్రుణ్ని పిలిచి, తన తుది సందేశాన్ని చెప్పారు. ‘నా జన్మ మధ్యలోనే అంతరిస్తోంది. ఈ సమయంలో నా స్నేహితుల వెచ్చని స్పర్శ, ఈ పుడమితల్లి శాశ్వత ప్రేమ, మానవులందరి ఆశీస్సులను నాతో తీసుకుని వెళ్తున్నాను. నేను ఈ ప్రపంచానికి ఇవ్వవలసినదంతా ఇచ్చాను. ఈ రోజు నేను ఖాళీ సంచితో ఉన్నాను. మీరంతా కొంత ప్రేమ, క్షమాపణలు ఇస్తే ఈ ప్రపంచం లేని చోటకి శాశ్వతానందంతో వెళ్తాను’ అని రాయించారు ఠాగూర్. ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచే సందేశాన్నిచ్చిన విశ్వకవి 1941వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన శరీర త్యాగం చేశారు. - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు -
పురస్కారం: ఆల్ఫ్రెడ్ నోబెల్ శాంతికాముకుడు
ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది ‘నోబెల్’ పురస్కారం. విజ్ఞానశాస్త్రం, కళలు, వైద్యరంగం, సాహిత్యం, ప్రపంచ శాంతి వంటి రంగాలలో నిష్ణాతులైనవారికిచ్చే గుర్తింపు ఇది. ఈ పురస్కారాన్ని మానవాళికి అత్యంత ప్రయోజనకరమైన ఆవిష్కరణలు చేసిన వారికి ఇస్తారు. ఏటా నామినేషన్లు అక్టోబరులో మొదలవుతాయి. నోబెల్ పురస్కారం ఆవిష్కర్త, వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ (లార్డ్) బెర్నార్డ్ నోబెల్. ఇతడు స్వీడన్ దేశానికి చెందిన రసాయన శాస్త్రజ్ఞుడు. నోబెల్... రసాయన శాస్త్రంలో, ప్రధానంగా విస్ఫోటకాల (ఎక్స్‌ప్లోజివ్స్) రంగంలో అనేక ఆవిష్కరణలు, పేటెంట్ల ద్వారా విశేషంగా ధనం ఆర్జించాడు. ఆ ధనాన్ని ఒకచోట మూలధనంగా ఉంచి, ‘నోబెల్ ఫౌండేషన్’ అనే సంస్థ ద్వారా ఆ మూల ధనంపై వచ్చే వార్షిక వడ్డీని నోబెల్ పురస్కారాల రూపంలో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఏటా ఈ పురస్కారాలను వివిధ రంగాలలో నిష్ణాతులైన మేధావులకు అందజేయవలసిందిగా వీలునామా రాసి గతించాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్... తాను జీవితకాలమంతా సంపాదించిన ధనాన్ని తృణప్రాయంగా పరిత్యజించటం వెనుక బలమైన కారణమే ఉంది. దానిని తెలుసుకుంటే మానవాళికంతటికీ కనువిప్పు కలుగుతుంది. అందువల్ల ఆల్ఫ్రెడ్ నోబెల్ జీవితగాధను చదివి తీరవలసిందే! ఆల్ఫ్రెడ్ నోబెల్ బాల్యం నోబెల్ శాస్త్రజ్ఞుడి పూర్తి పేరు ఆల్ఫ్రెడ్ బెర్నాడ్ నోబెల్ (తర్వాతి కాలంలో ఈయనకు ‘లార్డ్’ అనే బిరుదు వచ్చింది). ఇతడు స్వీడన్ దేశంలోని స్టాక్‌హోమ్ పట్టణంలో 1833వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి ఇమ్మాన్యుయేల్ నోబెల్, తల్లి కెరోలీనా ఆండ్రీ. ఇమ్మాన్యుయేల్ ఇంజనీరు, రసాయన శాస్త్రజ్ఞుడు. పేలుడు పదార్థాలు తయారుచేసే కంపెనీకి అధిపతి. ఎనిమిది మంది సంతానంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ నాల్గవవాడు. ఇమ్మాన్యుయేల్ పేలుడు పదార్థాలు తయారుచేసి విక్రయిస్తూ ఉండటంతో, ఆల్ఫ్రెడ్ నోబెల్ కూడా అదే రంగం మీద ఆసక్తి పెంచుకున్నాడు. పేలుడు పదార్థాల తయారీలోనే స్థిరపడ్డాడు. ప్రస్తుతం మనదేశంలో అందరి నోళ్లలోనూ నానుతున్న ‘బోఫోర్స్’ కంపెనీ కూడా ఆల్ఫ్రెడ్నోబెల్ స్థాపించినదే. ఇమ్మాన్యుయేల్ స్థాపించిన కంపెనీకి నష్టాలు వాటిల్లి దివాలా తీయటంతో అతడు స్టాక్‌హోమ్ నగరం విడిచి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ చేరి, అక్కడ వ్యాపారం కొనసాగించాడు. రష్యాకు నీటిలో పేలే విస్ఫోటకాలను సరఫరా చేశాడు. క్రిమియన్ యుద్ధం ముగియగానే ఆ కంపెనీ మళ్లీ దివాలా తీసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అతడు కంపెనీని తిరిగి స్వీడన్‌కు మార్చాడు. ఆల్ఫ్రెడ్ చిన్నతనం నుంచి రసాయన శాస్త్రం అంటే ఇష్టపడేవాడు. ఆ శాస్త్రంతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రాథమిక విద్య తర్వాత ఆల్ఫ్రెడ్ పారిస్‌లో హైస్కూల్ విద్యనభ్యసించాడు. 18 ఏళ్ల వయసులో ఉన్నత విద్యకోసం అమెరికా చేరుకున్నాడు. అక్కడ జాన్ ఎరిక్సన్ అనే రసాయన శాస్త్రవేత్త దగ్గర రసాయన శాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించి పరిశోధనలు చేపట్టాడు. అమెరికాలో ‘గ్యాస్మీటర్’ను కనిపెట్టి పేటెంట్ సంపాదించాడు. అదే అతడి మొదటి పేటెంట్. ఇదే తరుణంలో ఇమ్మాన్యుయేల్ కంపెనీ మళ్లీ నష్టాల బాట పట్టడంతో ఆల్ఫ్రెడ్ స్వదేశానికి వచ్చి, సోదరులతో కలిసి తండ్రి కంపెనీని లాభాల బాటలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు. కొత్త పేలుడు పదార్థాలను కనుగొనటంలో నిమగ్నమయ్యాడు. అలా తయారైనదే డైనమైట్. డైనమైట్ తర్వాత... ‘నోబెల్’కు ముందు..! డైనమైట్ను కనుక్కున్న తర్వాత, దానిని క్షేమకరంగా ఉపయోగించే పద్ధతుల మీద సోదరులతో కలిసి అనేక ప్రయోగాలు చేశాడు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఈ ప్రక్రియలో నోబెల్ ప్రయోగశాలలో 1888 సంవత్సరంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఆ ప్రమాదంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ తప్పించుకున్నాడు కానీ అతని సోదరుడు ‘లుడ్విగ్ నోబెల్’ మరణించాడు. అయితే ఈ వార్తను ప్రచురించే క్రమంలో పొరపాటు దొర్లింది. పారిస్ నుంచి వెలువడే ఒక ఫ్రెంచి పత్రిక ఈ వార్తను ‘మృత్యు వ్యాపారి, నరహంతకుడు నోబెల్ అస్తమయం’ అని పెద్ద అక్షరాలతో ప్రకటించింది. ఆ వార్త చూసిన ఆల్ఫ్రెడ్ హతాశుడయ్యాడు. తాను నైట్రో గ్లిజరిన్‌ను క్షేమకరమైన విధానంలో విస్ఫోటనకు ఉపయోగించేలా చేద్దామనుకుంటే, ఆ ప్రయత్నం ఇంతటి అపవాదు తెచ్చిందా అని తీవ్రంగా బాధపడ్డాడు. ఆ విచారం నుంచి బయటపడకపోగా జీవితంపై విరక్తిని పెంచుకున్నాడు. మానవాళికి ప్రయోజనం చేకూరే పని ఏదైనా చేయాలని ఆశించాడు. దాని ఫలితమే నోబెల్ ఫౌండేషన్. డైనమైట్ కథ ‘డైనమైట్’ను ఆల్ఫ్రెడ్ నోబెల్ 1867లో కనుగొన్నాడు. డైనమైట్లోని ముఖ్యమైన పేలుడు పదార్థం నైట్రో గ్లిజరిన్. ఇందులోని పేలుడు స్వభావాన్ని మొదట కనుగొన్నది ఆస్కారియో సొబ్రీరో. నైట్రో గ్లిజరిన్‌ను క్షేమకరంగా ఉపయోగించటానికి దానిని కీసెల్ ఘుర్ అనే తేలికగా ఉండే బూడిద వంటి మట్టి కలిపి ప్రయోగించాడు నోబెల్. దానికి ‘డైనమైట్’ పేరుతో పేటెంట్ హక్కులు పొందాడు. ఇలాంటి ప్రయోగాల ద్వారా అతడు 16,87,337 బ్రిటిష్ పౌండ్ల ధనం (సుమారు 472 మిలియన్ల అమెరికన్ డాలర్లు) ఆర్జించాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ గురించి మరికొన్ని... నోబెల్ వివాహం చేసుకోలేదు. ఆయన మరణించేనాటికి 90 కంపెనీలకు వ్యవస్థాపక భాగస్వామి, 355 పేటెంట్లకు హక్కుదారుడు. బోఫోర్స్ కంపెనీని మొదట్లో ఇనుము కర్మాగారంగా ప్రారంభించి, తర్వాత ఆయుధాల ఫ్యాక్టరీగా మార్చాడు. ఇప్పటికీ ఆ కంపెనీ ఆయుధాలు, విమానాలను ఉత్పత్తి చేస్తూనే ఉంది. ‘నోబెల్ బహుమతి’ దిశగా అతడిని ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన కార్యదర్శి ‘బెర్తా’. ఆమె రచయిత్రి కూడ. ఒక్కో నోబెల్ పురస్కారం విలువ సుమారు 3 లక్షల 50 వేల అమెరికన్ డాలర్లు (సుమారు 1 కోటి 75 లక్షల రూపాయలు). ఈ బహుమతిని స్టాక్‌హోమ్‌లో అందజేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్, 1896వ సంవత్సరంలో నోబెల్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి, తాను సంపాదించిన ధనంలో 95 శాతం నగదును నోబెల్ పురస్కారాల కోసం వినియోగించడానికి వీలుగా బ్యాంకులో కుదువబెట్టాడు. ఆ ధనం మానవాళికి ఉపయోగపడే విధంగా ఒక నియమావళిని రూపొందించాడు. ఇందుకు అతడికి సాకారం కాని కల కూడా తోడైంది. నోబెల్‌కి చిన్నతనం నుంచి శరీరారోగ్యం బాగుండేది కాదు. దాంతో తాను వైద్యుడై శరీర ధర్మశాస్త్రం (ఫిజియాలజీ) అభ్యసించాలనే ఆశయం నెరవేరలేదు. అందుకే ఆ రంగంలో కృషి చేసిన వారికి బహుమతి ఇవ్వడం ద్వారా ఆ ఆశను నెరవేర్చుకున్నాడు. నోబెల్ ఫౌండేషన్ ద్వారా... భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, జన్యు శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం వంటి విజ్ఞాన శాస్త్ర విభాగాలు, కంప్యూటర్, ఎలక్ట్రికల్ వంటి ఇంజనీరింగ్ విభాగాలు, చరిత్ర, అర్థశాస్త్రం, సాహిత్యం వంటి ఆర్ట్స్ విభాగాలు, సామాజిక ఆవిష్కరణలు, ప్రపంచ శాంతి మొదలైన విభాగాలలో సేవలందించిన వారికి మొత్తం ఆరు కేటగిరీలలో నోబెల్ బహుమతులు ఇస్తున్నారు. ప్రశాంతంగా జీవించడానికి... నోబెల్ ఫౌండేషన్ రూపకల్పన తర్వాత ఆల్ఫ్రెడ్ నోబెల్ తన చివరి రోజులను అజ్ఞాతంగా గడపటానికి నిశ్చయించుకొని ఇటలీలోని ‘శాన్ రిమో’ అనే ఊరికి వెళ్లాడు. అక్కడ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఆల్ఫ్రెడ్ నోబెల్... సెరిబ్రల్ హెమరేజ్ (మెదడులో రక్తనాళాలు చిట్లడం)కి గురై 1896వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన కన్నుమూశాడు. ఆయన సంస్మరణార్థం ఏటా ఇదేరోజున నోబెల్ బహుమతుల ప్రదానం జరుగుతుంది. ఇదీ క్లుప్తంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ జీవితం. అతడి జీవితంలో ఆసక్తి కలిగించే మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. ఆల్ఫ్రెడ్ నోబెల్ మంచి సాహిత్యాభిమాని, రచయిత. రసాయన శాస్త్ర ప్రయోగాలతో తలమునకలై ఉన్నప్పటికీ, కొంత సమయాన్ని సాహిత్య పఠనం, రచనా వ్యాసంగానికి కేటాయించేవాడు. ప్రముఖ సాహితీకారుల రచనలు చదవటంతోపాటు వాటిపై పద్య రూపంలో వ్యాఖ్యలు రాసేవాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ రచనలలో 1895లో రాసిన ‘ద పేటెంట్ బ్యాసిల్లస్’, 1896లో ‘నెమిసిస్’ పేరుతో రాసిన విషాదాంత రూపకం ముఖ్యమైనవి. ఇప్పటి వరకు నోబెల్ అందుకున్న ప్రముఖులలో మనదేశానికి చెందినవాళ్లు 13 మంది. వీరిలో తొమ్మిదిమంది భారతపౌరులు, నలుగురు భారత సంతతికి చెందిన వారు. వారి గురించిన సమగ్రసమాచారంతో కూడిన కథనాలను ప్రతి వారం ఇదే శీర్షికలో తెలుసుకుందాం. - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యుడు