జానపద సాహిత్యం కోసం అనంతమైన కృషి చేసినవారు తంగిరాల వెంకట సుబ్బారావు. ఆ సాహిత్యాన్ని సేకరించి, విశ్లేషించి, వేలాది పుటల గ్రంథాలను వెలుగులోనికి తీసుకొచ్చారు. ‘తెలుగు వీరగాథా కవిత్వం’పై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా అందుకొన్నారు. తెలుగులోని వీరగాథా వైశిష్ట్యాన్ని లోకానికి చాటడంలోతంగిరాల సఫలీకృతులైనారు. ఈ సిద్ధాంత గ్రంథంలో వీరగాథల పుట్టుపూర్వోత్త రాలు, వీరగాథా విభజన, శక్తి కథాచక్రం, పలనాటి వీర కథా చక్రం, కాటమరాజు కథాచక్రం, బొబ్బిలి వరుస కథలు, పదాలు, జంగం కథలు, లఘు వీర గాథలు, వీర గాథానుకరణాలు, వీరగాథలో రసం, భాష, ఛందస్సు, వీరగాథల వైశిష్ట్యం వంటి పరిశోధనా విషయాలను కూలంకషంగా చర్చించి వివరించారు.
తంగిరాల ‘రేనాటి సూర్యచంద్రులు’ అనే పెద్ద పుస్త కాన్ని ప్రచురించారు. ఇందులో భారతదేశంలో మొదటి స్వాతంత్య్ర పోరాట వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథల్ని సవివరంగా పరిశీలించి తెలుగు వారికి అందించారు. అలాగే రేనాటి సూర్య చంద్రులు రెండవ సంపుటాన్ని ప్రచురించి అందులో రాయలసీమ దాన కర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి సాహిత్యాన్ని విడమరచి చెప్పారు.
చదవండి: Aga Khan : ప్రముఖ ఆధ్యాత్మికనేత, దాత ఆగా ఖాన్ కన్నుమూత
‘చైతన్య కవిత’ అనే పత్రికను స్థాపించి ఎన్నో ఏళ్ళు దానికి సంపాదకుడిగా పని చేశారు. ‘శ్రీకృష్ణ కర్ణామృతం’ గ్రంథానికి కూడా సంపాదకత్వం వహించారు. రంగ నాథ రామాయణం, సుమతి శతకాలను తంగిరాలతో కలిసి కొంతమంది ఆంగ్లంలోకి అనువదించారు. ‘అంకమ్మ కథలు’ పేరుతో శక్తి కథాచక్రాన్ని ప్రచురించారు. వంద లాది పరిశోధనా వ్యాసాలను రచించారు.
తంగిరాల చేసిన సేవలకు గాను 2025 జన వరి 4న ఆయనకు ‘అజో విభోకందాళం ఫౌండేషన్ జీవిత సాఫల్య పురస్కారం’ పొందారు. ఇది జరిగిన ఇరవై ఒకటో రోజే (జనవరి 25) ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగులో జానపద సాహిత్యం ఉన్నన్నినాళ్లూ ఆచార్య తంగిరాల జీవించే ఉంటారు.
– ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి ‘ ఏపీ తెలుగు అకాడమీ మాజీ సంచాలకుడు
Comments
Please login to add a commentAdd a comment