
పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్న కన్నడ బ్యూటీ 'రష్మిక మందన్న'కు రక్షణ కల్పించాలని ఆమె కులానికి (కొడవ) చెందిన సంఘం వారు రంగంలోకి దిగారు. ఈమేరకు వారు కేంద్రానికి లేఖ కూడా రాశారు. రీసెంట్‌గా 'ఛావా' సినిమా సక్సెస్ మీట్‌లో రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట భగ్గుమన్నాయి. బాలీవుడ్ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'నేను హైదరాబాద్ నుంచి వచ్చాను.. నాపై ఇక్కడి వారు చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.' అని చెప్పడంతో కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సొంతూరును మరిచిపోయి ఇలా మాట్లాడటం ఏంటి అంటూ ఆమెపై కన్నడ అభిమానులు ఫైర్ అయ్యారు.
రష్మికకు రక్షణగా 'కుల' పెద్దలు
సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్న రష్మికకు భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర్‌లకు 'కొడవ నేషనల్ కౌన్సిల్' (సీఎన్‌సీ) లేఖ రాసింది. రష్మిక చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేగడంతో కర్ణాటకలోని ఒక ఎమ్మెల్యేతో పాటు కన్నడ అనుకూల వర్గానికి చెందిన వారు ఆమెపై బెదిరింపులకు దిగారని (సీఎన్‌సీ) పేర్కొంది. దీంతో నటికి భద్రత కల్పించాలని 'కొడవ' బోర్డు కోరింది. తమ తెగకు చెందిన రష్మిక తన కృషి, ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమలో అఖండ విజయాన్ని సాధించిందని బోర్డు చైర్మన్ ఎన్.యు. నాచప్ప లేఖలో పేర్కొన్నారు.
దేశంలోనే గొప్ప నటులుగా గుర్తింపు ఉన్న అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుందని గుర్తుచేశారు. ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టే తన అభిప్రాయాన్ని పంచుకుందన్నారు. కానీ, ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో ఆమెలో భయం పెరిగిందని ఆయన అన్నారు. తాను వెనుకబడిని వర్గానికి చెందిన మహిళ కాబట్టే టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న కూడా ఫిర్యాదు చేసిందని నాచప్ప తెలిపారు. కర్ణాటకలో కొడవ వర్గం ప్రజలు ఓబీసీ కిందకు వస్తారు. రష్మిక మందన్న సామాజిక వర్గం 'కొడవ' అని తెలిసిందే.
ఎమ్మెల్యే బెదిరింపులు
రష్మికపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 'రవి గనిగ' ఫైర్ అయ్యారు. బాలీవుడ్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడతూ ఆయన ఒక ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. జీవితాన్ని ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె తక్కువ చేసిందని తెలిపారు. ఈ విషయం రష్మిక తెలుసుకోవాలని కోరారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు కూడా ఆమె అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. రష్మిక మందన్నకు సరైన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే రవి పిలుపునిచ్చారు.
ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనని వారిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి వారి నట్లు, బోల్టులు ఎలా సరిచేయాలో తమకు తెలుసని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొడవ సామాజిక వర్గం వారు రష్మిక మందన్నకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆమెకు రక్షణ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కొడవ వర్గం లీడర్ ఒక లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment