kasargod
-
ఓటీటీలో దూసుకెళ్తోన్న చిన్న సినిమా.. ఏకంగా టాప్-5లో!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా ఓ రేంజ్లో కొనసాగుతోంది. అన్ని భాషల్లో సినిమాలు అందుబాటులోకి రావడం ఓటీటీల వల్లే మరింత సులువుగా మారింది. అందుకే భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను సీనీ ప్రియులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్చున్నారు. చిన్న సినిమాలకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఓ వరంలా మారిందనే చెప్పాలి. (ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..) అయితే సెప్టెంబర్ 15న థియేటర్లలో రిలీజైన మలయాళ చిత్రం కాసర్ గోల్డ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన కాసర్ గోల్డ్ ఈనెల 13న ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది. అసలు కథేంటంటే.. ఓ రాజకీయ నాయకుడు స్మగ్లింగ్ గోల్డ్ పడిపోవడం.. ఆ బంగారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి అతని అనుచరులు ప్రయత్నంచడం అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. మృదుల్ నాయర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ ముఖ్య పాత్రలో నటించారు. అలాగే దసరా విలన్ షైన్ టామ్ చాకో కూడా ముఖ్య పాత్ర చేశాడు. యూడ్లీ ఫిల్మ్స్ బ్యానర్‌పై విక్రమ్ మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ నిర్మించారు. ఈ సినిమాలో అసీఫ్ అలీ, సన్నివేలన్, సిద్ధిఖీ, సంపత్ రామ్, దీపక్ పారంబోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: శివకార్తికేయన్ నన్ను దారుణంగా మోసం చేశాడు: సంగీత దర్శకుడు) -
శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్
చిత్రలేఖనం అందరికీ తెలుసు. లీజా దినూప్ చేసేది నృత్య లేఖనం. శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్ చేసి నృత్యకళను, చిత్రకళను వేదిక మీద సంగమకళగా ప్రదర్శిస్తోందామె. ఇలా చేస్తున్న ఒకే కళాకారిణి లీజా. అందుకే ఆమె పేరు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ ‘చిత్రనర్తకి’ పరిచయం. తెలుగు వారి విశిష్ట సంప్రదాయ నృత్యం ‘కూచిపూడి’లో ‘తాళ చిత్ర నృత్యం’ అనే విభాగం ఉంది. అందులో చిత్రకారిణి నృత్యం చేస్తూ పాదాల కదలికతో బట్ట మీద పరిచిన రంగును చెదరగొడుతూ నర్తనం ద్వారా ఒక బొమ్మను గీస్తుంది. ఎంతో సాధన ఉంటే తప్ప ఈ విద్య సాధ్యం కాదు. ఇదే కూచిపూడిలో ‘సింహనందిని’ అనే నృత్యవిభాగం దుర్గపూజ సమయంలో నర్తకీమణులు ప్రదర్శిస్తారు. ఈ నృత్యంలో రంగు పరిచిన బట్ట మీద నర్తిస్తూ పాదాలతో సింహం బొమ్మ గీస్తారు. ఇది దుర్గాదేవిని ఆరాధించే ఒక పద్ధతిగా వ్యాఖ్యానిస్తారు. భారతీయ నృత్యకళల్లో వేరే నృత్యాలకు లేని విశిష్టత ఈ విధంగా కూచిపూడికి ఉంది. అయితే కేరళలోని కాసర్గోడ్ టౌన్‌కు సమీపంలో ఉండే పయ్యూర్ అనే ఊరికి చెందిన 30 ఏళ్ల లీజా దినూప్ భరతనాట్యం చేస్తూ వేదిక మీద సిద్ధంగా ఉంచిన కేన్వాస్ మీద దేవతల బొమ్మలను గీస్తూ నృత్య చిత్రాల సంగమ కళను ప్రదర్శిస్తూ గుర్తింపు పొందుతోంది. కన్నూర్ యూనివర్సిటీలో ఎం.ఏ భరతనాట్యం చేసిన లీజా ఆ తర్వాత తిరువనంతపురంలో బేచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసింది. ఆమె నృత్యం చేయగలదు... చిత్రకళను ప్రదర్శించగలదు. ఈ రెంటిని కలిపి తానొక ‘చిత్రనర్తకి’ని ఎందుకు కాకూడదు అనిపించింది. వెంటనే ఆమె ఆ కళను సాధన చేసింది. ‘రామాయణ గాధలను, శివ ఆరాధనను, రవివర్మ గీసిన చిత్రాలను కేన్వాస్ మీద పునఃప్రతిష్టిస్తూ నేను భరతనాట్యం చేస్తాను’ అని లీజా దినూప్ అంటుంది. వివాహం అయ్యి మూడేళ్ల పాప ఉన్న లీజా కేరళలో రాష్ట్ర, జాతీయ సాంస్కృతిక కార్యక్రమం ఏది జరిగినా ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది. ఇప్పటికి ఆమె రాష్ట్రమంతా దాదాపుగా 50 చిత్రనర్తన ప్రదర్శనలు ఇచ్చింది. అంతే కాదు ఇలా చేసే ఏకైక చిత్రకారిణి కనుక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కింది. వేదిక మీద సంగీత బృందం రాగతాళాలు కొనసాగిస్తుండగా నృత్యం చేస్తూ మధ్య మధ్య కేన్వాస్ దగ్గరకు వస్తూ కుంచెతో ఆమె ఆ నృత్యంలో ఉన్న ఆధ్యాత్మిక, భక్తిభావాలకు తగిన బొమ్మను గీస్తుంది. ముఖ్యంగా రామాయణంలోని నవరసచిత్రాలను, గణేశ భక్తిని, స్త్రీ శక్తి రూపాన్ని ఆమె కేన్వాస్ మీద రంగుల్లో నాట్యం ద్వారా దేహంలో ప్రదర్శించి మెప్పు పొందుతోంది. ‘కళాత్మిక లలితకళాగృహం’ పేరుతో ఒక నటనాలయాన్ని ప్రారంభించి చిన్నారులకు శిక్షణ ఇస్తున్న లీజా నుంచి చిత్రనృత్యాన్ని అభ్యసించే కొత్తతరం తయారవుతోంది. భవిష్యత్తులో ఈ ప్రయోగం మరింత ముందుకు వెళ్లొచ్చని ఆశిద్దాం. -
తౌక్టే తుపాను: చూస్తుండగానే కుప్పకూలిన భవనం
-
తౌక్టే బీభత్సం: చూస్తుండగానే కుప్పకూలిన భవనం
తిరువనంతపురం: ఆరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తౌక్టే తుపాను ప్రభావంతో సముద్రం ఎగిసిపడుతోంది. దీంతో కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో వాతావరణం భయానకంగా మారింది.కేరళలోని కసర్గడ్లో తుపాన్ ప్రభావంతో వీచిన గాలులకు ఒక అంతస్తు ఉన్న భవనం కుప్పకూలింది. ఆ భవనం సముద్రపు జలాల్లో కలిసిపోయింది. అదృష్టవశాత్తు తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆ భవనంలో ఎవరూ లేరు. ఈ తుపాను ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తుపానుపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఆ తుపాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర సహాయక బృందంతో పాటు రాష్ట్రాలు తుపాను నష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చదవండి: వైరల్ వీడియో: ఎలుకల వర్షం చూశారా చదవండి: రెడ్ అలర్ట్.. ముంచుకొస్తున్న తుపాను.. -
కేశవానంద భారతి కన్నుమూత
కాసరగఢ్ (కేరళ): రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడానికి కారణమైన స్వామి కేశవానంద భారతి (79) పరమపదించారు. దాదాపు గత ఐదు దశాబ్దాలుగా కేరళలోని ప్రఖ్యాత ఎదనీరు మఠాధిపతిగా కేశవానంద భారతి శ్రీపాద గల్వరు ఉన్నారు. వృద్ధాప్య సమస్యలతో ఆదివారం తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో ఆయన కన్నుముశారు. కేశవానంద భారతి మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కేశవానంద భారతి మృతి సమాచారం తెలుసుకుని భారీగా తరలివచ్చిన భక్తులు, అభిమానులు ఎదనీరు మఠంలో ఆయన మృతదేహానికి కన్నీటి నివాళులర్పించారు. ‘ఎదనీరు మఠాధిపతి కేశవానంద భారతి తత్వవేత్త. శాస్త్రీయ సంగీతకారుడు. యక్షగాన ప్రక్రియను పునరుత్తేజపరచడంలో విశేష కృషి చేశారు’అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాప సందేశం వెలువరించారు. ‘సమాజ సేవలో పూజ్య కేశవానంద భారతి చేసిన సేవలు స్మరణీయం. పేదలు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఆయన గొప్ప కృషి చేశారు’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మైలురాయి... ఆ తీర్పు కేరళ భూ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా కేశవానంద భారతి వేసిన పిటిషన్‌ను విచారించి... పార్లమెంటుపై రాజ్యాంగ సాధికారతను స్పష్టం చేస్తూ సుమారు 4 దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు మైలురాయి వంటి తీర్పును ప్రకటించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం కుదరదని స్పష్టం చేస్తూ.. ఆ సంచలన తీర్పును 13 సభ్యుల ధర్మాసనం వెలువరించింది. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రకటించిన తీర్పు అదే కావడం విశేషం. ఆ తీర్పుతో రాజ్యాంగ మౌలిక స్వరూప పరిరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుకు దఖలు పడింది. రాజ్యాంగానికి సవరణలు చేసేందుకు పార్లమెంటుకున్న అపరిమిత అధికారానికి కత్తెర వేసిన తీర్పుగా, పార్లమెంటు చేసిన అన్ని సవరణలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టుకు కట్టబెడుతూ ఇచ్చిన తీర్పుగా అది ప్రసిద్ధి గాంచింది. ‘రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించడం కుదరదు అని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది. అందుకే ఈ కేసుకు అంత ప్రాముఖ్యత నెలకొంది’అని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కే చంద్రు పేర్కొన్నారు. భూ సంస్కరణల చట్టాల ఆధారంగా కేరళ ప్రభుత్వం.. ఎదనీరు మఠానికి చెందిన కొంత భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ కేశవానంద భారతి మొదట కేరళ హైకోర్టులో పిటిషన్ వేసి, పాక్షికంగా విజయం సాధించారు. అయితే, 29వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు కేరళ భూ సంస్కరణల చట్టానికి రక్షణ కల్పించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు చేసిన 29వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్‌లో (కోర్టుల న్యాయసమీక్షకు వీలు లేకుండా) చేర్చిన కేరళ తీసుకువచ్చిన రెండు భూ సంస్కరణల చట్టాలకు రాజ్యాంగంలోని 31బీ అధికరణ కింద రక్షణ లభించడాన్ని సమర్థించింది. అయితే, అదే సమయంలో, ‘368 అధికరణ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకున్నప్పటికీ.. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు చేసే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు’అని స్పష్టం చేసింది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో లౌకికత, ప్రజాస్వామ్యం భాగమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పు తదనంతర కాలంలో పలు రాజ్యాంగ సవరణలను కొట్టివేయడానికి ప్రాతిపదికగా నిలిచింది. తాజాగా, ఉన్నత న్యాయస్థానాల్లో న్యా యమూర్తుల నియామకానికి సంబంధించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని, సంబంధిత రాజ్యాంగ సవరణను కొట్టివేయడానికి కూడా ఈ తీర్పే ప్రాతిపదిక. -
పెళ్లికి హాజరైన 43 మందికి కరోనా
తిరువనంతపురం: కరోనా విలయానికి పెళ్లిళ్లు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అన్నట్లుగా ఒకరి నుంచి ఒకరికి వైరస్‌ను అంటించుకుంటూ పచ్చని పందిళ్లను కరోనా హాట్స్పాట్లుగా మార్చేస్తున్నారు. ఎంతటి శుభకార్యమైనా 50 మందికంటే ఎక్కువ మందికి అనుమతి లేదని ప్రభుత్వాలు హెచ్చరించినా కరోనాను లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా వైరస్ బారిన పడుతూ అందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు. కేరళలోని కేసర్‌గాడ్ జిల్లా పిలంకట్టలో జూలై 17న ఓ వివాహ మహోత్సవం 125 మంది అతిథుల సమక్షంలో జరిగింది.(పెళ్లి వేడుకలో పీపీఈ కిట్లతో..) అయితే ఈ మధ్యే వధువు తండ్రికి కరోనా లక్షణాలతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ పెళ్లికి హాజరైనవారందరికీ పరీక్షలు జరపగా 43 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో నూతన వధూవరులు కూడా ఉండటం గమనార్హం. కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది బంధుగణం మధ్య వివాహం జరుపుకున్నందుకు గానూ పోలీసులు పెళ్లికూతురు తండ్రిపై కేసు నమోదు చేశారు. విచారణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు నిరూపణ అయితే వారికి రెండేళ్ల కఠిన జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. (ఆ ఇద్దరు... దయ చూపిన స్త్రీలు) -
కరోనాపై గెలుపు: అపూర్వ వీడ్కోలు
-
కరోనాపై గెలిచి.. సగర్వంగా ఇంటికి..
తిరువనంతపురం: కరోనా మహమ్మారి వ్యాప్తిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధం అమలు చేస్తున్నాయి. కరోనా విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. (ప్రధాని మోదీ ఈసారి ఏం చెబుతారో?) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం శనివారం నాటికి దేశవ్యాప్తంగా 184 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో 42, కేరళలో 41, హరియాణాలో 24, ఉత్తరప్రదేశ్‌లో 19, కర్ణాటక 12, గుజరాత్లో 10 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా సోకి ఇప్పటివరకు 68 మంది మృతి చెందినట్టు తెలిపింది. 2902 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు పేర్కొంది. (ఆ లైట్లు ఆర్పకండి: కేంద్రం క్లారిటీ) కాగా, కేరళలో కోవిడ్ బారిన పడి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఓ యువకుడికి అభినందన పూర్వక వీడ్కోలు లభించింది. కాసర్‌గఢ్‌లో మొట్టమొదటి కరోనా బాధితుడు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి శనివారం డిశ్చార్జి అయ్యాడు. అతడు ఆస్పత్రి నుంచి వెళుతుండగా వైద్య సిబ్బంది, రోగులు కరతాళ ధ్వనులతో ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. వారందరికీ అభివాదం చేస్తూ అతడు ముందుకు సాగాడు. కాగా, కోవిడ్ బారిన పడి కోలుకున్న కేరళలోని పతనంథిట్ట జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు థామస్ అబ్రహాం(93)ను, అతడి భార్య మరియమ్మ(88) శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. (కరోనా గుర్తింపునకు సరికొత్త యాప్) -
దేశంలోనే అరుదైన రైలు.. లెర్నింగ్ ఎక్స్‌ప్రెస్
కాసర్గోడ్: వేసవి సెలవుల అనంతరం తిరిగొచ్చిన విద్యార్థులు.. ‘లెర్నింగ్ ఎక్స్‌ప్రెస్’ను చూసి కేరింతలుకొట్టారు. రైలు బండి ఎక్కినట్లు క్లాస్‌రూమ్‌లోకి వెళ్లడం, ఇంజిన్‌లో కూర్చొని హారన్ మోగించడం(అల్లరి చేయడం) లాంటి కొత్త అనుభూతులు వారిని మరింత ఉత్సాహపర్చాయి. సోమవారం స్కూల్ రీఓపెన్ చేయగానే అక్కడ కనిపించిన దృశ్యాలు, విద్యార్థుల సందడి ఊరంతా పాకింది. తమ పిల్లల్ని రైల్ స్కూల్లోనే చేర్పించడానికి తల్లిదండ్రులు ఎగబడ్డారు. ఫలితంగా అడ్మిషన్లు వరదలా వచ్చాయి. పిల్నల్ని ప్రభుత్వ పాఠశాలల వైపునకు మళ్లించడానికి కారణమైన వినూత్న ఆలోచనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. విద్యార్థుల కోసం ఈ తరహా ‘లెర్నింగ్ ఎక్స్‌ప్రెస్’ను ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి. ఇంతకీ ఎక్కడుందీ స్కూల్? కేరళలోని కాసర్గోడ్ జిల్లా పిలికోడ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల ఇంది. ఏడు, ఆరు తరగతులు మినహాయించి నర్సరీ నుంచి ఐదో తరగతుల వరకు ఆయా క్లాస్ రూమ్‌ల బయట, లోపల అందమైన రంగులువేశారు. దాదాపు 400 మంది పిల్లలు చదువుతోన్న ఈ పాఠశాలకు ఈ ఏడాది ఏకంగా 185 కొత్త అడ్మిషన్లు వచ్చాయి. ఖర్చు ఎవరిది? స్కూల్ ఆవరణను అందంగా పెయింట్ చేసినందుకుగానూ దాదాపు రూ.2 లక్షలు ఖర్చయింది. స్కూళ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులకుతోడు పిలికోడ్ గ్రామస్తులు కొందరు నిధులు సమీకరించారు. సంజీష్ వెంగర అనే పెయింటర్ నెల రోజులు శ్రమించి స్కూల్‌కు కొత్తరూపం ఇచ్చాడిలా.. -
కూలీల 'కూల్' ఐడియా అదుర్స్
ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పట్టణ ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు.. చెట్లు లేవుకాబట్టి! ఇక ఊళ్లలో చెట్లున్నా ఉక్కపోత సమస్య. వడదెబ్బకు గురై చనిపోతున్నవారిలో కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకునేవారి సంఖ్యే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఎండ తీవ్రతను అధిగమించేందుకు కేరళలోని కొందరు కూలీలు అమలుచేసిన ఐడియా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాసరగోడ్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో బావి తవ్వేందుకు ఒప్పందం కుదుర్చుకున్న కూలీలు.. పంకాను ఏర్పాటుచేసుకుని పనికానిస్తున్నారు. భూ ఉపరితలం కంటే లోతుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుందని తెలిసిందే. ఆ వేడిగాలిని బయటికి పంపి, బయటి గాలిని లోపలికి నెట్టే ఫ్యాన్ సాయంతో పనిచేయగలుగుతున్నామని చెబుతున్నారు కూలీలు. హీట్ ను బీట్ చెయ్యడానికి భలే ఐడియా కదా ఇది! మారణహోమం సృష్టిస్తూ ఇప్పటికే దాదాపు 1000 మంది తెలుగువాళ్లను పొట్టన పెట్టుకుంది మాయదారి ఎండ. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రతరం కానుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినాసరే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉపశమన చర్యలు చేపట్టేదిశగా అడుగులు వేయట్లేదు! అటు కర్ణాటకలోనైతే ఏకంగా ఆరెంజ్ అలర్ట్ జారీఅయింది. కేరళ, తమిళనాడులలోనైతే భానుడిప్రతాపానికి తోడు 'ఎన్నికల' రాజకీయవేడీ జనాన్ని అతలాకుతలం చేస్తోంది. -
వెజిటేరియన్ మొసలి ... పరమాన్నమే తింటుంది
అదొక వెజిటేరియన్ మొసలి. అరవై ఏళ్లుగా పరమాన్నమే తింటుంది. అదీ గుడి పూజారులే పెట్టాలి. ఇతరులు పెడితే ముద్ద ముట్టుకోదు. అదీ దేవుడికి నైవేద్యం పెట్టిన తరువాత మాత్రమే ఆహారం తీసుకుంటుంది. కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలోని అనంతపుర చెరువులో ఉన్న అనంతపద్మనాభ స్వామికి మొసలి రక్షకుడు. ఆ చెరువులోనే ఉంటూ స్వామివారికి రక్షణ కల్పిస్తూ ఉంటాడు. ఆ మొసలిని అందరూ బాబియా అని పిలుస్తారు. తమాషా ఏమిటంటే ఈ మొసలి చేపలను కూడా తినదు. ఇంత వరకూ ఎవరికీ అపకారం చేయలేదు. దాంతో అందరూ ఆ మొసలిని దైవాంశ సంభూతురాలిగా భావించి పూజిస్తారు. అసలు తొమ్మిదో శతాబ్దం నాటి ఈ గుడి చెరువులోకి మొసలి ఎలా వచ్చిందో ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే చెరువులో ఒకే మొసలి ఉంటుంది. ఆ మొసలి చనిపోతే ఇంకొక మొసలి వస్తుంది. బిల్వమంగళుడనే భక్తుడు విష్ణువును పూజించేవాడట. అయితే ఆయనను పరీక్షించేందుకు కృష్ణుడు ఒక అల్లరిపిల్లవాడి రూపంలో వచ్చాడట. పిల్లవాడి అల్లరిని భరించలేక బిల్వమంగళుడు ఆ పిల్లవాడి చెవి మెలేసి దూరంగా తోసేశాడట. అప్పుడు ఆ పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు కానీ బిల్వమంగళుడికి తనను అల్లరిపెట్టింది కృష్ణుడేనని అర్థం కాలేదు. కృష్ణుడు ఒక గుహలో అంతర్ధానం అయిపోయాడు. ఆ గుహకు మొసలి కాపలాగా ఉంటుంది. మొదట్లో దేవుడి విగ్రహాన్ని 70 కి పైగా వనమూలికలతో తయారు చేసేవారు. ఇప్పుడు పంచలోహ విగ్రహం ఏర్పాటు చేశారు. మళ్లీ వనమూలికల విగ్రహాన్ని తయారు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
కాసర్ గోడ్ - ఓ మంచి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాంటి నియోజకవర్గం
కాసర్ గోడ్... కేరళ ఉత్తరాగ్రాన ఉన్న జిల్లా. ఇది అటు కొంకణ తీరానికి, ఇటు కర్నాటకకి దగ్గర్లో ఉండే కేరళ జిల్లా. అందుకే కాసింత కర్నాటకను, కొంచెం కేరళను కలిపి గోవాలో వేసి వేయిస్తే కాసర్గోడ్ జిల్లా తయారవుతుంది. మొత్తం మీద మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాంటిది కాసర్గోడ్. మిగతా చోట రాజకీయ నాయకుడు కావాలంటే ఆకర్షణీయ వ్యక్తిత్వం, నేతృత్వ లక్షణాలు, ప్రజాసేవా భావం, ఆర్ధిక దన్ను వంటి క్వాలిటీలు కావాలి. కాసర్గోడ్లో వీటితో పాటు ఇంకో క్వాలిటీ ఉండి తీరాలి. అప్పుడే రాజకీయులు రాణించగలరు. ఇంతకీ ఆ క్వాలిటీ ఏమిటనే కదా ప్రశ్న! కాసర్గోడ్ జిల్లాలో రాజకీయంగా రాణించాలంటే బోలెడన్ని భాషలు తెలిసుండాలి. ఆ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి ఉండాలి. కాసర్గోడ్ జనాభాలో కనీసం 35 శాతం మంది కన్నడ మాట్లాడతారు. మలయాళ భాషీయులూ చాలా మంది ఉంటారు. ఇవే కాక తుళు, కొంకణి, మరాఠీ, ఉర్దూ భాషలు మాట్లాడేవారుంటారు. వీటితో పాటు బ్యారీ అనే భాష కూడా వచ్చి ఉండాలి. బ్యారీ అంటే కాస్త అరబిక్, కాస్త మలయాళం, కాస్త కన్నడ కలిపి ముస్లింలు మాట్లాడే భాష.. నాయకుడికి ఈ భాషలన్నీ వచ్చి ఉండాలి. లేదా ఆయా భాషలు మాట్లాడగలిగే దుబాసీలు వెంట ఉంచుకోవాలి. ఇక్కడ ఇలాంటి బహుభాషా ప్రవీణ/లకు భలే డిమాండ్ ఉంటుంది. పోస్టర్లు కూడా పలు భాషల్లో తయారు చేయించక తప్పదు. ఎందుకంటే ఒక వీధి లో తుళు భాషీయులు ఉంటే, పొరుగువీధిలో కొంకణీలు ఉంటారు. ఆ పక్క సందు తిరిగితే కన్నడ బాష వినిపిస్తుంది. మరో సందు మలుపు తిరిగితే చాలు మలయాళీ వినిపిస్తుంది. కొన్ని వీధుల్లో ఉర్దూ వినిపిస్తే, మరికొన్ని చోట్ల బ్యారీ వినిపిస్తుంది. అసలు కాసర్గోడ్ జిల్లాలో చాలా మందికి చాలా భాషలు వచ్చు. అందుకే కాసర్గోడ్ లో కంటెస్ట్ చేయడం అంటే కఠిన పరీక్ష లాంటిదే! ముఖ్యంగా మంజేశ్వరం, మీంచా, మంగళ్ వాడీ, కుంబాలా, పుదిగే, కుంబాడజే, కరాదుక్క, ఎన్మాకజే, మదియాదుక్క, బెల్లూరు వంటి గ్రామ పంచాయతీల్లో 'జిహ్వకోభాష, వీధికో కల్చర్' విలసిల్లుతూ ఉంటుంది. అన్నిటికన్నా స్పెషల్ విషయం ఏమిటంటే ఈ పలు భాషలు, పలు సంస్కృతుల మధ్య సంఘర్షణ ఉండదు. రాజకీయులు సైతం ఇప్పటి వరకూ 'విభజించి పాలించే' విధానాన్ని అమలు చేయలేదు. ఏ కూరకు ఆ కూర వేరు చేస్తే ఎవరికీ సరిపోదు. అన్ని కూరల్నీ కలిపి మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ చేస్తే తప్ప ఉపయోగం ఉండదు. అందుకే కాసర్ గోడ్ రాజకీయులు కూడా 'విభజించు- పాలించు' కంటే 'కలిపి ఉంచు - పాలించు' విధానమే మంచిదని భావిస్తారు. అదీ కాసర్గోడ్ అసలు ప్రత్యేకత!!