మాట్లాడుతున్న రచయిత దామోదర్ మౌజో
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక హక్కుల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణకు రచయితలు, కవులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కాపలాదారుగా వ్యవహరించాలని ప్రముఖ కొంకణి రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో అన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం సాహిత్య సృజన చేసే కవులు, రచయితలను హతమార్చడం పిరికిపందల చర్య అన్నారు. సత్యాన్ని ఎదుర్కోలేకనే కల్‌బుర్గి, దబోల్కర్, గౌరీలంకేష్ వంటి మేధావులను, రచయితలను హత్య చేశారని ఆరోపించారు.
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ శుక్రవారం విద్యారణ్య స్కూల్‌లో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కవులు, రచయితలు ప్రజలను చైతన్యం చేశారన్నారు. తనకు రాజ్యాంగం పట్ల పూర్తి నమ్మకం ఉందన్నారు. జీవించే హక్కుతో సహా ప్రాథమిక హక్కులకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు.
మనుషులు ఏం తినాలో, ఏం తినకూడదో కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ జేఎన్‌యూ క్యాంటీన్‌లో మాంసాహారం వండకూడదని ఒక విద్యార్థి సంఘం హెచ్చరించడం దారుణమన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక ధోరణులను నిరసించాలన్నారు. అలాగే హక్కులను కాపాడుకోవాలని చెప్పారు. రచయితగా తాను సైతం తీవ్రమైన హెచ్చరికలు, ఒత్తిళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు.
కొంకణి భాష కోసం సుదీర్ఘమైన ఉద్యమం...
గోవా ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చిందన్నారు. మౌర్యుల కాలం నుంచి ఒక ఉనికిని కలిగి ఉన్న కొంకణి ప్రాంతం పోర్చుగీసు వారి రాకతో విచ్ఛిన్నమైందన్నారు. మతమార్పిడులు, సాహిత్య, సాంస్కృతిక మార్పిడులు తమ ఉనికిని ప్రమాదంలోకి నెట్టాయన్నారు. కొంకణిభాషకు లిపి లేకుండా పోయిందన్నారు. పోర్చుగీసు దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వలసి వెళ్లారని చెప్పారు. ఈ క్రమంలో కొంకణి మాతృభాషగా కలిగిన వారు ఆయా రాష్ట్రాల్లోని భాషల లిపినే కొంకణి లిపిగా మార్చుకున్నారన్నారు. గోవా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత దేవనాగరి భాషను కొంకణి అధికార భాషగా గుర్తించేందుకు తాము సుదీర్ఘ ఉద్యమం చేపట్టినట్లు గుర్తు చేశారు. గోవాలోని మారుమూల పల్లెటూరుకు చెందిన తాను ప్రజల జీవితాలను, కష్టాలను, బాధలను దగ్గర నుంచి చూడడం వల్ల ప్రజల గాథలనే ఇతివృత్తంగా ఎంచుకుని రచనావ్యాసంగం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
వేడుకలు వైవిధ్యం...
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అధ్యక్షత వహించారు. జర్మనీ రాయబార కార్యాలయం ప్రతినిధి స్టీఫెన్ గ్రాబర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్‌లు అమితాదేశాయ్, ప్రొఫెసర్ విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న భాషల సాహిత్యాన్ని ఒక వేదికకు తేవడం గొప్ప కార్యక్రమమని వక్తలు కొనియాడారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఒక వైవిధ్యభరితమైన వేడుక అని స్టీఫెన్ చెప్పారు. జర్మనీ భాషాసాహిత్యాలను, కళలను ఈ వేదికపైన ప్రదర్శించే చక్కటి అవకాశం లభించిందన్నారు.
అలరించిన సాస్కృతిక ప్రదర్శనలు
వేడుకల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పుస్తకప్రదర్శన, ఫుడ్‌ఫర్ థాట్, సేవ్ రాక్ ఫొటో ఎగ్జిబిషన్, స్టోరీ బాక్స్ వంటివి విశేషంగా ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment