Book of Records
-
40 రోజుల చిన్నారికి ఆధార్
నస్పూర్: దేశంలోనే ఆధార్‌కార్డు కలిగిన పిన్న వయసు్కరాలిగా మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన ఐజల్ ఫాతిమా రికార్డు సృష్టించింది. నస్పూర్ కాలనీలో నివసించే సింగరేణి ఉద్యోగి మహ్మద్ అఫ్జల్ పాషా, సమీరా తబస్సుమ్ దంపతులకు.. ఈ ఏడాది జనవరి 12న ఐజల్ ఫాతిమా జన్మించింది. చిన్నారికి ఫిబ్రవరి 21న ఆధార్ కార్డు మంజూరైంది. దేశంలో జన్మించిన 40 రోజులకే ఆధార్‌కార్డు పొందిన తొలి వ్యక్తిగా ఐజల్ ఫాతిమా గుర్తింపు పొందినట్లు.. మహ్మద్ అఫ్జల్ పాషా తెలిపారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తమ కుమార్తె చోటు సాధించినట్లు ఆ సంస్థ నిర్వాహకులు సోమవారం తెలియజేశారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఇదే రికార్డు.. పుట్టిన 43 రోజులకు ఆధార్ కార్డు పొందిన నిజామాబాద్ జిల్లా వాసి ఆద్య పేరిట నమోదైందన్నారు. -
స్కూలుకు వెళ్లకుండానే.. 'ఇండియా బుక్ ఆఫ్ అవార్డ్స్' లో చైత్ర!
నిజామాబాద్: మూడేళ్ల ఆ చిచ్చర పిడుగు స్కూలుకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉంటూ విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించి అరుదైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అచీవర్ అవార్డును సాధించింది. నగరంలోని గాయత్రీనగర్‌కు చెందిన బాస చైత్ర 17 జాతీయపండుగలు, 12 జాతీయ గుర్తులు, 13 అంతరిక్ష వస్తువులు, 26 శరీర భాగాలు, 26 రకాల జంతువులు, 22 రకాల కూరగాయలు, 21 పండ్లు, 13 రంగులు, 8 రకాల ఆకారాలు (ట్రైయాంగిల్, స్క్వేర్, సర్కిల్ లాంటివి) గుర్తుపట్టడంతో పాటు 26 అల్ఫాబెట్స్కి సంబంధించిన వస్తువుల పేర్లను, 11 ఇంగ్లిష్ రైమ్స్‌ని ధారాళంగా తడబడకుండా చెప్పేస్తుంది. ఈ పాప ప్రతిభను గుర్తించిన ఐబీఆర్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో చైత్ర ధారాళంగా చెప్పిన వాటిని ఆమె ప్రతిభా పాటవాలను ప్రత్యక్షంగా చూసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంస్థ వారు అచీవర్ అవార్డును ప్రదానం చేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంస్థ అనేది ఇండియాలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న అత్యుత్తమ వ్యక్తుల ప్రతిభని, ఒక సంస్థ సాధించిన ప్రగతిని భద్రపరచి భావితరాలకు స్ఫూర్తిని అందించే సంస్థ. దీనిలో భాగంగా రాష్ట్రంలోని నగరానికి చెందిన గాయత్రీనగర్‌కు చెందిన బాస చైత్ర ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించడంపై పలువురు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అచీవర్ అవార్డును అందుకోవడం అభినందనీయమంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చైత్రకు ఐబీఆర్లో స్థానం దక్కడంతో ఆమె తల్లిదండ్రులైన బ్యాంక్ ఉద్యోగిని అన్నపూర్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుశీల్ కుమార్‌లు హర్షం వ్యక్తం చేశారు. తమ పాప ఇప్పటి వరకు స్కూల్‌కు కూడా వెళ్లలేదని, ఇంట్లోనే ఉంటూ విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించి అచీవర్ అవార్డును కైవసం చేసుకుందన్నారు. ఇవి చదవండి: ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం! -
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డాక్టర్ రెడ్డీస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా రక్తపోటుపై అవగాహన కార్యక్రమాలతో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 30,813 మంది వైద్యులు పంపిన సందేశాలను ఆకులుగా అలంకరించి అతి పెద్ద హృదయాకృతిని రూపొందించినందుకు గాను ఈ ఘనత దక్కించుకుంది. దాదాపు 200 కిలోల బరువున్న ఈ ఇన్‌స్టాలేషన్‌ను హైదరాబాద్ బాచుపల్లిలోని కంపెనీ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. -
Prachi Dhabal Deb: ఆ కేకుల కోసం క్యూ కడతారు
బొమ్మలేసే ఆర్టిస్టు గురించి విన్నాం. కేక్ ఆర్టిస్ట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రాచీ ధబల్ను మన దేశంలో బేకింగ్ క్వీన్‌గా, గొప్ప కేక్ ఆర్టిస్ట్‌గా పిలుస్తారు. కేక్‌లను కళాత్మకంగా సౌందర్యాత్మకంగా చేసి తినడానికే కాదు చూడటానికి కూడా రుచికరంగా తయారు చేసి అంతర్జాతీయ అవార్డులు పొందుతోందామె. ఈ ఫొటోలు చూడండి. అన్నీ తినే కేకులే. ‘మీరూ ఇలా కొత్తగా ట్రై చేసి సక్సెస్ సాధించండి’ అంటోంది ప్రాచీ. ప్రపంచ ప్రఖ్యాత కేక్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? యూకేకు చెందిన ఎడ్డీ స్పెన్స్. కళాత్మకమైన కేకుల తయారీలో ఆయన ప్రతిభకు అక్కడి ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో గౌరవించింది. ‘నేను లండన్ వెళ్లి ఆయన దగ్గర పని నేర్చుకున్నాను. నాకు కేక్ ఆర్ట్ అంటే అంత పిచ్చి’ అంటుంది ప్రాచీ ధబల్. 36 ఏళ్ల ప్రాచీ గత సంవత్సరం 100 కిలోల కేక్‌ను తయారు చేసింది. ఇది ఇటలీలో ప్రసిద్ధమైన మిలాన్ కేథడ్రల్ (చర్చ్)కు రెప్లికా. ఆరున్నర అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ చర్చ్ ఆకారపు కేక్‌లో దాదాపు 1500 సున్నితమైన భాగాలు ఉన్నాయి. వాటన్నింటినీ రాయల్ ఐసింగ్ (తెల్ల సొన, చక్కెర పొడుల మిశ్రమం)తో తయారు చేసి ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2022’లో ఎక్కింది ప్రాచీ. అందుకే ఆమెను ‘బేకింగ్ క్వీన్ ఆఫ్ ఇండియా’ అంటుంటారు. చిన్నప్పటి నుంచి ప్రాచీ ధబల్ సొంత ఊరు డెహరాడూన్. అక్కడే పుట్టి పెరిగింది. ‘నాకు పదేళ్లున్నప్పుడు వేసవి సెలవుల్లో కేకుల తయారీని మా అమ్మ నాకు కాలక్షేపంగా నేర్పింది. నేను కప్‌కేక్‌లు తయారు చేసేదాన్ని. రోజులు పెరిగే కొద్దీ ఆ ఆసక్తి కూడా పెరిగింది. నాకు బొమ్మలు వేయడం కూడా వచ్చు. కథల పుస్తకాలు బాగా చదివేదాన్ని. నా పుట్టిన రోజున బయట కేక్ ఆర్డర్ ఇస్తున్నప్పుడు నేను చదివిన కథల్లోని కోటల్లాంటి, రాకుమార్తెల్లాంటి, ఉద్యానవనాల్లాంటి కేక్‌లు తెప్పించమని మా అమ్మను పోరేదాన్ని. కాని అలాంటి కేకులు ఎవరూ తయారు చేయరు. మార్కెట్లో మామూలు కేకులు ఉండేవి. నాకు అలాంటివి ఎందుకు తయారు చేయకూడదు అనిపించేది’ అంది ప్రాచీ ధబల్. ఉద్యోగం నచ్చలేదు ప్రాచీ కోల్‌కతాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పూణెలో ఉద్యోగానికి వచ్చి స్థిరపడింది. కాని ఆమెకు ఆ ఉద్యోగం నచ్చలేదు. ‘2012 నాటికి నాకు ఉద్యోగం బోర్ కొట్టింది. అందులో నాకు ఇష్టమైనదేదో లేదు. నాకు కేక్ ఆర్టిస్ట్‌గా మారాలనిపించింది. కాని ఆ రోజుల్లో ఆ కళకు పెద్దగా గిరాకీ లేదు. ఎవరికీ అలాంటిది ఒకటి ఉంటుందని తెలియదు. కళాత్మక కేకులు తయారు చేయాలంటే కావలసిన మెటీరియల్ మన దేశంలో దొరికేది కాదు. అయినా సరే తెగించి విదేశాల నుంచి కావలసిన సామాగ్రి తెప్పించుకుంటూ రంగంలో దిగాను. నేను తయారు చేసేది షాపులో అమ్మే కేకులు కాదు. కస్టమైజ్డ్ కేకులు. అందువల్ల వీటి ఖరీదు కూడా ఎక్కువ. అలాంటి కస్టమర్లు పెరిగే వరకూ నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. కాని నా ప్రత్యేకమైన కేకులు నలుగురి దృష్టిలో పడ్డాక ఇప్పుడు ఊపిరి సలపడానికి కూడా టైమ్ లేదు’ అని నవ్వుతుంది ప్రాచీ. దేశీయత ప్రాచీ తయారు చేసే కేకులు దేశీయతతో నిండి ఉంటాయి. చీరల మీద డిజైన్లు, ఆర్కిటెక్చర్, సంప్రదాయ చిహ్నాలు అన్నీ ఆమె కేకుల్లో కనిపిస్తాయి. ఇటీవల ఆమె బెనారస్ చీరను, ఆభరణాలను పోలిన కేక్‌ను తయారు చేసింది. ‘కుంకుమ భరిణె’ లా కనిపిస్తున్న ఆ కేక్ ఎన్నో ప్రశంసలు పొందింది. ఆమె తయారు చేసిన నెమలి కేక్‌లో పైకి ఆభరణాలుగా కనిపించేవి కూడా తినదగ్గ మెటీరియల్‌తో తయారు చేసినవే. అయితే ఈ కళను ప్రాచీ తన దగ్గరే దాచుకోవడం లేదు. యువ బేకర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసి నేర్పుతోంది. ‘అమ్మాయిలు ముందు తమకు ఇష్టమైన రంగంలో కనీస డిగ్రీ సంపాదించాలి. ఆ తర్వాత ఆ ఇష్టం కోసం కష్టపడాలి. తప్పకుండా విజయం లభిస్తుంది. కష్టపడకుండా ఏదీ రాదు’ అంటుంది ప్రాచీ. పాత దారిలో కొత్తగా నడవడమే విజయం అని ప్రాచీ విజయం తెలుపుతోంది. -
రెండ్రోజుల్లో ఫంక్షన్.. మూడు రోజుల్లో పెళ్లి.. సుధా రవికి చెప్పారా? ఆమె ఎవరు?
స్కూల్లో ఇంకో రెండు రోజుల్లో ఫంక్షన్ జరగబోతోంది... ‘సుధా రవికి చెప్పారా?’ అనే ప్రశ్న చెవులకు వినిపిస్తుంది. మూడురోజుల్లో పెళ్లి జరగబోతుంది... ‘సుధా రవికి తెలియజేశారా’ అనే ప్రశ్న ఎదురు వస్తుంది. ఇంతకీ ఎవరీ సుధా రవి? ఒక్కమాటలో చెప్పాలంటే ‘రంగోలి స్పెషలిస్ట్’ ఎవరి రంగోలి ద్వారా శుభకార్యాల వేదికలకు కొత్తకళ వస్తుందో...ఆమె పేరే సుధా రవి. తాజాగా కూతురు రక్షితతో కలిసి రూపొందించిన రంగోలితో ‘సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎంటర్ అయిందామె... సుధా రవి తన కూతురు రక్షితతో కలిసి 26,000 ఐస్‌క్రీమ్ పుల్లలను ఉపయోగించి రూపొందించిన రంగోలి ఆర్ట్ వర్క్ ‘సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎంటర్ అయింది. సింగపూర్‌లోని లిటిల్ ఇండియా షాప్‌కీపర్స్ అండ్ హెరిటేజ్ అసోసియేషన్(లిషా) ఆధ్వర్యంలో జరిగిన పొంగల్ వేడుకల్లో భాగంగా ఈ సిక్స్ బై సిక్స్ మీటర్ ఆర్ట్‌వర్క్‌కు శ్రీకారం చుట్టింది సుధా రవి. మూమూలుగానైతే బియ్యంగింజలు, సుద్దముక్కలు... మొదలైనవి ఉపయోగించి రంగోలి వేసే సుధా ఈసారి మాత్రం ఐస్‌క్రీమ్ స్టిక్స్‌ను మాత్రమే ఉపయోగించింది. ఈ రంగోలిలో తమిళ కవులు తిరువళ్లువర్, అవ్వైయార్, భారతీయార్ చిత్రాలు ఆకట్టుకుంటాయి. ఆశ్చర్యంగొలిపే అందమైన ఆర్ట్‌వర్క్‌లను రూపొందించడం రవికి కొత్తేమీ కాదు. 2016లో 3,200 చదరపు అడుగుల రంగోలీని రూపొందించి రికార్డ్ సృష్టించింది. ‘సింగపూర్‌లో తమిళ సంప్రదాయాలు, కళలను ముందుకు తీసుకువెళ్లడానికి, ఈతరానికి చేరువ చేయడానికి సుధా రవి పనిచేస్తున్నారు’ అంటున్నారు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న సుధా రవి ‘రంగోలి స్పెషలిస్ట్’గా పేరు తెచ్చుకుంది. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రంగోలి కళకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించడానికి తనవంతుగా ప్రయత్నిస్తోంది. ‘అందరు పిల్లల్లాగే నాకు చిన్నప్పటి నుంచి రంగులు అంటే చాలా ఇష్టం. వాటిని చూస్తే చాలు ఎంతో సంతోషం కలిగేది. ఆ సంతోషమే నన్ను రంగోలి కళ వైపు నడిపించింది. రకరకాల ప్రయోగాలు చేసేలా చేసింది. ఎమోషన్స్ విత్ కలర్స్ కాన్సెప్ట్‌తో కూడా రంగోలి రూపొందించాను. సింగపూర్‌లో దశాబ్ద కాలంగా ఉంటున్నాము. మా జీవితంలో రంగోలి భాగం అయింది. నాలాగే నా కూతురు రక్షితకు రంగోలిపై ఆసక్తి ఉండడం సంతోషకరమైన విషయం’ అంటుంది సుధా రవి. భూమిని ప్రేమగా ముద్దాడే రంగోలిని కాన్వాస్‌పైకి కూడా తీసుకువచ్చి కనువిందు చేయడంలో ఆమె విజయం సాధించింది. చదవండి: భార్య భర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండాలి? హ్యాపీ జర్నీ -
క్యాథడ్రెల్ కేక్!.. ఆ కుటుంబం ఏది చేసినా రిచ్‌గా ఉంటుంది
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి అందమైన భవనం పక్కన కూర్చుని ఫొటో తీసుకుంది. మనం కూడా ఒక ఫొటో తీసుకుంటే భలే ఉంటుంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అది నిజమైన భవనం కాదు. అక్షరాల వంద కేజీల కూల్ కేక్. అవునా! అనుకుంటున్నారా? మీరు చదివింది కరెక్టే. చూడగానే నోట్లో నీళ్లూరించే కేక్ డెకరేషన్లతో కేక్ ఆర్టిస్ట్‌లు తెగ ఆకట్టుకుంటుంటారు. కేక్ ఆకృతిని చూసి ధరకూడా చూడకుండా కొనేస్తుంటారు కొందరు. కానీ ఈ కేకు వాటన్నింటిలోకి చాలా భిన్నమైనది. అచ్చం ఇలాంటి కేకులు రూపొందించే ఆర్టిస్టే పూనేకు చెందిన ప్రాచీ ధబాల్ దేబ్. వినూత్న ఆలోచనతో ఏకంగా లండన్ వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్డు గుర్తింపును తెచ్చుకుంది. బ్రిటన్ రాయల్ కుటుంబం ఏది చేసినా ఎంతో రిచ్‌గా ఉంటుంది. వారు నివసించే భవనాల నుంచి ధరించే దుస్తుల వరకు అంతా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇలా ఎంతో ప్రత్యేకమైన బ్రిటన్‌కు చెందిన ఓ పురాతన చర్చ్‌ను వీగన్ కేక్‌తో రూపొందించింది ప్రాచి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేక్ ఐకాన్ ఎడ్డీస్పెన్స్ మార్గదర్శకత్వంలో రాయల్ ఐసింగ్ కళను నేర్చుకుని 1500ల కేకు ముక్కలతో మిలాన్ క్యాథడ్రెల్ చర్చ్‌ను నిర్మించింది. గుడ్లను వాడకుండా వీగన్ పదార్థాలతో కేకు ముక్కలను డిజైన్ చేసింది ప్రాచీ. ముక్కలన్నింటిని కలిపి చర్చ్రూపం తీసుకురావడానికి ప్రాచీకి నెలరోజులు పట్టింది. ఆరడుగుల నాలుగు అంగుళాల పొడవైన నిర్మాణమే ఈ రాయల్ ఐసింగ్ కేక్. నాలుగు అడుగుల ఎత్తు, మూడడుగుల పది అంగుళాల వెడల్పుతో తయారు చేసిన ఈ కేకు బరువు వందకేజీలపైనే. ఎంతో సంక్లిష్టమైన నిర్మాణాలను కేక్‌లుగా రూపొందించడంలో ప్రాచీకి నైపుణ్యం ఉండడంతో.. గతేడాది ఫెమినా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటుదక్కించుకుంది. -
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో బాలయ్య
-
అతి చిన్న రాతిపై 'క్షీరసాగర మథనం'
తెనాలి: పేదింట జన్మించి, సంక్షేమ వసతి గృహంలో ఉంటూ డిగ్రీ చదువుకుంటున్న హర్షిత..చిత్రలేఖనంలో తన సృజనతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. గుంటూరు జిల్లా అంగలకుదురులోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతిగృహంలో ఉంటూ తెనాలిలో జేఎంజే మహిళా కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్న హర్షిత దావులూరి 4.6 సెంటీమీటర్ల ఎత్తు, 5 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన అతి చిన్న రాతిపై పురాణాల్లోని అతి పెద్ద వృత్తాంతమైన క్షీరసాగర మథనాన్ని 15 నిమిషాల్లో చిత్రీకరించింది. ఆ వీడియోను కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ షైనీ తదితరులు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపారు. దీంతో రికార్డ్ హోల్డర్‌గా గుర్తిస్తూ ‘సెల్యూట్ ది టాలెంట్’ అంటూ ఆ సంస్థ రికార్డు పతకాన్ని, సర్టిఫికెట్‌ను హర్షితకు ఇటీవల పంపింది. హర్షిత సొంతూరు క్రాప. తల్లిదండ్రులు హేమలత, నాగయ్య వ్యవసాయ కూలీలు. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనేది తన లక్ష్యమని హర్షిత తెలిపింది. రికార్డు పతకం, ధృవీకరణ పత్రాలతో హర్షిత దావులూరి -
శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్
చిత్రలేఖనం అందరికీ తెలుసు. లీజా దినూప్ చేసేది నృత్య లేఖనం. శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్ చేసి నృత్యకళను, చిత్రకళను వేదిక మీద సంగమకళగా ప్రదర్శిస్తోందామె. ఇలా చేస్తున్న ఒకే కళాకారిణి లీజా. అందుకే ఆమె పేరు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ ‘చిత్రనర్తకి’ పరిచయం. తెలుగు వారి విశిష్ట సంప్రదాయ నృత్యం ‘కూచిపూడి’లో ‘తాళ చిత్ర నృత్యం’ అనే విభాగం ఉంది. అందులో చిత్రకారిణి నృత్యం చేస్తూ పాదాల కదలికతో బట్ట మీద పరిచిన రంగును చెదరగొడుతూ నర్తనం ద్వారా ఒక బొమ్మను గీస్తుంది. ఎంతో సాధన ఉంటే తప్ప ఈ విద్య సాధ్యం కాదు. ఇదే కూచిపూడిలో ‘సింహనందిని’ అనే నృత్యవిభాగం దుర్గపూజ సమయంలో నర్తకీమణులు ప్రదర్శిస్తారు. ఈ నృత్యంలో రంగు పరిచిన బట్ట మీద నర్తిస్తూ పాదాలతో సింహం బొమ్మ గీస్తారు. ఇది దుర్గాదేవిని ఆరాధించే ఒక పద్ధతిగా వ్యాఖ్యానిస్తారు. భారతీయ నృత్యకళల్లో వేరే నృత్యాలకు లేని విశిష్టత ఈ విధంగా కూచిపూడికి ఉంది. అయితే కేరళలోని కాసర్గోడ్ టౌన్‌కు సమీపంలో ఉండే పయ్యూర్ అనే ఊరికి చెందిన 30 ఏళ్ల లీజా దినూప్ భరతనాట్యం చేస్తూ వేదిక మీద సిద్ధంగా ఉంచిన కేన్వాస్ మీద దేవతల బొమ్మలను గీస్తూ నృత్య చిత్రాల సంగమ కళను ప్రదర్శిస్తూ గుర్తింపు పొందుతోంది. కన్నూర్ యూనివర్సిటీలో ఎం.ఏ భరతనాట్యం చేసిన లీజా ఆ తర్వాత తిరువనంతపురంలో బేచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసింది. ఆమె నృత్యం చేయగలదు... చిత్రకళను ప్రదర్శించగలదు. ఈ రెంటిని కలిపి తానొక ‘చిత్రనర్తకి’ని ఎందుకు కాకూడదు అనిపించింది. వెంటనే ఆమె ఆ కళను సాధన చేసింది. ‘రామాయణ గాధలను, శివ ఆరాధనను, రవివర్మ గీసిన చిత్రాలను కేన్వాస్ మీద పునఃప్రతిష్టిస్తూ నేను భరతనాట్యం చేస్తాను’ అని లీజా దినూప్ అంటుంది. వివాహం అయ్యి మూడేళ్ల పాప ఉన్న లీజా కేరళలో రాష్ట్ర, జాతీయ సాంస్కృతిక కార్యక్రమం ఏది జరిగినా ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది. ఇప్పటికి ఆమె రాష్ట్రమంతా దాదాపుగా 50 చిత్రనర్తన ప్రదర్శనలు ఇచ్చింది. అంతే కాదు ఇలా చేసే ఏకైక చిత్రకారిణి కనుక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కింది. వేదిక మీద సంగీత బృందం రాగతాళాలు కొనసాగిస్తుండగా నృత్యం చేస్తూ మధ్య మధ్య కేన్వాస్ దగ్గరకు వస్తూ కుంచెతో ఆమె ఆ నృత్యంలో ఉన్న ఆధ్యాత్మిక, భక్తిభావాలకు తగిన బొమ్మను గీస్తుంది. ముఖ్యంగా రామాయణంలోని నవరసచిత్రాలను, గణేశ భక్తిని, స్త్రీ శక్తి రూపాన్ని ఆమె కేన్వాస్ మీద రంగుల్లో నాట్యం ద్వారా దేహంలో ప్రదర్శించి మెప్పు పొందుతోంది. ‘కళాత్మిక లలితకళాగృహం’ పేరుతో ఒక నటనాలయాన్ని ప్రారంభించి చిన్నారులకు శిక్షణ ఇస్తున్న లీజా నుంచి చిత్రనృత్యాన్ని అభ్యసించే కొత్తతరం తయారవుతోంది. భవిష్యత్తులో ఈ ప్రయోగం మరింత ముందుకు వెళ్లొచ్చని ఆశిద్దాం. -
ఆరేళ్ల ఆర్నా ప్రపంచ రికార్డు.. విమానం తోక చూసి..
చిన్నారులకు పదేపదే చెబితేగానీ ఎ.బి.సి.డిలు గుర్తుండవు. అటువంటిది ఆరేళ్ల ఆర్నా గుప్తా విమానం తోక చూసి అది ఏ దేశానికి చెందినదో ఇట్టే చెప్పేస్తుంది. నిమిషంలో 93 దేశాలకు చెందిన విమానాలను గుర్తించి ‘అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. హర్యాణాలోని పంచకులకు చెందిన ఆర్నా ఏదైనా ఒక్కసారి చూసినా, విన్నా వెంటనే తన మెదడు లో నిక్షిప్తం చేసుకుంటుంది. వాటి గురించి ఎప్పుడు అడిగినా టక్కున చెప్పేస్తుంది. రెండేళ్ల వయసునుంచే ఆర్నా చెప్పిన ప్రతివిషయాన్ని ఆపోశన పట్టేస్తుంది. ఇది గమనించిన ఆర్నా తల్లి నేహా గుప్తా.. ఆర్నాను ప్రోత్సహించారు. దీంతో ఈ రోజు ఆర్నా ప్రపంచ రికార్డును సాధించింది. గతేడాది ఆగస్టులో 120 మంది ప్రముఖుల పేర్లను 92 సెకన్లలో చెప్పి రికార్డు సృష్టించింది. -
హాబీగా ఎంచుకున్న కళతో ఇప్పుడు రికార్డులు
తనను తాను అంకితం చేసుకున్నప్పుడే ఎంచుకున్న పని అయినా, అభిరుచి అయినా విజయవంతం అవుతుంది. కీర్తిని కట్టబెడుతుంది. అందుకు ఉదాహరణ 40 ఏళ్ల జిస్నా నాగిరిషా. ప్రపంచంలోని ఏడు అద్భుత కట్టడాల నమూనాలను గాజు బాటిళ్లపైన చిత్రించిన జిస్నా నాగిరిషాకు ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో ప్రవేశం లభించింది. జిస్నాకు పెయింటింగ్ అంటే చాలా మక్కువ. చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ చేస్తూ ఉండేది. ఆరేళ్ల క్రితం బాటిల్ ఆర్ట్ నేర్చుకుంది. అలా చిత్రించిన బాటిల్ ఆర్ట్‌ను ఆప్తులకు కానుకలుగా ఇచ్చేది. కేరళ రాష్ట్రం కొచ్చిలో ఉంటున్న జిస్నా హాబీగా ఎంచుకున్న కళ ఇప్పుడు ఆమెకు రికార్డులు తెచ్చిపెడుతోంది. ‘ఆరేళ్లుగా బాటిల్ ఆర్ట్ చేస్తున్నాను. రెండేళ్ల క్రితం దీంట్లో ఏదో ప్రత్యేకత సాధించడమెలా అని ఆలోచించాను. అప్పుడే న్యూ సెవన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అనే ఆలోచన వచ్చింది’ అని ఈ సందర్భంగా అనందంగా చెబుతారు జిస్నా. ఆమె దీని గురించి మరింతగా వివరిస్తూ ‘స్మారక చిహ్నాల ఫొటోలను ఒక్కోటి పరిశీలిస్తూ చాలా ఆశ్చర్యపోయాను వాటి అందానికి. వాటిని యధాతథంగా సీసాలపై నిలపాలనుకున్నాను’ అని తన అభిరుచి గురించి తెలిపారు. అనుకున్నట్టుగానే రెండేళ్లలో ప్రపంచ అద్బుత కట్టడాలను బాటిళ్లపై చిత్రించి, ఇండియా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. జిస్నా బాటిల్ ఆర్ట్ గిఫ్ట్ ఐటమ్స్గానూ చేస్తుంది. డిజైన్ బట్టి ఒక్కో బాటిల్ గిఫ్ట్ ఐటమ్ రూ.1000 నుండి అమ్ముడవుతున్నాయి. ఏషియన్ రికార్డ్ నుంచి ప్రపంచ రికార్డ్ సాధించాలనే తపనలో ఉంది జిస్నా. -
బుక్ ఆఫ్ రికార్డుకు ‘నవయుగ’ శ్రీకారం
కాజీపేట అర్బన్ వరంగల్ : జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా హన్మకొండ హంటర్‌రోడ్డులోని నవయుగ హైస్కూల్ కరస్పాండెంట్ గోపు లింగారెడ్డి తన విద్యార్థులతో నూతన ఒరవడికి నాంది పలికేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డుల్లో పాఠశాల విద్యార్థులకు చోటు సాధించడానికి అరుదైన అవకాశాన్ని అందిస్తునే రికార్డు బ్రేక్‌కు కృషి చేస్తున్నారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ... గాంధీజీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడికి ఘన నివాళి అందించాలని సంకల్పించారు. విద్యార్థులకు జాతిపిత ఆశయాలను, విశిష్టతను, స్వాతంత్య్రం సాధనకు అందించిన సేవలను తెలియజేయాలనే ఉద్దేశ్యంతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు 184 మంది విద్యార్థులు గాంధీజీ వేషధారణలో దోతి, కండువా, శాలువ, చేతి కర్ర, కళ్లజోడ్లను ధరించి, గాంధీజీ చెప్పిన 184 సూక్తులను ఆలపిస్తారు. దీంతో తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందడంతో పాటు రికార్డు కూడా బ్రేక్ చేయనున్నారు. ప్రతి విద్యార్థి పేరు తెలంగాణ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదు కానుంది. నేడు అరుదైన రికార్డు కోసం ప్రదర్శన.. ఓరుగల్లు నగరంలో మరో చరిత్ర సృష్టించడానికి నవయుగ హైస్కూల్ విద్యార్ధులు బుధవారం తమ ప్రతిభను ప్రదర్శించడానికి సన్నద్ధమవుతున్నారు. పాఠశాలకు చెందిన ఎల్కేజీ నుంచి 10వ తరగతికి చెందిన విద్యార్థులు పాల్గొననున్నారు. తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ బొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి, వరంగల్ కోఆర్డినేటర్ సీతం రఘువేందర్, యూత్వింగ్ ఇన్చార్జి గంగారపు అఖిల్‌లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఈ ప్రదర్శనను హంటర్‌రోడ్డులోని అలకనంద గార్డెన్స్‌లో ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి, జెడ్పీ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరుతారు. అనంతరం జెడ్పీలో 184 మంది గాంధీజీ వేషధారణ విద్యార్థులు స్వచ్ఛభారత్‌ను నిర్వహిస్తారు. సాయంత్రం ఆరుగంటలకు తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసిన ధ్రువపత్రాలను అతిథుల ద్వారా అందుకోనున్నారు. కార్యక్రమంలో అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, సివిల్ సప్లై కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఆర్జేడీ రాజీవ్, డీడీ జగన్, ఎంఈఓ వీరభద్రునాయక్లు పాల్గొననున్నారు. గాంధీజీ ఆశయాలను తెలియజేయడమే లక్ష్యం విద్యార్థులకు గాంధీజీ ఆశయాలను తెలియజేయడమే లక్ష్యంతో 184 మంది విద్యార్థులకు సురభి కళాకారులతో మేకప్ చేయిస్తున్నాం. గాంధీజీ మెరుగైన సమాజ నిర్మాణం కోసం అందించిన 184 సుక్తులను విద్యార్థులతో పలికిస్తాం. విద్యార్థులను నెలరోజలుగా తీర్చిదిద్దుతున్నాం. తెలుగు,తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డుల్లో నవయుగ విద్యార్థులకు చోటు దక్కనుండటం ఆనందంగా ఉంది. – గోపు లింగారెడ్డి ,కరస్పాండెంట్ ,నవయుగ హైస్కూల్ -
డాక్టర్ కొల్లూరికి ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
అమలాపురం : స్థానిక ఎస్కేబీఆర్ కళాశాల తెలుగు విభాగాధిపతి, కవి డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి రచించిన మహాత్మ కావ్యానికి ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. జాతి పిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా స్థానిక విద్యానిధి కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కొల్లూరికి ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డాక్టర్ శ్యామ్ జాదూగర్, విద్యానిధి విద్యా సంస్థల చైర్మన్ ఏబీ నాయుడు చేతుల మీదుగా అందకున్నారు. డాక్టర్ కొల్లూరి రాసిన మహాత్మ కావ్యం 8,030 అక్షరాలు, 1,442 పదాలతో సుదీర్ఘ ఏక వాక్య పుస్తక శీర్షిక అంశంలో ఆయనకు ఈ రికార్డు దక్కిందని శ్యామ్ జాదూగర్ వెల్లడించారు. బాపూజీ సిద్ధాంతాలను అమితంగా ప్రేమించే కొల్లూరి నిత్యం తన పూజా మందిరంలో గాంధీ చిత్ర పటానికి పూజలు చేస్తారన్నారు. కొల్లూరి గతంలో గాంధీజీ అంశంగా ముత్యాల సరాలు శతకాన్ని హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో రచించారు. ఈ త్రిభాషా కావ్యాన్ని అప్పటి గవర్నర్ ఎన్డీ తివారీ ఆవిష్కరించారు. -
డాక్టర్ టీఎస్ రావ్‌కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
విజయవాడ, న్యూస్‌లైన్ : విజయవాడకు చెందిన ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు, పుస్తక రచయిత డాక్టర్ టీఎస్ రావుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈ మేరకు తనకు అప్రూవల్ లేఖ అందినట్లు ఆయన తెలిపారు. యువతరంలో చైతన్యం తెచ్చే విధంగా ‘యువతరానికి ఆత్మీయ లేఖ’ పేరుతో 70 అడుగుల పొడవైన లేఖను(పుస్తక రూపంలో 140 పేజీలు) రచించి ప్రదర్శించినట్లు తెలిపారు. ఈ సుదీర్ఘమైన లేఖలో యువత నేర్చుకోవాల్సినవి, విడిచి పెట్టాల్సినవి, పాటించాల్సినవి, తీర్చిదిద్దుకోవాల్సినవి, సాధించాల్సినవి ఇలా నూటొక్క అంశాలను అయిదుగా విభజించి పొందుపరచి ప్రదర్శించానన్నారు. 16,500 పదాలతో వంద అంశాలతో, 101 ప్రముఖుల కొటేషన్లతో కూర్చి అందులో విశేషంగా మనం అనే మాటను 150 సార్లు, సమాజం అనే పదాన్ని 23 సార్లు, ప్రపంచం అనే పదాన్ని 13 సార్లు, పాజిటివ్ అనే పదాన్ని 21 సార్లు, సాధిద్దాం అనే పదాన్ని 20 సార్లు ఉపయోగించడాన్ని ఈ లేఖ ప్రత్యేకతగా గుర్తిస్తున్నట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థానక అధ్యక్షులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి తనకు పంపిన లేఖలో పేర్కొన్నారని రావు చెప్పారు. రెండున్నర దశాబ్ధాలుగా కౌన్సిలింగ్ రంగంలో విశేష సేవలందిస్తుండగా, ఒకభాషకు సంబంధించి ప్రపంచ రికార్డ్స్ సంస్థగా ఆవిర్భవించిన తెలుగు బుక్ ఆఫ్ రిక్డార్డ్స్లో తన లేఖ నమోదు కావడం సంతోషంగా ఉందని డాక్టర్ టీఎస్ రావు ఆనందం వ్యక్తం చేశారు.