konkani
-
హక్కుల రక్షణకు రచయిత కాపలాదారు కావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక హక్కుల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణకు రచయితలు, కవులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కాపలాదారుగా వ్యవహరించాలని ప్రముఖ కొంకణి రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో అన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం సాహిత్య సృజన చేసే కవులు, రచయితలను హతమార్చడం పిరికిపందల చర్య అన్నారు. సత్యాన్ని ఎదుర్కోలేకనే కల్బుర్గి, దబోల్కర్, గౌరీలంకేష్ వంటి మేధావులను, రచయితలను హత్య చేశారని ఆరోపించారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ శుక్రవారం విద్యారణ్య స్కూల్లో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కవులు, రచయితలు ప్రజలను చైతన్యం చేశారన్నారు. తనకు రాజ్యాంగం పట్ల పూర్తి నమ్మకం ఉందన్నారు. జీవించే హక్కుతో సహా ప్రాథమిక హక్కులకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు. మనుషులు ఏం తినాలో, ఏం తినకూడదో కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ జేఎన్‌యూ క్యాంటీన్లో మాంసాహారం వండకూడదని ఒక విద్యార్థి సంఘం హెచ్చరించడం దారుణమన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక ధోరణులను నిరసించాలన్నారు. అలాగే హక్కులను కాపాడుకోవాలని చెప్పారు. రచయితగా తాను సైతం తీవ్రమైన హెచ్చరికలు, ఒత్తిళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. కొంకణి భాష కోసం సుదీర్ఘమైన ఉద్యమం... గోవా ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చిందన్నారు. మౌర్యుల కాలం నుంచి ఒక ఉనికిని కలిగి ఉన్న కొంకణి ప్రాంతం పోర్చుగీసు వారి రాకతో విచ్ఛిన్నమైందన్నారు. మతమార్పిడులు, సాహిత్య, సాంస్కృతిక మార్పిడులు తమ ఉనికిని ప్రమాదంలోకి నెట్టాయన్నారు. కొంకణిభాషకు లిపి లేకుండా పోయిందన్నారు. పోర్చుగీసు దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వలసి వెళ్లారని చెప్పారు. ఈ క్రమంలో కొంకణి మాతృభాషగా కలిగిన వారు ఆయా రాష్ట్రాల్లోని భాషల లిపినే కొంకణి లిపిగా మార్చుకున్నారన్నారు. గోవా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత దేవనాగరి భాషను కొంకణి అధికార భాషగా గుర్తించేందుకు తాము సుదీర్ఘ ఉద్యమం చేపట్టినట్లు గుర్తు చేశారు. గోవాలోని మారుమూల పల్లెటూరుకు చెందిన తాను ప్రజల జీవితాలను, కష్టాలను, బాధలను దగ్గర నుంచి చూడడం వల్ల ప్రజల గాథలనే ఇతివృత్తంగా ఎంచుకుని రచనావ్యాసంగం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వేడుకలు వైవిధ్యం... హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అధ్యక్షత వహించారు. జర్మనీ రాయబార కార్యాలయం ప్రతినిధి స్టీఫెన్ గ్రాబర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్లు అమితాదేశాయ్, ప్రొఫెసర్ విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న భాషల సాహిత్యాన్ని ఒక వేదికకు తేవడం గొప్ప కార్యక్రమమని వక్తలు కొనియాడారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఒక వైవిధ్యభరితమైన వేడుక అని స్టీఫెన్ చెప్పారు. జర్మనీ భాషాసాహిత్యాలను, కళలను ఈ వేదికపైన ప్రదర్శించే చక్కటి అవకాశం లభించిందన్నారు. అలరించిన సాస్కృతిక ప్రదర్శనలు వేడుకల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పుస్తకప్రదర్శన, ఫుడ్‌ఫర్ థాట్, సేవ్ రాక్ ఫొటో ఎగ్జిబిషన్, స్టోరీ బాక్స్ వంటివి విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Summer Drinks: కొకుమ్ జ్యూస్.. వేసవిలో భోజనం తర్వాత తాగితే!
Summer Drink- Kokum Solkadhi Juice: కొంకణి కూరల్లో పులుపు కోసం వాడే ప్రధాన పదార్థం కొకుమ్. వేసవిలో భోజనం తరువాత ఈ జ్యూస్‌ను తప్పని సరిగా తాగుతారు . ఇది ఆకలిని నియంత్రించి, అధిక బరువుని తగ్గిస్తుంది జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి, గ్యాస్ ఎసిడిటీ సమస్యలను దరిచేరనియ్యదు. దీనిలోని యాంటీఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఈ జ్యూస్ శరీరానికి సహజ సిద్ధమైన చల్లదనాన్ని అందిస్తుంది. కొకుమ్ (సొల్కది) జ్యూస్ తయారీకి కావలసినవి: ►ఎండు కొకుమ్స్ – 12 ►చిక్కటి కొబ్బరి పాలు – ఒకటిన్నర కప్పులు ►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా ►నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►ఆవాలు – టీస్పూను ►జీలకర్ర – టీస్పూను ►కరివేపాకు – ఒక రెమ్మ ►ఇంగువ – చిటికెడు ►వెల్లుల్లి రెబ్బలు – రెండు. తయారీ: ►కొకుమ్స్ను శుభ్రంగా కడిగి, కప్పు నీటిలో అరగంటపాటు నానబెట్టుకోవాలి ►అరగంట తరువాత కొకుమ్స్ను బాగా పిసకాలి. తరువాత వడగట్టి రసాన్ని వేరు చేయాలి ►ఇప్పుడు ఈ రసానికి రెండు కప్పులు నీళ్లు, కొబ్బరి పాలు, రుచికి సరిపడా ఉప్పువేసి కలిపి పక్కనపెట్టుకోవాలి ►బాణలిలో ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి ►ఇప్పుడు ఇంగువ కరివేపాకు, వెల్లుల్లిని దంచి వేయాలి ►ఇవన్నీ వేగాక కొకుమ్ జ్యూస్‌లో కలిపి, రెండు గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ►చల్లబడిన జ్యూస్‌లో చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇది కూడా ట్రై చేయండి: Pineapple- Keera: పైనాపిల్ కీరా జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల! -
కాసర్ గోడ్ - ఓ మంచి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాంటి నియోజకవర్గం
కాసర్ గోడ్... కేరళ ఉత్తరాగ్రాన ఉన్న జిల్లా. ఇది అటు కొంకణ తీరానికి, ఇటు కర్నాటకకి దగ్గర్లో ఉండే కేరళ జిల్లా. అందుకే కాసింత కర్నాటకను, కొంచెం కేరళను కలిపి గోవాలో వేసి వేయిస్తే కాసర్గోడ్ జిల్లా తయారవుతుంది. మొత్తం మీద మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాంటిది కాసర్గోడ్. మిగతా చోట రాజకీయ నాయకుడు కావాలంటే ఆకర్షణీయ వ్యక్తిత్వం, నేతృత్వ లక్షణాలు, ప్రజాసేవా భావం, ఆర్ధిక దన్ను వంటి క్వాలిటీలు కావాలి. కాసర్గోడ్లో వీటితో పాటు ఇంకో క్వాలిటీ ఉండి తీరాలి. అప్పుడే రాజకీయులు రాణించగలరు. ఇంతకీ ఆ క్వాలిటీ ఏమిటనే కదా ప్రశ్న! కాసర్గోడ్ జిల్లాలో రాజకీయంగా రాణించాలంటే బోలెడన్ని భాషలు తెలిసుండాలి. ఆ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి ఉండాలి. కాసర్గోడ్ జనాభాలో కనీసం 35 శాతం మంది కన్నడ మాట్లాడతారు. మలయాళ భాషీయులూ చాలా మంది ఉంటారు. ఇవే కాక తుళు, కొంకణి, మరాఠీ, ఉర్దూ భాషలు మాట్లాడేవారుంటారు. వీటితో పాటు బ్యారీ అనే భాష కూడా వచ్చి ఉండాలి. బ్యారీ అంటే కాస్త అరబిక్, కాస్త మలయాళం, కాస్త కన్నడ కలిపి ముస్లింలు మాట్లాడే భాష.. నాయకుడికి ఈ భాషలన్నీ వచ్చి ఉండాలి. లేదా ఆయా భాషలు మాట్లాడగలిగే దుబాసీలు వెంట ఉంచుకోవాలి. ఇక్కడ ఇలాంటి బహుభాషా ప్రవీణ/లకు భలే డిమాండ్ ఉంటుంది. పోస్టర్లు కూడా పలు భాషల్లో తయారు చేయించక తప్పదు. ఎందుకంటే ఒక వీధి లో తుళు భాషీయులు ఉంటే, పొరుగువీధిలో కొంకణీలు ఉంటారు. ఆ పక్క సందు తిరిగితే కన్నడ బాష వినిపిస్తుంది. మరో సందు మలుపు తిరిగితే చాలు మలయాళీ వినిపిస్తుంది. కొన్ని వీధుల్లో ఉర్దూ వినిపిస్తే, మరికొన్ని చోట్ల బ్యారీ వినిపిస్తుంది. అసలు కాసర్గోడ్ జిల్లాలో చాలా మందికి చాలా భాషలు వచ్చు. అందుకే కాసర్గోడ్ లో కంటెస్ట్ చేయడం అంటే కఠిన పరీక్ష లాంటిదే! ముఖ్యంగా మంజేశ్వరం, మీంచా, మంగళ్ వాడీ, కుంబాలా, పుదిగే, కుంబాడజే, కరాదుక్క, ఎన్మాకజే, మదియాదుక్క, బెల్లూరు వంటి గ్రామ పంచాయతీల్లో 'జిహ్వకోభాష, వీధికో కల్చర్' విలసిల్లుతూ ఉంటుంది. అన్నిటికన్నా స్పెషల్ విషయం ఏమిటంటే ఈ పలు భాషలు, పలు సంస్కృతుల మధ్య సంఘర్షణ ఉండదు. రాజకీయులు సైతం ఇప్పటి వరకూ 'విభజించి పాలించే' విధానాన్ని అమలు చేయలేదు. ఏ కూరకు ఆ కూర వేరు చేస్తే ఎవరికీ సరిపోదు. అన్ని కూరల్నీ కలిపి మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ చేస్తే తప్ప ఉపయోగం ఉండదు. అందుకే కాసర్ గోడ్ రాజకీయులు కూడా 'విభజించు- పాలించు' కంటే 'కలిపి ఉంచు - పాలించు' విధానమే మంచిదని భావిస్తారు. అదీ కాసర్గోడ్ అసలు ప్రత్యేకత!!