కాసర్ గోడ్ - ఓ మంచి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాంటి నియోజకవర్గం
కాసర్ గోడ్... కేరళ ఉత్తరాగ్రాన ఉన్న జిల్లా. ఇది అటు కొంకణ తీరానికి, ఇటు కర్నాటకకి దగ్గర్లో ఉండే కేరళ జిల్లా. అందుకే కాసింత కర్నాటకను, కొంచెం కేరళను కలిపి గోవాలో వేసి వేయిస్తే కాసర్గోడ్ జిల్లా తయారవుతుంది. మొత్తం మీద మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాంటిది కాసర్గోడ్. మిగతా చోట రాజకీయ నాయకుడు కావాలంటే ఆకర్షణీయ వ్యక్తిత్వం, నేతృత్వ లక్షణాలు, ప్రజాసేవా భావం, ఆర్ధిక దన్ను వంటి క్వాలిటీలు కావాలి. కాసర్గోడ్లో వీటితో పాటు ఇంకో క్వాలిటీ ఉండి తీరాలి. అప్పుడే రాజకీయులు రాణించగలరు.
ఇంతకీ ఆ క్వాలిటీ ఏమిటనే కదా ప్రశ్న! కాసర్గోడ్ జిల్లాలో రాజకీయంగా రాణించాలంటే బోలెడన్ని భాషలు తెలిసుండాలి. ఆ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి ఉండాలి. కాసర్గోడ్ జనాభాలో కనీసం 35 శాతం మంది కన్నడ మాట్లాడతారు. మలయాళ భాషీయులూ చాలా మంది ఉంటారు. ఇవే కాక తుళు, కొంకణి, మరాఠీ, ఉర్దూ భాషలు మాట్లాడేవారుంటారు. వీటితో పాటు బ్యారీ అనే భాష కూడా వచ్చి ఉండాలి. బ్యారీ అంటే కాస్త అరబిక్, కాస్త మలయాళం, కాస్త కన్నడ కలిపి ముస్లింలు మాట్లాడే భాష..
నాయకుడికి ఈ భాషలన్నీ వచ్చి ఉండాలి. లేదా ఆయా భాషలు మాట్లాడగలిగే దుబాసీలు వెంట ఉంచుకోవాలి. ఇక్కడ ఇలాంటి బహుభాషా ప్రవీణ/లకు భలే డిమాండ్ ఉంటుంది. పోస్టర్లు కూడా పలు భాషల్లో తయారు చేయించక తప్పదు. ఎందుకంటే ఒక వీధి లో తుళు భాషీయులు ఉంటే, పొరుగువీధిలో కొంకణీలు ఉంటారు. ఆ పక్క సందు తిరిగితే కన్నడ బాష వినిపిస్తుంది. మరో సందు మలుపు తిరిగితే చాలు మలయాళీ వినిపిస్తుంది. కొన్ని వీధుల్లో ఉర్దూ వినిపిస్తే, మరికొన్ని చోట్ల బ్యారీ వినిపిస్తుంది. అసలు కాసర్గోడ్ జిల్లాలో చాలా మందికి చాలా భాషలు వచ్చు. అందుకే కాసర్గోడ్ లో కంటెస్ట్ చేయడం అంటే కఠిన పరీక్ష లాంటిదే!
ముఖ్యంగా మంజేశ్వరం, మీంచా, మంగళ్ వాడీ, కుంబాలా, పుదిగే, కుంబాడజే, కరాదుక్క, ఎన్మాకజే, మదియాదుక్క, బెల్లూరు వంటి గ్రామ పంచాయతీల్లో 'జిహ్వకోభాష, వీధికో కల్చర్' విలసిల్లుతూ ఉంటుంది. అన్నిటికన్నా స్పెషల్ విషయం ఏమిటంటే ఈ పలు భాషలు, పలు సంస్కృతుల మధ్య సంఘర్షణ ఉండదు. రాజకీయులు సైతం ఇప్పటి వరకూ 'విభజించి పాలించే' విధానాన్ని అమలు చేయలేదు.
ఏ కూరకు ఆ కూర వేరు చేస్తే ఎవరికీ సరిపోదు. అన్ని కూరల్నీ కలిపి మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ చేస్తే తప్ప ఉపయోగం ఉండదు. అందుకే కాసర్ గోడ్ రాజకీయులు కూడా 'విభజించు- పాలించు' కంటే 'కలిపి ఉంచు - పాలించు' విధానమే మంచిదని భావిస్తారు. అదీ కాసర్గోడ్ అసలు ప్రత్యేకత!!