చిత్రలేఖనం అందరికీ తెలుసు. లీజా దినూప్ చేసేది నృత్య లేఖనం. శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్ చేసి నృత్యకళను, చిత్రకళను వేదిక మీద సంగమకళగా ప్రదర్శిస్తోందామె. ఇలా చేస్తున్న ఒకే కళాకారిణి లీజా. అందుకే ఆమె పేరు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ ‘చిత్రనర్తకి’ పరిచయం.
తెలుగు వారి విశిష్ట సంప్రదాయ నృత్యం ‘కూచిపూడి’లో ‘తాళ చిత్ర నృత్యం’ అనే విభాగం ఉంది. అందులో చిత్రకారిణి నృత్యం చేస్తూ పాదాల కదలికతో బట్ట మీద పరిచిన రంగును చెదరగొడుతూ నర్తనం ద్వారా ఒక బొమ్మను గీస్తుంది. ఎంతో సాధన ఉంటే తప్ప ఈ విద్య సాధ్యం కాదు. ఇదే కూచిపూడిలో ‘సింహనందిని’ అనే నృత్యవిభాగం దుర్గపూజ సమయంలో నర్తకీమణులు ప్రదర్శిస్తారు. ఈ నృత్యంలో రంగు పరిచిన బట్ట మీద నర్తిస్తూ పాదాలతో సింహం బొమ్మ గీస్తారు. ఇది దుర్గాదేవిని ఆరాధించే ఒక పద్ధతిగా వ్యాఖ్యానిస్తారు. భారతీయ నృత్యకళల్లో వేరే నృత్యాలకు లేని విశిష్టత ఈ విధంగా కూచిపూడికి ఉంది.
అయితే కేరళలోని కాసర్‌గోడ్ టౌన్‌కు సమీపంలో ఉండే పయ్యూర్ అనే ఊరికి చెందిన 30 ఏళ్ల లీజా దినూప్ భరతనాట్యం చేస్తూ వేదిక మీద సిద్ధంగా ఉంచిన కేన్వాస్ మీద దేవతల బొమ్మలను గీస్తూ నృత్య చిత్రాల సంగమ కళను ప్రదర్శిస్తూ గుర్తింపు పొందుతోంది. కన్నూర్ యూనివర్సిటీలో ఎం.ఏ భరతనాట్యం చేసిన లీజా ఆ తర్వాత తిరువనంతపురంలో బేచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసింది. ఆమె నృత్యం చేయగలదు... చిత్రకళను ప్రదర్శించగలదు. ఈ రెంటిని కలిపి తానొక ‘చిత్రనర్తకి’ని ఎందుకు కాకూడదు అనిపించింది. వెంటనే ఆమె ఆ కళను సాధన చేసింది.
‘రామాయణ గాధలను, శివ ఆరాధనను, రవివర్మ గీసిన చిత్రాలను కేన్వాస్ మీద పునఃప్రతిష్టిస్తూ నేను భరతనాట్యం చేస్తాను’ అని లీజా దినూప్ అంటుంది. వివాహం అయ్యి మూడేళ్ల పాప ఉన్న లీజా కేరళలో రాష్ట్ర, జాతీయ సాంస్కృతిక కార్యక్రమం ఏది జరిగినా ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది. ఇప్పటికి ఆమె రాష్ట్రమంతా దాదాపుగా 50 చిత్రనర్తన ప్రదర్శనలు ఇచ్చింది. అంతే కాదు ఇలా చేసే ఏకైక చిత్రకారిణి కనుక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కింది. వేదిక మీద సంగీత బృందం రాగతాళాలు కొనసాగిస్తుండగా నృత్యం చేస్తూ మధ్య మధ్య కేన్వాస్ దగ్గరకు వస్తూ కుంచెతో ఆమె ఆ నృత్యంలో ఉన్న ఆధ్యాత్మిక, భక్తిభావాలకు తగిన బొమ్మను గీస్తుంది. ముఖ్యంగా రామాయణంలోని నవరసచిత్రాలను, గణేశ భక్తిని, స్త్రీ శక్తి రూపాన్ని ఆమె కేన్వాస్ మీద రంగుల్లో నాట్యం ద్వారా దేహంలో ప్రదర్శించి మెప్పు పొందుతోంది.
‘కళాత్మిక లలితకళాగృహం’ పేరుతో ఒక నటనాలయాన్ని ప్రారంభించి చిన్నారులకు శిక్షణ ఇస్తున్న లీజా నుంచి చిత్రనృత్యాన్ని అభ్యసించే కొత్తతరం తయారవుతోంది. భవిష్యత్తులో ఈ ప్రయోగం మరింత ముందుకు వెళ్లొచ్చని ఆశిద్దాం.
శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్
Published Thu, Sep 9 2021 1:15 AM | Last Updated on Thu, Sep 9 2021 8:34 AM
Comments
Please login to add a commentAdd a comment