జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి వింజమూరి అనసూయాదేవి జీవితం ఎంతటి స్ఫూర్తిమంతమైనదో డాక్యుమెంటరీగా తీసి, ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’లో ప్రదర్శించారు ఆమె కుమార్తె సీతారత్నాకర్. ‘అసమాన అనసూయ’ ను తెరపై చూసిన నాటి తరమే కాదు, నేటి నవతరమూ కళ్లప్పగించి చూస్తూనే ఉంది. ఈ సందర్భంగా తల్లి తన జీవితంలో నింపిన స్ఫూర్తిని సీతారత్నాకర్ పంచుకున్నారు.
మారుమూల పల్లెల్లో దాగి ఉన్న జానపద గేయాలకు సభా గాన మర్యాద కలిగించి సంగీత జగత్తులో ఉన్నతస్థానాన్ని కలిగించిన తొలి గాయని వింజమూరి అనసూయాదేవి. జానపద గేయాలకు కర్నాటక బాణీలో స్వర రచన చేసిన తొలి స్వరకర్త. విశ్వ విద్యాలయాలలో శాస్త్రీయ సంగీతాన్ని పాఠ్యాంశంగా చేర్పించిన అసమాన గాయని. దక్షిణ భారతదేశంలో తొలి మహిళా సంగీత దర్శకురాలు. ఆమె ఒక అద్భుతం. ఆమెను తలుచుకుంటున్నారు కుమార్తె సీతారత్నాకర్.
పాట పాడింది... బాధ్యతలూ నెరవేర్చింది
అమ్మానాన్నలకు మేం ఐదుగురం సంతానం. అమ్మకు సంగీతం అంటేప్రాణం. స్కూల్ లేని రోజుల్లో అమ్మ తనతోపాటు మమ్మల్నీ కచేరీలకు తీసుకెళ్లేది. ఎక్కడకు వెళ్లినా తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే కళను కూడా సాకారం చేసుకున్నారు. నేనూ, మా అక్క భరతనాట్యం నేర్చుకొని దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చాం. అక్కకు పెళ్లయ్యి అమెరికా వెళ్లడం, నాకు పెళ్లవడంతో నృత్యం ఆగిపోయింది. దూరదర్శన్‌లో ఉద్యోగం వచ్చింది. మేం మొదటి నుంచి చెన్నైలో ఉండేవాళ్లం. అలా చెన్నై, ఢిల్లీ దూరదర్శన్‌లో 37 ఏళ్లు వర్క్ చేశాను. ఎంతో మంది కళాకారులను, యాక్టివిస్ట్‌లను దూరదర్శన్‌కి పరిచయం చేశాను. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు నలుగురూ అమెరికాలో స్థిరపడ్డారు.
అమ్మ ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ సమయం తనతో గడిపే అవకాశం లభించేంది. అమ్మకు జానపద గేయాల గురించి తెలుసు కాబట్టి కాకినాడకు తీసుకెళ్లి, అక్కడి పల్లె పాటల మీద ఓ కార్యక్రమాన్ని చేశాం. అదొక మధురానుభూతి నాకు. నేను చేసిన ప్రోగ్రామ్స్ చూసేది. సూచనలు ఇచ్చేది. ‘ఇంకా ఏదైనా చేయాలి’ అంటూ గాయనిగా స్వరాలను కూర్చుతూనే ఉండేది. రచనలు చేస్తూనే ఉండేది. భావగీతాలు, జానపద గేయాలు ఈ రెండు పుస్తకాలు ఆమె 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా విడుదలయ్యాయి. ఆ తర్వాత జానపద సంగీతంపై ఏడు పుస్తకాలను విడుదల చేశారు. ఇవి కాకుండా నేనూ–నా రచనలు, గతానికి స్వాగతం అనే పుస్తకాలు, 95వ పుట్టిన రోజు సందర్భంగా ‘అసమాన అనసూయ’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు.
యజ్ఞంలా అనిపించింది...
నిరంతర కృషియే అమ్మను అసమానంగా ఈ రోజు నిలబెట్టింది. అమ్మ మరణించాక ఆమెకు సంబంధించిన ఫుటేజీ అంతా ఒకసారి చూడటం మొదలుపెట్టాను. మరికొంత మా వాళ్ల నుంచి సేకరించాను. అదంతా చూడటానికే నాకు రోజుల సమయం పట్టింది. ఆవిడ వీడియోలు చూస్తున్నప్పుడు ‘నా పాటలు ఆగిపోకూడదు...’ వంటి మాటలు విన్నాను. దీంతో అమ్మకు సంబంధించిన డాక్యుమెంటరీ ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నించాను. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి.. అని చాలా ఆలోచించేదాన్ని.
ఫుటేజీలో ఆమె దినచర్యతోపాటు, జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ చేర్చుకుంటూ, ప్రముఖుల సభా విశేషాలు, పుస్తకప్రారంభోత్సవాలు, కుటుంబ సభ్యుల నుంచి కామెంట్స్ జత చేసి ఒక రూపం తీసుకువచ్చాను. ఈ సమయంలో అమ్మ నా వెంటే ఉంటూ నాకు సూచనలు చేస్తున్నట్టు అనిపించేది. డాక్యుమెంటరీ పూర్తవ్వడానికి మూడేళ్ల సమయం పట్టింది. అమ్మ ఘనత అలనాటి వారికే తెలుసు అనుకున్నాను. కానీ, నేటి తరం కూడా అమ్మ డాక్యుమెంటరీ చూడటం, ఆమె గొప్పతనం గురించి ప్రస్తావిస్తుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది’ అంటూ తన తల్లితో తనకున్న అనుబంధాన్ని తెలిపారు సీతా రత్నాకర్.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment