పురస్కారం: ఆల్‌ఫ్రెడ్ నోబెల్ శాంతికాముకుడు | A Peace personality of Alfred Bernhard Nobel | Sakshi
Sakshi News home page

పురస్కారం: ఆల్‌ఫ్రెడ్ నోబెల్ శాంతికాముకుడు

Published Sun, Oct 13 2013 2:51 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

పురస్కారం: ఆల్‌ఫ్రెడ్ నోబెల్ శాంతికాముకుడు - Sakshi

పురస్కారం: ఆల్‌ఫ్రెడ్ నోబెల్ శాంతికాముకుడు

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది ‘నోబెల్’ పురస్కారం. విజ్ఞానశాస్త్రం, కళలు, వైద్యరంగం, సాహిత్యం, ప్రపంచ శాంతి వంటి రంగాలలో నిష్ణాతులైనవారికిచ్చే గుర్తింపు ఇది. ఈ పురస్కారాన్ని మానవాళికి అత్యంత ప్రయోజనకరమైన ఆవిష్కరణలు చేసిన వారికి ఇస్తారు. ఏటా నామినేషన్లు అక్టోబరులో మొదలవుతాయి.
 
 నోబెల్ పురస్కారం ఆవిష్కర్త, వ్యవస్థాపకుడు ఆల్‌ఫ్రెడ్ (లార్డ్) బెర్నార్డ్ నోబెల్. ఇతడు స్వీడన్ దేశానికి చెందిన రసాయన శాస్త్రజ్ఞుడు. నోబెల్... రసాయన శాస్త్రంలో, ప్రధానంగా విస్ఫోటకాల (ఎక్స్‌ప్లోజివ్స్) రంగంలో అనేక ఆవిష్కరణలు, పేటెంట్ల ద్వారా విశేషంగా ధనం ఆర్జించాడు. ఆ ధనాన్ని ఒకచోట మూలధనంగా ఉంచి, ‘నోబెల్ ఫౌండేషన్’ అనే సంస్థ ద్వారా ఆ మూల ధనంపై వచ్చే వార్షిక వడ్డీని నోబెల్ పురస్కారాల రూపంలో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఏటా ఈ పురస్కారాలను వివిధ రంగాలలో నిష్ణాతులైన మేధావులకు అందజేయవలసిందిగా వీలునామా రాసి గతించాడు.
 
 ఆల్‌ఫ్రెడ్ నోబెల్... తాను జీవితకాలమంతా సంపాదించిన ధనాన్ని  తృణప్రాయంగా పరిత్యజించటం వెనుక బలమైన కారణమే ఉంది. దానిని తెలుసుకుంటే మానవాళికంతటికీ కనువిప్పు కలుగుతుంది. అందువల్ల ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జీవితగాధను చదివి తీరవలసిందే!
 
 ఆల్‌ఫ్రెడ్ నోబెల్ బాల్యం
 నోబెల్ శాస్త్రజ్ఞుడి పూర్తి పేరు ఆల్‌ఫ్రెడ్ బెర్నాడ్ నోబెల్ (తర్వాతి కాలంలో ఈయనకు ‘లార్డ్’ అనే బిరుదు  వచ్చింది). ఇతడు స్వీడన్ దేశంలోని స్టాక్‌హోమ్ పట్టణంలో 1833వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి ఇమ్మాన్యుయేల్ నోబెల్, తల్లి కెరోలీనా ఆండ్రీ. ఇమ్మాన్యుయేల్ ఇంజనీరు, రసాయన శాస్త్రజ్ఞుడు. పేలుడు పదార్థాలు తయారుచేసే కంపెనీకి అధిపతి. ఎనిమిది మంది సంతానంలో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ నాల్గవవాడు. ఇమ్మాన్యుయేల్ పేలుడు పదార్థాలు తయారుచేసి విక్రయిస్తూ ఉండటంతో, ఆల్‌ఫ్రెడ్ నోబెల్ కూడా అదే రంగం మీద ఆసక్తి పెంచుకున్నాడు. పేలుడు పదార్థాల తయారీలోనే స్థిరపడ్డాడు. ప్రస్తుతం మనదేశంలో అందరి నోళ్లలోనూ నానుతున్న ‘బోఫోర్స్’ కంపెనీ కూడా ఆల్‌ఫ్రెడ్‌నోబెల్ స్థాపించినదే.
 ఇమ్మాన్యుయేల్ స్థాపించిన కంపెనీకి నష్టాలు వాటిల్లి దివాలా తీయటంతో అతడు స్టాక్‌హోమ్ నగరం విడిచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరి, అక్కడ వ్యాపారం కొనసాగించాడు.
 
 రష్యాకు నీటిలో పేలే విస్ఫోటకాలను సరఫరా చేశాడు. క్రిమియన్ యుద్ధం ముగియగానే ఆ కంపెనీ మళ్లీ దివాలా తీసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అతడు కంపెనీని తిరిగి స్వీడన్‌కు మార్చాడు. ఆల్‌ఫ్రెడ్ చిన్నతనం నుంచి రసాయన శాస్త్రం అంటే ఇష్టపడేవాడు. ఆ శాస్త్రంతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రాథమిక విద్య తర్వాత ఆల్‌ఫ్రెడ్ పారిస్‌లో హైస్కూల్ విద్యనభ్యసించాడు. 18 ఏళ్ల వయసులో ఉన్నత విద్యకోసం అమెరికా చేరుకున్నాడు. అక్కడ జాన్ ఎరిక్‌సన్ అనే రసాయన శాస్త్రవేత్త దగ్గర రసాయన శాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించి పరిశోధనలు చేపట్టాడు. అమెరికాలో  ‘గ్యాస్‌మీటర్’ను కనిపెట్టి పేటెంట్ సంపాదించాడు. అదే అతడి మొదటి పేటెంట్. ఇదే తరుణంలో ఇమ్మాన్యుయేల్ కంపెనీ మళ్లీ నష్టాల బాట పట్టడంతో ఆల్‌ఫ్రెడ్ స్వదేశానికి వచ్చి, సోదరులతో కలిసి తండ్రి కంపెనీని లాభాల బాటలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు. కొత్త పేలుడు పదార్థాలను కనుగొనటంలో నిమగ్నమయ్యాడు. అలా తయారైనదే డైనమైట్.
 
 డైనమైట్ తర్వాత... ‘నోబెల్’కు ముందు..!
 డైనమైట్‌ను కనుక్కున్న తర్వాత, దానిని క్షేమకరంగా ఉపయోగించే పద్ధతుల మీద సోదరులతో కలిసి అనేక ప్రయోగాలు చేశాడు ఆల్‌ఫ్రెడ్ నోబెల్. ఈ ప్రక్రియలో నోబెల్  ప్రయోగశాలలో 1888 సంవత్సరంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఆ ప్రమాదంలో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ తప్పించుకున్నాడు కానీ అతని సోదరుడు ‘లుడ్విగ్ నోబెల్’ మరణించాడు. అయితే ఈ వార్తను ప్రచురించే క్రమంలో పొరపాటు దొర్లింది. పారిస్ నుంచి వెలువడే ఒక ఫ్రెంచి పత్రిక ఈ వార్తను ‘మృత్యు వ్యాపారి, నరహంతకుడు నోబెల్ అస్తమయం’ అని పెద్ద అక్షరాలతో ప్రకటించింది. ఆ వార్త చూసిన ఆల్‌ఫ్రెడ్ హతాశుడయ్యాడు. తాను నైట్రో గ్లిజరిన్‌ను క్షేమకరమైన విధానంలో విస్ఫోటనకు ఉపయోగించేలా చేద్దామనుకుంటే, ఆ ప్రయత్నం ఇంతటి అపవాదు తెచ్చిందా అని తీవ్రంగా బాధపడ్డాడు. ఆ విచారం నుంచి బయటపడకపోగా జీవితంపై విరక్తిని పెంచుకున్నాడు. మానవాళికి ప్రయోజనం చేకూరే పని ఏదైనా చేయాలని ఆశించాడు. దాని ఫలితమే నోబెల్ ఫౌండేషన్.
 
 డైనమైట్ కథ
 ‘డైనమైట్’ను ఆల్‌ఫ్రెడ్ నోబెల్ 1867లో కనుగొన్నాడు. డైనమైట్‌లోని ముఖ్యమైన పేలుడు పదార్థం నైట్రో గ్లిజరిన్. ఇందులోని పేలుడు స్వభావాన్ని మొదట కనుగొన్నది ఆస్కారియో సొబ్రీరో. నైట్రో గ్లిజరిన్‌ను క్షేమకరంగా ఉపయోగించటానికి దానిని కీసెల్ ఘుర్ అనే తేలికగా ఉండే బూడిద వంటి మట్టి కలిపి ప్రయోగించాడు నోబెల్. దానికి ‘డైనమైట్’ పేరుతో పేటెంట్ హక్కులు పొందాడు. ఇలాంటి ప్రయోగాల ద్వారా అతడు 16,87,337 బ్రిటిష్ పౌండ్ల ధనం (సుమారు 472 మిలియన్ల అమెరికన్ డాలర్లు) ఆర్జించాడు.
 
 ఆల్‌ఫ్రెడ్ నోబెల్ గురించి మరికొన్ని...
     నోబెల్ వివాహం చేసుకోలేదు.
     ఆయన మరణించేనాటికి 90 కంపెనీలకు వ్యవస్థాపక భాగస్వామి, 355 పేటెంట్లకు హక్కుదారుడు.
     బోఫోర్స్ కంపెనీని మొదట్లో ఇనుము కర్మాగారంగా ప్రారంభించి, తర్వాత ఆయుధాల ఫ్యాక్టరీగా మార్చాడు. ఇప్పటికీ ఆ కంపెనీ ఆయుధాలు, విమానాలను ఉత్పత్తి చేస్తూనే ఉంది.
     ‘నోబెల్ బహుమతి’ దిశగా అతడిని ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన కార్యదర్శి ‘బెర్తా’. ఆమె రచయిత్రి కూడ.  
 
 ఒక్కో నోబెల్ పురస్కారం విలువ సుమారు 3 లక్షల 50 వేల అమెరికన్ డాలర్లు
 (సుమారు 1 కోటి 75 లక్షల రూపాయలు). ఈ బహుమతిని స్టాక్‌హోమ్‌లో అందజేస్తారు.
 
 ఆల్‌ఫ్రెడ్ నోబెల్, 1896వ సంవత్సరంలో నోబెల్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి, తాను సంపాదించిన ధనంలో 95 శాతం నగదును నోబెల్ పురస్కారాల కోసం వినియోగించడానికి వీలుగా బ్యాంకులో కుదువబెట్టాడు. ఆ ధనం మానవాళికి ఉపయోగపడే విధంగా ఒక నియమావళిని రూపొందించాడు. ఇందుకు అతడికి సాకారం కాని కల కూడా తోడైంది. నోబెల్‌కి చిన్నతనం నుంచి శరీరారోగ్యం బాగుండేది కాదు. దాంతో తాను వైద్యుడై శరీర ధర్మశాస్త్రం (ఫిజియాలజీ) అభ్యసించాలనే ఆశయం నెరవేరలేదు.  అందుకే ఆ రంగంలో కృషి చేసిన వారికి బహుమతి ఇవ్వడం ద్వారా ఆ ఆశను నెరవేర్చుకున్నాడు. నోబెల్ ఫౌండేషన్ ద్వారా... భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, జన్యు శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం వంటి విజ్ఞాన శాస్త్ర విభాగాలు, కంప్యూటర్, ఎలక్ట్రికల్ వంటి ఇంజనీరింగ్ విభాగాలు, చరిత్ర, అర్థశాస్త్రం, సాహిత్యం వంటి ఆర్ట్స్ విభాగాలు, సామాజిక ఆవిష్కరణలు, ప్రపంచ శాంతి మొదలైన విభాగాలలో సేవలందించిన వారికి మొత్తం ఆరు కేటగిరీలలో నోబెల్ బహుమతులు ఇస్తున్నారు.
 
 ప్రశాంతంగా జీవించడానికి...
 నోబెల్ ఫౌండేషన్ రూపకల్పన తర్వాత ఆల్‌ఫ్రెడ్ నోబెల్ తన చివరి రోజులను అజ్ఞాతంగా గడపటానికి నిశ్చయించుకొని ఇటలీలోని ‘శాన్ రిమో’ అనే ఊరికి వెళ్లాడు. అక్కడ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఆల్‌ఫ్రెడ్ నోబెల్... సెరిబ్రల్ హెమరేజ్ (మెదడులో రక్తనాళాలు చిట్లడం)కి గురై 1896వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన కన్నుమూశాడు. ఆయన సంస్మరణార్థం ఏటా ఇదేరోజున నోబెల్ బహుమతుల ప్రదానం జరుగుతుంది. ఇదీ క్లుప్తంగా ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జీవితం. అతడి జీవితంలో ఆసక్తి కలిగించే మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి.
 

ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మంచి సాహిత్యాభిమాని, రచయిత. రసాయన శాస్త్ర ప్రయోగాలతో తలమునకలై ఉన్నప్పటికీ, కొంత సమయాన్ని సాహిత్య పఠనం, రచనా వ్యాసంగానికి కేటాయించేవాడు. ప్రముఖ సాహితీకారుల రచనలు చదవటంతోపాటు వాటిపై పద్య రూపంలో వ్యాఖ్యలు రాసేవాడు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ రచనలలో 1895లో రాసిన ‘ద పేటెంట్ బ్యాసిల్లస్’, 1896లో ‘నెమిసిస్’ పేరుతో రాసిన విషాదాంత రూపకం ముఖ్యమైనవి.
 
    
 ఇప్పటి వరకు నోబెల్ అందుకున్న ప్రముఖులలో మనదేశానికి చెందినవాళ్లు 13 మంది. వీరిలో తొమ్మిదిమంది భారతపౌరులు, నలుగురు భారత సంతతికి చెందిన వారు. వారి గురించిన సమగ్రసమాచారంతో కూడిన కథనాలను ప్రతి వారం ఇదే శీర్షికలో తెలుసుకుందాం.
 - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు
 విశ్రాంత రసాయనాచార్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement