
మాట్లాడొద్దు, అని అర్థం చైనీస్‌లో మో యాన్ అంటే. దాన్నే కలంపేరుగా స్వీకరించాడు ‘మోయాన్’. అసలు పేరు గ్వాన్ మోయే. 1955లో రైతుకుటుంబంలో జన్మించాడు. చైనాలో ఉన్న విప్లవ రాజకీయాల నేపథ్యంలో మనసులో ఉన్నది బయటపెట్దొద్దు, అని తల్లిదండ్రులు వారించేవారట. అయినా మాట్లాడకూడని అంశాలే మాట్లాడుతూ రచయితగా అవతరించాడు. సాంస్కృతిక విప్లవ కాలంలో కార్మికుడిగా పనిచేశాడు. సైన్యంలో పనిచేశాడు. ఆయన రచనల్లో సామాజిక వాస్తవికతతోపాటు మాంత్రిక వాస్తవికత కూడా కనబడుతుంది. చరిత్ర, వర్తమానం, జానపద గాథలు ఒక కలలాంటి స్థితిలో కలగలిసిపోతాయి. ఆదర్శవాదంలో కూడా మనిషి దురాశ, అవినీతిని వ్యంగ్యంగా చిత్రించాడు. రెడ్ సొర్గమ్ క్లాన్, ద గార్లిక్ బాలాడ్స్, ద రిపబ్లిక్ ఆఫ్ వైన్, లైఫ్ అండ్ డెత్ ఆర్ వేరింగ్ మి ఔట్ ఆయన నవలలు. నవలికలు, కథలు కూడా విస్తృతంగా రాశాడు. పద సంపదను పరిమితం చేస్తుందన్న కారణంగా టైప్ చేయడం కన్నా చేత్తో రాయడానికే ఇష్టపడతాడు. దేశాల మధ్య ఉన్న హద్దులను దాటేందుకు సాహిత్యమే మార్గం అంటాడు. 2012లో ఆయన్ని నోబెల్ బహుమతి వరించింది. ఈ పురస్కారం దక్కిన తొలి చైనా నివాస రచయిత. కమ్యూనిస్టు పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయన్న కారణంగా ఆయన్ని విమర్శించేవాళ్లూ ఉన్నారు.